Sunday, June 19, 2016

ముఝే తుమ్‌సే కుఛ్‌ భీ న చాహియే - Mujhe Tumse Kuch Bhi Na - Mukesh

నువ్వొస్తావని... 
        ఎవరినీ రానివ్వలేదు 
ఎవరినో ప్రేమిస్తావు. అది ఏక పక్షమే అయినా అహోరాత్రులూ వారి గురించే ఆలోచిస్తూ ఉండిపోతావు. . ఇదే సమయంలో నిన్ను మరెవరో ప్రేమిస్తూ ఉండవచ్చు. కానీ అవేవీ నీకు పట్టవు. అయితే, పరిస్థితులు వికటించి నువ్వు ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న వ్యక్తే నీకు కాకుండాపోతే....? ఏ వైపునుంచీ వెలుగేరాక కొందరి హృదయం చీకట్లో వేళ్లాడుతుంది. జీవితం గాయాల కోనలా కనిపిస్తుంది. ‘కన్హయ్యా’ సినిమా కోసం శైలేంద్ర రాసిన ఈ పాటలో ఇలాంటి హృదయ క్షోభే ఉంటుంది. అసలే వేదనా గీతం, దాన్నింక ముకేశ్‌ పాడితే ఇంకా చెప్పాలా? విషాదం భూమ్యాకాశాల్ని కమ్మేసినట్టు ఉంటుంది. 
* * * * * *
ముఝే తుమ్‌సే కుఛ్‌ భీ న చాహియే 
ముఝే మేరే హాల్‌ పే ఛోడ్‌ దో 
మేరా దిల్‌ అగర్‌ కోయీ దిల్‌ నహీఁ 
ఉసే మేరే సామ్‌నే థోడ్‌ దో / ముఝే తుమ్‌సే/ 
(నీ నుంచి నేనేమీ కోరుకోవడం లేదు - నా స్థితిలో నన్ను వదిలేసెయ్‌ 
నా హృదయం అసలు హృదయమే కాదనుకుంటే, దాన్ని నా ముందే విరిచేసెయ్‌) 

తొలుత ఒక నదీ ప్రవాహం లాంటి ప్రేమనే ఆశించి ఉండవచ్చు. ఆ ప్రేమలో ఇంద్రధనుస్సునే ఊహించి ఉండవచ్చు. కానీ ఏ విషమ పరిస్థితుల కారణంగానో నీ ప్రేమమూర్తి నీకు యోజనాల దూరంగా వెళిపోతే ఏమనిపిస్తుంది? నీ మీద అగ్గిరవ్వలు కురిపిస్తుంటే ఏమనిపిస్తుంది? గుండె చిక్కపట్టుకుని నా దారిన నన్ను వదిలేసెయ్‌ చాలు అనేస్తారు. చివరికి, నీ చేతులతో నా హృదయాన్ని తునాతునకలు చేస్తానన్నా, అందుకు నేను సిద్ధమే అనేదాకా వెళతారు.
మై యే భూల్‌ జావూంగా జిందగీ, కభీ ముస్కురాయి థీ ప్యార్‌ మే 
మై యే భూల్‌ జావూంగా మేరా దిల్‌ కభీ ఖిల్‌ ఉఠా థా బహార్‌ మే 
జిన్హే ఇస్‌ జహాఁ నే భులా దియా, మేరా నామ్‌ ఉన్‌ మే హీ జోడ్‌ దో / ముఝే తుమ్‌ సే/ 
(ఒకప్పుడు నా జీవితం ప్రేమలో హాయిగా నవ్వుకుందన్న విషయాన్నే నేను మరిచిపోతాను 
ఒకప్పుడు నా హృదయం వసంతంలో నిండుగా వికసించిందన్న విషయాన్నే నేను మరిచిపోతాను 
ఈ లోకం ఎవరెవరిని మరిచిపోయిందో, వారిలో నా పే అందులోనే చేర్చేసెయ్‌) 
గాయాల్ని ఎలాగూ మరిచిపోవాలనకుంటాం. కానీ, కొన్ని సార్లు జీవితపు ఆనంద ఘట్టాల్ని కూడా మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుది. ఎందుకంటే, ఆనందాల్ని గుర్తు చేసుకున్న ప్రతిసారీ వాటిని వెన్నంటి నడిచే విషాదాలు కూడా గుర్తుకొస్తాయి. పెగా వేటిని మరిచిపోవాలనుకుంటామో అవే మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. ఇదొక హృదయ వైచిత్రి. అందువల్ల మనం మరిచిపోలేకపోయినా అస్తమానం ఆ విషయాల్నే చర్చించుకునే ఈ లోకమైనా వాటిని మరిచిపోతే మేలు కదా అనిపిస్తుంది.
తుమ్హే అప్‌నా కహెనే కీ చాహ్‌ మే, కభీ హోసకే న కిసీ కే హమ్‌ 
యహీ దర్డ్‌ మేరే జిగర్‌ మే హై, ముఝే మార్‌ డాలేగా బస్‌ యే గమ్‌ 
మై వో గుల్‌ హూఁ జో న ఖిలా కభీ, ముఝే క్యో న శాఖ్‌ సే థోఢ్‌ దో / ముఝే తుమ్‌సే / 
(నిన్ను నా దానివని అనుకునే ఆశలో, నేను ఎవరి వాణ్నీ కాలేకపోయాను 
ఈ బాధే నా హృదయంలో ఉంది. ఈ క్షోభ ఎప్పుడో నా ప్రాణాలు తీస్తుంది 
ఎన్నడూ వికసించని మొగ్గను నేను, ఈ కొమ్మనుంచి నన్నెందుకు తెంపేయవు?) 
నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నీ జీవితంలో భాగం కావాలనుకుంటావు. కానీ, ఎదుటి వ్యక్తిలోనూ అదే స్థాయి ప్రేమోద్వేగం ఉండాలి కదా! ఒకవేళ ఉన్నా, నీ వైపు అడుగులు వేయడానికి, నీలో కలిసిపోవడానికి ఆ వ్యక్తికి అన్నీ కలిసి రావాలి కదా! అలాంటి సానుకూల పరిస్థితులు అసలే రాక ఒక్కోసారి ఆమె హృదయ ద్వారాలు శాశ్వతంగానే మూసుకుపోవచ్చు. ఏ కారణంగానైనా నువ్వు ప్రేమించే వ్యక్తి అలా నీకు శాశ్వతంగా దూరమైపోయిందే అనుకో. అంతమాత్రాన జీవితమంతా శూన్యంలో వేళ్లాడుతూ ఉండిపోవడం ఎందుకు? ఆ స్థితిలో నిన్ను ప్రేమించే వారెవరైనా ఎప్పటినుంచో నీ వెన్నంటి నడుస్తున్నారేమో ఒక సారి పరికించి చూడటం మేలు కదా! అదే నిజమైతే నిండు మనసుతో ఆమెకు చేయందించడం మేలు కదా! వాస్తవానికి తనకోసం తాను జీవించడం కన్నా, ఇతరులకు ఒక జీవితాన్ని ఇవ్వడంలోనే అసలైన జీవితం ఉంది. అందులోనే అసలు సిసలైన జీవితానందం ఉంది.

Sunday, June 12, 2016

మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై - mere dil me aaj kya hai


నీ పాపిట మళ్ళీ సిందూరం నింపుతా  

జీవితం సాఫీగా సాగిపోయే అవకాశాలు ఎన్ని ఉంటాయో, అనుకోని మలుపు తిరిగి, అది ఆగిపోయే పరిస్థితులు కూడా అన్నే ఉంటాయి, ఆ విపరీత పరిస్థితులకు ఇతరులే కారణమైనా, అవి మన మే బంధీలమైపోవచ్చు. ఆ అవకాశం ఇవ్వకుండా తప్పించుకోవాలనిచూస్తే , ఆ ప్రయత్నంలో ఎన్ని సుడిగుండాలు దాటాలో చివరికి ఏ తీరాన్ని చేరుకుంటామో, తెలియదు. ఆ పరుగులో అలసి సొలసి ఇంకా పరుగెత్తలేక ఎవరి ఆశ్రయాన్ని కోరతామో తెలియదు. ఒకవేళ ఎవరైనా ఆ ఆశ్రయం ఇచ్చినా, అప్పటికి వారి పరిస్థితి కూడా సంక్షోభంలోనే ఉంటే ఏమనిపిస్తుంది? ఆశ్రయమిచ్చినందుకు కృతజ్ఞతతోనో లేదా మానవతా దృష్టితోనో వాళ్లకు అండగా నిలవాలని ఉంటుంది. తోడూ నీడగా నిలవాలని కూడా అనిపిస్తుంది. శిధిలమైపోయిన వారి జీవన సౌధాన్ని తిరిగి నిర్మిలంచాలనిపిస్తుంది. చెదిరిపోయిన వారి జీవితాన్ని తిరిగి నిలెట్టాలనిపిస్తుంది. ‘దాగ్‌’ సినిమా కోసం సాహిర్‌ లుధ్య్వాన్వీ రాసిన ఈ పాటలో ఈ ఆరాటమే, ఈ ఆర్థ్రతే కనిపిస్తుంది. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ సంగీత దర్శకత్వంలో కిశోర్‌ కుమార్‌ పాడిన ఈ పాట డెబ్బైయవ దశాబాద్దాన్నంతా ఉబ్బితబ్బిబ్బు చేసింది. అక్కడితో ఆగకుండా అన్ని తరాలమీదా ఒక నిండు మేఘంలా ఆవహించింది అందుకే ఈ తరం కూడా ఈ పాటను అప్పుడో ఇప్పుడో మనసులో ఆలపిస్తూనే ఉంది. 



* * * * * * *
మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై, తూ కహే తో మై బతాదూఁ 
తేరీ జుల్ఫ్‌ మై సవారూఁ, తేరీ మాంగ్‌ ఫిర్‌ సజాదూఁ 
మేరే దిల్‌ మే క్యా హై, తూ కహే తో మై బతాదూఁ 
(ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది 
నీ కురుల్ని తిరిగి సవరించాలని ఉంది, నీ పాపిటను మళ్లీ అలంకరించాలని ఉంది. 

ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది ) 

దేన్నయినా తొలిసారిగా నిర్మించడం కొంత సులువే. ఎందుకంటే చదునైన నేలమీద దాన్ని నిర్మిస్తాం. అలా కాకుండా ఆ  శిధిల భవనాన్నే పూర్వ వైభవంతో మళ్లీ నిలబెట్టాలనుకుంటే అదెంతో కష్టమవుతుంది. ఎందుకంటే శిధిలాల మధ్యన పడి ఉన్న రాతిముక్కలు, గాజుముక్కలు అడుగడుగునా గుచ్చుకుంటాయి అరిపాదాలు, అరిచేతులు రక్తసిక్తమైపోతాయి. అయినా ఆ పునర్మిర్మాణానికి పూనుకోవడానికి కేవంల ప్రేమ ఉంటే సరిపోదు. కొంత సాహసం కూడా కావాలి. అయితే మనసున్న ఏ మనిషీ శిధిలాల్ని చూస్తూ ఊరుకోలేడు. చెదిరిపోయిన జీవితాల్ని చూసి ఏమీ 
పట్టనట్టు తన దారిన తాను వెళ్లిపోలేడు. అందుకే ఆ సౌధాన్ని తిరిగి నిలబెట్టమని అతని అంతరంగం అనుక్షణం తరుముతూనే ఉంటుంది. 
ముఝే దేవ్‌తా బనాకర్‌, తేరీ చాహతోఁ నే పూజా 
మేరా ప్యార్‌ కహెరహా హై, మై తుఝే ఖుదా బనాదూఁ 
మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై, తూ కహే తో మై బనాదూఁ 
(నన్నో దేవతను చేసి, నీ ఆకాంక్షలు పూజించాయి 
నా ప్రేమేమో నిన్ను దైవాన్ని చేయాలంటోంది 
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది ) 

ఆపదలో ఉన్నవారికి ఆదుకునే వారు దేవతామూర్తిలాగే కనిపిస్తారు. అందుకే వారిని ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ, అన్నీ తెలిసిన వారు ఆదుకోవడం కన్నా, అదుకునే అవకాశం ఇచ్చిన వారే గొప్ప అనుకుంటారు. జీవితాన్ని సార్థకం చేసుకునే అవకాశం ఇచ్చినవారు. జన్మనిచ్చిన సృష్టికర్తకు సమానంగా కనపడతారు. అందుకే వానిని దైవంగా హృదయంలో ప్రతిష్టించుకుంటారు. పైగా, తన పరిధులల్లో తనను ఉంచేయకుండా, వెంట తీసుకుని లోకాలన్నీ తిప్పే వారు తన కోసమే దిగివచ్చిన దివ్యమూర్తులుగా కనిపిస్తారు. దైవమై వారు జీవితమంతా వ్యాపిస్తారు. . 
కోయీ డూండ్‌నే భీ ఆయే, తో హమే న డూండ్‌ పాయే 
తూ ముఝే కహీఁ ఛుపాదే, మై తుఝే కహీ చుపాదూఁ 
మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై, తూ కహే తో మై బనాదూఁ 

(ఎవరైనా వెతకడానికే వచ్చినా, మనల్ని పట్టుకోలేకపోవాలి 
నువ్వు నన్నెక్కడైనా దాచెయ్‌, నిన్ను నేనెక్కడైనా దాచేస్తాను 
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది) 

జీవన ప్రవాహంలో పడిపోయి ఆప్తమిత్రుడైనా ఒక్కోసారి మనల్ని మరిచిపోతాడేమో గానీ, శత్రువెప్పుడూ మనల్ని మరిచిపోడు. పగబట్టిన లోకం కూడా మనల్ని మరిచిపోదు. అలా అని అజాత శత్రువుగా నిలవడం ఎంతమందికి సాధ్యమవుతుంది. ఏ కారణంగానో ఎక్కడో ఒక ఘర్షణ అంకురిస్తుంది. ఆవేశకావేశాల్లో జరగరానిదేదో జరిగిపోతుంది. చేసిన తప్పునకే శిక్ష పడిందని ఎవరనుకుంటారు? తప్పు తనదేనని తెలిసినా దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎంతమంది అనుకుంటారు? అందుకే తన నేరమేమీ లేనట్లు, ప్రతీకారాలకు పాల్పడతారు. తప్పు తనదేమీ కాకపోయినా పులి ఎదురైనప్పుడు పారిపోక తప్పదు కదా! అలా పారిపోతూ అలసి సొలసి డస్సిపోయిన వారిని ఎవరైనా చేరదీసి ఎవరి కంటా పడకుండా గుండెల్లో దాచేస్తే అంతకన్నా ఏంకావాలి? ఈ బాధలు ఏదో ఒకరికే అనికాదుగా, కలిసినడుస్తున్న ఇద్దరికీ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒకరికొకరు రక్షణ కవచంగా, ఒకరికొకరు జీవితాంతపు సహచరులుగా ఉంటే ఎన్ని బాధలైనా ఇట్టే ఎదురుకోవచ్చు. 
మేరే బాజువోఁ మే ఆకర్‌ తేరా దర్ద్‌ చైన పాయే 
తేరే గేసువోఁ మే చుప్‌కర్‌, మై జహాఁ కే గమ్‌ భులా దూఁ 
మేరే దిల్‌ మే ఆజ్‌ క్యా హై, తూ కహే తో మై బతా దూఁ 
తేరీ జుల్ఫ్‌ ఫిర్‌ సవారూఁ తేరీ మాంగ్‌ ఫిర్‌ సజాదూఁ 
(నా బాహువుల్లో వాలిపోయి నీ బాధ లన్నీ ఉపశాంతి పొందాలని ఉంది. . 
నీ కేశాల్లో దాచుకుని, నాకు లోకపు దుఃఖాన్నంతా మరిచిపోవాలని ఉంది 
ఈ రోజు నా మదిలో ఏముందో, నువ్వడిగితే చెప్పేయాలని ఉంది 
నీ కురుల్ని తిరిగి సవరించాలని ఉంది, నీ పాపిటను మళ్లీ అలంకరించాలని ఉంది) 
ప్రేమతో చాచిన బాహవుల్ని మించిన శాంతివనం ఏముంది? అక్కడ ఎంతటి బాధైనా అడుగంటిపోతుంది. ఎదుటి వారి ఆత్మక్షోభలన్నీ ఏమారిపోతాయి. అదేసమయంలో ఎదుటి వారి హృదయం కూడా ఆశాకమైపోతే అందులో నువ్వూ తలదాచుకోవచ్చు. లెక్కపెట్టుకోము గానీ, లోకం చేసే గాయాలు ఒకటా రెండా? గాయాల రుచి మరిగిన లోకం, అవకాశం చిక్కాలే గానీ, రోజుకో గాయం చేస్తుంది. అలా గాయాలు చేస్తూ, లోకం దుమ్మెత్తిపోస్తున్నా సరే, ఎంత కసిగా ఈటెలు విసురుతున్నా సరే, మనల్ని చేరదీసే ఆత్మీయ హృదయం ఒక్కటుంటే చాలు. మనకు వెయ్యేనుగుల శక్తి వస్తుంది. అలా అన్ని ఆవరోధాల్నీ అధిగమిస్తూ విజయపతాకం ఎగరవేస్తుంది, వేయిజన్మల ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. 
-------------------- 

Monday, June 6, 2016

హో... జీ... హో.... బచ్‌పన్‌ కీ ముహబ్బత్‌ కో - Ho Ji Hoo bachpan kee Mohabbath ko


ఆశాసౌధంలో ....
                          ......శూన్యాన్ని నింపుతావా? 


బాల్య ప్రేమ పాల సుముద్రం లాంటిది. ఆశామోహాలకు అతీతమైనది. . యుక్తవయసులో ప్రేమలో పడితే అంతకు ముందున్న జీవితమైనా ఆ ప్రేమ ఛాయల్లేకుండా కొంత ఖాళీగా ఉంటుంది. బాల్యంలో మొదలైన ప్రేమ అలా కాదు అది జీవితపు ఆద్యంతమూ ఆవహిస్తుంది. ఆ ప్రేమ తాలూకు ఆనందమైనా, వేదనైనా బతికినంత కాలం వెన్నంటి నడుస్తుంది. అలా బాల్యంలోనే మొదలవడం వల్లనేనో ఏమో, పార్వతీ- దేవదాసుల ప్రేమ అజరామరం అయ్యింది. ‘బేజూబావ్‌రా‘ సినిమా కోసం శకీ ల్‌ బదాయునీ రాసిన ఈ పాటలో ఆకాశమంతా కమ్ముకున్న బాల్యంలోంచి ఎదిగిన ప్రేమ శిఖరం కనిపిస్తుంది. లతా మంగేష్కర్‌ గొంతులో పడిన నౌషాద్‌ బాణీ నిజంగా గుండెల్లో హోరెత్తిపోతుంది. 


* * * * * 
హో... జీ... హో....
బచ్‌పన్‌ కీ ముహబ్బత్‌ కో దిల్‌ సే న జుదా కర్‌నా
జబ్‌ యాద్‌ మేరీ ఆయే మిల్‌నే కీ దువా కర్‌నా 

(ఓయీ.. వో.... .బాల్య ప్రేమను మనసు నుంచి వేరు చేయకు 

నా జ్ఞాపకాలు వచ్చినప్పుడు మనం కలవాలని ప్రార్థించు) 

ఊహ తెలిసిన నాటి నుంచే గుండెల్లో ఊరిన ప్రేమ, ఆడుతూ, పాడుతూ ఊరంతా కలయ తిరిగిన ప్రేమ, జీవితమంతా కలిసి ఉండాలనే కలలు కంటుంది. కానీ, జీవితాన్ని మెలివేసే విష వలయాలు కోకొల్లలు కదా! అవి బాల్య ప్రేమలని కూడా చూడకుండా ఒక్కోసారి విడదీయడానికే సిద్ధమవుతాయి. లేదా జీవితపు సుడిగుండాల కారణంగానో, అపార్థాల కారణంగానో, ఆటంకాల కారణంగానో ఒక్కోసారి ఈ బాల్యప్రేమికులే దూరమైపోతారు. కానీ, గుండె లోతుల్లో కట్టిపడేసిన ప్రేమపాశాలు మళ్లీ కలవడానికే తపించిపోతాయి. అందుకే మనం కలవాలని దైవాన్ని ప్రార్థించరాదా! అంటూ ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు గోముగా అడిగేస్తారు.
ఘర్‌ మేరి ఉమ్మీదోంకా, సూనా కియే జాతే హో... హో జీ హో.....
దునియా హీ ముహబ్బత్‌ కీ లూటే లియే జాతే హో
జో గమ్‌ దియే జాతే హో, ఉస్‌ గమ్‌ కీ దవా కర్‌నా / బచ్‌పన్‌ కీ / 

( నా ఆశల కుటీరంలో శూన్యాన్ని నింపి వెళ్లిపోతావా? ఓయీ... ఓ...
ఆ ప్రేమ లోకాన్నే కొల్లగొట్టి వెళ్లిపోతావా
ఏ బాధను ఇచ్చివెళుతున్నావో.. ఆ బాధకు నువ్వే మందు కూడా ఇవ్వు) 


నాలుగడుగులు తనతో కలిసి నడిచిన వాడే, మళ్లీ వస్తానంటూ ఏళ్ల పర్యంతం ఎటో వెళ్లిపోవచ్చు. ఏ బాధ్యతలూ, భాఽరాల కారణంగానో ఎంతో కాలం దాకా తిరిగే రాకపోవచ్చు. కానీ, ఈ స్థితిలో జీవితమంతా కలిసి నడవాలని కలలు కన్న ఈ వ్యక్తి ఏమైపోవాలి? తాను కట్టుకున్న ఆకాశమంత ఆశా సౌధం నిండా చీకట్లే క మ్ముకుంటాయిగా...! గాయం చేయడమో, కల్లోలపరచడమో కాదు . ఏకంగా, తన ప్రేమలోకాన్నే అతడు కొల్లగొట్టుకుపోయినట్లనిపిస్తుంది. అయినా ఇన్ని గాయాలు ఇచ్చిన నువ్వే ఆ గాయాల్ని మాన్పే ఔషధాన్ని కూడా నువ్వే ఇవ్వు మహాత్మా అనేస్తుంది.
సావన్‌ మే పపీహే కా సంగీత్‌ చురావూంగీ హో..జీ.. హో
ఫరియాద్‌ తుమ్హే అప్‌నీ గా గా కే సునావూంగీ
ఆవాజ్‌ మేరీ సున్‌ కే దిల్‌ థామ్‌ లియా కర్‌నా / బచ్‌పన్‌ కీ/ 

(వర్షాకాలంలో వానకోయిలల సంగీతాన్ని దోచేసుకుంటా ఓయీ...ఓ...
నీ మీద నా అభియోగాలన్నీ పాడీ, పాడీ వినిపిస్తా...
నా స్వరాన్ని వినేసి నీ గుండెను చిక్కపట్టుకో) 

ఆత్మ క్షోభను, ఆక్రోశాన్నీ గుండెలోనే పెట్టుకుంటే వాటిని మోయడం క ష్టం. ఏదో ఒకరూపంలో వాటిని బయటపెట్టకుండా ప్రాణాల్ని నిలుపుకోవడం కష్టం. కాకపోతే, వాటిని అగ్గి రవ్వల్లా కాకుండా, కాస్త కమనీయంగా, రాగబద్దంగా వ్యక్తం చెయ్యడం మేలు. ఎందుకంటే వీటిని పరుస్తోంది తన బాల్యప్రేమికుడి ముందు కదా! తన ఆక్రోశాన్నే కాదు, తాను మోపే అభియోగాల్ని సైతం ఒక గీతంగానే వినిపించాలి. అయినా, బాణానికి ఎంత తేనె పూసినా అది గుండెలోకి దిగకుండా ఉంటుందా? అందుకే ఎదుటి వారుు గుండెల మీద డాలు అడ్డుపెట్టుకోవాల్సిందే. బాణం వేటుకు అతలాకుతలమయ్యే గుండెల్ని చిక్కపట్టుకోవాల్సిందే. అయినా, వాళ్ల అవస్థలేవో వాళ్లు పడతారులే అనుకుని మనమంతా మిన్నకుండిపోతే మన పెద్దరికం ఏముంది? వాళ్ల అడ్డంకులన్నీ తొలగిపోయి వారి ప్రేమ ఫలించడానికి మనవంతుగా మనం చెయ్యాల్సిన వన్నీ చేద్దాం! సరేనంటారా?