Sunday, December 4, 2016

దిల్‌ లగాకర్‌ హమ్‌ యే సమ్‌ఝే - Dil lagaakar hum ye samjhe - jindagi aur mouth mahendra kapoor rama chandra



ప్రేమానందం ఎందరికి తెలుసు? 

 
 
      గాలి గాలిగా తేలిపోయే మేఘాల్లా ఉన్నంత కాలం జీవితాన్నించి పొందే స్పూర్తి ఏదీ ఉండదు. అనుభూతి ఏదీ ఉండదు. సముద్రజలాన్ని పీల్చేసే ఆకాశపు ఆరాటమంతా హృదయంలోఉండాలి. ఎండ.... వెన్నెల ఈ రెండూ పైకి ఒకే రకం వెలుతురు కేంద్రాల్లా అనిపించవచ్చు. కానీ ఆ రెండింటి మధ్య ఎంత తేడా ఉంది?. ఎండ జీవితాన్ని మేల్కొలుపుతుంది. రగుల్కొల్పుతుంది. వెన్నెల పరవశంలో ముంచే స్తుంది. నిద్రలోకి జారిపోయేలా చేస్తుంది. మనల్ని తీరానికి చేర్చే నావ ఏదో , మనల్ని కాటు కలిపే బాట ఏదో తెలియకపోతే, మన జీవితం మనకు దక్కదు. జీవిత పరమార్థమైన ఆ దివ్యానందమూ మనకు చిక్కదు. ఈ సందేశమే, ’జిందగీ ఔర్‌ మౌత’ సినిమా కోసం శకీల్‌ బదాయునీ రాసిన పాటలో వినిపిస్తుంది. సి. రామచంద్ర స్వరపరిచిన ఈ పాటను మహేంద్రకపూర్‌ ఎంత మనోహరంగా గానం చేశాడో వింటే గంధర్వులు సైతం అసూయపడతారేమో! ఎవరి సంగతో ఎందుకు వింటే మీకే తెలుస్తుంది!!! 

దిల్‌ లగాకర్‌ హమ్‌ యే సమ్‌ఝే - జిందగీ క్యా చీజ్‌ హై 
ఇశ్క్‌ కహెతే హై కిసే ఔర్‌ - ఆశికీ క్యా చీజ్‌ హై /దిల్‌ లగాకర్‌ / 
( మనసు లగ్నం చేసి జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నా 
దేన్ని ప్రేమంటారో..... మనసు పడటం అంటే ఏమిటో తెలుసుకున్నా) / మనసు లగ్నం చేసి/ 
జీవితాన్ని ఉత్తి గాజు కళ్లతో చూస్తే ఏం తెలుస్తుంది? మనసు పెడితేగానీ అదెంత మహిమాన్వితమో బోధపడదు. జీవితం అంటే మూడక్షరాల పదం కాదు కదా! అది ముల్లోకాల మూట. అంతు చిక్కని కటిక చీకట్ల పాతాళం అందులోనే ఉంది, చీకటి వెలుగుల సమిశ్రమమై ఆత్మను ప్రజ్వలింపచేసే భూతలం అందులోనే ఉంది. అన్నింటికీ అతీతమై, ఎంత ఎగిరినా తరగని జ్ఞాన తారకల గగనతలం అందులోనే ఉంది. అలాంటి మూడు లోకాల ముచ్చటైన జీవితాన్ని ఎవరైనా కనుగుడ్లతో చూస్తే ఏం తెలుస్తుంది? జీవితాన్ని హృదయంతోనే చూడాలి. హృదయంతోనే అర్థం చేసుకోవాలి. ఆ హృదయమైనా త్రిలోకాల్ని చుట్టేసేటంత విశాలమై ఉండాలి. కేవలం భౌతికమే సమస్తమయ్యే ఉత్త మనిషైతే సరిపోదు. మహోత్తుంగ తరంగాల వంటి మనోభావాలున్న మనీషి కావాలి. మహర్షి కావాలి. ప్రాపంచిక పరమసత్యమేమిటంటే, మనుషులంతా భూమ్మీదే పుడతారు. కానీ, కొన్నాళ్లలోనే చాలా మంది పాతాళంలో పడిపోతారు. కొందరే ఆ భూమిని పట్లుకుని అటూ ఇటూ కాకుండా అక్కడే తారట్లాడుతూ అలా ఉండిపోటారు... అదే గొప్ప అయినట్లు..: అత్యంత అరుదుగా అతికొద్ది మందే రివ్వున ఎగిరి ఆకాశాన్ని అందుకుంటారు. ఆకాశమైపోతారు. హృదయం అలా ఆకాశమైన వారికే సమస్త ప్రాణికోటినీ ఆవరించిన ప్రేమ గురించి బోధపడుతుంది. మనసు పడటం అంటే ఏమిటో అందులోని అద్భుతత్వం ఏమిటో అర్థమవుతుంది.

హాయ్‌ యే రుఖ్‌సార్‌ కే శోలే, యే బాహే మర్‌మరీ 
ఆప్‌ సే మిల్‌కర్‌ యే దో బాతే సమఝ్‌మే ఆగయీ 
దూప్‌ కిస్‌కా నామ్‌ హై ఔర్‌ చాంద్‌నీ క్యా చీజ్‌ హై / దిల్‌ లగాకర్‌ / 
( ఆహా... ఏమి యీ ముఖబంతుల జ్వాలలు, యీ చలువరాతి బాహువులు 
నిన్ను కలిసిన ఫలంగా ఈ రెండు మాటలైతే అర్థమయ్యాయి 
దేని పేరు ఎండనో, వెన్నెలంటే ఏమిటో బోధపడ్డాయి ) / మనసు లగ్నం చేసి/. 
ముఖారవిందం అనగానే ముద్దుమోవి అనేమీ కాదు. ముఖం అంటే సమస్త భావోద్వేగాల్ని ఆవిష్కరించే వేదిక కూడా. జీవితం హృదయంలోకి ఒదిగిపోతే, హృదయం ముఖంలోంచి బయటపడుతుంది. నిజానికి జీవితమూ, హృదయమూ, ముఖమూ వేరు వేరేమీ కాదు. ముఖమంటే మకరంద మాధురిమల్ని ఎగజల్లేది అని మాత్రమే కాదు కదా! అది జీవన జ్వాలల్ని కూడా ఎగజిమ్ముతుంది. జీవితంలో అవీ భాగమే కదా మరి ! అందుకే జీవితం తాలూకు సమస్త అంశాలూ ఆ ముఖంలో ప్రస్పుటమవుతూ ఉంటాయి. నిజానికి ముఖం అన్నది అర్థం చేసుకునే వారికి అర్థంచేసుకునేటంత ఒక అనంతమైన ఒక ఉద్గ్రంధం. జీవితంలో అన్నీ ఉన్నట్లే, ముఖంలోనూ ఆ అన్నీ ఉంటాయి. బాహువులైనా ఏమిటి? అవే దో రక్తమాంసాలు కప్పుకున్న ఎముకల జోడు అని కాదు కదా! అవి శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆవిష్కరించే ప్రతినిధులు. ఎండనకా వాననకా ఆరుకాలాలూ, చెమట చిందించి అందమైన ఆకృతుల్ని ఆవిష్కరించే క ర్మాగారాలవి. కొందరు కొండంత బాధలోనూ మందహాసం చేస్తారు. కానీ, ఆనందంలో చేసే మందాహాసానికీ దీనికీ ఎంత తేడా? అలా చూస్తూ వెళితే, ఎండ కూడా వెలుగునే ఇస్తుంది. వెన్నెల కూడా వెలుగునే ఇస్తుంది. కానీ, ఈ రెండు వెలుగులూ ఒకటేనా? కాదు కదా! ఎండ వెలుగు, జీవన పోరాటంలో మనిిషి పట్టు బిగించేలా చేస్తుంది. వెన్నెల వెలుగు పారవశ్యంలో తేలిపోయేలా చేస్తుంది. మైమరిచిపోయేలా చేస్తుంది. అందుకే జీవితంలో ఒడుదుడుకుల పాలు కాకుండా ఉండాలంటే, ఎండకూ, వెన్నెలకూ మధ్యనున్న తేడా ఏమిటో తెలిసి ఉండాలి.

ఆప్‌కీ శోఖీ నే క్యా క్యా, రూప్‌ దిఖ్‌లాయే హమే 
ఆప్‌ కీ ఆంఖోనే క్యా క్యా, జామ్‌ పిల్‌వాయే హమే 
హోశ్‌ ఖో బైటే తో జానా, బేఖుదీ క్యా చీజ్‌ హై / దిల్‌ లగాకర్‌/ 
( నీ సోయగం నాకు ఏమేమి రూపాలు చూపించింది !! 
నీ కళ్లు ఏమేమి మధువులు తాగించాయి 
స్పృహ కోల్పోయాకే నాకు మైకం అంటే ఏమిటో తెలిసింది )/ మనసు లగ్నం/ 
మెలుకువతో ఉన్నప్పుడు, లోకమంతా కళ్లముందే ఉంటుంది. ఒక్కసారి కాస్త నిదురలోకి జారిపోతే లోకమంతా కనుమరుగైపోతుంది. స్పృహలో ఉన్నప్పుడు ప్రతిదీ సర్వసమగ్రంగా కనిపిస్తుంది. అదే మైకంలో ఉన్నప్పుడు ఏదీ మొత్తంగా ఉండదు. అలా అని ఏదీ మొత్తంగా కనిపించకుండా పోదు. సగం లోకమే కళ్లముందు ఉంటుంది మిగతా సగం కనుమరుగైపోతుంది. అన్నీ సగం సగమైపోతాయి. సగం సగంగానే కనిపిస్తాయి. భౌతిక రూపాలే కాదు. ప్రతి భావోద్వేగమూ సగం సగంగానే కనిపిస్తుంది. అప్పటిదాకా ఆనందోద్వేగంలో ముంచేస్తూ వచ్చిందే, కాస్త మంద్రంగా మనసు మీద మలాం పూస్తూ అలా పైపైన తారట్లాడుతూ ఉంటుంది. అప్పటిదాకా హృదయాన్ని భరించరాని క్షోభకు గురి చేసిన అంశాలు కూడా దూది పింజాల్లా తేలాడుతున్నట్లే అనిపిస్తాయి. కాకపోతే అప్పటిదాకా సంపూర్ణంగా కనిపించినవి హఠాత్తుగా అలా సగం సగంగా కనిపించడం కొందరికి గొప్ప థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అయితే ఆ మైకం కోసం మద్యం, మాదక్రద్రవ్యాలే అవసరం లేదు. జీవితానికి అసమాన ప్రతిరూపమై నిలిచిన జీవన సహచరి మలయమారుతం లాంటి మాట చాలు. జీవచైతన్యానికి నిలువుటద్దమైన ఆమె నేత్రాలు చాలు.

ఆప్‌ కీ రాహో మే జబ్‌ సే, హమ్‌ నే రఖా హై కదమ్‌ 
హమ్‌ కో యే మహ్‌సూస్‌ హోతా హై కె హై మంజిల్‌ పే హమ్‌ 
కోయీ క్యా జానే ముహబ్బత కీ ఖుశీ క్యా చీజ్‌ హై / దిల్‌ లగాకర్‌ / 
( నీ దారుల్లో నేనెప్పుడు నా కాలు మోపుతానో 
నేను గమ్యం మీదే ఉన్నానన్న అనుభూతి కలుగుతుంది 
ప్రేమానందం అంటే ఏమిటో నిజంగా ఎవరికేం తెలిసింది) /మనసు లగ్నం చేసి/ 
జీవన యానంలో ఎవరికి వారం మనం ఎంచుకున్న మార్గంలో పడి అలా నడుస్తూనే ఉంటాం. కానీ, కొందరికి నెలలూ, ఏళ్లే కాదు, దశాబ్దాల పర్యంతం అలా నడుస్తూనే ఉన్నా, ఒక్కోసారి ఎటుపోతున్నామో తెలియదు, ఏ తీరానికి చేరువువుతున్నామో కూడా అర్థం కాదు. దానికి కారణం నీలోని సగాన్ని ఎప్పుడో, ఎక్కడో వదిలేసి, ఇప్పటిదాకా సగం ఆ శరీరంతో సగం ఆత్మతో జీవితం సాగిస్తూ ఉండడమే. సగం ప్రాణంతో అలా ప్రయాణిస్తూ ఉండిపోవడమే. అయితో నీ నుంచి విడిపోయిన నీలోని ఆ సగం కూడా నీలాగే ఎక్కడో అయోమయంగా సంచరిస్తూ ఉంటుంది. ఆ సగంతో నువ్వు కలిసిపోయేదాకా నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. నడుస్తూనే ఉంటావు కానీ బాట సాగదు. పరుగెడుతూనే ఉంటావు కానీ, తీరం కనపడదు. అయినా అలా నడుస్తూ, పరుగెడుతూ , ఎక్కడో ఒక చోట , నీ దారి వదిలేసి, మరో దారిలో కాలు మోపుతావు. అక్కడ కూడా నడక సాగిస్తూనే ఉంటావు. పరుగెడుతూనే ఉంటావు. హఠాత్తుగా ఏ దారి మలుపున్నో తీరా నువ్వు సొమ్మసిల్లిపడిపోయే సమయానికి ఎవరో ఎదురవుతారు. ఆ ఎదురయ్యింది ఎవరో కాదు నీలోంచి పోయిన నీలోని ఆ సగ భాగమేనని నీ ఆత్మకు వెంటనే తెలిసిపోతుంది. ఆ మరక్షణమే ఇన్నేళ్లుగా నువ్వు వెతుకుతున్న నీ తీరం కూడా నీ కళ్ల మందు ప్రత్యక్ష్యమవుతుంది. అదొక అద్భుత అనుభవం. రెండు అర్థ ప్రపంచాలు, ఒక పూర్ణ ప్రపంచంగా మారే ఆ దివ్య ప్రేమలోకం గురించి లోకంలో ఎంత మందికి తెలుసు? నిజానికి ఆ అనుభూతి పొందిన ఆ అరుదైన ఆ హృదయ జీవులదే జీవితమంటే. అసలు సిసలైన జీవ చైతన్యమంటే, మహార్ణవమైన జీవితానందమంటే వారిదే !
- బమ్మెర 



Tuesday, November 8, 2016

జబ్‌ తుహ్‌హీ నహీఁ అప్‌నే - jub tuhhee nahee aapne - parwana film Kurhid anwar singer suraya singer


నువ్వు లేని లోకం ...నాకు పరాయిదే....


తన జీవితానికి తానే లోకమనుకున్న వ్యక్తే తనకు కాకుండాపోతే ఎలా ఉంటుంది? అవతల ఎంత పెద్ద లోకం ఉన్నా శూన్యంగానే అనిపిస్తుంది. తన జీవితం కూడా ఒక్కొక్క అడుగే వేస్తూ ఆ శూన్యంలో కలిపిసోతున్నట్లే అనిపిప్తుంది. అయినా అప్పటిదాకా అతను సైతం తననే లోకం అన్నవాడే కదా! అలాంటి వ్యక్తే ఉన్నట్లుండి అదంతా ఏమీ కానట్లు, తన దారిన తాను ఎలా వెళ్లిపోయినట్లు? తమకు తాముగానే ఆ కొత్త లోకాలు వాళ్ల మీద వచ్చిపడతాయో లేక తామే వెతికి తెచ్చుకుంటారో తెలియదు గానీ, వారైతే ఆ కొత్త లోకంలోకి వెళ్లిపోతారు. అంతటితో ఇంక వారి ఆలోచనలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి.... వారి జీవిత లక్ష్యాలు మారిపోతాయి. అలా అనుకుంటే తొలినుంచే ఎవరికి వారుగా ఉండిపోతే ఏ సమస్యా ఉండదుకదా! కడదాకా కలసి నడవాలనుకున్న ఏ జీవితాలైనా అర్థాంతరంగా దారులు మార్చుకుంటే ఎలా ఉంటుందో చెప్పేదే పర్వానా చిత్రంలోని ఈ గీతం. డి.ఎన్‌ మధోక్‌ రాసిన ఈ గీతానికి ఖుర్షీద్‌ అన్వర్‌ సంగీతం సమకూరిస్తే, సురయ్యా గుండెలు అవిసిపోయేలా గానం చేయడంతో పాటు ఆ పాత్రలో నటించారు కూడా....
* * * * * *
జబ్‌ తుహ్‌హీ నహీఁ అప్‌నే - దునియా హీ బేగానీ హై 
ఉల్ఫత్ జిసే కహెతే హైఁ- ఏక్‌ ఝూటీ కహానీ హై / జబ్‌ తుమ్‌ హీ / 
(నువ్వే నాకు కాకుండా పోయాక - నాకీ లోకమే పరాయిదైపోయింది 
దేన్ని మనం ప్రేమంటామో - అదంతా ఒక బూటకపు కథే అనిపిస్తోంది) 
లోకంలో ఎన్ని కోట్లమంది ఉంటేనేమిటి? నీలోకం ఆ వ్యక్తే అయినప్పుడు నీకింక వేరే లోకం ఏముంటుంది? ఆ స్థితిలో అవతల మరోలోకం ఉందన్న ధ్యాసైనా ఉండదు. జీవితం పారవశ్యాల్లో తేలిపోతుంది. కాకపోతే ఉన్నట్లుండి హఠాత్తుగా ఆ లోకమే దూరమైపోతే, ఎప్పటికీ నీకు కాకుండా పోతే మన ఉనికేమిటో మనకే అర్థం కాదు. ఏది సత్యమో, ఏది అసత్యమో బోధపడదు. అప్పటిదాకా ప్రేమ అనుకున్నదే, ఉత్తి అబద్ధం అనిపిస్తుంది. అదేమిటో గానీ, కొందరు కొన్నాళ్లే ఒక లోకంలో ఉండి, ఆ తర్వాత మరో లోకంలోకి మరోలోకంలోకి అలా అలా లోకాలు మారుస్తూ వెళ్లిపోతుంటారు. కానీ, కొందరికి మాత్రం ఒకే ఒక్క లోకం ఉంటుంది. వారికి ప్రేమైనా, వియోగమైనా అక్కడే, జీవనమైనా మరణమైనా అక్కడే. అలాంటి వారికి తమలోకం చేజారిపోతే లోకంలో ఇంకేదీ నిజం కాదనిపిస్తుంది. చివరికి ప్రేమ కూడా అబద్దమే అనిపిస్తుంది..
జాతే హుయే క్యోఁ తుమ్‌ కో, ఇస్‌ దిల్‌ కా ఖయాల్‌ ఆతా
తడ్‌పాకే చలేజానా- ఏక్‌ రీత్ పురానీ హై / జబ్‌ తుమ్‌హీ/ 
( వెళ్ళిపోతున్న నీకు నా యీ హ్రుదయాన్ని గురించిన ద్యాసెందుకు
తపింపచేసి వెళ్లిపోవడం - ఒక పాత రీతే కదా మరి!) 
జీవనయానంలో బహుదూరపు బాటసారులై, ఎవరికి వారు అలా వెళిపోతుండవచ్చు. ఎప్పటికీ అలాగే ఎవరి దారిలో వారు అలా వెళ్లిపోతే ఏమీ ఉండదు. కానీ, ఉన్నట్లుండి కొందరికి తామేదో ఒంటరి పక్షి అయినట్టు, ఒంటి స్థంభం మేడలో కూర్చుని ఏవో ఆర్తనాదాలు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరి నీడనో చేరితే తప్ప తానింక మనలేననిపిస్తుంది. అంతటితో అప్పటిదాకా ఏ వైపునో ఉన్న మనసు మరే వైపో వెళుతుంది . ఆ వెళ్లినదేదో ఏ చెట్టుమీదో గుట్ట మీదో వాలిపోతే ఏమీ ఉండదు. కానీ, ఏ హృదయం మీదో వాలిపోతేనే అంతా అతలాకుతలమైపోతుంది. ఒక దశలో మరీ అంతగా ఆంధోళన పడాల్సిన పనేమీ లేదులే! ఇదో ఆనంద సీమేలే అనికూడా అనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రతిపాదనకు ఎదుటి వారినుంచి వ్యతిరేకత ఏదీ రానప్పుడు, ఇద్దరి గొంతులూ ఒకేలా, ఇద్దరి మాటా ఒకేలా ధ్వనించినప్పుడు ఏదీ వేరు కాదనిిపిస్తుంది. ఇప్పటిదాకా నేను జీవించినది జీవితమే కాదు. ఇప్పటిదాకా నేనున్నది ఒక లోకమే కాదనిపిస్తుంది. ఇంకేముంది మనసు ఎప్పటికీ ఆ కొత్త లోకంలోనే తిష్టవేయాలనుకుంటుంది. అందమైన పొదరిల్లు అల్లుకుంటుంది. అందులో తన సహవాసితో మకాం వేసి జోరుజోరుగా షికారు పాటలే ఆలపిస్తుంది. కానీ, అలా వచ్చిన హృదయాలన్నీ స్థిరంగా ఉండిపోవడానికి కాదని, కొద్దికాలం హృదయాలను మురిపించి ఆ తర్వాత తపింపచేయడానికి, విలవిల్లాడేలా చేయడానికేనని ఆ తర్వాతెప్పుడో తెలిసిపోతుంది. అప్పటిదాకా ఏ రోజూ లోకాన్ని తరచి చూడని తనకు ఒకసారి అలా పరికించి చూసే సరికి అంతా వింతగా అనిపిస్తుంది. లోకం తీరే ఇంతని, దీనికున్న రీతీ రివాజులన్నీ ఇవేనని బోధపడుతుంది. అంతటితో గుండె తడారిపోతుంది. గొంతు పగుళ్లు బారి మాటే పెగలకుండా పోతుంది.
పర్వానే కే జల్‌నే పే - హఁస్‌నా న తమాషాయీ 
హస్‌తీ హుయీ శమ్మా భీ ఁ ఏక్‌ రాత్ కీ రానీ హై /జబ్‌ తుమ్‌ హీ/ 
(శలభాలు కాలిపోవడం చూసి, తమాషాగా నవ్వుకోకు 
నవ్వుతున్న దీపం కూడా ఆ ఒక్కరోజుకి రాణియే కదా!) 
’తమసోమా సద్గమయా’ అనే మాట ఎన్ని యుగాలుగా వినపడుతోంది. రుషులూ, మహర్షులంతా చీకటిని వదిలేసి వెలుగులోకి వెళ్లండి అంటూ ఘోషించిన వారే కదా! అలాంటప్పుడు కాంతిని ప్రేమించడం శలభాల (మిడతలు) తప్పెలా అవుతుంది.? అసలు జగత్తు నడిచేదే కాంతితో కదా! కాకపోతే ఆ కాంతి కాల్చివేస్తుంది కూడాననే సత్యం తెలియకపోతే ఎలా? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. తమ హద్దుల్లో తాము ఉండిపోతే ఈ సమస్యే ఉండదు కదా అని కూడా ఎవరైనా అనవచ్చు. కానీ అవ్యాజమైన ప్రేమకు హద్దులు ఉంటాయా? హద్దులంటూ ఉంటే అసలది ప్రేమ ఎలా అవుతుంది.? ప్రేమ అభయాన్నిస్తుంది. అద్వైతంగా ఉంటుంది. అవును మరి! ప్రేమలో ఏదో ఒకటే ఉంటుంది. ఇద్దరు కాస్తా ఒక్కరే అవుతారు. అంతిమంగా ఒక్కరే ఉంటారు. అప్పటిదాకా నీ ఎదురుగా ఉన్నది నిన్ను తాకి బూడిదైపోయింది నీలో భాగమేనని నీకు తెలియాలి గానీ శలభాలు కాలిపోవడాన్ని చూసి దీపాలు తమాషాగా నవ్వుకుంటే ఎలా? పోనీ ఆ నవ్వుకునే దీపస్థంభమైనా శాశ్వతంగా ఉండిపోయేదేమీ కాదు కదా! అశాశ్వతం అనుకుంటే అన్నీ అశాశ్వతమే. అయితే అశాశ్వతమైన జీవితంలో శాశ్వతానందాన్ని పొందడంలోనే జీవన వైదుష్యం ఉంది. అసలు సిసలైన జీవన జ్ఞానం ఉంది.

- బమ్మెర 

Friday, October 21, 2016

ఆప్‌ కహే ఔర్‌ హమ్‌ న ఆయే - Aap kahi aur hum na aaye rajesh roshan latha mangeshkar des - pardes

నీతోడు లేకుండా  గమ్యాన్ని చేరలేను

క లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే ఒక్కోసారి వంద అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎంతో కష్టపడి ఒక అవరోధాన్ని తొలగించేసరికి మరో పది ఆటంకాలు మనదారికి అడ్డుపడతాయి. వీటన్నింటినీ ఒకే ఒక్కరుగా ఎదుర్కోవడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. ఆ స్థితిలో ఎవ రైనా తోడుగా వస్తే ఎంత బావుండునోకదా అనిపించవచ్చు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి తామే స్వయంగా ఆహ్వానించారనుకోండి. ఇంక కాదనడం ఎక్కడుంటుంది? వెతకబోయిన బంగారు తీగె వేలికి చుట్టుకున్నంత ఆనందంగా హర్షాతిరేకానికి లోనవుతాం. కాకపోతే వాళ్లు మనల్ని మధ్యలో వదిలేసి పోకుండా కొన్ని ముందు జాగ్రత్తలైతే చెబుతాం. దేస్‌- పర్‌దేస్‌ సినిమా కోసం అమీత ఖన్నా రాసిన ఈ పాట ఈ అంశాల్నే ప్రస్థావిస్తుంది. రాజేశ్‌ రోషన్‌ సమకూర్చిన బాణీకి లతామంగేష్కర్‌ గాత్రం ఎన్ని సొగసులు అద్దిందో మీరే వినండి. 
* * * * * * 
ఆప్‌ కహే ఔర్‌ హమ్‌ న ఆయే - ఐసే తో హాలాత్ నహీ ! ఓ..... 
మంజిల్‌ తక్‌ పౌంచేంగే కైసే - ఆప్‌ కా జబ్‌ తక్‌ సాథ్‌ నహీఁ /ఆప్‌ కహే ఔర్‌/ 
(మీరు అడగడమూ... నేను రాకపోవడం కూడానా? అలాంటి పరిస్థితే లేదు 
అసలు మీ తోడే లేకపోతే గమ్యాన్నెలా చేరుకోగలన్నేను) 
చేరుకోవాలనుకున్న గమ్యం ఇద్దరిదీ ఒక్కటే అయినప్పుడు ఏం చేస్తారు? ఆ రెండవ వ్యక్తినుంచి పిలుపొస్తే చాలు, ఏమాత్రం బెట్టు చేయకుండా వెంటనే అంగీకారం తెలిపేస్తారు. మొదట తమ ప్రయాణాన్ని ఎవరికి వారు వేరు వేరుగానే ప్రారంభించి ఉండవచ్చు. కానీ, తామిద్దరి మార్గం, గమ్యం ఒకటేనని తెలిసిపోయాక విడిగా ఎందుకు! కలిసినడిస్తే పోలా అనిపించవచ్చు. కలిసి నడవడంలో నిజంగా ఎంత సౌలభ్యం ఉంది! ఏ విపత్కర పరిస్థితో ఎదురైనప్పుడు ఒకరినొకరు ఆదుకోవచ్చు. పరస్పర స్పూర్తితో గుండె దిటవు చేసుకోవచ్చు. అయినా, అన్ని గమ్యాల్నీ అందరూ ఒంటరిగానే చేరుకోలేరు కదా!. ఆ నిజం కొందరికి మొదట్లో తెలియకపోయినా కాలగతిలో తెలుస్తుంది. పోనుపోను ఒక్కోసారి తాము ఎంచుకున్న దారిలో ఒంటరిగా సాగిపోవడం అసాధ్యమని తేలిపోతుంది. ఆ స్థితిలో నీతోడే లేకపోతే నేననుకున్న తీరాన్ని చేరడం సాధ్యమే కాదంటూ స్పష్టంగానే చెప్పేస్తారు. అలా చెప్పేయడానికి వారి మనసు ఏమాత్రం వెనుకంజ వేయదు.
చాహ్‌నే వాలోఁ కీ దునియా మేఁ చాహ్‌నే వాలే ఆగయే 
ఉల్ఫత్ కీ మయ్‌ ఆంఖోఁ సే లో ఆజ్‌ పిలానే ఆగయే 
ఆప్‌ పియే ఔర్‌ ఆప్‌ న ఝూమే - ఆప్‌ కీ బస్‌కీ బాత్ నహీఁ ఓ.... /ఆప్‌ కహే ఔర్‌/ 
(కోరుకునే వారి లోకంలోకి కోరుకున్న వారు వచ్చేశారు 
ప్రేమ మధువును ఈ రోజు కళ్లతో తాగించడానికి వచ్చేశారు 
ఆ మధువు తాగికూడా మీరు మత్తిల్లకుండా ఉండి పోవడమా? 
అది మీ వల్ల అయ్యే పనే కాదు సుమా!) 
కోరుకున్న వారే కడదాకా తమ తోడుగా రావడమన్నది ఎంతమంది జీవితాల్లో జరుగుతుంది? ఆశించినట్లు నిజంగానే అలా తోడైవస్తే, ఆ ఇద్దరూ కొంత కాలం కలిసి నడుస్తారు. కాకపోతే, ఉన్నట్లుండి ఆ ఇద్దరిలో ఒక్కరు హఠాత్తుగా మాయమైపోతారు. మాయమైపోవడం అంటే ఎక్కడికో వెళ్లిపోవడం అని కాదు. ఒకరి ఆత్మలో ఒకరు కలిసిపోయి ఏకాత్మగా ఒక్కరే మిగిలిపోతారు. దాన్నే కదా ప్రేమంటాం. నిజానికి ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా, ఆ లక్ష్యం మీద అవ్యాజమైన ప్రేమ ఉండాలి. అయితే లక్ష్యంమీద ఉన్న ఆ ప్రేమ ఆ లక్ష్యసాధనలో తనతో కలిసి నడుస్తున్న వాళ్ల మీదికి కూడా పాకుతుంది. అదే జరిగితే, వాళ్లు నడుస్తున్న దారంతా ప్రేమతో తడి సిపోతుంది. కళ్లల్లో ప్రేమ మధువు నిండిపోతుంది. ఆ మధువు పొంగిపొర్లుతుంటే ఎదుటివ్యక్తి గుండెలోకి ఒంపేస్తారు. దివ్యార్థ్రమైన ఆ ప్రేమ మధువుతో మత్తిళ్లకుండా ఎవరైనా ఉంటారా? ఆ స్థితిలో ఆ మత్తులో ఊగకుండా నిగ్రహించుకోవడం నిజంగా ఎవరి వల్లా కాదు
చమక్‌తా హువా హై తీర్‌ హుస్న్‌ కా జరా సంభల్‌ కే రహియేగా 
నజర్‌ నజర్‌ కో మారేగీ తో- కాతిల్‌ హమే న కహియేగా 
చాల్‌ చలీ హై సోంచ్‌ కే హమ్‌నే - ఇస్‌ ఖేల్‌ మే అప్‌నీ మాత్ నహీఁ ఓ..... /ఆప్‌ కహే ఔర్‌/ 
(తళుకులీనే అందాల బాణమిది కాస్త సంభాళించుకో 
చూపు చూపునా వేటు బడితే, నన్ను హంతకి అనమాకు 
అన్నీ ఆలోచించే ఈ అడుగులు వేశాను ఈ ఆటలో ఓటమెక్కడిది మనకు) 
ప్రేమ ఎలా పుట్టినా అది తన సహజతత్వాన్ని కోల్పోదు. ఏ పూలగుత్తికో గురిపెట్టిన బాణమే కావచ్చు. కానీ, ఒడిసిపట్టుకోవడం తెలియకపోయినా, గురిపెట్టడం రాకపోయినా, అది మరెక్కడో దిగిపోవచ్చు. ఆ దెబ్బకు ఒక్కోసారి ఎవరి దేహమో లేదా మనసో నిలువెల్లా రక్తసిక్తమైపోవచ్చు. అందుకే తళతళా మెరిసే ఈ అందాల బాణాన్ని అతి జాగ్రత్తగా ప్రయోగించే విలువిద్య తెలియడం చాలా అవసరం. లేదంటే, అది ఎంత రక్తపాతానికి దారి తీస్తుందో జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో ఎవరికి తెలుసు? సాధారణంగా, ఎవరైనా బాణం బారిన పడటానికి విలుకాడే గురితప్పడంకారణమైతే కావచ్చు. లేదా మనమే వాళ్ల దృష్టి చెదిరిపోయేలా చే సి వాళ్లు గురితప్పడానికి మనమే కారణమై ఉండవచ్చు. అలాంటప్పుడు ఒకరినొకరు హంతకుడనేస్తే ఎలా? ఎప్పుడో అరుదుగా తప్ప వేల కోణాల్లోంచి ఆలోచించి నారి సారించేవారు గురి తప్పడం ఉండదు. విజయం చేజారిపోయే అవకాశమే ఉండదు.
పాస్‌ ఆకే యే ఆప్‌కే హమే హోనే లగా అహసాస్‌ హై 
దమ్‌ హై తో బస్‌ ఆప్‌కే దమ్‌ సే ఆప్‌ హీ కే పాస్‌ హై 
క్యా కరే జో హాలే దిల్‌ కో ఐసే తో జజ్‌బాత్ నహీఁ ఓ.... /ఆప్‌ కహే ఔర్‌ / 
(మీ చేరువైన ఫలంగా నాలో ఈ అనుభూతి కలుగుతోంది 
ఉన్న ప్రేమేదో మీ ప్రాణంతో కలిసి మీ చెంతనే ఉన్నట్లుంది 
ఇదేదో ఒక భావోద్వేగంలే అనుకోవద్దు- నా మనస్థితే అలా ఉంది) 
ఏ తీరాన్ని చేరడానికో, ఏ లక్ష్యాన్ని సాధించడానికో ఎవరైనా ఒకరి సన్నిధిలోకి వెళ్లి ఉండవచ్చు. అయితే ఒక్కోసారి అద్భుతమైన పారవశ్యానికి లోనై ఆ సన్నిధానమే సమస్తమనిపించవచ్చు. ప్రాణమున్నంత కాలం అక్కడే ఉండిపోవాలనిపించవచ్చు. అప్పుడప్పుడే మొదలైన అనుబంధమే అయినా కొందరికి అది దశాబ్దాలుగా కొనసాగుతున్న అనుభూతిగా అనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఆ ప్రేమలోకంలో పడి అసలైన లక్ష్యలోకానికి దూరమైపోకూడదు. వ్యక్తిగత బంధాలు కేవలం, సుఖ సంతోషాల్నే కాదు. అప్పుడో ఇప్పుడో వ్యక్తిగతమైన సమస్యల్ని కూడా మోసుకువస్తాయి. ఒక్కోసారి ఆ వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించమే పెద్ద పనైపోతుంది. ఈ క్రమంలో ఒక్కోసారి అనుకున్న లక్ష్యం నుంచి వైదొలగే ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. . సామూహిక సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్లవలసిన అడుగులు అర్థాంతరంగా ఆగిపోవచ్చు. అలా అని, వ్యక్తిగత బంధాలనుంచి తప్పించుకోవాల్సి అవసరమేమీ  లేదు. కాకపోతే అక్కడే కూరుకుపోకూడదు. అలాంటి సమయాల్లో మనతో కలిసి నడిచే వారు, మన లక్ష్యం, వారి లక్ష్యం ఒకటే అయిన వారు, ఆ సమయంలో మనల్ని తట్టిలేపుతారు. వ్యక్తిగత వలయాల్లోంచి లేవదీసి సామాజిక ర హదారుల గుండా నడిపిస్తారు. అలాంటి వారు ఎప్పుడైనా అనుకోకుండా ఎదురై సమష్టిగా సాగిపోదాం రమ్మంటే మనసున్న ఏ మనిషైనా రానని ఎలా అనగలడు?
- బమ్మెర 

Sunday, October 9, 2016

ఓ మేరే దిల్‌ కే చైన్‌ - O Mere Dil ke chain chain aaye mere dil ko dua keejiye


నిన్ను నేను కోరుకుంది.. ఈ లోకం కోసమే!

కొందరికి, తమ సుఖ సౌఖ్యాలకోసం ఒకరితోడు కావల్సి వస్తుంది. మరికొందరికి లోక కళ్యాణం కోసం తాము తలపెట్టిన యజ్ఞ నిర్వహణ కోసం ఒకరి తోడు కావల్సి వస్తుంది. పరిశీలిస్తే, వ్యక్తిగత జీవితమే సమస్తం అనుకునే వారి సంతోషాలు చిన్నవి. వారి సమస్యలూ చిన్నవి. అలా కాకుండా సామాజిక సంక్షేమాన్ని కోరుకునే వారికి సిద్ధించే ఆనందాలు అపారమైనవిగా ఉంటాయి. అలాగే వారికి ఎదురయ్యే సమస్యలు కూడా అనంతమైనవిగానే ఉంటాయి. . పైగా వ్యక్తిగతమైన ఆశలు స్వల్పకాలంలోనే నెరవేరతాయి. కానీ, సామాజిక లక్ష్యాలు నెరవేరడానికి నెలలు, ఏళ్లు కాదు కొన్ని సార్లు ద శాబ్దాలు కూడా పట్టవచ్చు. అయినా పట్టువిడువ కుండా పోరాటం చేస్తున్న క్రమంలో ఆ యోధుల మనసు ఒక్కోసారి తీవ్రమైన అశాంతికి లోనుకావచ్చు. అలాంటి సమయాల్లో ఆ సామాజిక వాదులకు సైతం ఒక్కోసారి ఒక ప్రేమమూర్తి నీడలో సేదతీరాలనిపించవచ్చు. ఆ నీడ తన సామాజిక లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన బలాన్నంతా ఇస్తుందని అనిపించవచ్చు. ఇలాంటి భావోద్వేగాలే మేరే జీవన్‌ సాథీ సినిమా కోసం మజ్రూహ్‌ సుల్తాన్‌పురి రాసిన ఈ పాటలో వినిపిస్తాయి. ఒక గంభీరమైన ఆత్మధ్వని, ఒక రసరమ్యమైన హృదయ నాదం కలగలసి ప్రవహించడం అన్నది ఒక్క కిశోర్‌ కుమార్‌ గొంతులోనే చూస్తాం. ఈ పాటకు ఆర్‌. డి. బర్మన్‌ సమకూర్చిన బాణీ ఆ గొంతులో ఎంత అద్భుతంగా పలికిందో మీరే వినండి.
  * * * * * *
ఓ మేరే దిల్‌ కే చైన్‌ 
చైన్‌ ఆయే మేరె దిల్‌ కో దువా కీజియే 
(ఓ నా జీవన శాంతమా! 
నా మనసుకు సాంత్వన కలగాలని పార్థించవా!) 
మనసంతా అలజడితో నిండిపోతే అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమే అవుతుంది. ఎందుకంటే బాణాన్ని గురిపెట్టే కంటికి, నారిని సారించే చేతికి ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేని ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. పొంతన లేని అడుగులు తీరం చేరడంకన్నా, దారి తప్పే అవకాశమే ఎక్కువ. దారి తప్పిన ప్రయాణం తీరాన్ని చేర్చకపోగా, ఎప్పుడైనా ఏ భయంకరమైన అగాధంలోనో పడదోస్తే అది ఇంకా ప్రమాదం. అందుకే అంతటి అలజడిలోనూ కొందరి హృదయాలు ఎవరైనా కాస్తంత శాంతిని ప్రసాదిస్తారేమోనని చూస్తుంటారు. వాళ్లు ప్రసాదించడమే కాదు ఏ దివ్య శక్తినుంచైనా ఆ శాంతి లభించే అవకాశాలు ఉంటే ఆ శక్తిని ప్రార్థించైనా తమకు ఆ శాంతి కూడా లభించేలా చూడమని అర్థిస్తారు..
అప్‌నా హీ సాయా దేఖ్‌ కే తుమ్‌ - జానే జహాఁ శ ర్‌మా గయే 
అభీ తో యే పహెలీ మంజిల్‌ హై - తుమ్‌ తో అభీ సే ఘబ్‌రాగయే 
మేరా క్యా హోగా - సోంచో తో జరా 
హాయ్‌...ఐసే న ఆహేఁ భరా కీజియే / ఓ మేరే / 
(నీ నీడే నువ్వు చూసుకుని ఓ నా లోకమా! సిగ్గుపడిపోతున్నావు 
ఇంకా ఇది తొలి మజిలీయే నువ్వు అప్పుడే గాబరా పడిపోతున్నావు 

నేనేమైపోవాలి! కాస్త ఆలోచించు 
ఉఫ్‌ఫ్‌ఫ్‌ఫ్‌.... ఇలా నువ్వు నిట్టూర్పులు నింపుకోకు) 
లీలగా మనసులో కదిలే వ్యక్తి ఎవరో తమ చెంతగా వస్తున్నారని ముందే తెలిసినప్పుడు ఒక్కోసారి తన నీడనే అతని నీడ అనుకుని సిగ్గుపడిపోవచ్చు. ఒకవేళ అతనే ఆమె కోసం వచ్చినా అతడో ఉన్నత లక్ష్యం కోసం వచ్చిన వాడు కాబట్టి ఏడడుగులు నడవగానే వదిలేయడు కదా! ఏడేడు లోకాలు వెంటతీసుకు వెళతాడు. ఆ లోకాలు ఈ భూమండ లానికి ఆవల ఎక్కడో ఉన్నాయని కాదు. సామాజిక పోరాటంలో మనసును కుదిపేసే ప్రతి భావోద్వేగమూ ఒక లోకమే అవుతుంది. అప్పుడు భావోద్వేగాల ఆ ఏడేడు భువనాలు వె న్నంటి తిరగాల్సి వస్తుంది. అలాంటి గురుతర బాధ్యతల్ని మోయాల్సిన జీవన సహచరి, ఏ కారణంగానైనా తొలి మజిలీ చేరడానికి ముందే సొమ్మసిల్లి పడిపోతే ఏమిటా పరిస్థితి? అడుగడుగునా ఆమె తోడు లభిస్తుందని గంపెడాశతో ఆమెను ఎంచుకున్న వ్యక్తిని ఆకాశమంత అయోమయత్వం అలుముకోదా? ఎంత సేపూ తమలో తాము కూరుకుపోవడం కాదు నువ్వే సమస్తమని నీ ఎదురుగా కూర్చున్న వ్యక్తి గురించి కూడా ఎంతో కొంత ఆలోచించాలి కదా! అదేమీ లేకుండా అదే పనిగా నిట్టూర్పులు విడుస్తూ కూర్చుంటే జీవన యానం కొనసాగేదెట్లా? జీవిత లక్ష్యం నెరవేరేదెట్లా?
ఆప్‌కా అర్‌మాఁ ఆప్‌ కా నామ్‌ - మేరా తరానా ఔర్‌ నహీఁ 
ఇన్‌ ఝుక్‌తీ పల్‌కోఁ కే సివా - దిల్‌ కా టికానా ఔర్‌ నహీఁ 
జంచ్‌తా హీ నహీఁ - ఆంఖోఁ మే కోయీ 
దిల్‌ తుమ్‌కో హీ చాహే తో క్యా కీజియే / ఓ మేరే / 
(నీ ఆకాంక్షలు, నీ పేరు ఇవే తప్ప నాకంటూ వేరే రాగం లేదు 
నీ వాలిపోయిన కనురెప్పలు కాక నాకు మరో నివాసం లేదు 
నా కళ్లకు వేరెవరూ నచ్చడం లేదు 
మనసు నిన్నే కోరుకుంటే నేనేం చేయను!) 
ఆకాశాన్ని తాకే పర్వతం సైతం జానెడంత అద్దంలో ఒదిగిపోయినట్లు, ఒక్కోసారి అనంతమైన జీవిత లక్ష్యం,  తాను నమ్ముకున్న ఒక వ్యక్తి లోగిలిలో నిలిచిపోతుంది. ఆ లోగిలే అతని లోకమై భూమ్యాకాశాల్ని ఏకం చేస్తుంది. ఆ స్థితిలో తనతో ముడిపడిన ఆమె ఆకాంక్షలు, ఆమె ఆకాంక్షలను చుట్టేసే ఆమె పేరు, ఈ ఆలాపనలే తప్ప అతని గొంతులో పలికే మరో రాగమేదీ ఉండదు. సామాజిక ఆకాశాన్ని ఒడిసిపట్టుకున్న ఆమె కనురెప్పలే తప్ప అతనికి మరో ఆశ్రయం ఉండదు. కళ్ల ముందునుంచి లక్షలాది మంది రోజూ అలా సంచరిస్తూ ఉండవచ్చు. కానీ, వాళ్లంతా నీ లక్ష్యాన్ని స్వీకరించరు కదా! అంతమందిలో ఎవరో ఒకరుంటారు. నీ మాటే తమ మాటగా, నీ బాటే వారి బాటగా నిండు మనసుతో స్వీకరిస్తారు. అలాంటి వాళ్లే లోకంలో ఎవరూ లేనట్లు, నా వెంట పడ్డావేమిటని మాటవరుసకే అన్నా మనసు తట్టుకుంటుందా? లోకంలో ఎందరుంటేనేమిటి? నాకు నువ్వే నచ్చావు? నా మనసు నిన్నే కోరుకుంటోంది నేనేం చేయనని నిస్సంకోచంగా అనేస్తారు.
యూఁ తో అకేలా భీ అక్సర్‌ - గిర్‌ కే సంభల్‌ సక్‌తా హూఁ మైఁ 
తుమ్‌ జో పకఢ్‌లో హాథ్‌ మేరా - దునియా బదల్‌ సక్‌తా హూఁ మైఁ 
మాంగా హై తుమ్హే - దునియా కే లియే 
అబ్‌ ఖుద్‌ హీ సన మ్‌ ఫైస్‌లా కీజియే / ఓ మేరే / 
(ఎన్నిసార్లు పడిపోయినా నేను తిరిగి లేచి నిలబడగలను 
నువ్వు నాతో చేయి కలపాలే గానీ, నేను లోకాన్నే మార్చేయగలను 
అసలు నిన్ను కోరుకుందే లోకం కోసం) 

ఓ ప్రియతమా! ఇక నిర్ణయం తీసుకోలసింది నువ్వే) కొందరికి స్వయం-అస్తిత్వం ఉంటుంది. నిండైన స్వయం-వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి వారు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏ సుడిగుండాన్నయినా ఒంటరిగానే ఎదురీదగలరు. ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేవగలరు. కానీ, సమస్త మానవాళి గురించి ఆలోచిస్తూ, సంఘటితంగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఎంత టి వారికైనా, ఒంటరి ప్రయాణం కన్నా, ఒకరిని తోడు తీసుకుని సహయానం చేయాలనిపించవచ్చు. ఈ సంయుక్త ప్రయాణంలో మరింత వేగంగా అడుగులు వేయవచ్చుననిపించవచ్చు. ప్రత్యేకించి సమాజంలో ఏదైనా మార్పు తీసుకు రావాలనుకున్నప్పుడు సమష్టిపోరాటమే మేలనిపిస్తుంది. ఆ స్థితిలో నిన్ను నేను కోరుకుంటున్నది నా కోసం అనుకునేవు సుమా! నీ తోడు నేను కోరుకుంటున్నది సమాజం కోసమని ఒక మహాపర్వతమెక్కి ఆకాశం దద్దరిల్లేలా అరిచి చెప్పాలనిపిస్తుంది. ఈ యువకుడిలో సుడివడుతున్న అంతర్వేదనంతా అదే. లోకంలోని ప్రేమికులంతా, తమ వ్యక్తిగత సుఖ సౌఖ్యాల కోసం కాకుండా, ఇలా సామాజిక హితం కోసం సహజీవనానికి సిద్ధమైతే అదొక స్వర్ణయుగమే కదా! భూమ్మీద స్వర్గసీమ అంటే అదే కదా! -
-బమ్మెర

Sunday, September 25, 2016

మేరి జిందగీ మే ఆతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ - Meri Jindagi me Aathe tho kuch aur baath hothi



నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే.....!

   మనసు పురివిప్పిన నాటి నుంచి మనలో ఎన్నెన్నో కలలు పురుడు పోసుకుంటాయి. ఆ తర్వాత ఆ కలలు నెరవేరిన ట్టే అనిపిస్తాయి. ఆ కలల సౌరభాలు హృదయమంతా, జీవితమంతా వ్యాపిస్తాయి కూడా. కానీ, ఒక్కోసారి అంతలోనే అంతా అయిపోయినట్లు ఆ కలల సౌధాలన్నీ ఏ పెనుగాలి తాకిడికో విరిగిపడినట్లు చెల్లాచెదురైపోతాయి. తిరిగి చక్కబడతాయిలే అన్న ఆశే లేకుండా తునాతునకలై ఆనవాళ్లే దొరకనంత దూరాల్లోకి విసిరివేయబడతాయి. అదేమిటో గానీ, రవ్వంత కాలమే మనతో ఉండి, శాశ్వతంగా దూరమైపోతాయి. అలా పోయిన వేవీ ఇంకెప్పటికీ తిరిగి రావని తెలిసి కూడా ఎందుకో పిచ్చి మనసు.... పగలూ రేయీ వాటికోసమే పలవరిస్తూ ఉంటుంది. ఆ స్వప్న లోకమే ఉంటే ఎంత బావుండేది...! ఆ స్వప్పమూర్తే త నతో ఉంటే ఎంత అద్భుతంగా ఉండేది! అనుకుంటూ జీవితమంతా మదనపడుతూ ఉండిపోతుంది. ‘ కన్యాదాన్‌’ సినిమా కోసం హస్రత జైపూరి రాసిన ఈ పాటలో ఈ అంతరధ్వనే వినిపిస్తుంది. శంకర్‌ జైకిషన్‌ స్వరపరిచిన ఈ గీతం రఫీ గొంతులో పడి వికల మనస్కుల అంతర్వేదనను నిజంగా ఆకాశానికి చేర్చింది
* * * * *
మేరి జిందగీ మే ఆతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
యే నసీబ్‌ జగ్‌మగాతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
( నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది 
ఆ సంగతే వేరుగా ఉండేది
నా తలరాత ను మెరిపించి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది)
తానే సమస్తమై జీవితంలోకి రావలసిన వ్యక్తే రాకుండా పోయాక, ఎవరి జీవితమైనా ఉండాల్సిన రీతిలో ఎలా ఉంటుంది? ఆ అసలు మూలాల్ని పట్టించుకోకుండా ‘‘ఇలా ఎందుకున్నావు? అలా ఎందుకు అయిపోయావు?’’ అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు అర్థమేముంటుంది? తానే తన జీవన సౌధానికి మూలస్థంభం అనుకుని అన్ని సన్నాహాలూ చేసుకుంటున్న సమయంలో ఆ మూలస్థంభమే మటుమాయమైపోతే ఇంకెక్కడి జీవితం..? . ఇంకెక్కడి జీవన సౌధం? ఇప్పటికి ఈ చీకట్లు ఇలానే ఉండిపోయినా ఆ ప్రేమమూర్తి రాకతో అంతా కాంతివంతమవుతుందని కదా కలలు కన్నది.! ఆ ప్రేమమూర్తి, ఆ కాంతి పుంజం ఇంకెప్పటికీ రానే రాదని తేలిపోతే ఏమిటి చెయ్యడం? గుండెను చిక్కపట్టుకుని జీవితమంతా బిక్కుబిక్కుమంటూ గడపడమే గానీ, జీవితపు రసానందంలో ఓలలాడే అవకాశం ఎక్కడ ఉంటుంది? అవును మరి! ఆమే తన జీవితంలోకి వచ్చి ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది! జీవన కావ్యమే వేరుగా ఉంటుంది!
కయీ బార్‌ మిల్‌ చుకీ హై, యే హసీఁ హసీఁ నిగాహేఁ
వహీ బేక రారియాఁ హైఁ న మిలీ ఖుషీ కి రాహేఁ
మేరే దిల్‌ సే దిల్‌ మిలాతే, తో కుఛ్‌ ఔర్‌ బాత కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే......... /
(ఎన్నో సార్లు కలిశాయి - ఈ ముగ్ధ మనోహరపు చూపులు
అయినా, ఎప్పుడూ వికల మనస్కంగానే తప్ప, ఆనందపు దారులే దొరకలేదు
నా మనసుతో మనసు కలిపి ఉంటే - ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది / నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే /
ఎవరి జీవితం వారిని ఎన్ని రకాలుగా కుంగదీస్తుందో ఎవరికి తెలుసు? అందమైన కళ్లు ఎన్నిసార్లు ఎదురైతేనేమిటి? ఆ కళ్లల్లో కల్లోలాలు, లీలగా తిరిగే కన్నీళ్లే కనపిస్తుంటే, ఆ కళ్లల్లో ఆనంద తీరాల్ని చూసే అవకాశం ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి ఎప్పటికీ మారదని ఎప్పటికప్పుడు తేలిపోతుంటే ఏమైపోవాలి? ఒక్కగానొక్క జీవితం ఇలా చిందరవందర అయిపోయిందేమిటా అన్ని మనసు చింతిల్లదా? ఒకానొక దశలో విసిగి వేసారి, అసలు సుఖదుఃఖాలకు సంబంధమే లేని పూర్తిగా వేరైన మరో జీవితాన్ని వెతుక్కోవాలని అనిపించదా? తీరా అలాంటి మరే జీవితాన్నో వెతుక్కున్నాక ‘‘నీదీ ఒక బతుకేనా? ఇదీ ఒక జీవితమేనా?’’ అంటూ నిప్పుల వ ర్షం కురిపిస్తుంటే పాపం ఆ జీవుడు ఏంమాట్లాడతాడు? దిక్కులు చూస్తూ నిలుచోవడం తప్ప ఏం సమాధానం చెబుతాడు? ఆ రోజున ఆ మనసుతో మనసు కలిపే ఉంటే ఈ రోజున ఇలా మాట్లాడే అవసరమే ఉండేది కాదు కదా! ఒక్క అడుగు ముందుకేసి హృదయాన్ని పరిచే ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది...! ఆ కావ్యమే వేరుగా ఉంటుంది!
ముఝే క్యా గరజ్‌ కిసీసే, హసే ఫూల్‌ యా సితారే
హైఁ మేరే నజర్‌ మే కితనే, యే జవాఁ జవాఁ నజారే
అగర్‌ ఆప్‌ ముస్కురాతే తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే............ /
(పూలు నవ్వితే నే! తారలు నవ్వితేనే! వాటితో నాకు పనేమిటి?
అవేమీ కొరగాని నేను చూసిన ఎన్ని నవయవ్వనపు సుందరసీమల్లేవు?
నువ్వే ఒక్క మందహాసం చేసి ఉంటే ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది / నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే /)
ఏ రకంగా జీవించినా మనల్ని చూసి హేళనగా నవ్వుకునే వాళ్లుంటారు. అదే సమయంలో మనం అనుకున్న లక్ష్యం, దాన్ని చేరుకోవడానికి మనం ఎంచుకున్న మార్గం ఎంతో ఉన్నతమైనదీ, ఉత్కృష్టమైనదీ అని అభినందించే వాళ్లూ ఉంటారు. నిజానికి ఈ ఇద్దరిలో ఎవరూ ముఖ్యం కాదు. వీళ్ల వ్యాఖ్యానాలూ ముఖ్యం కాదు. అనుక్షణం నీతో నడిచే నీ అంతరాత్మే అన్నింటికన్నా ముఖ్యం. లేదా నీ ఆత్మలో ఆత్మగా ఉన్న నీ ప్రేమమూర్తే ముఖ్యం. ఆమె చేసే వ్యాఖ్యానాలే నిఖార్సయినవి. నిజమైనవి. లోకం ఎన్ని రకాలుగా మాట్లాడినా కుంగిపోకుండా, నీ వైపు చూస్తూ ఆ ప్రేమమూర్తి ఒక మందహాసం చేస్తే ఈ మహీతలమే నీ సొంతమైనట్లు. ఆ మహీతలానికి నువ్వే రారాజువైనట్లు, చక్రవర్తివైనట్లు. కానీ, అందరిలాగే లోకపు వ్యాఖ్యలకు జడిసి, నీ వైపు అడుగులు వేయడానికే జంకి, ముఖం దాచేసుకుని తన దారిన తాను వెళ్లిపోతే.....! వేలాది లక్షలాది జీవితాల్లో ఇదేగా జరుగుతోంది? అలా కాకుండా, లోకాన్నే ఏకాకిని చేసి నీ చేయందుకుని నడిస్తే, మందహాసాల కుంభవృష్టి కురిపిస్తే....! ఎంత బావుంటుంది. కానీ, అలా జరగడం లేదే! అదే జరిగితే ఆ కథే వేరుగా ఉంటుంది! ఆ కావ్యమే వేరుగా ఉంటుంది!
యే ఖుషీ రహే సలామత, యూఁహీ జష్న్‌ హో సుహానా
జిసే సున్‌రహీ హై దునియా, మేరే దిల్‌ కా హై తరానా
మేరే సాథ్‌ తుమ్‌ భీ గాతే, తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ
తో కుఛ్‌ ఔర్‌ బాత హోతీ / మేరే జిందగీ మే ఆతే............/
(నీ సంతోషం అలా సుభిక్షంగా ఉండిపోనీ - ఈ ఉత్పవం సుశోభితం కానీ
ఈ లోకం వింటున్నదంతా నా హృదయ గానమే సుమా
నాతో కలిసి నువ్వూ పాడి ఉంటే ఁ ఆ సంగతే వేరుగా ఉండేది
ఆ సంగతే వేరుగా ఉండేది - నా జీవితంలోకి నువ్వే వచ్చి ఉంటే)
దారులు శాశ్వతంగా వేరైపోతున్నాయని తొలిసారిగా తెలిసినప్పుడు హృదయాలు దావానలమైపోవడం సహజమే. కలల సౌధమంతా కాలి కూలిపోవడమే సహజమే. కానీ, ఏ మంటలైనా ఎంత కాలం ఉంటాయి? రోజులు, నెలలు పట్టవచ్చు. ఒక్కోసారి ఏళ్లు పట్టవచ్చు. కానీ, ఎప్పటికైనా ఆ మంటలు చల్లారిపోవడం ఖాయం. తాను కోల్పోయిన వారి తాలూకు జ్ఞాపకాల్లో మనసు ఏదోలా సేద తీరడమూ ఖాయం. ఆ తర్వాత కూడా జీవితంలో ఉండవలసినవన్నీ లేకుండాపోయాయే అన్న బాధైతే ఉండవచ్చు కానీ, గత జీవితంలో ఉండాల్సినవైతే ఉన్నాయి కదా ! అన్న ఊరట ఒకటి కలుగుతుంది. ఓదార్పు కలుగుతుంది. ఆ ఓదార్పులో అప్పుడప్పుడు తనను తాను ఊయల్లో ఊపుకొనేందుకు, లలిత లలితంగా మన గొంతులోంచి ఒక లాలిపాట పుట్టుకు రావచ్చు. ఆ పాట మాధుర్యంలో మనసు ఒకింత ఊరడిల్ల గలిగితే అంతకన్నా ఏం కాంవాలి? ఆ ఘడియలు అలాగే కొనసాగాలని ఎవరైనా కోరుకోవాలి. కాకపోతే ఆ పాడే సమయంలో తాను కూడా ఉంటే గొంతు కలిపేది కదా అనిపిస్తుంది. ఏక గళంలో కాకుండా యుగళ గీతమై మార్మోగేది కదా అనిపిస్తుంది. కానీ, అలా ఎంతగా ఎదురు చూసినా కొన్ని జీవితాల్లో ఏ ఫలితమూ ఉండదు. తన ఎదురు చూపే తన ఎదురుగా నిలుస్తుంది. అలా కాకుండా ఆమే తన జీవితంలోకి వచ్చి ఉంటే ఆ కథే వేరుగా ఉంటుంది! ఆ జీవన కావ్యమే వేరుగా ఉంటుంది!
... బమ్మెర

Wednesday, September 14, 2016

సంసార్‌ సేభాగే ఫిర్తే హో - Samsar se bhage phirthe ho - Chitralekha movie - aashabomsle song



నేల తెలియకపోతే...ఆకాశం ఎక్కడిది?


నిశ్శబ్దాన్ని ప్రశాంతత అనలేం. ఫళాయనాన్ని పారమార్థికత అనలేం. ఓటవెుౖనా,గెలుపైనా అవి యుద్ధ భూవిులో దిగిన వాడికే గానీ, దూరంగా నిలుచుని దిక్కులు చూసే వాడికి కాదు కదా! సముద్రయానంలోని సంతోషం ఏవిుటో, సంఘర్షణేమిటో పడవెక్కిన వాడికే తెలుస్తుది గానీ, ఒడ్డున కూర్చున్న వాడికి కాదు కదా! సముద్రం నుంచైనా, సమర భూమి నుంచైనా జీవిత పాఠాలు నేర్చుకునేది, పరిపూర్ణ జీవన సౌందర్యాన్ని దర్శించేది జీవన పోరాటాల్లో పాలు పంచుకునవాళ్లే. ఆకాశంలోకి ఎగరాలనుకునే విమానం ముందు నేలమీద పరుగులు తీయాల్సిందే. అసలు సిససలైన ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలనుకునే ఎవరైనా భౌతిక జీవిత సత్యాల్ని తరచి చూడాల్సిందే . అందుకోసం పరోక్షంగానే కాదు. ప్రత్యక్షంగానూ ప్రపంచ గమనంలో పాలు పంచుకోవడం తప్పనిసరి అవుతుంది. ‘చిత్రలేఖ’ సినిమా కోసం సాహిర్‌ లుథియాన్వి రాసిన ఈ పాటలో ఈ ప్రబోధవేు ప్రతిధ్వనిస్తుంది. రోషన్‌ సంగీత దర్శకత్వంలో దాదాపు ఐదు దశాబ్దాల కిత్రం లతామంగేష్కర్‌ గానం చేసిన ఈ గీతం ఇప్పటికీ మానవ జీవితాల్లో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది. 
* * * * *
సంసార్‌ సే భాగే ఫిర్తే హో - భగ్‌వాన్‌ కో తుమ్‌ క్యా పావోగే 
ఇస్ లోక్‌ కో భీ ఆప్ నా న సకే - ఉస్ లోక్ మే  భీ పఛ్‌తావోగే /సంసార్‌ సే/ 
(భవలోకాన్నించి పారిపోవాలని చూసేనువ్వు భగవంతుణ్ని ఎలా పొందుతావు? 
ఈ లోకాన్నే అందుకోలేని నువ్వు ఆ లోకంలో కూడా పశ్చాత్తాపపడతావు) 
భవబందాల్ని అధిగమించి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలి. అంతే గానీ ఆ బంధాలకు వెరిసి వాటి నుంచి పారిపోయి కాదు.అయినా కళ్లముందున్న భౌతిక ప్రపంచాన్నే అందిపుచ్చుకోలేని వాడు కంటికి కనిపించని అభౌతిక లోకాన్ని, ఆ భగవతుణ్ని ఎలా దర్శించుకోగలడు? చేతికంది చేతుల్లోకి వచ్చేసే ఈ ప్రత్యక్ష లోకంలోనే ఏవీు చేయులేనివాడు ఆ లోకంలో మాత్రం ఏంచేస్తాడు? అడుగడుగునా పశ్చాత్తాపపడటం ప్ప. అయినా భౌతికత్వానికీ, అభౌతికత్వానికీ ధ్యన రేఖ గీసిందెవరు? ఈ రెండూ వేరు వేరని చెప్పిందెవరు? నిజానికి ఈ రెండూ ఒకే రూపపు వేరువేరు పార్శ్వాలు కదా!. ఒకే మార్గపు వేరు వేరు చివర్లు కదా! అందువల్ల ఈ చివరనుంచి మార్గంలో అడుగెడితేనే ఎవరైనా ఆ చివరకు చేరతారు. భౌతిక సీమలోంచి నడిస్తే తప్ప ఎవరూ భగవంతుని సన్నిధానాన్ని చేరుకోలేరు. అందువల్ల ఎవరికైనా నిజంగానే దైవాన్ని చేరుకోవాలని ఉంటే , వారు భువనలోకం లోంచి పయనించాల్సిందే. అందుకు విరుద్ధంగా వాటన్నింటి నుంచి పారిపోవాలని చూసేవారు జీవితంలో సాధించేదేమీ ఉండదు. 

యే పాప్ హై క్యా, యే పుణ్య్‌ హై క్యా - రీతోఁ పర్‌ ధర్మ్‌ కీ వెుుహరే హైఁ 
హర్‌ యుగ్‌ బదల్‌తే ధర్మోం కో కైసే ఆదర్శ్‌ బనావోగే / సంసార్‌ సే/ 
(ఈ పాపాలేమిటి? పుణ్యాలేమిటి? ఈ ఆచారాల పైన ధ ర్మాల ముద్రలున్నాయి 
యుగయుగానికీ మారే ధర్మాల్ని ఎలా ఆదర్శంగా తీసుకుంటావు?) 
మానవ సమాజం నిరంతరం మారుతూ ఉంటుంది. దాని ఆచారాలూ, ధర్మాలూ మారుతూ ఉంటాయి. ఒకనాడు సతీసహగమనానికి జోహార్లు పలికిన సమాజమే ఆ తర్వాత కాలంలో అది అమానషమైన ఆచారమంటూ తూలనాడింది. వితంతు వివాహాన్ని మహా పాపకార్యమన్న సమాజమే ఆ తర్వాత కాలంలో అందుకు సిద్ధపడ్డ వారికి నీరాజనాలు పలికింది. అయినా, ఒక నిండైన జ్ఞానం లోంచి పుట్టుకొచ్చినదైతే అది వేరే మాట. అలా కాకుండా, ఎవరి ఆధిపత్యం కోసమో రూపొందిన, ఒక తెగకో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో చెందిన ఏ వర్గ ప్రయోజనాల కోసమో సిద్ధమైన ఆచారాలనూ, ధర్మాలనూ ఎవరైనా ఎందుకు నెత్తినెత్తుకోవడం?  ధర్మాల గురించి ఎందుకు? ఎవరి స్వార్థ చింతనలోంచో, ఎవరి అమానుషత్వంలోంచో పుట్టుకొచ్చిన నియమాలను ఎవరైనా ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం? అవైనా స్థిరంగా ఉంటాయా అంటే అవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. తమ ఉనికినీ, స్వరూప స్వభావాలనూ మార్చుకుంటూ వెళతాయి. అలాంటి మహా చంచలమైన వాటి ఆధారంగా ఏది పుణ్యమో, ఏది పాపమో ఎలా నిర్ధారిస్తారు? ఆ నిలకడలేని వాటిని ఎంచుకుని నువ్వెక్కడ నిలకడగా ఉండగలవు? మనిషన్నవాడు అఖండంగా, అనంతంగా వ్యాపించాలి ఏ ఒక్కతెగకో, జాతికో మేలు కలిగేలా మొగ్గు చూపకుండా, సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూసే జ్ఞానదృష్టిని సముపార్జించాలి. విశ్వమానవుడిగా, విశ్వప్రేమికుడిగా జీవించగలగాలి. 

యే భోగ్‌ భీ ఏక్‌ తపస్యా హై - తుమ్‌ త్యాగ్‌ కే మారే క్యా జానో 
అప్‌మాన్‌ రచేతా కా హోగా, రచ్‌నా కో అగర్‌ ఠుక్‌రావోగే /సంసార్‌ సే / 
( ఈ భోగ్యం కూడా తపస్సేనని- ఓ త్యాగపీడితుడా నీకేం తెలుసు? 
సృష్టిని తృణీకరిస్తున్నావంటే అది సృష్టికర్తను అవమానించడమే) 
కనపించే భౌతికాలన్నీ హీనమైనవి, కంటి కి కనిపించని అభౌతికాలే ఉన్నతమైనవి అంటే ఎలా ? మంచు కరిగితే నీరవతుంది. నీరు మరిగితే ఆవిరవుతుంది. క నిపించని ఆవిరి పవిత్రమైనప్పుడు వాటికి మూలమైన మంచు, నీరు అపవిత్రం ఎలా అవుతాయి? శరీరమే లేకపోతే, మనసెక్కడిది? ఆత్మ ఎక్కడిది? ఆ పైవాన్నింటికీ శ రీరమే మూలభూతం కదా! మూలభూతాన్నే కదా దైవం అంటాం. అయినా గుండెనూ, గుండె స్పందనలనూ ఎవరైనా ఎలా వేరు చేస్తారు? రక్తమాంసాల్నీ, ప్రాణాన్నీ ఎలా వేరు చేస్తారు? శరీరం, ఆత్మ వేరు వేరు కాదు. భౌతికం, అభౌతికం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకే సత్యపు రెండు పార్శ్వాలు అని చెప్పడానికే కదా అరవిందో ‘ఇంటెగ్రల్‌ ఫిలాసఫీ’ని ప్రతిష్టాపించాడు. ఇవేమీ వినకుండా, కనకుండా, ఎవరైనా, భౌతికమైనవన్నీ పాపాత్మకాలు, అభౌతికమైన వన్నీ పుణ్యాత్మకాలు అంటే ఏమనగలం? సృష్టికర్తను ఆరాధిస్తూనే, ఆయన సృష్టిని ఏవగించుకుంటే ఏమిటి అర్థం? అది ఆ సృష్టికర్తను అవమానించడం కాదా? అన్నం భౌతిక పదార్థమే కదా! అలాంటప్పుడు ‘ అన్నం పరబ్రహ్మం’ అని ఎలా అన్నారు జ్ఞానులు. సర్వసంగ పరిత్యాగం ఒక్కటే పరమధర్మం అని ఎవరెనా అనుకుంటే ఏమనగలంలే గానీ, నిజానికి, ఈ భౌతిక రూపాలన్నీ, ఈ భోగభాగ్యాలన్నీ పవిత్రమైనవే.వాటిని ఆస్వాదించడం పరమ పవిత్రకార్యమే, తపస్సుతో సమానమే. 

హమ్‌ కహెతే హై యే జగ్‌ అప్‌నా హై - తుమ్‌ కహెతే హో ఝూటా సప్‌నా హై 
హమ్‌ జనమ్‌ బితాకర్‌ జాయేంగే, తుమ్‌ జనమ్‌ గఁవాకర్‌ జావోగే /సంసార్‌ సే/ 
(మేమేమో ఈ లోకం మాదేనంటాం. నువ్వేమో అంతా ఒక అబద్దపు కల అంటావు 
మేము జీవితాన్ని గడిపేసి పోతాం - నువ్వేమో జీవితాన్ని కోల్పోయి వెళ్లిపోతావు) 
ప్రళయకాలం ఎప్పుడో వస్తుందని, అప్పుడు ప్రపంచమంతా మునిగిపోతుంద ని ఇప్పుడెండుకు ఏడుపు? విశ్వపు ఆది ఘడియల్ని నువ్వు చూడలే దు. దాని అంతిమ ఘడియల్నీ నువ్వు చూడలేవు. నువ్వు ఉండని, నువ్వు చూడలేని ఆ ఎప్పటి పరిణామాలో ఊహించుకుని శూన్యమొక్కటే సత్యం. ప్రపంచమంతా ఉత్త మాయ అంటూ విశ్వాంత కావ్యాన్ని పారాయణం చేయడం ఎందుకు? ఆ మాట అలా ఉంచి, విశ్వం అంతమై తీరుతుందని అంత కచ్చితంగా చెప్పిందెవరు? ఆ సెలవిచ్చిన పెద్దాయన ఇప్పటికి ఎన్ని విశ్వాంతాల్ని చూశాడు? అయినా, విశ్వకాలం అంటే ఏమిటి? నీ జీవితకాలమే విశ్వకాలం. నువ్వున్నంత కాలం విశ్వం ఉంటే అది ఉన్నట్లే, నువ్వే లేకుండా పోయాక విశ్వం ఉన్నదేం తెలుస్తుది? లేకుండా పోయిందేమి తెలుస్తుంది? ఈ రోజున, ఇప్పుడు, ఈ క్షణాన నువ్వు ఉన్నావు. లోకం ఉంది. ఇది సత్యమే... పరమ సత్యమే. ఈ సత్యాన్ని గుర్తించిన వారంతా లోకం తమదే అనుకుంటారు. ఆ లోకంలో మమేకమవుతారు. తాదాత్మ్యత పొందుతారు. క్షణక్షణం, అణువణువునా ఆకాశాన్ని చూస్తారు. నక్షత్ర మండలాన్ని చూస్తారు. సూర్యచంద్రుల్ని చూస్తారు. సముద్రతరంగాల్ని చూస్తారు వాటి సంగీతాన్ని వింటారు. అన్నింటినీ మించి జీవితపు అమృతభాండాన్ని అమాంతంగా లేవనెత్తి గుండెనిండా నింపుకుంటారు. ఈ లోకం అబద్ధం కాదు, మాయ కాదు. పరమసత్యం అంటూ పరవశంతో గానం చేస్తారు. ఒకటి మాత్రంనిజం....ఈ లోకమంతా అబద్దం అనుకునే వారంతా అక్షరాలా జీవితాన్ని పోగొట్టుకుని వెక్కివెక్కి ఏడుస్తూ వెళిపోతారు. అలా కాకుండా, ఈ లోకాన్ని సత్యమని, పరమసత్యమని గుర్తించిన వారు జీవితపు మహార్ణవ సౌందర్యాన్నీ, దివ్య మాధుర్యాన్నీ పొందుతారు. చివరికి ఒక రోజున పంచభూతాల్లో కలిసిపోయినా, విశ్వగీతాన్ని ఆలపిస్తూ ప్రపంచం ఉన్నంత కాలం వినువీధిలో తిరుగాడుతుంటారు. 
- బమ్మెర 

Wednesday, August 24, 2016

ముఝ్‌సే పహలీ- సీ ముహబ్బత్‌ - Mujhse pehli si mohabbath - Khaidi old movie - Noorjahan - Faiz ahmed faiz writer


లోకంలో ప్రేమే కాదు... కోట్లాది దుఃఖాలున్నాయి.


మనిషి జీవితంలో ఎన్నెన్ని దశలు? ఒక నాడు నీటిబుడగలతో అడుకున్న వాడే కొన్నాళ్లుపోయాక నక్షత్రాలతో ఆడుకుంటాడు. ఒక నాడు తరంగమై కదిలిన వాడు కొన్నాళ్లు పోయాక సముద్రమై ఎగిసిపడతాడు. తాను సుఖంగా ఉంటే చాలనుకున్న వాడు ఒక నాడు సర్వ సుఖాలతో ఉండికూడా సాటి మనుషుల దుఃఖాలు చూసి వెక్కివెక్కి ఏడుస్తాడు. ప్రాణానికి ప్రాణమైన ప్రేమమూర్తి ఎదురుగానే ఉన్నా ఏమీ పట్టనట్లు, మంటల్లో కాలిపోతున్న మనుషుల కోసం పరుగెడతాడు. తనతో పాటు మరికొందరిని కలుపుకుని ఆ మంటల్ని చల్లార్చే పనిలో పడతాడు. లోకమే జీవితమై పోయినవాడికి, తన వ్యక్తిగత జీవితం జీవితంలానే అనిపించదు. ఈ ఇతివృత్తమే ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ రాసిన ఈ గీతంలో ధ్వనిస్తుంది. ‘ కైదీ’ సినిమాలోని ఈ పాటను రశీద్‌ ఆతే్త్ర స్వరబద్ధం చేస్తే మహాగాయని నూర్జహాన్‌ మహార్థ్రంగా గానం చేశారు. 
* * * * *
ముఝ్‌సే పహలీ- సీ ముహబ్బత్‌, మేరే మహబూబ్‌ న మాంగ్‌ /ముఝ్‌సే/ 
మైనే సమ్‌ఝా థా కె, తూ హై తో దరఖ్‌షాఁ హై హయాత్‌ 
తేరా గమ్‌ హై తో గమ్‌-ఎ-దహర్‌ కా ఝగ్‌డా క్యా హై 
(ఒకప్పుటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నా నుంచి ఆశించకు 
నీవుంటే బతుకుంతా కాంతులీనుతుందనే అనిపించింది నాకు... కానీ, 
నీ బాధల్లో ఇక్కడ నేనుండిపోతే... ప్రపంచ బాధల పైన ప్రతిఘటన ఎక్కడ?) 
తాను ప్రేమించిన వ్యక్తే తన లోకంగా అనుకుంటున్నంత కాలం,, అసలు సిసలైన లోకమొకటి అవతల ఉందన్న సంగతే గుర్తుకు రాదు. తనకు, తన ప్రేమమూర్తికి ఆవల ఏం జరిగినా తనకు సంబంధమే లేదనిపిస్తుంది. ఆ ఒక్క వ్యక్తి తనతో ఉంటే జీవితం కోటి సూర్య ప్రభలతో వెలిగిపోతుందనిపిస్తుంది. తన ప్రేమమూర్తే తన నేలగా ఆకాశంగా అనిపిస్తుంది. కానీ, తరంగానికేసి చూస్తూ అదే సముద్రమని ఎంతకాలం మనల్ని మనం మభ్యపెట్టుకోగలం? లోకంలో జరుగుతున్న అనేకానేక మానవ పోరాటాల్లో ఏ ఒక్కదానితోనూ సంబంధం లేకుండా ఎన్నాళ్లని ముడుచుకు పడిఉంటాం? అలా ఉండిపోదామనే అనుకున్నా, ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక చోట ఎవరి ఆర్తనాదమో మన చెవుల్లో గింగురుమంటుంది?. ఎవరి అశ్రుధారో అగ్నిధారలా మన గుండెల్ని కాల్చివేస్తుంది. అంతటితో అన్నేళ్లూ మనల్ని కట్టిపడేసిన సంకెళ్లన్నీ పటాలున తెగిపోతాయి. హఠాత్తుగా మనం మానవ సముద్రంలో కలసిపోతాం. అప్పటిదాకా దోసిట్లో పెట్టుకున్న తరంగాన్ని సముద్రంలోకి వదిలేసి మనమూ ఆ సముద్రంలోకి దూకేస్తాం. సముద్రమంతా వ్యాపిస్తాం. నువ్వు నాకోసం, నేను నీ కోసం అనే ధోరణిపోయి మనమున్నది లోకం కోసం.... కోటానుకోట్ల జనావళిని శోక విముక్తి చేయడానికి సాగుతున్న పోరాటాల్లో మనమూ భాగమవుతాం. ఆ స్థితిలో మనల్ని కట్టిపడవేసే బంధాలకు వీడ్కోలు చెబుతాం.
తే రీ సూరత్‌ సే హై ఆలమ్‌ మేఁ బహారోఁ కో సబాత్‌ 

తేరీ ఆంఖో కే సివా దునియా మేఁ రఖా క్యా హై -2 
తూ జో మిల్‌ జాయే తో తక్‌దీర్‌ నిగూఁ హో జాయే 
యూఁ న థా మైఁ నే ఫకత్‌ చాహా థా యూఁ హో జాయే 
ఔర్‌ భీ దుఖ్‌ హైఁ జమానే మే ముహబ్బత్‌ కే సివా రాహ్‌తేఁ ఔర్‌ భీ హైఁ వసల్‌ కే రాహత్‌ కే సివా 
హాఁ.... ముఝ్‌ సే పహలీ- సీ ముహబ్బత్‌, మేరే మహబూబ్‌ న మాంగ్‌ / ముఝ్‌సే /
(నీ మోవితోనే లోకంలో వసంతం వెల్లివిరుస్తోంది 
నీ కళ్లు కాక లోకంలో ఇంకేముంది? నువ్వే లభిస్తే అదృష్టమే వచ్చి నా పాదాక్రాంతమవుతుంది 
అలా అని కఛ్చితంగా ఇలాగే జరగాలని కూడా నేనేమీ అనుకోలేదు 
ఎందుకంటే పపంచంలో ప్రేమ ఒక్కటే కాదు, ఎన్నో దుఃఖాలున్నాయి 
ప్రేమికుల కలయికే కాదు ఇంకా సంతోషాలెన్నో ఉన్నాయి 
అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా నువ్వింక నా నుంచి ఆశించకు) 
లోకపు అన్ని వైపుల్నించీ ఈటెలే దిగుతున్న సమయంలో ఎవరికైనా తన ప్రేమమూర్తిని మించిన వారెవరుంటారు? అందుకే జీవచైతన్యాన్ని ప్రదీపింప చేసే ఆ మూర్తిమత్వం ఒడిలో వాలిపోవాలనిపిస్తుంది. ఆ ముఖబింబం వెదజల్లే ఆ దివ్యకాంతుల్లో ఓలలాడాలనిపిస్తుంది. కోటి చంద్రబింబాలను ప్రతిబింబింప చేసే ఆ కళ్లను, జీవితాంతపు భరోసానిచ్చే ఆ కళ్ల కాంతి కిరణాలను మించి ఎవరికైనా ఈ లోకంలో ఇంకేముంటుంది? అందునా ఆ ప్రేమమూర్తి పరిచయాలకే పరిమితం కాకుండా, ఏకంగా జీవిత భాగస్వామిగా నిలబడితే ఇంకేముంది? అదృష్టదేవతే వచ్చి తన లోగిలిలో నిలిచినట్లనిపిస్తుంది. అయితే, లోకంలో హోరెత్తే కోటానుకోట్ల శోశధ్వనులు ఒకసారి గుండెల్ని తాకాక అప్పటిదాకా మనం మునిగి తేలుతున్నన ప్రేమలోకం మపకబారిపోతుంది. అంతా మాయలా అనిపిస్తుంది. అంతటితో ఆ హృదయం, తన వ్యక్తిగత ప్రేమనుంచి తన ఆత్మాశ్రయ జీవితం నుంచి బయటికొచ్చి జనంలో కలిసిపోతుంది. జనమే మనమని కోటి ఝంకారాలతో జనజీవన గాధల్ని ఎలుగెత్తి చాటుతుంది. విషాదాల్ని, ప్రమోదాలుగా మార్చే తన వంతు ప్రయత్నం చేస్తుంది.
అన్‌గినత్‌ సదియోఁ కే తారీక్‌ బహీమాన తలిస్మ్‌ 
రేషమ్‌- వో -అట్లస్‌-వో- కంఖ్వాబ్‌ మేఁ బున్వాయే హుయే 
జాబజా బిక్తే హువే కూచా-వో-బాజార్‌ మేఁ జిస్మ్‌ 
ఖాక్‌ మేఁ లిథ్‌డే హువే, ఖూన్‌ మేఁ నహ్లాయే హువే 
జిస్మ్‌ నిక్‌లే హువే అమరాజ్‌ కే తన్నూరోఁ సే 
పీప్‌ బహతీ హుయీ గ ల్తే హువే నాసూరోఁ సే 
లౌట్‌ జాతీ హై ఉధర్‌ కోభి నజర్‌, క్యా కీజే 
అజ్‌ భీ దిల్‌కష్‌ హై తేరా హుస్న్‌ మగర్‌ క్యా కీజే -2 
ఔర్‌ భీ దుఖ్‌ హైఁ జమానే మే ముహబ్బత్‌ కే సివా 
రాహతేఁ ఔర్‌ భీ హైఁ, వస్ల్‌ కీ రాహత్‌ కే సివా 
ముఝ్‌ సే పహలీ- సీ ముహబ్బత్‌ మేరే మహబూబ్‌ న మాంగ్‌ / ముఝ్‌సే/ 
(ఎన్నో యుగాలుగా విస్తరిస్తున్న చీకటి కాలం 
సిల్కు, శాటీన్‌, బంగారు దారాలతో అల్లుకుంటోంది 
వీధివీధినా దేహాలు అమ్ముడుబోతున్నాయి 
దుమ్ము కమ్ముకుని రక్తమోడుతున్న దేహాల 
మానని గాయాలు రసిగారుతున్నాయి. 
నా దృష్టి అటే పోతోంది. మరి .. నే నేం చేయాలి? 
నీ సౌందర్యం ఇప్పటికీ మనోహరమే గానీ, నేనేం ఏంచేయాలి? 
ప్రపంచంలో ప్రేమే కాదు ఇంకా దుఃఖాలున్నాయి. 
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి 

అందుకే ఒకప్పటి ఆ ప్రేమను ప్రియా! నువ్వింక నానుంచి ఆశించకు)
‘‘మనిషి తన జీవితంలో ఏది కోల్పోయినా ఫరవాలేదు కానీ తనను తాను కోల్పోకూడదు’’ అంటూ ఉంటారు. తనను తాను కోల్పోవడం అటే తన జీవితం నుంచి తాను వైదొలగిపోవడమే కదా!. దేహాలు అమ్ముడు పోవడం అంటే నీ శ్రమ ఫలితం నీకు దక్కకపోవడం. నీకు నువ్వు కాకుండాపోవడం. అలా నిన్ను నిన్ను కాకుండా చేసే శక్తులు అనాదిగా ఈ లోకంలో తిరుగాడుతున్నాయి. ఏదో నిన్నూ నన్నూ మాత్రమే అని కాదు కోటానుకోట్ల మందిని అవి నిర్జీవం చేస్తున్నాయి. కాకపోతే అవి ఎంతో తెలివిగా ఇతరులెవరూ తమ అసలు రూపాన్ని గుర్తించకుండా బంగారు దారాలతో, పీతాంబరాలతో తమను తాము చుట్టేసుకుంటున్నాయి. ఆ ముసుగులో ఉంటూ జీవితాల మీద దాడులు చేస్తున్నాయి. హృదయాల్నీ తీవ్రంగా గాయం చేస్తున్నాయి. ఆ దాడుల పాల్పడిన దేహాలు నేలమీద పడి దొర్లుతున్నాయి. గాయపడిన హృదయాలు రక్తలోడుతున్నాయి. లోకంలో ఇన్ని ఘోరాలు జరిగిపోతుంటే హృదయం ఉన్న ఏ మనిషైనా తన ప్రేమలోకంలో ఎలా ఉండిపోతారు? తాను ప్రేమించిన వ్యక్తి ఎంతటి సౌందర్యమూర్తి అయినా తన దృష్టి ఆ వైపు పోనే పోదు. మనసున్న ఏ మనిషైనా సాటి మనిషుల బాధల్ని చూస్తాడు. సామాజిక రుగ్మతల మూలాల్ని వెతుకుతాడు. వాటినుంచి విముక్తి కలిగించే తన వంతు ప్రయత్నం చేస్తాడు. లలాంటి వారినే లోకం మనిషి అంటుంది. మనీషి అంటుంది. ఇంకా ఇంకా విస్తరిస్తే రాజర్షి అంటుంది... మహర్షి అంటుంది.. 

 ... బమ్మెర

Friday, August 12, 2016

జబ్‌ జీరో దియా మేరే భారత్‌ నే - jab zeero diya mere Bharth ne - Mahendra kapoor song Poorab our paschim old movie

దేశాల్ని కాదు,
హృదయాల్ని గెలుస్తాం...!


విజ్ఞాన, గ ణిత, సాంకేతిక రంగాల్లో విదేశాలదే పై చేయని చాలా మంది అనుకుంటారు గానీ, గణాంకాలకు మూలమైన సున్నాను, దశాంశాన్ని కనిపెట్టింది భారతీయుడైన ఆర్యభట్ట కదా మరి ! అలా విజ్ఞాన రంగాల్లోనే కాదు సంస్కృతి, మానవ సంబంధ వికాసంలోనూ అనాదిగా, భారతదేశమే శిఖర స్థానంలో ఉంటూ వస్తోంది. అమెరికా వెళ్లిన భారతీయ యువకుడు భారతీయ జీవన విశిష్టతలను, ఇక్కడి మానవ విలువల ఉత్కృష్టతను ఈ పాట ద్వారా అక్కడి వాళ్లకు వివరిస్తాడు. ‘పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’ సినిమా కోసం ఇందీవర్‌ రాసిన ఈ గీతానికి కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ సంగీతం సమకూరిస్తే, భారతీయుల గుండెలు సగర్వంతో పులకించిపోయేలా మహేంద్రకపూర్‌ పాడాడు.
* * * * * 
జబ్‌ జీరో దియా మేరే భారత్‌ నే, దునియా కో తబ్‌ గిన్‌తీ ఆయీ 
జీరో కీ భాషా భారత్‌ నే, దునియా కో పహెలే సిఖ్‌లాయీ 
దేతా న దశ్‌మలవ్‌ భారత్‌ తో యూఁ చాంద్‌ పే జానా ముష్కిల్‌ థా 
ధర్‌తీ ఔర్‌ చాంద్‌ కీ దూరీ కా, అందాజా లగానా ముష్కిల్‌ థా 
( నా భారతావని సున్నాను కనుగొన్నాకే ప్రపంచానికి లెక్కించడం తెలిసింది 
సున్నా భాషను ఈ దేశమే లోకానికి తొట్టతొలుత నేర్పించింది 
భారతదేశం దశాంశ జ్ఞానమే ఇవ్వకపోతే చంద్రుని మీదికి వెళ్లడం క ష్టమయ్యేది 
భూమి, చంద్రుల మధ్య దూరాన్ని అంచనా వేయడం కష్టమయ్యేది) 
సభ్యతా జహాఁ పహెలే ఆయీ, జన్మీ జహాఁ పహెలే కలా 
మేరా భారత్‌ వో భారత్‌ హై, జిస్‌కే పీఛే సంసార్‌ చలా 
సంసార్‌ చలా ఔర్‌ ఆగే బఢా, ఆగే బఢా ఔర్‌ బఢ్‌తా హీ గయా 
భగ్‌వాన్‌ కరే యే ఔర్‌ బఢే, బఢ్‌తా హీ రహే ఔర్‌ ఫూలే ఫలే 
(ఎక్కడ సభ్యత ముందుగా వచ్చిందో, కళాత్మకత ఎక్కడ తొలుత జనించిందో 
ఆ నా భరతభూమి వెనుక యావత్‌ ప్రపంచమే నడిచింది. అడుగు ముందుకు వేస్తూ ఇంకా ఎంతో పురోగమించింది. దైవం ఇలా ఇంకా ముందుకు తీసుకుపోనీ, వృద్ధికి తేనీ, మరెంతో వికసింపచేయనీ)
హై ప్రీత్‌ జహాఁ కీ రీత్‌ సదా, మై గీత్‌ వహాఁ కే గాతా హూఁ 
భారత్‌ కా రహెనే వాలా హూఁ, భారత్‌ కీ బాత్‌ సునాతా హూఁ 
( ఎక్కడైతే ప్రేమ ఎప్పుడూ ఒక రీతిగా ఉందో, అక్కడి గీతాన్ని నేను గానం 
చే స్తాను, భారత వాసిని నేను, భారతీయ విషయాల్ని వినిపిస్తాను) 
కాలే గోరే కా భేద్‌ నహీఁ హర్‌ దిల్‌ సే హమారా నాతా హై 
కుఛ్‌ ఔర్‌ న ఆతా హో హమ్‌ కో, హమే ప్యార్‌ నిభానా ఆతా హై 
జిసే మాన్‌ చుకీ సారీ దునియా, మై బాత్‌ వహీ దోహ్‌రాతా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(నలుపు తెలుపు భేద భావం లేదు, ప్రతి హృదయంతోనూ మా అనుబంధం ఉంది. మాకు మరేదో రాకపోయినా, ప్రేమను నిలబెట్టుకోవడం మాత్రం బాగా తెలుసు. దేన్ని లోకమంతా ఒప్పుకుందో, ఆ మాటే నేను మళ్లీ చెబుతాను) 
భారతీయులు అమితంగా ఆరాధించే శ్రీరాముడు, శ్రీకృష్ణుల శరీర వర్ణం నలుపు రంగే. ఇలాంటి వారికి నలుపు తక్కువ తెలుపు ఎక్కువ అనే వర్ణభేదం ఎలా ఉంటుంది? భారతీయులకు ప్రేమను పంచడం, ప్రేమల్ని సమున్నతంగా నిలబెట్డడమే పరమ లక్ష్యంగా ఉంటుంది. ఇది వాస్తవమని ఏవో ఒకటి రెండు దేశాలు కాదు, మొత్తం ప్రపంచమే ఆమోదించింది. నిజానికి, లోకానికి ఆ మార్గాన్ని ఆ గమనంలోని రహస్యాల్ని తెలియజెప్పడమే ధర్మంగా భారతదేశం సాగిపోతోంది. .
జీతే హో కిసీ నే దేశ్‌ తో క్యా, హమ్‌నే తో దిలోంకో జీతా హై 
జహాఁ రామ్‌ అభీ తక్‌ హై నర్‌ మే, నారీ మే అభీ తక్‌ సీతా హై 
ఇత్‌నే పావన్‌ హై లోగ్‌ యహాఁ మై నిత్‌ నిత్‌ శీశ్‌ ఝుక్‌తా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(ఎవరైనా దేశాల్ని గెలిచారేమో గానీ, మేమైతే హృదయాల్ని గెలిచేశాం 
ఇక్కడి ప్రతి పురుషుడిలోనూ రాముడున్నాడు, ప్రతి స్త్రీ లోనూ సీత ఉంది 
ప్రజలెంత పవిత్రంగానో ఉన్నారో ఇక్కడ.. వారి ముందు అనునిత్యం శిరస్సు వంచుతాను. ) 
యుద్ధాలు చేసి, ఎవరైనా దేశాలు గెలుచుకోవచ్చేమో గానీ, ఏ యుధ్ధాలు చేసి హృదయాల్ని గెలుస్తారు? ప్రేమ బావుటా ఎగరేయాలి గానీ, రక్తపాతంతో ఎవరైనా గుండెలకు చేరువ కాగలరా? భౌతిక సంపద మీద వ్యామోహం పోతే గానీ, ప్రేమ సంపదను సమకూర్చుకోలేరు. అందుకే ప్రేమ రాజ్యాల్ని గెలవడం ద్వారా భారతీయులు రారాజులయ్యారు. పరిణామ క్రమంలో చోటు చేసుకునే ఉత్తాన పతనాలు ఎలాగూ ఉంటాయి కానీ అనాదిగా వస్తున్న మానవీయ విలువలు ఇతరుల కన్నా మిన్నగా ఈ దేశంలో కొనసాగుతున్నాయి. వాటి ముందు ఎవరైనా సవినయంగా తలవంచాల్సిందే....
ఇత్‌నీ మమ్‌తా నదియా కో భీ, జహాఁ మాతా కహెకే బులాతే హైఁ 
ఇత్‌నా ఆదర్‌ ఇన్సాన్‌ తో క్యా పత్తర్‌ భీ పూజే జాతే హైఁ 
ఇస్‌ ధర్‌తీ పే మైనే జనమ్‌ లియా, యే సోచ్‌ కే మై ఇత్‌రాతా హూఁ / భారత్‌ కా రహెనే/ 
(నదులంటే ఎంత మమకారమో ఇక్కడ ప్రతి నదినీ తల్లీ అని పిలుస్తారు 
మనుషులకు ఎనలేని ఆదరణే కాదు, ఇక్కడ రాళ్లుకూడా పూజింపబడతాయి 
ఈ నేల మీద జన్మించాను కదా అన్న భావనతో నేనెంతో గర్వపడతాను) 
ప్రతి అణువునా భారతీయులు ఒక దివ్యత్వాన్ని చూస్తారు. దైవంగా ఆరాధిస్తారు. అందుకే ప్రవాహాల్ని ఏదో నదిలే అనుకోరు. ప్రతి నదినీ ఇక్కడ ఒక దేవతగా ఆరాధిస్తారు. ఇదేమిటి మీ దేశంలో రాళ్లను పూజిస్తారు? అంటే మనుషుల్నే కాదు అంతే సమానంగా రాళ్లనూ పూజిస్తామని ఎదురు సమాధానం చెబుతారు. నిజానికి, ఏ పంచభూతాత్మక శక్తి ప్రాణికోటినంతా ఆవరించి ఉందో, ఆ శక్తే సమస్త నిశ్చల ప్రకృతిలోనూ ఉంది కదా! అందుకే చరాచర జగత్తునంతటినీ సమదృష్టితో చూసే సమున్నత సంస్కృతి ఈ దేశీయులకు అబ్బింది. ఏముందిలే అనుకునే వారికి ఏమీ ఉండదు కానీ, అర్థం చేసుకునే వారికి ఈ సంస్కృతి ఆకాశమంత ఎత్తున కనిపిస్తుంది. 

Monday, August 8, 2016

ఏ మేరే వతన్‌ కే లోగోఁ .....! - ye Mere watan ki logo

అమర వీరుల్ని... మరిచిపోకండి...!  
 

1963లో భారత చైనా యుద్ధం ముగిసిన తరువాత, అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే ఒక కార్యక్రమం, ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగింది. ఆ కార్యక్రమానికి అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ హాజరయ్యారు. అమర వీరుల స్మృత్యర్థం ప్రముఖ కవి, ప్రదీప్‌ రాసిన ‘ఏ మేరే వతన్‌ కే లోగోఁ గీతాన్ని సి. రామచంద్ర స్వరపరిస్తే, లతా మంగేష్కర్‌ ఆ వేదిక మీద ఎంతో రసార్థ్రంగా పాడారు. ఆ గీతం విని భావోద్వేగానికి లోనైన నెహ్రూ వేదిక మీదే కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రైవేట్‌ గీతాన్ని ఐదు దశాబ్దాలుగా వింటూనే ఉన్నా, విన్న ప్రతిసారీ దేశ ప్రజల హృదయాలు గగుర్పాటుకు లోనవుతూనే ఉన్నాయి. అమర వీరుల త్యాగాల్ని తలుచుకుని భారతీయుల గుండెలు తీవ్రమైన ఉద్విగ్నతతో ఊగిపోతూనే ఉన్నాయి..... 


ఏ మేరే వతన్‌ కే లోగోఁ .....! తుమ్‌ ఖూబ్‌ లగాలో నారా 
యే శుభ్‌దిన్‌ హై హమ్‌ సబ్‌కా, లహెరాలో తిరంగా ప్యారా 
పర్‌ మత్‌ భూలో సీమా పర్‌, వీరో నే హై ప్రాణ్‌ గవాయే 
కుఛ్‌ యాద్‌ ఉన్హే భీ కర్‌లో, జో లౌట్‌ కే ఘర్‌ నా ఆయే 

(ఓ నా దేశ ప్రజలారా! మీరు ఎలుగెత్తి నినాదాలు చేయండి 
మనందరికీ ఇదో శుభదినం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి 
కానీ, సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల్ని ఎప్పుడూ మరిచిపోకండి 
ఎన్నడూ ఇంటికి తిరిగి రాకుండా పోయిన ఆ వీరుల్ని జ్ఞాపకం చేసుకోండి) 
పల్లవి:
ఏ మేరే వతన్‌ కే లోగోఁ జరా ఆంఖ్‌ మే భర్‌లో పానీ 
జో శహీద్‌ హుయేఁ హైఁ ఉన్‌ కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
తుమ్‌ భూల్‌ న జావో ఉన్‌ కో, ఇస్‌ లియే సునో యే కహానీ 
జో శహీద్‌ హుయే హై ఉన్‌కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(ఓ నా దేశ ప్రజలారా..! కళ్లల్లో కాసిన్ని అశ్రువుల్ని నింపుకోండి 
అమరులైన వారి ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి 
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథ వినండి ) 
జబ్‌ ఘాయల్‌ హువా హిమాలయ్‌, ఖత్‌రే మే పడీ ఆజాదీ 
జబ్‌ తక్‌ థీ సాఁస్‌ లడే వో, ఫిర్‌ అప్‌నీ లాశ్‌ బిఛా దీ 
సంగీన్‌ పే భర్‌ కర్‌ మాథా, సోగయే అమర్‌ బలిదానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌ కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 

/అమరులైన/ 
(హిమాలయాలు గాయమైనప్పుడు, స్వాతంత్య్రం ప్రమాదంలో పడినప్పుడు 
ఊపిరి ఉన్నంతవరకు పోరాడి, చివరికి తమ శవాల్ని పరిచేశారు 
తుపాకీ అంచు మీద నుదురు ఆనించి, అమర వీరులు శాశ్వతంగా నిదురోయారు) /అమరులైన/ 
జబ్‌ దేశ్‌ మే థీ దీవాలీ, వో ఖేల్‌ రహే థే హోలీ 
జబ్‌ హమ్‌ బైఠే తే ఘరోఁ మే, వో ఝేల్‌ రహే థే గోలీ 
థే ధన్య్‌ జవాన్‌ వో అప్‌నీ, థీ ధన్య్‌ వో ఉన్‌కీ జవానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌ఖీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(దేశంలో దీపావళి జరగుతున్న వేళ, జనమంతా హోళీ ఆడుతున్నప్పుడు 
మనమంతా ఇళ్లల్లో కూర్చున్నప్పుడు, వాళ్లు తూటాలకు ఎదురొడ్డుతూ ఉండిపోయారు 
ఎంతటి ధన్యులో ఆ సైనికులు, వారి యువశక్తి ఎంత సార్దకమైనదో) /అమరులైన/ 
కోయీ సిక్‌, కోయి జాట్‌, మరాఠా.... కోయీ గుర్కా, కోయీ మద్‌రాసీ 
సర్‌హద్‌ పర్‌ మర్‌నే వాలా.... హర్‌ వీర్‌ థా భారత్‌ వాసీ 
జో ఖూన్‌ గిరా పర్వత్‌ పర్‌, వో ఖూన్‌ థా హిందుస్తానీ 
జో శహీద్‌ హుయే ఉన్‌కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
(ఒకరు సిక్కు, ఒకరు జాట్‌, ఒకరు మరాటీ ఒకరు గూర్ఖా, ఒక మదరాసీ 
ఎవరైతేనేమిటి? సరిహద్దులో మరణించే ప్రతి వీరుడూ భారత వాసి 
పర్వతాల మీద పడిన రక్తం ఎవరిదైతేనేమిటి? ఆ రక్తం హిందుస్తానీది) 
/అమరులైన /- 
థీ ఖూన్‌ సే లథ్‌పథ్‌ కాయా, ఫిర్‌ భీ బందూక్‌ ఉఠాకే 
దస్‌ దస్‌ కో ఏక్‌ ఏనే మారా, ఫిర్‌ గిర్‌ గయే హోశ్‌ గవా కే 
జబ్‌ అంత్‌ సమయ్‌ ఆయా తో, కహ్‌గయే కె అబ్‌ మర్‌తే హై 
ఖుశ్‌ రహ్‌నా దేశ్‌ కే ప్యారో, అబ్‌ హమ్‌ తో సఫర్‌ కర్‌తే హైఁ 
(రక్తంలో దొర్లుతూనే ఉన్నారు, అయినా తుపాకీ లేవనెత్తి 
ఒక్కొక్కరు పది-పది మందిని అంతమొందించి, చివరికి స్పృహ తప్పి నేలవాలిపోయారు 
అంతిమ ఘడియలు వచ్చేశాక, తమ మరణాన్ని గురించి చె బుతూ 
సంతోషంగా ఉండండి ఓ నా దేశపు బిడ్డలారా! ఇక మేము వెళ్లిపోతున్నామంటూ సాగిపోయారు.)/ అమరులైన/ 
క్యా లోగ్‌ థే వో దీవానే... క్యా లోగ్‌ థే వో అభిమానీ 
జో శహీద్‌ హుయే హై ఉన్‌ కీ జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
తుమ్‌ భూల్‌ న జావో ఉన్‌కో, ఇస్‌ లియే యే హై కహానీ 
జో శహీద్‌ హుయే హైఁ ఉన్‌కీ, జరా యాద్‌ కరో ఖుర్‌బానీ 
జయ హింద్‌....జయ హింద్‌, జయ హింద్‌ కీ సేనా- 2 
జయ హింద్‌... జయహింద్‌... జయ్‌ హింద్‌... జయ హింద్‌... జయహింద్‌ 
(ఏమిటా పిచ్చి వారికి! ఎంతటి దేశ ప్రేమికులు వారు! 
అమరవీరుల ఆ ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోండి 
మీరు మరిచిపోకుండా ఉండేందుకు ఈ కథంతా వినండి /అమరులైన/ 

స్వాతంత్య్రం రాగానే సరిపోదు కదా! ఈ స్వతంత్ర దేశాన్ని కుటిలత్వంతో కుయుక్తులతో కూలదోయాలని చూసే శత్రుదేశాల నుంచి దాన్ని అనుక్షణం కాపాడుకోవడమూ అంతే ముఖ్యం కదా! అలా కాపాడుతున్నది అన్నింటికీ సిద్ధపడి, రేయింబవళ్లు సరిహద్దుల్లో గస్తీ కాసే సైనిక వీరులే! ఆ గస్తీలోనూ ఇప్పటికీ ఎన్నెన్నో ప్రాణాలు అహుతి అవుతూనే ఉన్నాయి. అనంతంగా సాగిపోతున్న అమర వీరుల ప్రాణత్యాగాలను అనుక్షణం గుర్తు చేసుకోవడం తప్ప వారి ఆత్మలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఆ అమరవీరులను అనునిత్యం గుర్తుచేయడం ద్వారా ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా ఒక అద్భుతమైన భూమిక నిర్వహిస్తోంది. ఆనాటి అమర వీరుల శ్రద్దాంజలి సభలో మాట్లాడుతూ నెహ్రూ ‘ఈ పాట విని స్పూర్తి పొందని వాడు అసలు భారతీయుడే కాదు’ అన్నారు. దేశ రక్షణలో మనమూ ఒక భాగం కావడానికి కంకణబద్ధులమవడం తప్ప భారతీయుడిగా మన ముందుండే మరో కర్తవ్యం ఏముంది!
                                                                                                                                                 ... బమ్మెర

Sunday, July 31, 2016

జానెవాలో జరా, ముడ్‌ కే దేఖో ముఝే - Jaanevalo zara mudke deko mujhe -


నేనూ మీలాంటి మనిషినే........!


మన పక్కనుంచి వెళుతున్నవాడు కూడా మనిషే, మన వాడే, మనలో భాగమే అనుకునే పరిస్థితిలో అన్నిసార్లూ మనం ఉండం. ఎందుకంటే పక్కవాడు మనలా లేడు. మనలా ఆలోచించడం లేదు. మనలా మాట్లాడటం లేదు. మనలా జీవించడం లేదు. అందుకే మనమూ, వాడూ వేరువేరనుకుంటాం. అందుకే ఎవరి బతుకులు వారి బతుకుతూ ఎవరి దారిన వారు వెళ్లిపోవడమే మేలనుకుంటాం. అందుకే అందరి మధ్య ఉంటూనే చాలాసార్లు ఒంటరి భావనతో ఉండిపోతాం. అన్నీ సానుకూలంగానే ఉన్నప్పుడు ఎవరినుంచి విడిపోయినా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, ఏ సమస్యో వచ్చినప్పుడు, ఏ సంక్షోభంలోనో పడిపోయినప్పుడు కనీసం ఒక్క మనిషైనా తోడుగా లేడే అని దిక్కులు పిక్కటిల్లేలా పిలుస్తాం. కానీ, అందరినుంచీ ఎప్పుడో విడిపోయిన మన గొంతును ఇప్పుడు ఎవరు వింటారు? ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుటివారి పిలుపునకు బదులిస్తేనే కదా!, మన పిలుపునకు ఎదుటి వారు బదులిస్తారు!. ‘ దోస్తీ’ సినిమా కోసం ఆనంద్‌ బక్షీ రాసిన ఈ పాట ఈ సందేశమే వినిపిస్తుంది. లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ బాణీలో ఒదిగిపోయిన రఫీ గొంతు సైతం ఎంతో ఉద్వేగంతో ఆ సందేశాన్ని లోకమంతా వెదజల్లుతుంది. 
* * * * * 

జానెవాలో జరా, ముడ్‌ కే దేఖో ముఝే 
ఏక్‌ ఇన్‌సాన్‌ హూఁ, మై తుమ్హారీ తర్హా 
జిస్‌నే సబ్‌ కో రచా, అప్‌నే హీ రూప్‌ సే 
ఉస్‌ కీ పహెచాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా / జానే వాలో/ 
(ఓ బాటసారులారా! కాస్త వెనుతిరిగి నన్ను చూడండి 
మీకు మల్లే నేనూ ఓ మనిషినే 
ఎవరు తన రూపంతో మనందరినీ సృష్టించాడో 
మీకు మల్లే నేనూ ఆయన గుర్తునే) 
నీ మనసే నీ ప్రపంచమైనప్పుడు, నీ జీవిత మే నీ సమస్తమైనప్పుడు నీ ఆవల ఏం జరుగుతున్నా నీకేమీ పట్టదు. అవతల ఎందరో అరుస్తుంటారు, ఆక్రోశిస్తుంటారు అయినా అవేవీ నీ మనసుకు ఎక్కవు. ఎందుకంటే నీ జీవితమే నీకు గానీ అవతలి వారి జీవితంతో నీకేం పని? వాళ్లేమైపోతే నీకేమిటి బాధ? ఎవరైనా బాహ్య ప్రపంచం నుంచి విడిపోతే, మానవాళి అంతా మటుమాయమైపోతే, తానొక్కడే మనిషి ఈ లోకపు సృష్టి తానొక్కడే. తన చుట్టూ ఉన్నవేవీ ఏమీ కావు. తన చుట్టూ ఉన్నవారెవరూ మనుషులూ కాదు మానులూ కాదు. పైగా ఈ సృష్టి గానీ,
సృష్ట్టికర్తగానీ నీకు మాత్రమే ప్రాణం పోసినట్టు, ఈ సృష్టినంతా నీకే దారాధత్తం చేసినట్లు భ్రమిస్తావు. వాస్తవానికి, ఏ పంచభూతాత్మక శక్తి నిన్ను సృష్టించిందో, సమస్త చరాచర జగ త్తునంతా ఆ శక్తే కదా సృష్టించింది. అలాంటప్పుడు నువ్వొక్కడివే మనిషైనట్లు మిగతా ఎవరూ ఏమీ కానట్లు ఉండిపోతావెందుకని? పక్కవాడు గుండెలు బాదుకుంటున్నా, పట్టనట్లే వెళ్లిపోతావెందుకని?
ఇస్‌ అనోఖే జగత్‌ కీ మై తక్‌ధీర్‌ హూఁ 
మై విధాతా కే హాథో కీ తస్‌వీర్‌ హూఁ 
ఇస్‌ జహాఁ కే లియే, ధర్‌తీ మా కే లియే 
శివ్‌ కా వర్‌దాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా / జానేవాలో/ 
(ఈ సుందర లోకపు జాతకాన్ని నేను 
సృష్టికర్త చేతుల్లోని చిత్రపటాన్ని నేను 
ఈ లోకం కోసం, ఈ భూమాత కోసం ఏతెంచిన 
మీలాగే శివుని వరప్రసాదాన్ని నేను) 
తన అస్తిత్వం, గురించి తానే చెప్పుకోవాల్సి రావడానికి మించిన దురదృష్టం మానవ జీవితంలో మరేముంటుంది. కానీ, ఎదుటి వాళ్లు తన ఉనికిని అసలే పరిగణనలోకి తీసుకోనప్పుడు తనను తానే పరిచయం చేసుకోక తప్పదుగా! లేదంటే తనకింక మనుగడే ఉండదు మరి! నిజానికి సృష్టికి ప్రతిసృష్టి చేచగలిగే మానవుడు ఈ సుందర జగత్తు పాలిటి సౌభాగ్యమూర్తే నువ్వే కాదు సమస్తమానవులూ సౌభాగ్యమూర్తులే. సృష్టికర్త చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్ర కళాకండాలే. భూతలం కోసమే కావచ్చు. సమస్త జగత్తు కోసమైనా కావచ్చు. నీలాగే నాలాగే ప్రతి మనిషీ ఈ లోకానికి శివప్రసాదంగా సిద్ధించినవారే. అందువల్ల నీవొక్కడివే ఈ లోకానికి ఏదైనా చేయగలుగుతావన్నట్లు, మిగతా ఎవరివల్లా ఏమీ కాదన్నట్లు వ్యవహరిస్తే ఏలా? మనుషుల్లో అంతస్తుల వ్యత్యాసాలు ఉండవ చ్చు. హోదాల్లో తేడాలు ఉండవచ్చు. అయితే ఇవన్నీ భౌతిక లోకంలోనే తప్ప, జ్ఞాన లోకంలో ఇవి ఎందుకూ కొరగావు. అందుకే జ్ఞానవంతులు, ఈ తేడాల్ని ఏమాత్రం పట్టించుకోరు. పైగా మనుషులందరినీ సృష్టిలోని దివ్యత్వంలో భాగంగానే చూస్తారు. తన ఆత్మలోనూ భాగంగానే చూస్తారు. అంటే సాటి మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే కన్నీరుమున్నీరవుతారు. అండగా నిలుస్తారు. చేయందిస్తారు. చేయిపట్టుకుని నడిపిస్తారు.
మన్‌ కే అందర్‌ ఛుపాయే మిలన్‌ కీ లగన్‌ 
అప్‌నే సూరజ్‌ సే హూఁ ఏక్‌ బిఛ్‌డీ కిరణ్‌ 
ఫిర్‌ రహా హూఁ భటక్‌తా మై యహాఁ సే వహాఁ 
ఔర్‌ పరేశాన్‌ హూఁ మై తుమ్హారీ త ర్హా / జానేవాలో/ 
(కలుసుండే కాంక్షను మనసులోనే దాచేసుకుని 
సూర్యున్నించి విడిపోయిన కిరణాన్ని నేను 
బాటతప్పి ఇటూ అటూ తిరుగుతున్నాన్నేను 
మీకు మల్లే మహా చింతాక్రాంతుణ్నయ్యాన్నేను) 
చెప్పడానికి వెనకాడతాం గానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరమూ మన ఆశాసౌధాల్లోంచి దూరంగా విసిరేయబడి కటిక చీకట్లో కాలిపోరున వాళ్లమే. జీవనయానంలో కాటు కలిసి అటూఇటూ తిరుగుతున్న వాళ్లమే. ఎవరికెవరమూ తీసిపోని రీతిలో అంతు చిక్కని ఆందోళనలో అందరమూ అల్లకల్లోలమవుతున్న వాళ్లమే. అందువల్ల ఇక్కడ ఎవరినో చూసి ఎవరూ తలవంచుకుని వెళ్లాల్పిన అవసరం లేదు. ఎవరినుంచి ఎవరూ తప్పించుకు తిరగాల్సిన అవసరం లేదు. అందరి జీవితాలూ ఇక్కడ తెరిచిన పుస్తకాలే. పైపైన కనపడే రంగులు వేరు వేరు కావచ్చు గానీ, లోపలున్న అందరి మూలాలూ ఒకటే. కష్టాలకూ కన్నీళ్లకూ ఎవరూ అతీతులు కారు. ఇక్కడ అఖండమైన ఆనందమూర్తులెవరూ లేరు. అయినా బాఽధా తప్త హృదయులు నేరస్తులేమీ కాదు. వాటిని అధిగమించే ఏ ప్రయత్నమూ చేయకపోవడాన్ని నిలదీయవచ్చులే గానీ, బాధల్ని అభివ్యక్తం చేయడాన్నే అడ్డుకోవడం కచ్ఛితంగా నేరమే అవుతుంది.
మేరే పాస్‌ ఆవో ఛోడో యే భరమ్‌ 
జో మేరా దుఃఖ్‌ వహీ హై తుమ్హారా భీ గమ్‌ 
దేఖ్‌తా హూఁ తుమ్హే, జాన్‌తా హూఁ తుమ్హే 
లాఖ్‌ అంజాన్‌ హూఁ మై తుమ్హారీ తర్హా 
(భ్రమలన్నీ వదిలేసి నా చెంతకు వచ్చేయండి 
ఏ దుఃఖం నాలో ఉందో, ఆ దుఃఖం మీలోనూ ఉంది 
మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరేమిటో తెలుసున్నా 
లక్షలాది మందితో మీలాగే నిర్లక్ష్యమైపోయాన్నేను) 
ఎవరికి వారు తామేదో అతీతులమన్న భ్రమలో ఉంటారు. పక్కనున్న ఏ ఒక్కరితోనూ తమకు పోలికే లేదనుకుంటారు. కానీ, కొమ్మలు వేరు వేరుగా కనపడినా, వృక్షపు కాండం ఒక్కటే కదా! మనుషులైనా తమ అంత స్తుల రీత్యా, హోదాల రీత్యా భిన్నంగా కనపడవచ్చేమో గానీ, వారి ఆవేదనలూ, ఆత్మక్షోభలూ, దుఃఖాలక్షౌ ఏమైనా తేడా ఉంటుందా? శరీరాల రంగూ, రూపూ వేరు కావచ్చేమో గానీ, వాటన్నింటి నిద్ర ఒక్కటే. మరణం ఒక్కటే. నిదురోయాక నాకు నేనుండను. నీకు నీవుండవు. ఎవరికీ తన దంటూ ఏదీ ఉండదు. మరణమూ అంతే అది ఎవరికీ సడలింపులూ, మినహాయింపులూ ఇవ్వదు. మళ్లీ వచ్చి ఆగిపోయిన పనుల్ని పూర్తిచేసే అవకాశం ఎవరికీ ఇవ్వదు. ఎవరైనా అంతిమంగా వెళ్లేది శూన్యారణ్యంలోకే. ఇన్నిన్ని సారూప్యాలు ఉన్నప్పుడు. మనుషులింకా దాచిపెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికీ ఏముంది? అయినా, ఒకరినుంచి ఒకరు దూరదూరంగా వెళ్లిపోవాలనుకుంటారు? ఒకరినొకరు ఉపేక్షిస్తూ, లోకంలో అందరికందరూ అనామకులుగా మిగిలిపోతారు. ఎవరికీ ఎవరూ పట్టక నిర్లక్ష్యమైపోతారు. ఈ దౌర్భల్యం నుంచి మనిషి బయటపడేదెన్నడో!! అందరితో కలిసిపోయి అందరిలో వ్యాపించి అనంతంగా జీవించేదెన్నడో!!


....బమ్మెర