Thursday, October 27, 2022

Kabhi Kabhie Mere Dil Mein Song Analysis | Kabhi Kabhie Film | Mukesh Songs | Jeevanageetham |

నిన్ను భూమ్మీదికి రప్పించిందే  నా కోసం 

‘‘కభీ కభీ  మేరె దిల్‌ మే’ అన్న పాట ప్రాణం పోసుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అయినా ఒక తాజా పాటలా సంగీత ప్రేమికుల్ని ఇప్పటికీ ఉర్రూతలూపుతూనే ఉంది. ఆ పాటను ఎంతో రసార్థ్రంగా పాడిన ముకేశ్‌కు ఆ యేటి (1976) జాతీయ స్థాయి ఉత్తమ గాయకుడి అవార్డు లభించింది. కాకపోతే ఆ అవార్డు అందుకోవలసిన రోజు నాటికి ముకేశ్‌   ఈ లోకంలో లేరు.  అందుకే ఆయన కొడుకు నితిన్‌ ముకేశ్‌  ఆ అవార్డును అందుకున్నారు. ‘కభీ కభీ’ సినిమాలోని  ఈ పాటను సాహిర్‌ లుధ్యాన్వి రచిస్తే, ఖయ్యామ్‌ స్వరబద్ధం చేశారు. ముకేశ్‌ను అమరం చేసిన అరుదైన పాటల్లో ఒకటైన ఈ పాటను మరోసారి విని ఆనందించండి మరి!


కభీ కభీ మేరే దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసె తుఝ్‌కో  బనాయా గయా హై మేరే లియే
తూ అబ్‌ సే పహెలే సితారో మే బస్‌ రహీథీ కహీ
తుఝే జమీఁ పర్‌ బులాయా గయా హై మేరే లియే 

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో ఇలా వచ్చేస్తుంది
నిన్నెవరో నా కోసమే సృష్టించినట్లు, 
ఇంతకుముందెక్కడో నక్షత్రాల్లో నివసించేనిన్ను
నా కోసమే భూమ్మీదికి రప్పించినట్లు /ఒక్కోసారి/)

సామాన్య దృష్టికి కనిపించే ప్రపంచం  వేరు, ప్రేమోద్వేగంలో కనిపించే ప్రపంచం వేరు. ఆ స్థితిలో కలిగే భావాలన్నీ భౌతిక ప్రపంచానికి అతీతంగానే ఉంటాయి. సరిగ్గా అలాంటి భావాలే ఈ గీతం నిండా ఉన్నాయి. నిజానికి లోకంలోని కోటానుకోట్ల యువతీయువకుల్లో తామిద్దరమే ఇలా కలుసుకోవడం ఎలా జరిగింది? అన్న భావన అప్పుడో ఇప్పుడో ప్రతి ప్రేమ హృదయంలోనూ అంకురిస్తుంది. ప్రేమోద్వేగం ఆకాశాన్ని తాకే స్థితిలో ఆమెను ఎవరో తనకోసమే సృష్టించారన్న  బావున కలిగినా కలగవచ్చు. పైగా ఆమెపట్ల తనకున్న అద్వితీయ భావన వల్ల  ఆమె ఇక్కడెక్కడో భూమ్మీది మనిషిగా కాకుండా ఎక్కడో ఆకాశంలో, నక్షత్రాల మధ్య నివాసించేలా అనిపిస్తుంది. అలాంటి ఆమెను తనకోసమే ఎవరో భూమ్మీదికి రప్పించారన్న భావన కలుగుతుంది. ఈ విషయాల్లో తర్కానికి తావులేదు. అదొక భావోద్వేగం. ఒక రసానుభూతి అంతే.

కభీ కభీ మేరే దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె యే బదన్‌ ఔర్‌ నిగాహే  మేరీ అమానత్‌ హై
యే గేసువోంకీ ఘనీ ఛావ్‌ హై మేరీ ఖాతిర్‌
యే హోట్‌ ఔర్‌ యే బాహే మేరీ అమానత్‌ హై

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో  ఇలా వచ్చేస్తుంది
నీ తనువు, నీ చూపులు నా సంపత్తి అయినట్లు
ఈ ముంగురుల గాడమైన నీడలు నా కోసమే అయినట్లు
ఈ పెదాలు, ఈ బాహువులు నా ఐశ్వర్యమైనట్లు /ఒక్కోసారి/)

ఒక  జీవన ప్రపంచానికే  వేదికైన తన ప్రియురాలి  తనువు, నిరంతరం లోకంలోకి ఒదిగిపోతూ, లోకాన్ని తనలో పొదుగుకుంటూ ఉండే  ఆమె  చూపులు,  తన సొంత సంపదైపోయినట్లు ఏవేవో  భావోద్వేగాలు కదలాడుతూ ఉంటాయి. తనదైన ఒక స్వాప్నిక ప్రపంచాన్ని చూడటమే కాదు, ఆ ప్రపంచాన్నే తనలోకి ఇముడ్చుకోగలిగే ఆ పదునైన చూపుల్ని తన సొంతం చేసుకోవాలని ఎంత ఆరాటమో తనకు. అంతే కాదు చల్ల చల్లగా నలుమూలలా విస్తరించే ఆమె ముంగురుల నీడలు తాను సేదదీరడం కోసమే అయినట్లు  భావిస్తాడు. పైగా భావనా ప్రవాహానికి ముఖద్వారమైన పెదాలు, జీవితాన్ని అమృతమయం చేసి, అద్భుతమైన అంతర్లోకాన్ని ఆవిష్కరించే ఆమె బాహువులు తన ఐశ్వర్యమైనట్లు  ఎంతో తాదాత్మ్యతలో పడిపోతాడు ప్రేమికుడు.

కభీ కభీ మేరే   దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసె బజ్‌తీ హై  శహనాయియాఁ  సి రాహోఁమే
సుహాగ్‌ రాత్‌ హై గూంగట్‌ ఉఠారహా హూఁ మై
సిమట్‌ రహీ హై తూ శర్మాకె  అప్‌ని బాహోఁ మే

( ఒక్కోసారి నా మదిలోకి ఒక భావనేదో ఇలా వచ్చేస్తుంది
పలు దారుల్లో  సన్నాయిల్లా ఏవో మారు మోగుతున్నట్లు 
తొలిరేయి వేళ  నేను నీ తలకొంగును తొలగించి వేస్తున్నట్లు 
నువ్వేమో నా బాహువుల్లో  సిగ్గుతో ముడుచుకుపోతున్నట్లు / ఒక్కోసారి / )

ప్రియురాలిని ఎప్పుడు తనలో కలిపేసుకుందామా అని నిరంతరం నిరీక్షించే ప్రియుడికి చుట్టూ  సన్నాయి స్వరాలు కాక ఇంకేం వినపడతాయి? కేవలం సన్నాయి నాదాలేనా? సహజీవనం తాలూకు ఒక ఊహాలోకమే మనసులో కదలాడుతుంది. నాలుగడుగులు ముందుకేసి ఏకంగా తొలిరాత్రి ఊహలన్నీ మనసులో తొంగి చూడవచ్చు. నిజానికి సన్నాయిలు ఏం చేస్తాయి? ప్రేమికుల హృదయాల్ని నాదమయం చేస్తాయి. చంద్రబింబాన్ని కమ్మేసిన నల్లమబ్బును ఎవరో తొలగించినట్లు ఆ సమయంలో  అతని చేతులు ప్రియురాలి ముఖారవిందాన్ని కమ్మేసిన మేలి ముసుగును తొలగించడానికి సిద్ధమవుతాడు. ప్రేమికుడు అలా తొలగించడం బాగానే ఉంది కానీ, ఆ స్థితిలో ప్రియురాలి పరిస్థితి ఏమిటి? ముసుగులోనే బిడియపడుతున్న ఆమె  ముఖంమీది ఆ కాస్త ముసుగుకూడా తొలగిపోతే ఇంక  సిగ్గుతో తడిసి ముద్దయిపోక ఏంచేస్తుంది? ఇక్కడ జరిగిందీ అదే.

కభీ కభీ మేరె దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసే తూ ముఝె చాహేగీ ఉరమ్‌ భర్‌ యూఁహీ
ఉటేగి మేరి తరఫ్‌ ప్యార్‌ కి నజర్‌ యూఁహీ
మై జాన్‌తా హూఁ కె తూ గైర్‌ హై మగర్‌ యూఁహీ

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో ఇలా వచ్చేస్తుంది
జీవితమంతా నువ్వు ఇలాగే న న్ను ప్రేమిస్తావన్నట్లు
నీ ప్రేమ చూపులు ఎప్పటికీ ఇలాగే  నా మీద వాలిపోతాయన్నట్లు
నువ్వు నాకు పరాయివేనని తెలిసినా ఎందుకో 
ఒక్కోసారి నా మదిలోకి ఏదో భావన ఇలా వ చ్చేస్తుంది)

ఏ ప్రియుడైనా తన ప్రేయసి జీవితాంతం తనను ప్రేమిస్తూనే ఉండాలని కోరుకుంటాడు. ఆమె చూపుల్లో ఎప్పుడూ తానే ఉండాలనీ కోరుకుంటాడు. ఎందుకని? ఎన్నో ప్రేమలు  భగ్నమైపోయి అర్థాంతరంగా ముగిసిపోవడం ఎన్నోసార్లు కళ్లారా చూసే ఉంటాడు కాబట్టి. ప్రేమలు విచ్ఛిన్నమై కడకు  ఒకరినొకరు క ళ్లెత్తి చూసుకునే స్థితి కూడా లేని తనాన్ని తాను ఎన్నోసార్లు గమనించే ఉంటాడు  కాబట్టి. అందుకే తన ప్రేమ శాశ్వతంగా ఉండాలని కుంటాడు. కడదాకా ఆమె కనుసన్నలలో తడిసిపోవాలనుకుంటాడు. కాకపోతే ఎంతటి అన్యోన్యత ఉన్నా, ఎంతటి ప్రేమోద్వేగం  ఉన్నా కళ్యాణ బంధమేదీ లేకపోతే సంప్రదాయ సమాజంలో వారిద్దరూ పరాయిలేగా!. నిజానికి  తమ ప్రేమకు  హద్దులు ఉన్నాయని  ఒకవేళ తెలిసినా ఆ భావోద్వేగాలు ఆగుతాయా? అవి రసాత్మకమై, కవితాత్మకమై  వారి హృదయాల్లోంచి ఒక గీతంలా ఇలా జాలువారుతూనే ఉంటాయి. ఎవరైనా ఆ భావోద్వేగాల్ని ఎలా ఆపగలరు!

---బమ్మెర


Saturday, October 15, 2022

Kahin Deep Jale Kahin Song Analysis | Bees Saal Baad (1962 film) |

 నీ ఊపిరి లో ఈ గీతం అమరం కావాలి

గానకోకిల లతా మంగేష్కర్‌ స్వర వైదుష్యం ఎవరినైనా ఒక  భావాతీత స్థితికి చే రుస్తుంది. ఆమె గొంతులో సప్త స్వరాలు సప్త సముద్రాలయ్యాయి కదా మరి!. అందుకే  ఆ స్వరంలో తడిసిన ఏ ఒక్క గీతాన్ని విన్నా  అది జీవితాంతపు జ్ఞాపకమైపోతుంది.  భారతీయుల్నే కాదు  ప్రపంచ దేశాల  రసహృదయాలందరినీ  దశాబ్దాల పర్యతం ఆమె తన గానమాధ్యురంతో  ఓలలాడించింది.  ఆ గానానికి పరశించిపోయిన  భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డుతో ఆమెను సత్కరించింది. నేల మీద నడిచే పాటలు వేలాదిగా ఉండొచ్చు. కానీ, ఆకాశంలో నాట్యం చేసే పాటలు కొన్నే ఉంటాయి. అలాంటి అత్యంత అరుదైన వాటిల్లో  ‘ కహీఁ దీప్‌ జలే’ అన్న పాట ఒకటి.  శకీల్‌ బదాయుఁనీ రచించగా, హేమంత్‌ కుమార్‌ స్వరపరిచిన  ఈ పాటను  ‘ బీస్‌ సాల్‌  బాద్‌ ’ సినిమా కోసం లతామంగేష్కర్‌ పాడారు. ఆకాశం హోరెత్తిపోయేలా పాడే ఆ స్వరాన్ని వినడం కన్నా  మహానందం మరేముంటుంది?





కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌-జరా దేఖ్‌లే ఆకర్‌ పర్‌వానే
తేరీ కౌన్‌ సీ హై మంజిల్‌ - కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌

( ఒకచోట   దీపాలు వెలుగుతున్నాయి.  ఒకచోట  హృదయాలు కాలుతున్నాయి.
ఒకసారి వచ్చి చూసుకో  మిడతా! నీ తీరమెక్కడో తెలుసుకో )/ ఒకచోట  దీపాలు/

మిడత పురుగులు ఎక్కడ వెలుగు కనిపిస్తే అక్కడ వాలిపోతాయి. కానీ,  అన్ని  వెలుగులూ ఒక్కటే  కావు కదా! ఒక్కోసారి అవి అడవి కాలిన మంటలూ కావచ్చు. అదేమీ  తెలియకుండా బిరబిరా వె ళ్లిపోతే నలువైపులా కమ్ముకున్న ఆ మంటల్లో ఆహుతి అయిపోవడమేగా! అయినా ప్రేమించే హృదయాల దావాగ్నిని పట్టించుకోకుండా, దీపాల వెలుగు చుట్టూ తిరిగితే ఎలా? అసలు మనిషి మనిషికీ మధ్య తేడా ఎక్కడ వస్తోంది? కొన్ని గుండెలు శిలల్లా, మరికొన్ని పువ్వుల్లా ఎందుకు ఉంటున్నాయి? చూపుల్లో లాలితత్వం, ఆలోచనల్లో స్పందన కరువైతే మనిషి కఠిన శిలే అవుతాడు మరి! వెలుగు వెలుగే కానీ, ఏ వెలుగు పునాదులు  ఎక్కడున్నాయో తెలియకపోతే  ఎలా? అసలు ఆ కనిపించేవేమిటో, వాటి మూలాలు, పాతాళంలో ఉన్నాయో, ఆకాశంలో ఉన్నాయో తెలిస్తేగా దేన్ని లక్ష్యంగా తీసుకోవాలో  బోధపడుతుంది.

మేరా గీత్‌ తేరే దిల్‌ కీ పుకార్‌ హై- జహాఁ మై హూఁ వ హీ తేరా ప్యార్‌  హై
మేరా దిల్‌ హై తేరీ  మహెఫిల్‌- కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌

(నా గీతం నీ హృదయపు పిలుపు సుమా - నేనెక్కడుంటానో  అక్కడే ఉంటుంది నీ ప్రేమ
నా హృదయం నీ  కచేరీ వేదిక) / ఒకచోట  దీపాలు/

నీ పిలుపు ఎప్పుడూ  నీ గొంతులోంచే వస్తుందనుకుంటే ఎలా? నిన్ను ప్రేమించే, లేదా నువ్వు ప్రేమించే గుండెలో  కూడా నీ పిలుపు ప్రతిధ్వనిస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడుంటే నీ ప్రేమా అక్కడే మకాం వేస్తుంది. ప్రేమ పుట్టడం అన్నది ముందు ఒకరిలోనే అయినా  ఆ తరువాత అది ఇద్దరిలోకీ  సమంగా వ్యాపిస్తుంది.  నీలోంచి వచ్చేవి మాత్రమే నీవని, నీ ఆవలి వైపు వచ్చేవన్నీ  నీకు సంబంధం లేనివనీ అనుకుంటే అది తప్పిదమవుతుంది.  పువ్వులో పుట్టిన పరిమళం పువ్వులోనే ఉండిపోతుందా? నేలనేలంతా వ్యాపిస్తుంది. గాలిలో కలిసి, నక్షత్రాల మీదుగా, సమస్త గోళాల మీదుగా ఆకాశమంతా వ్యాపిస్తుంది.  అవేమీ పట్టన ట్టు ఉంటే  నీ గురించి నీకు తెలిసేదెన్నడు? నీ ప్రేమ ఎక్కడెక్కడికి విస్తరించిందో  నువ్వు గుర్తించేదెప్పుడు? ఆ స్పృహే నిజంగా  నీకు కలిగిన్నాడు నువ్వే ప్రాణంగా జీవిస్తున్న ఆ ప్రేమమూర్తి గురించి తెలుస్తుంది. ఆ  ఒక్క హృదయమే  వేయి రూపాలు ధరిస్తుంది. అప్పుడింక ఆ హృదయం నీలోంచి వచ్చే వేయి రాగాలు , వేయి గీతాలతో సాగే ఒక కచేరీ వేదిక అవుతుంది.

న మై సప్నా హూఁ  న కోయీ రాజ్‌ హూఁ- ఏక్‌ దర్ద్‌ భరీ ఆవాజ్‌ హూఁ
పియా దేర్‌ న కర్‌ ఆ మిల్‌- కహీఁ దీప్‌ జలే కహీఁ దిల్‌


(నేనేమీ  స్వప్నాన్ని కాను, నేను రహస్యాన్నీ కాను- ఒక వేదనా భరిత స్వరాన్ని నేను
ప్రియా! ఆలస్యం చేయక వచ్చి కలుసుకో నన్ను ) / ఒకచోట దీపాలు /

భావాలు నేలమీద పారుతున్నంత సేపే అవి సత్యమని,  వాటి గొంతు  సముద్రాలూ, మేఘాలు దాటి ఆకాశాన్ని చేరగానే భ్రమ అనుకుంటే ఎలా? అనంతంగా విస్తరించిన  నీ ప్రియురాలి ఆత్మగానాన్ని  ఒక కలగానో, ఎవరికీ అంతుచిక్కని ఒక రహస్యంగానో అనుకుంటే జీవితంలోని అత్యున్నతమైన వాటికి నువ్వు దూరమైపోతావు.  ఎవరూ తనను అర్థంచేసుకోక, ఎవరూ తనను తానుగా గుర్తించక ఎంత వేదనో భరిస్తూ భూమ్యాకాల మధ్య తిరుగాడుతున్న ఆ ప్రేమమూర్తిని చూడు. ఆ సంచారం నిజమేనని గ్రహిస్తే  గానీ, ఆ రూపం కనపడదు. ఆ గొంతులోని ప్రాణధ్వని వినబడదు. ఏదోలే అనుకుని వదిలేస్తే  ఒక్కోసారి ఆ ప్రేమ మూర్తి ఏ ప్రమాదంలోనో ఇరుక్కుపోవచ్చు. ఎదురుచూసి, చూసి చివరికి నిన్ను చేరుకోకుండానే అలసిపోయి ఆగిపోవచ్చు.  చివరికి తనకు తానే ద క్కకుండా శూన్యంలో కలిసిపోవచ్చు. నిరీక్షణలో ఆశలు నిర్జీవమైపోతే ఎలా? వెంటనే వెళ్లి ఆ ప్రేమమూర్తిని అక్కున చేర్చుకోవాలి కదా!

దుశ్మన్‌ హైఁ  హజారో యహాఁ జాన్‌ కే- జరా మిల్‌నా నజర్‌ పహ్‌చాన్‌కే
కయీ రూప్‌ మే హై ఁ  కాతిల్‌- కహీఁ  దీప్‌  జలే కహీఁ దిల్‌

(ఇక్కడ వేలాది ప్రాణాంతక శత్రువులున్నారు-కాస్త చూపుల్ని గుర్తించి  కలుసుకో
హంతకులు ఇక్కడ అనేక రూపాల్లో  సంచరిస్తున్నారు)/ ఒక చోట దీపాలు/

పైపైన చూస్తే లోకం ఎంత సౌమ్యంగానో కనిపిస్తుంది. కానీ, లోనికి తొంగి చూస్తే అందులో చాలా భాగం ఒక మహా కీకారణ్యమని తెలిసిపోతుంది. క్రూర మృగాల్లాంటి మనుషులు ఇక్కడ  శాంత మూర్తుల ముసుగులో సంచరిస్తున్నారు. . అందుకే నువ్వు వాళ్లను గుర్తించలేవు.  వాస్తవానికి ఏ కాస్త అవకాశం దొరికినా ప్రాణాలు తీయాలనుకునే  శత్రువులు. ఇక్కడ  వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ల శత్రువైఖరికి  అంతకు ముందే వారితో జరిగిన ఏదో ఘర్షణే కారణమని కూడా కాదు.. వారికి ఆశించింది  అందకుండా పోతే చాలు, వాళ్లు అలా మారిపోతారు. కాకపోతే వాళ్ల  క్రూరత్వం బయటికి కనపించకుండా  పదేపదే రూపాలు మారుస్తుంటారు. అయినా వాళ్ల  కళ్లల్లోంచి  ఆ నకిలీతనం బయటపడుతూనే ఉంటుంది. అందుకే వారి చూపుల్ని నిశితంగా గమనించి అది నేనేనని  తెలిసిపోగానే నన్ను కలుసుకో.  హంతకులు ఇక్కడ అనేక రూపాల్లో విహరిస్తున్నారు. పొరబడి వాళ్ల పాలైపోకుండా వచ్చి నా చేయందుకో అంటుంది ఆ ప్రియురాలు

లోకం రీతులు, ప్రేమ లోతులు తెలిసిన ఓ యువతి జీవితాన్ని ప్రతిబింబించే ఈ గీతం మీ కోసం. 

                                                                                                --- బమ్మెర


Sunday, October 9, 2022

Aage Bhi Jaane Na Tu Song Lyrics Analysis | Waqt (1965 film) | Asha Bhosle songs |

ఈ క్షణమే మన జీవితం 

తుమ్మెద , పూల చుట్టూ తిరుగుతున్నట్లు, తుమ్మెద  నాదమొకటి కొన్ని దశాబ్దాలుగా భారత రస హృదయాల మీద తిరుగాడుతూ ఉంది. ఆ  నాదం పేరే ఆశా భోంస్లే. ప్రతి పాటతోనూ హృదయ వేదిక మీదికి ఒక గమ్మత్తైన మత్తును వదిలేసే ఆ స్వరం ఇప్పటికి కొన్ని  వేల పాటలు పాడింది. ప్రణయ భావోద్వేగాల్ని గానం చేసినంత హాయిగానే జీవిత సత్యాల్ని ఒలికించే గీతాల్ని సైతం ఆమె ఆహ్లాద భరితం చేస్తారు. ఆమె గొంతు ఒలికించిన రసడోలికల్లో ఊగిపోయిన భరతఖండం ఆమెను దాదా సాహె బ్‌ పాల్కే అవార్డుతో సత్కరించింది.  ‘వక్త్‌’ సినిమా కోసం   ‘సాహిర్‌’ రచిస్తే ‘రవి’ స్వరపరిచిన ఈ గీతం . ఆశా భోంస్లే స్వర ఝరిలో ఎలా ప్రాణం పోసుకుందో  చూద్దామా మరి!


ఆగే భీ జానే న తూ- పీఛే భీ జానే న తూ
జో భీ హై బస్‌ యహీ ఎక్‌ పల్‌ హై

(ముందుకూ పోమాకు- వెనక్కీ పోమాకు 
ఏమున్నా  ఈ ఒక్క  క్షణమే మన కు)

రాబోయే కాలం గురించో, గడిచిపోయిన కాలం గురించో  ఆలోచించడంలోనే కదా మన జీవితంలోని అత్యధిక కాలం కరిగిపోతుంది. భవిత ఎలా ఉంటుందో మనకేమీ  తెలియదు. గతం ఎప్పటికీ తిరిగి మన చేతికి రాదు. ఇంక వాటి గురించి ఆలోచించి మాత్రం మనం ఏం చేస్తాం? మనతో ఉన్నది, మనతో నడుస్తున్నది, మనలో భాగమై ఉంది, ఇప్పటి ఈ క్షణం ఒక్కటే. ఇప్పుడున్న ఈ క్షణమే  సజీవమైనది. దివ్యమైనది.  నీ ముందున్న ఈ అపురూప క్షణాల్ని ఆస్వాదించకుండా  శవమైపోయిన గతంలోకి వెళ్లడం ఎందుకు? శూన్యంలో తిరుగుతున్న ఆ భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎందుకు? అందుకే మృతప్రాయమైన ఆ గతమూ వద్దు. ఏ ఉనికీ లేని ఆ భవిష్యత్తూ వద్దు. కోటి కిరణాలతో  తొణకిస లాడే ఈ వర్తమానంలో  జీవిద్దాం మరి!

అంజానే సాయోంకా రాహోఁ మే ఢేరా హై
అన్‌దేఖీ బాహోఁనే హమ్‌ సబ్‌కో ఘేరా హై 
యే పల్‌ ఉజాలా హై - బాకీ ఆంధేరా హై
యే పల్‌ గవాఁనా న యే పల్‌ హీ తేరా హై
జీనేవాలే సోంచ్‌లే యహీ వ క్త్‌ హై కర్‌లే  పూరి ఆర్జూ / ఆగే భీ/

 ( తెలియని  నీడలేవో దారుల నిండా అలుముకుని ఉన్నాయి
 ఎన్నడూ చూడని బాహువులేవో మనలందిరినీ చుట్టు ముట్టేశాయి
 ఈ ఘడియే వెలుతురు. మిగతా అంతా చీకటి
ఈ ఘడియను జారవిడుచుకోకు, యీ ఘడియే నీది మరి
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను... నీ ఆశలన్నీ నెరవేర్చుకో)

జరగబోయే  వాటి గురించి  ఏదో కొంత అంచనా అయితే ఉంటుంది. అయితే  ఆ జరగబోయేవన్నీ  మన అంచనాలకు లోబడే ఉంటాయని కాదు కదా! వాస్తవం ఏమిటంటే మన ఆలోచనలకు, అంచనాలకూ అతీతంగా ఏవేవో జరిగిపోతూనే ఉంటాయి, ఆ జరిగే  క్రమంలో మనం ఊహించని  పరిణామాలేవో  మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి.  మన శక్తియుక్తులతో,  మన కళ్ల ముందున్న క్షణాల మీద ఎలాగోలా వెలుతురు నింపుకుంటాం. కానీ, మన కంటికి  దూరంగా ఉన్నవన్నీ చీకటిమయమే అవుతాయి? ఆ చీకట్లో ఏం అన్వేషించి  ఏం పట్టుకుంటాం?  ఆ వృధా ప్రయత్నాల్లో పడి  మన ముందున్న ఈ అపురూప క్షణాల్ని పోగొట్టుకోవడం ఎందుకు? ఈ క్షణమే మనది.  దీన్ని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం. మన ఆశల్ని నెరవే ర్చుకునే అరుదైన క్షణాలివి వాటిని సార్థకం చేసుకుందాం.

ఇస్‌ పల్‌కే జల్‌వోఁ మే మహఫిల్‌ సఁవారీ హై
ఇస్‌ పల్‌ కీ గర్‌మీ నే ధఢ్‌కన్‌ ఉభారీ హై 
ఇస్‌ పల్‌ కే హోనే సే దునియా హమారీ హై
యే పల్‌ జో దేఖో తో సదియోం పే భారీ హై
జీనేవాలే సోంచ్‌లే  యహీ వక్త్‌ హై కరలే పూరి ఆర్జూ  / ఆగే భీ/
( ఈ అద్భుత క్షణాల్లో జీవన సదస్సు జరుగుతోంది
ఈ ఉద్విగ్న క్షణాల్లో  గుండె వేగం పెరుగుతోంది.
ఈ క్షణంలో ఉన్నాం క నకే ఈ లోకం మనదైంది
ఈ క్షణాలు ఎన్నో యుగాల కన్నా అపురూపమైనవి
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను మరి... ఆశలన్నీ నెరవేర్చుకో )

విశ్వం ఎన్ని లక్షల ఏళ్లు ఉంటేనేమిటి? మనం వాటిని చూడబోయామా? వాస్తవానికి విశ్వకాలం అంటే మరేదో కాదు. మన జీవిత కాలమే విశ్వకాలం. మనం లోకంలో లేకుండా పోయాక ఈ విశ్వం ఏమిటి? మనమేమిటి? అందుకే సమస్త మానవాళీ ఇప్పుడున్న ఈ  క్షణాన ఒక మహా సదస్సు జరుపుకునే అపురూప క్షణాలివి. అత్యంత అరుదైన ఈ క్షణాల్లోని ఆ ఉద్విగ్న భావాలతో హృదయ లయ పెరిగే ఘడియలివి. ఈ క్షణంలో జీవించే వారిదే ఈ ప్రపంచం. మన ముందున్న ఒక్క క్షణం రాబోయే కొన్ని యుగాలకు సమానం. అందుకే ఓ మానవా! ఇదే సరియైన సమయం నీ ఆశలన్నీ  నెరవేర్చుకో 

ఇస్‌ పల్‌ కే సాయే మే ఆప్‌నా ఠికానా హై
ఇస్‌ పల్‌ కే ఆగే కీ హర్‌ శౌ ఫసానా హై
కల్‌ కిస్‌నే దేఖా హై-కల్‌ కిస్‌నే జానా హై
ఇస్‌ పల్‌ సే పాయేగా-జో తుఝ్‌కో పానా హై
జీనేవాలే సోంచ్‌లే యహీ వక్త్‌ హై కర్‌లే పూరి ఆర్జూ / ఆగే భీ/

( ఈ ఘడియ నీడలోనే మన నివాసం ఉంది
ఈ ఘడియ ఆవలకు వెళితే అక్కడంతా ఓ పెద్ద గాదే  ఉంటుంది 
రేపును చూసిందెవడు? రేపు గురించి తెలిసిందెవడు?
ఏం పొందాలనుకున్నా ఈ ఘడియలోనే పొందగలవు మరి !) 
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను మరి... ఆశలన్నీ నెరవేర్చుకో )

ఈ క్షణాలే నీకు నీడనిస్తాయి. జీవితాన్నిస్తాయి. జీవితానందాన్ని ఇస్తాయి. ఈ  క్షణం తరువాత జరిగే ప్రతిదీ  ఓ మహా గాధగా ఉంటుంది. రేపు, రేపు అంటాం కానీ, రేపు తాలూకు  రూపురేఖలు ఎలా ఉంటాయో ఎవరైనా చూశారా? రేపు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని మార్పులకు లోనవుతుందో ఎవరైనా అంచనా వేయగలిగారా? అందీ అందని సత్యాల గురించి అంచనాలెందుకు? ఆలోచనలెందుకు? ఏం పొందాలన్నా, ఏం సాధించాలన్నా  ఈ రోజు ఒక్కటే నీకు ఉపకరిస్తుంది. ఓ మానవా! అన్నీ ఆలోచించుకో  ఈ ఆశలన్నీ ఇప్పుడే నెరవేర్చుకో. 

ఇదీ ఈ గీతం  సంభోదన, వర్తమానం విలువ తెలిపే ఒక కవిగారి  హృదయ సంవేదన.

                                           ---బమ్మెర

Thursday, September 15, 2022

Mera Pyar Woh Hai song | Yeh Raat Phir Na Aayegi film | Mahendra Kapoor songs |

స్వర్గానికి బదులుగా నిన్నే కోరుకుంటా 

భూమి ఎంత అందమైన దైనా  కావచ్చు. కానీ, దాన్ని ఆవరించి ఉన్న  ఆకాశాన్ని చూడనిదే వెలితిగా,  ఏదో  అసంపూర్ణంగా అనిపిస్తుంది. రాగాల ఆలాపనలోనూ అంతే.  తార స్వరాన్ని తాకకుండా పాటంతా మంద్రలోనే సాగితే ఏదో వెలితిలా  అనిపిస్తుంది.  ఆ వెలితి ఎందుకు ఉండాలని,  రాగాన్ని నేలమీదే కాకుండా  ఆకాశాన కూడా నడిపించిన మహాగాయకుడు మహేంద్రకపూర్‌. పాడటానికి సంగీత పరిజ్ఞానమే సరిపోదు ఎంతో  ఆత్మవిశ్వాసం ఉండాలి అనే వారాయన. ‘యే రాత్‌ ఫిర్‌ న ఆయేగీ’ సినిమాలోని   ‘మేరా ప్యార్‌ వో హైఁ కే’ అన్న  ఈ పాటలో ఆ ఆత్మశ్వాసమే ధ్వనిస్తుంది.  హెచ్‌. ఎస్‌. బిహారీ రాసిన ఈ గీతానికి ఓ. పి. నయ్యర్‌ సంగీతం సమకూర్చారు. గగన సీమలో తేలియాడే మహేంద్ర కపూర్‌  గళ మాధుర్యాన్ని  మరోసారి                   విని తరించండి మరి!


మేరా ప్యార్‌ వో హై కే మర్‌కర్‌ భీ తుమ్‌కో
జుదా అప్‌నీ బాహోఁసే హోనే న దేగా
మిలీ ముఝ్‌ కో జన్నత్‌ తో జన్నత్‌ కే బద్‌లే
ఖుదా సే మేరీ జాఁ తుమ్హే  మాంగ్‌ లేగా

( నా ప్రేమ,  నా మరణానంతరం కూడా నిన్ను  నా బాహువుల్లోంచి దూరం  కానివ్వదు. నాకు స్వర్గమే లభించినా, ఓ ప్రియురాలా!  స్వర్గానికి బదులుగా నిన్నే ఇవ్వమని భగవంతుడ్ని కోరుకుంటాను)

ప్రేమకు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం ఉండదని కదా వాదన! అందుకే కాల పరిమితి మా శరీరాలకే గానీ,  ప్రేమలకు లేదంటారు ప్రేమికులు. ఆ కారణంగానే తమ మరణానంతరం కూడా తాము ప్రేమించిన వారి పట్ల  ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని బలంగా నమ్ముతారు. అంతే కాదు. భగవంతుడే వచ్చి నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను. ఇక నీ ప్రియురాలును మరిచిపో అంటే ‘నా ప్రియురాలే లేని స్వర్గం నాకెందుకు? ఆ స్వర్గానికి బదులుగా నా ప్రియురాలిని నాకు  ఇవ్వు చాలు’ అంటారు. నిజానికి   భావోద్వేగాలకు భౌతిక రూపాలే ఉండవు. భౌతికం కాని వాటికి జీవిత కాలం, ఓ కాల పరిమితి అంటూ ఏముంటాయి? ప్రేమే కావచ్చు. మరొకటి కావచ్చు. భౌతికం కానివి  ఏవైనా అనంత కాలం ఉంటాయి. ఈప్రేమికుడు అనేదీ అదే. దేహం భౌతిక మైనది కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతుంది.  కానీ,  ఈ అభౌతికమైన, ఆత్మగతమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అంటాడా ప్రేమికుడు.

జమానా తో కర్‌వట్‌ బదల్‌తా రహేగా
నయీ జిందగీ కే తరానే బనేంగే
మిటేగీ న లేకిన్‌  ముహబ్బత్‌  హమారీ
మిటానే కే  సౌ సౌ బహానే బనేంగే
హకీకత్‌  హమేశా, హకీకత్‌ రహేంగీ
కభీ భీ న ఇస్‌కా ఫసానా బనేగా   / మేరా ప్యార్‌/

(లోకం అటూ ఇటూ దొర్లుతునే ఉంటుంది. ఏ రోజుకారాజు కొత్త కొత్త రాగాలు  సిద్ధమవుతూనే ఉంటాయి. మా ప్రేమ ఎప్పటికీ మాసిపోయేది కాదు . అయిన లోకం దాన్ని మసి చేసే వందలాది సాకులు వెతుకుతూనే ఉంటుంది . సత్యం ఎప్పుడూ సత్యమే. ఈ సత్యమెప్పుడూ గతించిన గాధగా మారిపోదు
)

కాలం నిరంతరం మారుతూ ఉంటుంది. కాలంతో పాటు లోకమూ మారుతూ వెళుతుంది. అవసరాలకు, పెరుతుతున్న ఆశలకు ఆనుగుణంగా ప్రపంచంలోని పలు విషయాలు నిత్యం మారుతూ వెళుతూ ఉంటాయి. ఆ క్రమంలో  లోకం అప్పటిదాకా ఆలపించిన వాటికి భిన్నంగా ఒక్కోసారి పూర్తి  విరుద్ధంగా కూడా కొంగొత్త రాగాలు ఆలపిస్తుంది.  
లోకం  విషయం ఏమైనా కావచ్చు. అది ఎన్ని రకాలుగానైనా మారవచ్చు. ప్రేమ విషయంలో అవేవీ జరగవు. ప్రేమ ఒక పరమ సత్యం. సత్యం మారడం ఉండదు కదా!. ఎవరెన్ని ఎత్తులు వేసినా దాని  తుడిచేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. భౌతిక రూపాలలకు నిరంతరం రూపాంతరం చెందడం ఒక సహజలక్షణం. కానీ,  ఆత్మల పరిస్థితి అది కాదు. భౌతిక ప్రపంచానికి ఈ ఆత్మలోకం పూర్తిగా  భిన్నమైనది, అతీతమైనది. ఆ అతీతత్వమే ఆ ప్రేమను ఆ ప్రేమించే ఆత్మలను అమరం చేస్తుంది.

తుమ్హే ఛీన్‌ లే మేరీ బాహోఁ సే  కోయీ
మేరా ప్యార్‌ యూఁ బేసహారా నహీఁ హై
తుమ్హారీ బదన్‌ చాంద్‌నీ ఆకే ఛూలే
మేరే దిల్‌కో యే భీ గఁవారా నహీఁ హై
ఖుదా భీ ఆగర్‌ ఆకే తుఝకో మిలే తో
తుమ్హారీ కసమ్‌  హైఁ మేరా దిల్‌  జలేగా / మేరా ప్యార్‌/

( నా బాహువుల్లోంచి ఎవరో వచ్చి బలత్కారంగా నిన్ను తీసుకుపోవడమా !  నా ప్రేమ అంత నిస్సహాయమైనదేమీ కాదు
నీ తనువును వె న్నెలే వచ్చి తాకినా  నా హృదయానికి అది భరించరాని విషయమే సుమా ! . మనిషి మాటెందుకు? దేవుడే దిగి వచ్చి నిన్ను కలుసుకున్నా నీ మీద ఒట్టు. నా మనసు మండిపోతుంది)

ప్రేమికులు దేనికైనా భయపడుతున్నారూ అంటే ఇంకా ఆ ప్రేమ అసమగ్రంగా ఉందనే అర్థం. సంపూర్ణమైన, సర్వసమగ్రమైన ప్రేమ దేనికీ భయపడదు. అందుకే, పరిపూర్ణంగా ప్రేమించిన ఒక ప్రియుడు ఎవరో వచ్చి తన ప్రియురాలిని  తననుంచి దూరం చేయలని చూస్తే ఏ ప్రేమికుడూ నిస్సహాయంగా ఉండిపోలేడు. మనిషే అని కాదు చివరికి గాలి, నీరు,  వెన్నెల ఇలా ప్రకృతిలోని ఏదీ తన ప్రియురాలిని తాకడాన్ని భరించలేడు. చివరికి తన ప్రియురాలితో ఆ  దేవుడే వచ్చి కలిసినా ఆ ప్రియుడి గుండెలు మండిపోతాయి.
ఈ ప్రేమైక జీవన  భావోద్వేగాలే ఈ పాట నిండా ధ్వనిస్తున్నాయి.  అవి మహేంద్రకపూర్‌ గొంతులో పడి నిప్పు రవ్వల్లా, వజ్రకిరణాల్లా మెరిసిపోతున్నాయి.
                                                                                                                  --- బమ్మెర

Monday, August 22, 2022

Kasme Waade Pyar Wafa song Analysis - कसमें वादे प्यार वफ़ा विश्लेषण | Upkar film - उपकार (1967 फ़िल्म) | Manna Dey Songs - मन्ना डे गीत

ఆకాశంలోకి ఎగిరానని అంత అహం ఎందుకు ?


హీరోలకే తప్ప విలన్‌ పాత్రధారులకు అత్యున్నత పురస్కారాలు రావడం చాలా... చాలా అరుదు. దాదాపు 400 సినిమాల్లో విలన్‌ పాత్రలే ధరించిన  ప్రాణ్‌కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు రావడం అంతటి అరుదైన సంఘటనే మరి! కాకపోతే, సినీ జీవితమంతా విలన్‌ పాత్రలే పోషించిన ప్రాణ్‌, 'ఉప్‌కార్‌' సినిమాలో మాత్రం, ఎంతో హృద్యమైన క్యారెక్టర్‌ పాత్ర పోషించారు.  ఆ సినిమాలోని ‘కస్‌మే వాదే ప్యార్‌ వఫా సబ్‌’ అన్న పాటలోని ఆయన అభినయం నిజంగా,  కోట్లాది భారతీయ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది. 

జీవన ప్రవాహంలో, భావోద్వేగాల వెల్లువలో మనిషి ప్రతిరోజూ ఏవేవో మాటలు చెబుతుంటాడు. తన మాట, తన బాట ఒకటేనని  కూడా చెబుతాడు. కాకపోతే, ప్రతి మాటా మరీ అంత ఆలోచనాత్మకం కాకపోవడం వల్ల, ఆలోచన మారినప్పుడు అతని మాట కూడా మారిపోవచ్చు. ఆ పరిస్థితిని ఎవరైనా కాస్త అర్థం చేసుకోవచ్చు. అయితే వాగ్దానం అనే మాట పూర్తిగా వేరు.  ప్రత్యేకించి ప్రమాణం చేసి మరీ చెప్పడం వేరు. ఎవరైనా ఏ విషయంలోనైనా వాగ్ధానం చేశారూ అంటే, ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే, చేసిన వాగ్దానం నుంచి వైదొలగడని మానవలోకం బలంగా నమ్ముతుంది. అయితే, ఎవరైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం  ఏ కారణాన్నో మిషగా చూపించి ఆ వాగ్ధానానికి విరుద్ధంగా వెళితే ఏమనుకోవాలి? అప్పటిదాకా అతని వాగ్దానాన్ని నమ్మి,  సర్వశక్తులూ ధారవోసి, జీవితాన్నే ఫణంగా పెట్టి, అతని వెంట నడిచిన వాళ్లంతా ఏమైపోవాలి? వాగ్ధానం అన్నది సాదాసీదా మాటలా చంచలంగా మారిపోతే ఆ రెండింటికీ మధ్య తేడా ఏముంది? ఇలాంటి చేదు అనుభవాల తర్వాత మళ్లీ  ఎవరైనా, ప్రమాణాలు చేస్తేనో, వాగ్ధానాలు చే స్తేనో ఎలా ఉంటుంది? వినేవాళ్ల గుండెలు ఆక్రోశంతో మండిపోతాయి. మహా అగ్నిగోళాలై చండ్రనిప్పులు ఎగజిమ్ముతాయి? ఆ ఆక్రందనకూ, ఆవేదనకూ ప్రతిరూపమే ఈ గీతం. ‘ఉప్‌కార్‌’ సినిమా కోసం ఇందీవర్‌ ఈ గీతాన్ని రచించగా, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ స్వరపరిచారు. ఆకాశం పిక్కటిల్లేలా అంతరంగ లోకాన్ని ప్రతిధ్వనింప చేస్తూ,  ‘మన్నాడే’ ఈ గీతాన్ని ఆలపించిన తీరు అనితర సాధ్యం! 




కస్‌మే వాదే ప్యార్‌ వఫా సబ్‌ - బాతే హైఁ బాతో కా క్యా
కోయీ కిసీకా నహీ యే ఝూటే - నాతే హైఁ నాతోంకా క్యా
(ప్రమాణాలూ, వాగ్ధానాలూ ఇవన్నీ ఉత్త మాటలే- ఈ మాటలదేముంది?
ఎవరూ ఎవరికీ కారు. అన్నీ అసత్యపు బంధాలే- ఈ బంధాలదేముంది?)
మాట అంటే ఉత్తుత్తి శబ్ధం కాదు కదా! అది మనిషిలోని నిలువె త్తు నిబద్ధతకు ప్రతిరూపం. మాటంటే ఒక ప్రాణచలనం. మాటే కదా బంధాల్నీ మానవ సంబంధాల్నీ నిలబెట్టేది వాస్తవానికి బంధం అన్నది మానవ   హృదయం సృష్టించిన ఒక అద్భుత ప్రపంచం. క్రమక్రమంగా ఆ ప్రపంచం తన ఉనికినీ, తన జవజీవాల్నీ  కోల్పోతోంది ఎందుకని? పోనుపోను... మానవ సంబంధాలు మరీ ఇంత కంటకప్రాయంగా ఎందుకు మారుతున్నాయి? మాట ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గే మానవ నైజం మూలాలు ఎక్కడున్నాయి? మాట ఇచ్చి వెనక్కి తగ్గడం అంటే  తన శవయాత్రలో తాను నడవడమే కదా!  ఇచ్చిన ఒక మాట కోసం, చేసిన వాగ్దానం కోసం జీవితాల్నే ఫణంగా పెట్టిన వారు లోకంలో ఎందరు లేరు? మాట పోతే ప్రాణం పోయినట్లేననే కదా  ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరెందరో నానా కష్టాలు  పడ్డారు? అలాంటి వాళ్లను చూసిన వారు, ఎవరైనా ఏదైనా వాగ్దానం చేశారంటే దాని మీద కొండంత  నమ్మకం పెట్టుకుంటారు. అయితే, వాగ్దానం చేసిన వారే ఒక్కరొక్కరుగా ఆ వాగ్దానం నుంచి పక్కకు తొలగిపోతుంటే ఆ నమ్ముకున్న వారికి  ప్రమాణాలూ, వాగ్ధానాలూ అన్నీ  ఉత్త అబద్ధాలే అనిపించవా మరి? 
 
హోగా మసీహా సామ్‌నే తేరే - ఫిర్‌ భీ నా తూ బచ్‌ పాయేగా
తేరా అప్‌నా ఖూన్‌ హీ ఆఖిర్‌ - తుజ్‌కో ఆగ్‌ లగాయేగా 
ఆస్‌మాన్‌ మే ఉడ్‌నే వాలే మిట్టీ మే మిల్‌ జాయేగా /కస్‌మే/
(ఏ మహర్షో నీ ముందు నిలుచున్నా - నీకు మాత్రం ఇక్కడ రక్షణే లేదు
నీ రక్తం అనుకున్న వాళ్లే - ఇక్కడ నీకు నిప్పు ముట్టిస్తారు. 
ఆకాశంలో ఎగిరే వాళ్లంతా కడకు - మట్టిలో కలిసిపోయే వాళ్లేగా )
మనిషి ఎంత క్రూరుడయ్యాడూ అంటే నీ ముందే ఒక మహా యోగి ఉన్నా నిన్ను వదిలేయడు. అతని కళ్లముందే నిన్ను బలితీసుకుంటారు
నావాళ్లూ ... నావాళ్లూ అని నువ్వేదో నమ్మేస్తావు గానీ,  నీ రక్తం పంచుకున్న వాళ్లే ఒక రోజున నిన్ను అగ్ని గుండంలోకి తోసేస్తారు. మాకేమిటి? ఏకంగా ఆకాశంలోకే ఎగిరిపోయామని కొందరు తెగ విర్రవీగుతారు   కానీ,  ఎంతెత్తుకు ఎగిరినా ఎప్పటికీ ఆకాశంలోనే ఉండిపోలేరుగా! ఆకాశంలో తిరిగీ తిరిగీ చివరికి మళ్లీ భూమ్మీదికి దిగిరావలసిందేగా! అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందేగా! ఎందుకో ఈ సత్యం చాలా మందికి  కడదాకా బోధపడదు. మృత్యువు వచ్చి భుజం పైన చేయి వేసే దాకా మనసు ఆ సత్యం వైపు తిరిగైనా చూడదు. 

సుఖ్‌ మే తేరే సాథ్‌ చలేంగే - దుఖ్‌ మే సబ్‌ ముఖ్‌ మోడేంగే 
దునియా వాలే తేరే బన్‌కర్‌ - తేరా హీ దిల్‌ తోడేంగే
దేతే హైఁ భగ్‌వాన్‌ కో దోఖా - ఇన్‌సా కో క్యా ఛోడేంగే / కస్‌మే/
(నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నీ వెంటే నడుస్తారు. 
నువ్వు దుఃఖంలో ఉన్నావా -  అందరూ  మొహం చాటేసుకుని  వెళ్లిపోతారు. 
లోకంలో మనుషులు నీవాళ్లలా ఉంటూనే నీ హృదయాన్ని విరిచేస్తారు.
 వీళ్లు దేవుణ్ణే మోసగించే రకం - ఇక మనిషినేం వదులుతారు?)
నీ జీవితం సకల సౌఖ్యాలతో ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగే వాళ్లంతా నీకేమిటి? నేనున్నానంటూ, ఎవరికి వారు ఎంతో ధీమానిచ్చే మాటలు చెబుతారు. కానీ, ఒక్కసారి నీ జీవితం కష్టాలవైపు మొగ్గిందా? వాళ్లల్లో ఏ ఒక్కరూ కనపించరు ఉన్నట్లుండి అంతా  మటుమాయమవుతారు. అప్పటిదాకా నీ వాళ్లుగా ఉన్నవాళ్లంతా,  నీ గుండెల్లో గునపాలు గుచ్చి మరీ వెళ్లిపోతారు.  అవసరమైతే  దేవుణ్నే మోసం చేయగల సిద్ధహస్తులు వీరు. ఇలాంటి వారు, ఇక మనిషిని వదిలేస్తారా? అందుకే, ఎవరో ఏదో వాగ్ధానం చేశారనీ, ప్రమాణం చేసి మరీ చెప్పారని అందరికి అందరినీ నమ్మితే, ఒక్కోసారి పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోవవడం ఖాయం. అందుకే  నిజమైన మనిషికీ, నకిలీ మనిషికీ మధ్క గల తేడా తెలుసుకుని మసలడం  ఎంతో అవసరం అన్న ఒక నిగూఢ సత్యాన్ని ఈ గీతం మరీ మరీ స్పష్టంగా చెబుతుంది.

                                                                                                                 --- బమ్మెర
songs from upkaar,कसमें वादे प्यार वफ़ा हिंदी लिरिक्स,

Wednesday, August 10, 2022

Zindagi Ka Safar song - जिन्दगी का सफर गीत | Safar film - सफर (1970 फ़िल्म | Kishore Kumar Songs - किशोर कुमार गीत |

ఏడుస్తూ వచ్చినా.. నవ్వుతూ వెళ్లిపోతా...

‘జీవితానికి అర్థం లేదు. దానికి మనమే ఒక అర్థం కల్పించాలి’ అంటారు తత్వవేత్త జియో పాల్‌ సార్థ్‌. నిజమే కదా ! ఏ ప్రాణీ  పుట్టుకతోనే ఒక అర్థాన్ని పునికి పుచ్చుకుని, ఒక గమ్యాన్ని ఎంచుకుని లోకంలోకి రాదు. వచ్చాక చేసిన కొన్ని  పరిశీలనలు, పరిశోధనల తరువాత, ఎదురైన కొన్ని అనుభవాల తరువాత  జీవితం పట్ల కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. వాటి ఆధారంగా మరికొన్ని ఆలోచనలు చేస్తాం. మనవైన అర్థాలు చెప్పుకుంటాం. మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకుంటాం. అవన్నీ మనం ఏర్పరుచుకున్నవే తప్ప అందులో ఏవీ సహజంగా ఉన్నవేమీ కాదు.అందుకే ఎంత అధ్యయనం చేసినా జీవితానికి పూర్తి అర్థం బోధపడినట్లు అనిపించదు. ఆ బోధపడక పోవడానికి జీవితమూ, ప్రపంచమూ నిరంతరం మారుతూ ఉండడమూ ఒక కారణమే. వాస్తవానికి జీవితం ఏ మేరకు అర్థమయ్యిందని కూడా కాదు, అన్ని పరిణామాల్ని ఎదుర్కొంటూనే ఆనందం జారిపోకుండా నిలబడగలిగావా లేదా అన్నదే అన్నిటికన్నా ముఖ్యమవుతుంది. ‘సఫర్‌’ సినిమా కోసం ఇందీవర్‌ రాసిన పాటలో ఈ ప్రస్థావనే ఉంది. కళ్యాణ్‌జీ- ఆన ంద్‌జీ స్వరపరిచిన ఈ పాటను గండుకోయిల కిశోర్‌ కుమార్‌ గానం చేశారు. 

జిందగీ కా సఫర్‌, హై యే కైసా సఫర్‌

కోయి సమ్‌ఝా న హీఁ కోయి జానా నహీఁ

హై యే కైసీ డగర్‌, చల్‌తేహై సబ్‌ మగర్‌

కోయి సమ్‌ఝా నహీఁ కోయి జానా నహీఁ/జిందగీ కా/

(ఈ జీవనయానం, అదేమిటో గానీ,  

ఎవరూ దీన్ని అర్థం చేసుకోలేదు. ఎవరికీ ఇది బోధపడలేదు. 

 అదేమి మార్గమో గానీ, అందరూ అందులోంచే నడుస్తున్నా ఆ మార్గం గురించి

ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ బోధపడలేదు.)

అనంతమైన ఈ సృష్టి, దాని నిరంతరమైన పరిణామాలు అనుక్షణం నీ మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. అలాగే మానవాళి ఆలోచనా ప్రభావం కూడా సమాజం మీద పడుతూనే ఉంటుంది.  పరస్పరం ప్రభావితం అవుతూనే ఉంటాయి. అందుకే ఎక్కడా ఏదీ నిలకడగా ఉండదు. ప్రపంచంలో ఏదీ నాశనం కాదు కూడా కాకపోతే , నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. అయితే నిలకడగా లేని దాన్ని ఎవరైనా నిశితంగా ఎలా పరిశీలించగలరు? అందుకే ఎన్నేళ్లు గడిచినా జీవిత యాత్ర ఎవరికీ స్పష్టంగా అర్థం కాదు. ఎవరికీ సంపూర్ణంగా బోధపడదు. ఎందుకంటే  అప్పటికి అవే  నిజమనిపించిన ఎన్నో సత్యాలు  కొంత వ్యవధిలోనే సమూలంగా మారిపోతుంటాయి. కాకపోతే ప్రపంచంలో ఏదీ శాశ్వత సత్యం కాదనే నిజమొకటి ఎప్పటికప్పుడు  బోధపడుతునే ఉంటుంది. అదే మనసును కొంత నిలకడగా ఉంచుతుంది. అదే అన్నింటి పైనా ఒక సమదృష్టిని కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే  ఒకింత అయోమయం, ఒకింత జ్ఞానస్పృహ ఇవే జీవితాన్ని నడిపిస్తాయి.

జిందగీ కో బహత్‌ ప్యార్‌ హమ్‌నే దియా 

మౌత్‌ సేభీ మొహబ్బత్‌ నిభాయేంగె హమ్‌ః

రోతె రోతే జమానే మే ఆయే మగర్‌

హస్తే, హస్తే జమానే సే జాయేంగ్‌ హమ్‌

జాయేంగె పర్‌ కిధర్‌, హై కిసే యే ఖబర్‌

కోయి సమ్‌ఝా నహీఁ కోయి జానా నహీఁ / జిందగీ కా/

( జీవితానికి నేనెంతో ప్రేమ పంచాను-మృత్యువు పట్ల కూడా నేను అంతే ప్రేమతో ఉంటాను. ఏడుస్తూ, ఏడుస్తూ లోకం లోకి వచ్చాను గానీ, నవ్వుతూ నవ్వుతూ లోకంలోంచి వెళ్లిపోతా. కాకపోతే ఆ వెళ్లేది ఎక్కడి కి అన్న సమాచారమే ఎవరి         వ ద్దా లేదు. అందుకే   ఆ ప్రదేశం గురించి, ఆ ప్రయాణం గురించి ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ బోధపడలేదు.)

సమస్త విషయాల మీద, సమస్త జీవన పరిణామాల మీద సమదృష్టి కలిగి ఉండడమే జ్ఞానానికి పరమావధి. ఆ దృష్టే ఏర్పడిన్నాడు. అతనికి జీవితమూ మరణమూ సమానంగానే కనపడతాయి. ఆ పరిణతి ఏర్పడిన మనిషి జీవితం పట్ల మనిషి ఎంత ప్రేమగా ఉంటాడో మృత్యువు పట్ల కూడా అంతే ప్రేమగా ఉంటాడు. పుట్టేటప్పుడు ఏడుపు లంఘించినా  పోయే టప్పుడు మాత్రం మందహాసంతో ఉండిపోతాడు. కాకపోతే ఆ పోయేది ఎక్కడికో ఏమీ అర్థం కాకపోవడమే  ఇక్కడ సమస్య. జీవితంలో అంతుచిక్కని విషయాలు ఎప్పుడూ ఉంటాయి. వాటికోసం ఇంకా నిరీక్షించకుండా,  అర్థమైన వాటితోనే జీవితాన్ని ఎలా  సార్థకం చేసుకోవాలో తెలియడమే వివేకం మరి!

ఐసే జీవన్‌ భీ హై జో జియే హీ నహీఁ

జిన్‌ కో జీనే సే పహెలే హీ మౌత్‌ ఆగయీ

ఫూల్‌ ఐసే భి హై  జో ఖిలే హీ నహీఁ

జిన్‌కో ఖిల్‌నే సే పహెలేహీ ఖిజా ఛాగయీ 

హైఁ పరేశాఁ నజర్‌ థక్‌ గయే చారగర్‌

కోయి సమ్‌ఝా నహీఁ కోయీ జానా నహీఁ / జిందగీ కా/

( జీవితాలన్న పేరే కానీ, వాటిలో కొన్ని అసలు జీవించనే లేదు.

జీవించడం కన్నా ముందే   వాటిని  మృత్యువు ఆవహించింది. 

పూలన్న పేరే కానీ, వాటిలో కొన్ని అసలు వికసించనే లేదు.

వికసించడం కన్నా ముందే అవి హేమంతానికి  ఆహుతైపోయాయి.

మనసులు ఆవేదనతో నిండిపోవడం, అలసిపోయి చూడటమే గానీ,

ఈ పరిణామాలు ఎవరికీ అర్థం కాలేదు.  ఎవరికీ బోధపడ లేదు.)

వికసించడం కన్నా ముందే కొన్ని పూలు  రాలిపోయినట్లు,  కొన్ని ప్రాణాలు ఇంకా జీవించడం మొదటెట్టక ముందే మృత్యువు పాలవుతాయి. ఒక దశలో జీవితం ఎంతో సుదీర్ఘమని అనిపించినా మరోదశలో జీవితం ఎంత క్షణికమో బోధపడుతుంది. '' నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహిస్తూనే మరోపక్క దానికి సమాంతరంగా నడిచి వచ్చే మృత్యువును కూడా అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అప్పుడే ప్రాణం సౌరభాలు వెదజల్లుతుంది. జీవితం సార్థకమవుతుంది '' అన్న  లోతైన జీవన తాత్వికతను తెలిపే అద్భుత గీతమిది. 

 - బమ్మెర

#सफर (1970 फ़िल्म , जिन्दगी का सफर , किशोर कुमार


Saturday, July 23, 2022

Aapki Nazron Ne Samjha song analysis | Anpadh film | Lata Mangeshkar song |

నువ్వే నా జీవన గమ్యం 

మించడం కన్నా ప్రేమించబడటంలోనో గొప్పతనం ఉంది’ అంటూ ఉంటారు. నిజమే మరి! ప్రేమించడానికి ఏముంది? మనకు ఏ యోగ్యతలూ లేకుండానే ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమించబడటానికే ఎన్నోయోగ్యతలు ఉండాలి. అలా ఏమీ లేనప్పుడు ఎవరైనా నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? ఎవరైనా నిన్ను ప్రేమించారూ అంటే నీలో ఏవో యోగ్యతలు ఉన్నట్లే మరి! ఓ నవయువకుడు తన ముందు నిలుచుని ‘‘ నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అనగానే ఆనందపరవవశమైన ఓ యువతి భావోద్వేగాల్ని చిత్రించే ఈ పాట ‘అన్‌పఢ్‌’ సినిమాలోనిది. రాజా మెహందీ అలీ ఖాఁ రాసిన యీ గీతానికి స్వర కల్పన చేసిన వారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్‌ మోహన్‌. ఈ గీతాన్ని గానం చేసిన వారు లతా మంగేష్కర్‌. అయితే సాహిత్యం మారినా ఇదే బాణీ ‘చిన్ననాటి స్నేహితులు’ సినిమాలోని సుశీల పాడిన ‘ఎందుకయ్యా న వ్వుతావూ ఎవరు సుఖపడినారనీ’ అన్న పాటలో వినబడుతుంది. ఈ రెండూ విని ఆస్వాదించండి మరి!


ఆప్‌కీ నజ్‌రోఁ నే సమ్‌ఝా ప్యార్‌ కే ఖాబిల్‌ ముఝే

దిల్‌ కీ యే ధడ్‌కన్‌ ఠహెర్‌ జా మిల్‌గయీ మంజిల్‌ ముఝే

(మీ చూపులు నన్ను మీ ప్రేమకు యోగ్యురాలిగా భావించాయి. ఓ హృదయ ధ్వనీ కాస్త ఆగిపో నాకు నా గమ్యం దొరికిపోయింది.)

తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తే తనను ప్రేమించి ఆ మాటను తానే ముందుగా తన ముందు పెడితే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? అతని ప్రేమకు తనను యోగ్యంగా భావించి తన జీవితంలోకి ఆహ్వానించే ప్రేమమూర్తికోసమే ఎదురు చూసే వారికి నిజంగానే అలాంటి వ్యక్తి తారసపడితే ఇంకేం కావాలి? అది వారికి తమ జీవిత గ మ్యం లభించినట్లు

జీవిత గమ్యాలు అనేవి వ్యక్తిగతమే గానీ, సార్వత్రికం కాదు. అందుకే ఎవరి జీవిత గమ్యాల్ని వారే నిర్ణయించుకుంటారు. ఒకరి గమ్యం మరొకరికి గొప్పగా కనిపించకపోవచ్చు గానీ తమ గమ్యం తమకు ప్రపంచంలోకెల్లా గొప్పదిగానే కనిపిస్తుంది. 

జీ హమే మంజూర్‌ హై ఆప్‌కా యే ఫైస్‌లా

కహ రహీ హై హర్‌ నజర్‌ , బందా పర్‌వర్‌ శుక్రియా

హస్‌ కే అప్‌నీ జిందగీ మే కర్‌లియా శామిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

( నన్ను  మీ ప్రేమయోగ్యంగా భావించిన మీ నిర్ణయం నాకు సర్వదా ఆమోదం. ఈ భవదీయురాలి ప్రతిచూపూ హర్షాతిరేకంతో కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ఒక నవ్వుతో మీరు మీ జీవన క్షేతంలో నన్నుచేర్చుకున్నారు)

మనం ప్రేమించే వారే ఆ ప్రతిపాదన చేసి నువ్వు ఏమంటావో చెప్పు అన్నట్లు చూస్తే ఏం చెప్పగలం? నాకు ఆమోదమే నని వేరే చెప్పాలా? హర్షాతిరేకంతో ఊగిపోయే మన చూపుల్ని బట్టే వారు అర్థం చేసుకోవాలి. ప్రేమోద్వేగంలో అప్పటిదాకా తనలోతాను ప్రవాహంలా మాట్లాడుకున్న మనసే తీరా ఒక సందర్భంలో ఏమీ మాట్లాడలేని స్థితిలో పడిపోతుంది. ఆ స్థితిని ఆ ప్రేమమూర్తి అర్థం చేసుకోవలసిందే.. మాటల ద్వారా వ్యక్తం కాలేని  భావాలు మౌనంద్వారానే కదా వ్యక్తమవుతాయి!

ఆప్‌కీ మంజిల్‌ హూ మై, మేరీ మంజిల్‌ ఆప్‌ హైఁ

క్యో మై తూఫాఁ సే ఢరూ, మేరే సాహిల్‌ ఆప్‌ హైఁ

కోయీ తూఫానోఁ సే కహెదే మిల్‌గయా సాహిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

(ఇప్పుడిక మీ జీవన గమ్యాన్ని నేను, నా జీవన గమ్యం మీరు, ఇంకా తుఫాన్‌లతో నేనెందుకు భయపడాలి? నా తీరంగా మీరు ఉన్నారుగా! ఈ సమయంలో తుఫాన్‌లతో ఎవరైనా నాకు నా జీవన తీరం లభించిందని చెప్పేస్తే బావుండేది!)

ప్రేమ బాహువుల మధ్య ఒదిగిపోయిన వారికి నిజంగా ఎంతో ధీమా వచ్చేస్తుంది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే మాట నువ్వు నా జీవన తీరానివి అన్నట్లుగా వినబడుతుంది. ఇద్దరికీ ఆ మాట ఒకేసారి, ఒకేలా వినబడుతుంది. అందుకే ‘ నీ జీవన తీరాన్ని నేను. నా జీవన తీరాని నువ్వు ’ అనే మాటల్ని ఇరువురూ ఒక పారవశ్యంతో చెప్పేసుకుంటారు? అంతే కాదు ఇప్పుడు తూఫాన్లు వచ్చినా ఇక తమనేమీ చేయలేవనే ధీమాతో ఉండిపోతారు. 

పడ్‌గయీ దిల్‌ పర్‌ మేరే ఆప్‌కీ పర్‌ఛాయియా 

హర్‌ తరఫ్‌ బజ్‌నే లగీ సైక్‌డో శహనాయియా 

దో జహాఁకీ ఆజ్‌ ఖుశియా హోగయీ హాసిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

( నా హృదయం మీద మీ ముద్రలు నిలిచిపోయాయి. అన్ని వైపుల్నించి వందలాది సన్నాయులు మోగుతున్నాయి. రెండు ప్రపంచాల ఆనందాలు ఈరోజు నా ఒడిలో వాలిపోయాయి.)

పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడే కాదు ప్రేమమూర్తి ముద్రలు హృదయంమీద పడిన్నాడే సన్నాయిల మోత మార్మోగుతుంది. ప్రేమించిన తానొక ప్రపంచమైతే, తనను ప్రేమించిన వారు మరో ప్రపంచం. ఆ రెండు ప్రపంచాలు ఒకటైన వేళ రెండు ప్రపంచాల ఆనందాలు ఇరువురికీ సొంతమైపోతాయి! కాకపోతే ఆ రెండు ప్రపంచాలూ ఒక దశలో ఒకే ప్రపంచంగా పెనవేసుకుపోతాయి. రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారినట్లు, రెండు ప్రపంచాలు ఒకే అద్భుతలోకంగా అవతరిస్తాయి. అద్వైతం అంటే ఆధ్యాత్మికమనే కాదు. రెండు ప్రేమ హృదయాల ఏకత్వమూ అద్వైతమే.

                                                                                                               --- బమ్మెర