Saturday, December 18, 2021

ఓ మేరే దిల్‌ కే చైన్‌ - O mere Dil ke chin - RD barman kishore kumar Mere jeevanth saahi movie

 

నీ తోడు కోరింది లోకం కోసం

సాధారణంగా ప్రేమికుల మక్కువంతా తమవైన వ్యక్తిగత ప్రయోజనాల మీదే ఉంటుంది. అయితే, అరుదుగా మాత్రమే కొందరిలో తన ప్రేమమూర్తి చేయందుకుని సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. సామాజిక కార్యకలాపాల ద్వారానే తమ వ్యక్తిగత ప్రయోజనాలు కూడా నెరవేరతాయన్న ఒక అవగాహన వారికి ఉండడమే అందుకు  కారణం. సరిగ్గా అలాంటి భావజాలంతో వచ్చే సినిమా పాటలు చాలా అరుదుగానే ఉంటాయి.  1972లో వచ్చిన ‘మేరే జీవన్‌ సాథీ’ సినిమా కోసం మజ్రూహ్‌ సుల్తాన్‌పురి అలాంటి సామాజిక ప్రేమగీతాన్నే రాశాడు. ఈ పాటకు ఆర్‌. డి బర్మన్‌ సమకూర్చిన బాణీ.. కిశోర్‌ కుమార్‌  గాత్ర మాధుర్యంతో పండిపోయింది. ఈ సినిమా వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా రస హృదయుల గుండెల మీద నేటికీ  ఈ పాట నడయాడుతూనే ఉంది.  

ఓ మేరే దిల్‌ కే చైన్‌

చైన్‌ ఆయే మేరే దిల్‌ కో దువా కీజియే /ఓ మేరే/

( ఓ నా హృదయ సాంత్వనమా!

నాకు శాంతి కలగాలని కోరుకోవా! )   


పోరాటం వ్యక్తిగతమే కావచ్చు. సామాజికమే కావచ్చు. ఆ పోరాటం ఎడతెరిపి లేకుండా ఏళ్ల పర్యంతం కొనసాగుతున్నప్పుడు ఒక్కోసారి మనసు కాస్తంత శాంతినికోరుకుంటుంది. ఒకనిండైనసాంత్వనను కోరుకుంటుంది. ఒకవేళ అప్పటికే ఎవరైనా మన హృదయానికి బాగా చేరువై ఉంటే, వాటిని ప్రసాదించమని వారిని కోరేందుకు హృదయం సిద్ధమవుతుంది. 


అప్‌నా హీ సాయా దేఖ్‌ కే తుమ్‌ - జానె జహాఁ శర్‌మాగయే

అభీ తో పహ్‌లీ మంజిల్‌ హై - తుమ్‌ తో అభీ సే ఘబ్‌రాగయే

మేరా క్యా హోగా, సోంచో తో జరా

హాయ్‌ ఐసే న ఆహేఁ భరా కీజియే / ఓ మేరే/

(ఓ హృదయేశ్వరీ! నీ నీడనే నువ్వు చూసుకుని సిగ్గుపడుతున్నావు

ఇంకా ఇది తొలి అంతస్థే! అప్పుడే నువ్వు గాబరా పడిపోతున్నావు

ఇలా అయితే,  నేనేమై పోవాలో ఆలోచించు

హోయ్‌... మరీ అంతలా నిట్టూర్పులు విడవకు)

ఎవరినో నీ మనసు నిండా నింపేసుకుంటావు. ఆమే నీ లోకంగా ప్రేమ పెంచేసుకుంటావు. కానీ, నువ్వేదో  అలా అనుకున్నంత మాత్రాన ఎదుటి వ్యక్తి వెంటనే ఆమోదముద్ర వేస్తారని కాదు కదా! నీ ప్రతిపాదనకు వెంటనే తలూపి అప్పటికప్పుడు నీతో కలసి నడవాలంటే అది అయ్యేపనేనా? నువ్వు కాస్త తెలిసిన వ్యక్తివే కావచ్చు. నీ దారీ ఆమె దారీ ఒకటే అయినా కావచ్చు.  అంతమాత్రానికే నువ్వూ నేనూ ఒకటేనని నీలో భాగంగా జీవించేస్తారా?  అయినా నీ భావోద్వేగాల్ని ఎదుటి వ్యక్తి మీద అలా గుమ్మరించేస్తే  ఎలా? సామాజిక కార్యకలాపాల్లో ఆమెకూ బాధ్యత ఉంటుంది ఎవరూ కాదనలేరు. కానీ, ఆమె నీతోనే కలసి నడవాలనేమీ లేదుగా !  


ఆప్‌కా అర్‌మాఁ ఆప్‌కా నామ్‌ - మేరా తరానా ఔర్‌ నహీఁ

ఉన్‌ ఝుక్‌తీ పల్‌కోఁ కే సివా - దిల్‌ కా టికానా ఔర్‌ నహీఁ

జంచ్‌తా హీ నహీఁ - ఆంఖో మే కోయీ 

దిల్‌ తుమ్‌కో హీ చాహే తో  క్యా కీజియే / ఓ మేరే/

( నీ గురించిన  ఆశలు, నీ పేరు ఇవే తప్ప నాలో మరో రాగం లేదు

వాలిపోయే నీ కనురెప్పలే తప్ప నాకు మరో ఆవాసం లేదు

నువ్వు కాక నా కళ్లల్లో మరేదీ పొసగదు

నా మనసు నిన్నే కోరుకుంటే నేనేం చేయను!)

ఎదుటి వ్యక్తి కేవలం వ్యక్తిగానే ఉన్నంత కాలం, అదొక పరిచయంగానే ఉండిపోతుంది. అప్పుడు నీకు నువ్వుగా, నీలో నువ్వు ఉండిపోతావు. కానీ, ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ ప్రపంచమైపోతారో అప్పుడు నువ్వింక నువ్వుగా ఉండలేవు.  నీకొక గూడూ గుడారం ఏమీ ఉండవు. క్రమంగా నీ ప్రపంచం అంతర్థానమైపోతుంది. ఆ తర్వాత అవతలి వ్యక్తే ప్రపంచంగా ఆ కళ్లల్లో, ఆ కంటి వెలుగుల్లో నువ్వు జీవించడం మొదలెడతావు.  ఎందుకంటే ఆమె ఒక లోకమైపోయాక ఆమె కాక లోకంలో మరెవరూ ఉన్నట్లు నీకు అనిపించదు.   


యూఁ తో అకేలా అక్సర్‌ - గిర్‌ కే సంభల్‌ సక్‌తా హుఁ మై

తుమ్‌ పకడ్‌లో హాథ్‌ మేరా - దునియా బదల్‌ సక్‌తా హుఁ మై

మైనే మాంగా హై తుమ్హే - దునియా కే లియే 

అభ్‌ ఖుద్‌ హీ సనమ్‌ ఫైస్‌లా కీజియే / ఓ మేరే /

(ఒంటరిగా నేనిలా ఎన్ని సార్లు నేల కూలినా  మళ్లీ నిలదొక్కుకోగలను

నువ్వు నా చెయ్యందుకో చాలు.. నేనీ లోకాన్నే మార్చేయగలను

నిన్ను నే కోరుకుంది లోకహితం కోసమే సుమా

ఏ నిర్ణయానికి వస్తావో అదంతా నీ చేతుల్లోనే ఉందిక)

ఎవరైనా తన సొంత పని మీద చాలా దూరం పయనించి మధ్యలో అలసిపోయారే అనుకోండి.  అవతలి వాళ్లల్లో కొందరికి అదేమంత పెద్ద  గాబరా పడాల్సిన విషయంగా అనిపించకపోవచ్చేమో! అలా కాకుండా నువ్వు చేపట్టిన పని పదిమంది కోసం అయినప్పుడు జనం స్పందనలు వేరుగా ఉంటాయి. పదిమంది పని భుజానేసుకుని ఎక్కడైనా పడిపోతే అది సామూహిక నష్టం, సామాజిక నష్టం. అలా తెలిసి తెలిసి సామాజిక నష్టం చేసే హక్కు ఎవరికీ ఉండదు. అందుకే ప్రమాదాన్ని ముందే గమనించి అవసరమనిపిస్తే ఒకరి సాయం తీసుకోవడం నీకు అనివార్యమవుతుంది. పైగా నీ వ్యక్తిగత అవసరాల కోసం సాయం కోరినప్పుడు ఎవరైనా విముఖత చూపవచ్చేమో గానీ, సామాజిక ప్రయోజనం కోసం సాయం కోరినప్పుడు అత్యధికులు తమ సుముఖతనే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సామాజిక ప్రయోజనాల్లో  తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఒదిగి ఉంటాయని  ఎక్కువ మందికే తెలుసు. 

సామాజిక హృదయాన్ని ఆవిష్కరించే ఇలాంటి పాటలు అరుదుగా కాకుండా ఎక్కువ సంఖ్యలో రావాలని మనమంతా మనసారా కోరుకోవాలి.  

 బమ్మెర 

Friday, December 10, 2021

ఆసూ భరీ హైఁ యే జీవన్‌ కీ రాహేఁ - Aansu Bhari Hai - Raj Kapoor, Mukesh, Parvarish Song

  


నన్నింక మరిచిపొమ్మని చెప్పరా!!


రెండు కన్నీటి చుక్కల్ని చూసే మనం ఒక్కోసారి కకావికలైపోతాం. అలాంటిది, ఒక్కోసారి జీవితమే కన్నీటి సముద్రమైపోతుంది. ఆ సముద్రాన్ని దాటి బయటికి రావడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదని, నువ్వు నువ్వుగా ఇంక మిగలవనీ  తేలిపోతే,  ఎవరికైనా ఏమనిపిస్తుంది? నేను ఈ సముద్ర గర్భంలో కలసిపోయినా, తనను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఆ గతి పట్టకూడదనిపిస్తుంది. వారిని ఆ వైపే రాకుండా వారించి కాపాడాలనిపిస్తుంది. 1958లో విడుదలైన ‘పర్‌వరిశ్‌’ సినిమాకోసం హస్రత జయ్‌పురి రాసిన ఈ పాటలో అలాంటి జీవన స్పందనలే వినిపిస్తాయి. దత్తారామ్‌ స్వరపరిచిన ఈ పాటను విషాదగీతాలకు మారుపేరైన ముకేశ్‌ పాడిన తీరు నిజంగా గుండెల్ని జలదరింపచేస్తుంది. మరొకసారి వినిచూడండి మీకే తెలుస్తుంది. 

ఆసూ భరీ హైఁ యే జీవన్‌ కీ రాహేఁ 

కోయీ ఉన్‌సే కహెదే హమే భూల్‌ జాయేఁ

(జీవన దారులన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి

నన్నింక మరిచిపొమ్మని ఎవరైనా ఆమెతో చె ప్పేస్తే బావుండును)    


ప్రాణప్రదంగా ప్రేమించినవారిని ఎవరైనా పూలబాటల్లోంచి తీసుకువెళ్లాలనుకుంటారు గానీ, ముళ్లడొంకల్లోంచి నడిపించాలనుకుంటారా? కన్నీటి తుపానుల్లో వదిలేయాలనుకుంటారా? వెంట తీసుకుపోలేని స్థితిలో వారిని దూరంగా ఉండిపొమ్మంటారు. అలా అని వచ్చిపడిన సంక్షోభమేమిటో, ఆ విషాదమేమిటో నేరుగా తన ప్రేమమూర్తికి చెప్పేయడం కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. ఆ విషాదం వెనుక  అసలేం జరిగిందో చెప్పేయడానికి ఒక్కోసారి మన హృదయమే సరిపోదు. భాషా సరిపోదు. ఏదోలా చెప్పేద్దాం అనుకునేసరికి ఒక్కోసారి గొంతు తడారిపోతుంది. ఉన్న ఆ కాస్త భాష కూడా అవిటిదైపోతుంది. ఈ స్థితిలో తన ఆవేదనను తన ప్రేమ మూర్తికి చేరవేయడానికి మరో వ్యక్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేదో ఆ విషాదాన్ని వివరించడానికని కాదు తననింక శాశ్వతంగా మరిచిపొమ్మనడానికి

వాదే భులాదే, కసమ్‌ తోడ్‌ దే వో 

హాలత పే అప్‌నీ, హమే ఛోడ్‌ దే  వో 

ఐసే జహాఁ సే క్యో హమ్‌ దిల్‌ లగాయే / కోయీ ఉన్‌సే/

(వాగ్దానాలన్నీ మరిచిపొమ్మని, చేసిన ప్రమాణాలన్నీ విరిచేయమని

నా స్థితిగతుల్లో నన్ను ఇలా వదిలేసి పొమ్మని ఆమెకు చెబితే బావుండును

ఇలాంటి ఈ లోకం మీద నేనింకా మనసు లగ్నం చేయడం దేనికి?

న న్నింక మరిచిపొమ్మని ఎవరైనా ఆమెతో చెప్పేస్తే బావుండును)

ప్రేమికులుగా ఎన్నో వాగ్దానాలు, ప్రమాణాలు చేసుకున్న మాట వాస్తవమే కానీ, అవన్నీ జీవితం అంతో ఇంతో హాయిగా నడుస్తున్న రోజులు. జీవితం అక్షరాలా మన చేతుల్లోనే ఉన్న రోజులవి. కానీ, ఉన్నట్లుండి అంతా తలకిందులై పోయి, అనివార్యంగా అనుకున్న వాటికి అంతా పూర్తి విరుద్ధంగానే  జరిగిపోతున్నప్పుడు అప్పుడెప్పుడో చేసిన వాగ్దానాలకు, ప్రమాణాలకు ఉనికేమిటి? వాటి విలువేమిటి? పున్నమి రోజుల్లో కలిసి నడిచిన ఆ దారుల్లోనే ఆ తర్వాత కటిక చీకట్లో నడవలేం కదా! ఒకవేళ తప్పనిసరిగా ఆ దారుల్లోంచే వెళ్లాలనే అనుకున్నా ఏ చిన్న దీపమైనా వెలిగించే అవకాశమే లేనప్పుడు మళ్లీ వెన్నెల రోజులు వచ్చేదాకా వేచి ఉండాల్సిందే కదా! అయినా ప్రకృతిలో అమావాస్య తర్వాత కచ్ఛితంగా పున్నమి వస్తుందన్న గ్యారెంటీ ఉంది. కానీ, జీవితాన్ని కమ్మేసిన చీకట్లు కచ్చితంగా తొలగిపోతాయన్న గ్యారెంటీ ఏదీ లేదు. ఆ గ్యారెంటీ ఏదీ లేనప్పుడు నీ ప్రేమమూర్తిని అప్పటిదాకా వేచి ఉండవని హృదయమున్న ఏ ప్రేమికుడూ చెప్పలేడు. అందుకే తననింక మరిచిపొమ్మని చెప్పడానికే సిద్ధమవుతాడు. 

బర్‌బాదియోఁ కీ అజబ్‌ దాస్తా హూఁ

శబ్‌నమ్‌ భీ రోయే మై వో ఆస్‌మాఁ హూఁ

తుమ్హే హర్‌ ముబారక్‌, హమే అప్‌నీ ఆహేఁ /కోయీ ఉన్‌సే /

(ధ్వంసమైపోయిన  వింత జీవనగాథను నేను

మంచు సైతం విలపించే ఆకాశాన్ని నేను

నీకు నీ సంసారపు శుభాకాంక్షలు, నా నిట్టూర్పులు నాతోనే ఉంటేనేమిటి? 

నన్నింక మరిచిపొమ్మని ఆమెతో ఎవరైనా చెప్పేస్తే బావుండును)

మన చుట్టూ జరిగే ఎన్ని జీవన ఽవిధ్వంసాల్ని మనం చూడలేదు. వాటన్నింటికీ ఒక తుది మొదలైనా ఉంటాయి. కూలిపోతున్నట్లే అనిపించిన జీవితాలే తిరిగి నిలబడిన ఎన్నో సందర్భాలు మనం అనేకం చూశాం. కానీ, కొన్ని జీవితాలు ఇందుకు పూర్తిగా భిన్నమైనవి, మోడు చిగురించడం మాట అటుంచి ఏ మంటలో ఎగిసిపడి కూకటి వేళ్లతో సహా బూడిదైపోతుంది. సంతోషమైనా దుఃఖమైనా నీతోనే అనడం అవతలి వ్యక్తి హృదయపు నిబద్ధతను చెబుతుంది కానీ, దుఃఖం తర్వాత సంతోషం వచ్చే అవకాశం అసలే కనిపించనప్పుడు ఎదుటివారిని నిరీక్షణలో ఉంచడం ఏ రకమైన నీతి. అందుకే అంతేలేని ఈ దుఃఖ సాగరపు అంచున నిలబడి జీవితాన్ని బలిచేసుకోవడం కన్నా, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించమని ఏ హృదయమున్న ప్రేమికుడైనా చెబుతాడు. నీ కొత్త జీవితపు ఆనందాన్ని చూసి ఆనందపడే అవకాశాన్నయినా ఈ నిట్టూర్పుల మధ్య నాకు దక్కనీ అంటాడు నిజానికి, సముద్రాన్ని చేతుల్లోకి తీసుకోలేనప్పుడు తరంగాన్ని తాకి తన్మయం చెందడంలోనే  హృదయ ఔన్నత్యం, ఒక  గొప్ప జీవన పరిణతీ ఉన్నాయి.

 బమ్మెర 

Saturday, December 4, 2021

  • ఏముంది ప్రేమలో అంటే..!


 లోకంలో చాలా మందికి  ప్రశ్నించడం ఒక్కటే తెలుసు! ఆ ప్రశ్నించడం కూడా అదేదో కొత్త విషయం తెలుసుకుందామని కాకుండా ఒకరి జీవన ప్రవాహాన్ని అడ్డుకోవడమే వారి ఉద్దేశంగా ఉంటుంది. నువ్వు అనుకున్నది, చేస్తున్నదంతా వ్యర్థమూ, నిరర్థకమూ అని చెప్పడానికే వారి శక్తినంతా వినియోగిస్తారు. అలాంటి ప్రశ్నలన్నింటి కీ సమాధానం చెప్పడం అవసరమా? అంటే  ఏమో మరి!  1953లో విడుదలైన ’అనార్కలి’ సినిమా కోసం రాజేంద్ర కృష్ణ రాసిన ఈ పాట అలాంటి  కొన్ని ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే. సి.రామచంద్ర స్వరకల్పనలో లతా మంగేష్కర్‌ పాడిన ఈ పాట ప్రాణం పోసుకుని ఆరు దశాబ్దాలు దాటినా....  రసహృదయాల్ని ఇప్పటికీ రంజింపచేస్తూనే ఉంది.




దిల్‌ కీ లగీ హై క్యా - కభీ  ఆఁసూ బహాకే దేఖ్‌

ఆఁసూ బహాకే దేఖ్‌ - కభీ ముస్కురాకే దేఖ్‌

పర్వానా జల్‌రహా హై - మగర్‌ జల్‌రహా హై క్యోఁ

యే రాజ్‌ జాన్‌నా హై తో - ఖుద్‌ కో జలాకే దేఖ్‌

(ప్రేమలో పడటమేమిటో తెలియాలంటే ఎప్పుడైనా కన్నీళ్లు రాల్చి చూడు!

కన్నీళ్లు రాల్చి చూడు- ఎప్పుడైనా మందహాసం చేసి చూడు!

మిణుగురు కాలుతోంది - కానీ, ఎందుకలా కాలిపోతోంది?

ఈ రహస్యం తెలియాలంటే..! నిన్ను నవ్వు కాల్చుకుని చూడు)


ఆత్రేయ అన్నట్లు, ’’నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’’.  నిజానికి ఏ గాఢమైన అనుభూతి అయినా కన్నీళ్లతోనే ముడిపడి ఉంటుంది. ప్రేమంటే తీయని బాధే కదా! కన్నీళ్లదీ ప్రేమదీ విడదీయరాని బంధం కదా! కాకపోతే  ఏ బంధమూ శాశ్వతం కాదనేది ఒక పరమ సత్యం. అందుకే ఎవరైనా ప్రేమంటే ఏమిటో తెలియాలంటే నాలుగు కన్నీళ్లు రాల్చే భావోద్వేగానికి చేరుకోవాలి. వైర్యాగంతో మందహాసం కూడా చేయగలగాలి. ఎగిసి పడే మంటలకు ఆహుతైపోతామని తెలిసి తెలిసి మిణుగురులు ఎందుకలా మంటల చుట్టే తిరుగుతాయి. కడకు కాలిపోయినా సరే మంటల్లోంచి ఎగిసిపడే ఆ దివ్యమైన ఆ కాంతిజ్వాలలను కొన్ని  క్షణాలైనా కళ్లారా చూద్దామనే కదా! 


ముఝ్‌ సే మత పూఛ్‌ మేరే ఇష్క్‌ మే రఖా హై

ఏక్‌ శోలా హై- జో సీనే మే ఛుపా రఖా హై / ముఝ్‌ సే/

(ఏముంది ప్రేమలో...! అంటూ ఎప్పుడూ నన్ను అడగొద్దు!

హృదయంలో దాచిపెట్టుకున్న జ్వాల సుమా అది

ఏముంది ప్రేమలో అంటూ ఎప్పుడూ నన్ను అడగొద్దు!)



ఏ హృదయానికి ఆ హృదయం దేనికదే వేరువేరుగా ఉండిపోతే, కలిసిన హృదయాల తాలూకు కష్టాలూ లేవు, కన్నీళ్లూ లేవు. కానీ, రెండు హృదయాలు చేరువై, ఏకమై అద్వైతప్రేమ  ఒకటి ప్రేమ అంకురించాక కదా హృదయాల్లో  అగ్ని సరస్సులు ప్రవహించడం మొదలవుతుంది. జీవితం. బాగుంటే దాన్ని అలాగే కాపాడుకోవడానికి, బాగో లేకపోతే దాన్ని బాగుచేసుకోవడానికి  హృదయంలో ఎప్పుడూ ఎడతెగని ఒక ఆరాటం,  బాధ, ఒక జ్వాల నిరంతరం ఎగిసెగిసి పడుతూనే ఉంటాయి. ఈ జ్వాలే మనిషిని నడిపిస్తుంది. జీవితాన్ని నిలబెడుతుంది. అవసరమైనప్పుడు ఎంతటి యుద్ధానికైనా సిద్ధం చేస్తుంది. వీటన్నింటికీ వెనుక  ప్రేమే స్పూర్తిగా ఉంటుంది ! ఏముంది ప్రేమలో అంటే... ఎవరైనా ఒక్క మాటలో ఏం చెప్పగలరు?


దాగే-దిల్‌, దాగే-జిగర్‌, దాగే తమన్నా లేకర్‌

మైనే వీరాన్‌ బహారోఁ కో సజా రఖా హై / ముఝ్‌ సే/

(గాయపడిన మనసు, గాయపడిన స్థైర్యం, గాయమైన ఆకాంక్షలతో

నేను మోడైపోయిన వసంతాల్నే అలంకరించాను

ఏముంది ప్రేమలో అంటూ ఎప్పుడూ నన్నడగొదు!్ద)

గుండె లోతుల్లోకి లోకం విసిరిన జ్వాలలు అంతరాంతరాళాల్లో ఎంత చిచ్చుపెడతాయో ఎవరికి తెలుసు! అందుకే చాలా మంది జీవిత నిఘంటువుల్లో శాంతి, ప్రశాంతత అన్న మాటలే ఉండవు. అవే లేకపోతే ఇంకేముంది! హృదయం, ఆత్మబలం, ఆశా సౌధం విరిగిపడిన శకలాలే కదా! అప్పుడే ఒక బాఽధ్యతగా ఏ మోడైపోయిన వసంతాలనో తిరిగి చిగురింపచేయాల్సి వస్త్తేఏం చేయాలి? రక్తమోడుతున్న హృదయంతో, విరిగిపడిన ఆత్మబలాన్ని, తునాతునకలైన ఆశల్నే సాధనాలుగా ఆ వసంతాల్ని చిగురింపజేయాల్సి ఉంటుంది. అవ్యాజమైన ప్రేమ అడుగడుగునా అండగా నిలబడినప్పుడే అది సాధ్యమవుతుంది. 


దేఖ్‌నే వాలే తుఝే - దర్దే ముహబ్బత కీ కసమ్‌

మైనే ఇస్‌ దర్ద్‌ మే -దునియా కో భులా రఖా హై

(వీక్షకులారా! నా వ్యధా హృదయం సాక్షిగా

ఈ బాధలో నేనీ లోకాన్నే మరిచిపోయాను!

ఏముంది ప్రేమలో అంటూ ఎప్పుడూ నన్నడగొద్దు)

చాలా మంది ప్రేమికులు ఆ ప్రేమ వల్ల కలిగిన వ్యధలూ, క్షోభల్నే మూటగట్టుకుని ఉండవచ్చు.  వారి జీవితాలు, ఎడారిలా, దగ్ధమైపోయిన అరణ్యంలా మారిపోయి ఉండవచ్చు. ఒకటేమిటి? వారి తాలూకు సమస్తమూ ధ్వంసమైపోయి ఉండవచ్చు. అయినా వాళ్లు దాన్నేమీ పట్టించుకోరు. ఎందుకంటే తమదైన ఆ ప్రేమలోకంలోకి ప్రవేశించాక ఈ లోకాన్ని వాళ్లెప్పుడో మరిచిపోయారు.  నిజంగా ఆ లోకం ఎంత అద్భుతమైనది కాకపోతే ఈ లోకాన్ని వారు మరిచిపోగలిగారు!. అలా మైమరిచి ఆ లోకంలో తేలిపోతున్న వాళ్ల వద్దకు వెళ్లి, ప్రేమలో ఏముంటుంది? దానివల్ల ఒరిగేదేముంది? అని ఎవరైనా అడిగితే వాళ్లు అతనికేసి ఎలా చూస్తారు! ఎంత పగలబడి నవ్వుకుంటారు? ఈ  అమాయకత్వం నుంచి పూర్తిగా బయటపడితే గానీ, నిజంగా ఈ లోకానికి  ప్రేమంటే ఏమిటో తెలిసి రాదు!  ప్రేమ జీవితం ఎంత దివ్యమైనదో వారి అనుభవంలోకి రాదు!!

 బమ్మెర