Saturday, July 23, 2022

Aapki Nazron Ne Samjha song analysis | Anpadh film | Lata Mangeshkar song |

నువ్వే నా జీవన గమ్యం 

మించడం కన్నా ప్రేమించబడటంలోనో గొప్పతనం ఉంది’ అంటూ ఉంటారు. నిజమే మరి! ప్రేమించడానికి ఏముంది? మనకు ఏ యోగ్యతలూ లేకుండానే ఎవరినైనా ప్రేమించవచ్చు. ప్రేమించబడటానికే ఎన్నోయోగ్యతలు ఉండాలి. అలా ఏమీ లేనప్పుడు ఎవరైనా నిన్ను ఎందుకు ప్రేమిస్తారు? ఎవరైనా నిన్ను ప్రేమించారూ అంటే నీలో ఏవో యోగ్యతలు ఉన్నట్లే మరి! ఓ నవయువకుడు తన ముందు నిలుచుని ‘‘ నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అనగానే ఆనందపరవవశమైన ఓ యువతి భావోద్వేగాల్ని చిత్రించే ఈ పాట ‘అన్‌పఢ్‌’ సినిమాలోనిది. రాజా మెహందీ అలీ ఖాఁ రాసిన యీ గీతానికి స్వర కల్పన చేసిన వారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు మదన్‌ మోహన్‌. ఈ గీతాన్ని గానం చేసిన వారు లతా మంగేష్కర్‌. అయితే సాహిత్యం మారినా ఇదే బాణీ ‘చిన్ననాటి స్నేహితులు’ సినిమాలోని సుశీల పాడిన ‘ఎందుకయ్యా న వ్వుతావూ ఎవరు సుఖపడినారనీ’ అన్న పాటలో వినబడుతుంది. ఈ రెండూ విని ఆస్వాదించండి మరి!


ఆప్‌కీ నజ్‌రోఁ నే సమ్‌ఝా ప్యార్‌ కే ఖాబిల్‌ ముఝే

దిల్‌ కీ యే ధడ్‌కన్‌ ఠహెర్‌ జా మిల్‌గయీ మంజిల్‌ ముఝే

(మీ చూపులు నన్ను మీ ప్రేమకు యోగ్యురాలిగా భావించాయి. ఓ హృదయ ధ్వనీ కాస్త ఆగిపో నాకు నా గమ్యం దొరికిపోయింది.)

తాను ఎంతగానో ప్రేమించే వ్యక్తే తనను ప్రేమించి ఆ మాటను తానే ముందుగా తన ముందు పెడితే ఆ ఆనందానికి అవధులు ఉంటాయా? అతని ప్రేమకు తనను యోగ్యంగా భావించి తన జీవితంలోకి ఆహ్వానించే ప్రేమమూర్తికోసమే ఎదురు చూసే వారికి నిజంగానే అలాంటి వ్యక్తి తారసపడితే ఇంకేం కావాలి? అది వారికి తమ జీవిత గ మ్యం లభించినట్లు

జీవిత గమ్యాలు అనేవి వ్యక్తిగతమే గానీ, సార్వత్రికం కాదు. అందుకే ఎవరి జీవిత గమ్యాల్ని వారే నిర్ణయించుకుంటారు. ఒకరి గమ్యం మరొకరికి గొప్పగా కనిపించకపోవచ్చు గానీ తమ గమ్యం తమకు ప్రపంచంలోకెల్లా గొప్పదిగానే కనిపిస్తుంది. 

జీ హమే మంజూర్‌ హై ఆప్‌కా యే ఫైస్‌లా

కహ రహీ హై హర్‌ నజర్‌ , బందా పర్‌వర్‌ శుక్రియా

హస్‌ కే అప్‌నీ జిందగీ మే కర్‌లియా శామిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

( నన్ను  మీ ప్రేమయోగ్యంగా భావించిన మీ నిర్ణయం నాకు సర్వదా ఆమోదం. ఈ భవదీయురాలి ప్రతిచూపూ హర్షాతిరేకంతో కృతజ్ఞతలు తెలియచేస్తోంది. ఒక నవ్వుతో మీరు మీ జీవన క్షేతంలో నన్నుచేర్చుకున్నారు)

మనం ప్రేమించే వారే ఆ ప్రతిపాదన చేసి నువ్వు ఏమంటావో చెప్పు అన్నట్లు చూస్తే ఏం చెప్పగలం? నాకు ఆమోదమే నని వేరే చెప్పాలా? హర్షాతిరేకంతో ఊగిపోయే మన చూపుల్ని బట్టే వారు అర్థం చేసుకోవాలి. ప్రేమోద్వేగంలో అప్పటిదాకా తనలోతాను ప్రవాహంలా మాట్లాడుకున్న మనసే తీరా ఒక సందర్భంలో ఏమీ మాట్లాడలేని స్థితిలో పడిపోతుంది. ఆ స్థితిని ఆ ప్రేమమూర్తి అర్థం చేసుకోవలసిందే.. మాటల ద్వారా వ్యక్తం కాలేని  భావాలు మౌనంద్వారానే కదా వ్యక్తమవుతాయి!

ఆప్‌కీ మంజిల్‌ హూ మై, మేరీ మంజిల్‌ ఆప్‌ హైఁ

క్యో మై తూఫాఁ సే ఢరూ, మేరే సాహిల్‌ ఆప్‌ హైఁ

కోయీ తూఫానోఁ సే కహెదే మిల్‌గయా సాహిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

(ఇప్పుడిక మీ జీవన గమ్యాన్ని నేను, నా జీవన గమ్యం మీరు, ఇంకా తుఫాన్‌లతో నేనెందుకు భయపడాలి? నా తీరంగా మీరు ఉన్నారుగా! ఈ సమయంలో తుఫాన్‌లతో ఎవరైనా నాకు నా జీవన తీరం లభించిందని చెప్పేస్తే బావుండేది!)

ప్రేమ బాహువుల మధ్య ఒదిగిపోయిన వారికి నిజంగా ఎంతో ధీమా వచ్చేస్తుంది. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అనే మాట నువ్వు నా జీవన తీరానివి అన్నట్లుగా వినబడుతుంది. ఇద్దరికీ ఆ మాట ఒకేసారి, ఒకేలా వినబడుతుంది. అందుకే ‘ నీ జీవన తీరాన్ని నేను. నా జీవన తీరాని నువ్వు ’ అనే మాటల్ని ఇరువురూ ఒక పారవశ్యంతో చెప్పేసుకుంటారు? అంతే కాదు ఇప్పుడు తూఫాన్లు వచ్చినా ఇక తమనేమీ చేయలేవనే ధీమాతో ఉండిపోతారు. 

పడ్‌గయీ దిల్‌ పర్‌ మేరే ఆప్‌కీ పర్‌ఛాయియా 

హర్‌ తరఫ్‌ బజ్‌నే లగీ సైక్‌డో శహనాయియా 

దో జహాఁకీ ఆజ్‌ ఖుశియా హోగయీ హాసిల్‌ ముఝే /దిల్‌ కీ యే/

( నా హృదయం మీద మీ ముద్రలు నిలిచిపోయాయి. అన్ని వైపుల్నించి వందలాది సన్నాయులు మోగుతున్నాయి. రెండు ప్రపంచాల ఆనందాలు ఈరోజు నా ఒడిలో వాలిపోయాయి.)

పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడే కాదు ప్రేమమూర్తి ముద్రలు హృదయంమీద పడిన్నాడే సన్నాయిల మోత మార్మోగుతుంది. ప్రేమించిన తానొక ప్రపంచమైతే, తనను ప్రేమించిన వారు మరో ప్రపంచం. ఆ రెండు ప్రపంచాలు ఒకటైన వేళ రెండు ప్రపంచాల ఆనందాలు ఇరువురికీ సొంతమైపోతాయి! కాకపోతే ఆ రెండు ప్రపంచాలూ ఒక దశలో ఒకే ప్రపంచంగా పెనవేసుకుపోతాయి. రెండు శరీరాలు ఒకే ఆత్మగా మారినట్లు, రెండు ప్రపంచాలు ఒకే అద్భుతలోకంగా అవతరిస్తాయి. అద్వైతం అంటే ఆధ్యాత్మికమనే కాదు. రెండు ప్రేమ హృదయాల ఏకత్వమూ అద్వైతమే.

                                                                                                               --- బమ్మెర 


Thursday, July 14, 2022

Aa Laut Ke Aaja Mere Meet Song | Rani Rupmati (1959) Film | Mukesh Songs |

ఆ లౌట్‌ కే ఆజా మేరే మీత్‌

ప్రణయ భావోద్వేగంలోనూ జీవితసత్యాలను మరవని ప్రేమికులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే ప్రణయ జీవితాన్ని ఆసాంతం అనుభవించగలుగుతారు. అన్నిసార్లూ జీవితం మనం అనుకున్నట్లే ఉండదు. పైగా, చాలా సార్లు అనుకున్నదానికి పూర్తిగా విరుద్ధంగానే జరగవచ్చు. ప్రేమ, ప్రణయాలు ఎంత మధురమైనవైనా కావచ్చు. వాటి పట్ల మనకు ఎంత మక్కువైనా ఉండవచ్చు. జీవితపు ఊయలలో తేలియాడుతున్న సమయంలోనే ఒక్కోసారి అనుకోని విషాదాలు కమ్ముకుంటాయి. రెండు శరీరాలు ఒకే ఆత్మగా సాగిన జీవితాలు హఠాత్తుగా రెండు వేరు వేరు ప్రపంచాలవుతాయి. అనంత జీవన యానంలో ఇవన్నీ  సహజమే.కానీ, చాలాసార్లు హృదయం జీర్ణించుకోదు.  అయితే, ఆవేదనకు గురికావడం వేరు ఆవేదనలో కొట్టుకుపోవడం వేరు. అలా కొట్టుకుపోయే వాళ్లే  కొన్నిసార్లు జీవిత సత్యాల్ని విస్మరించే ప్రమాద ం ఉంది. నిజానికి ఏదీ శాశ్వతం కాని జీవితంలో ప్రణయమూ శాశ్వతం కాదు. అందుకే అద్భుతమైన సంయోగాలు సైతం కొన్నిసార్లు  వియోగాలుగా మిగిలిపోతాయి. ప్రతికూలమైన పరిణామాలు అప్పుడో ఇప్పుడో ఎదురవుతూనే ఉంటాయి. అలాఅని సానుకూలంగా ఉన్న ఆ నాలుగు ఘడియల్లోనైనా ప్రణయాన్ని ఆస్వాదించడంలో వెనుకడుగు వేయకూడదు. జీవితపు ఆవలి తీరాన్ని అవగాహన చేసుకోవలసిందే గానీ, ఆ కారణంగా కుంగిపోకూడదు కదా! సరిగ్గా ఈ జ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న ఓ యువహృదయం పాడుకునే పాటే ఇది. ‘రాణీ రూప్‌మతి’ సినిమాలోని ఈ పాటను భరత్‌ వ్యాస్‌ రాస్తే, ఎస్‌ ఎన్‌ త్రిపాఠీ స్వరపరిచారు. మంచుకంఠం ముకేశ్‌ ఈ పాటను పాడారు.
ఇప్పుడు ఆ ఆపాట మీకోసం....





లౌట్‌ కే ఆ...
లౌట్‌ కే ఆ...
లౌట్‌ కే ఆ...

ఆ లౌట్‌ కే ఆజా మేరే మీత్‌,
తుఝే మేరే గీత్‌ బులాతే హైఁ
మేరా సూనా పడారే సంగీత్‌
తుఝే మేరె గీత్‌ బులాతే హైఁ

(రా...వచ్చేయ్‌ ప్రియతమా..! నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి.
నువు లేక నా స్వరలోకమే మూగబోయింది.  రా.... నా గీతాలు పిలుస్త్తున్నాయి)

తాను ప్రేమించే వ్యక్తి దూరం కావడం అంటే అతని ప్రపంచమే దూరం కావడమే! ఏదో రాగం, ఒక గీతం కాదు తన సంగీత ప్రపంచమే మూగబోవడం. ప్రాణాధికంగా ప్రేమించిన హృదయానికి  తన ప్రేమమూర్తి  కనుమరుగైపోతే తన గొంతే కాదు, తన ప్రపంచం మూగబోవడమేగా...!

బర్సే గగన్‌ మేరే బర్‌సే నయన్‌
దే ఖో తర్సే హై మన్‌ అబ్‌ తో ఆజా
శీతల్‌ పవన్‌ యే లగాయే అగన్‌
ఓ సజన్‌ అబ్‌ తో ముఖ్‌డా దిఖాజా
తూనే భలిరే నిభాయీ ప్రీత్‌ తుఝే మేరే గీత్‌ బులాతీ హై

( ఆకాశం వర్షిస్తోంది, నా కళ్లూ వర్షిస్తున్నాయి- నీ కోసం నా మనసు తపించిపోతోంది
చల్లగాలులూ నాలో అగ్గి రాజేస్తున్నాయి ఓ మానవీ ఇపుడైనా ఒకసారి నీ మోము చూపించవా
ప్రేమను నువ్వు  భలేగా నిలబెట్టావు.... రా...నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి)

ప్రేమమూర్తి కోసమైన ఎదురుచూపులో కళ్లు ఆకాశమైపోతాయి. ఆ సమయంలో కళ్లు వర్షించడం అంటే ఆకాశం వర్షించడమే. ప్రేమ కోసం మనసు తపించేవేళ చల్లగాలులు సైతం అగ్గిసెగల్లాగే అనిపిస్తాయి. ప్రేమ మూర్తి మోము ఒక్కటే ఆ అగ్నిని  చల్లార్చగలదు. మనసున వర్షించే ఆ ప్రీతమ్‌ను ఆ హృదయగీతం పిలవక ఇంకేం చేస్తుంది?

ఏక్‌ పల్‌ హై హస్‌నా, ఏక్‌ పల్‌ హై రోనా
 కైసా హై జీవన్‌ కా ఖేలా
ఏక్‌ పల్‌ హై మిల్‌నా, ఏక్‌ పల్‌ బిఛడ్‌నా
 దునియా హై దో దిన్‌కా మేలా
యే ఘడీ నా జాయే బీత్‌
తుఝే మేరే గీత్‌ బులాతే హైఁ

( ఒక నిమిషం నవ్వడం, ఒక నిమిషం ఏడ్వడం ఏమిటో ఈ జీవన క్రీడ
 ఒక నిమిషం కలవడం, ఒక నిమిషం విడిపోవడం, లోకం రెన్నాళ్ల జాతర
ఉన్న నాలుగు ప్రేమఘడియలూ చేజారిపోకుండా, రా... నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి.)

ప్రణయోద్వేగంలోనూ జీవన తత్త్వాన్ని విస్మరించనితనం హృదయ ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది. ప్రేమ డోలికల్లో తేలియాడే వేళలో సైతం ఈ నవ్వులూ, ఈ కలయికా శాశ్వతం కాదని గుర్తుంచుకోవడం ఎంత సత్యస్పృహ ఉంటే సాధ్యమవుతుంది? అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడ్వడం ఇదంతా ఒక ఆట అనీ, అప్పుడే కలవడం, అప్పుడే విడిపోయే ఈ జీవితం ఒక విచిత్ర జాతర అనీ గమనించడానికి ఎంత పరిణతి ఉండాలి?
మధురమైన ప్రేమ ఘడియల్లో దుఃఖాన్ని గురించి, మరణాన్ని గురించి జ్ఞప్తికి తెచ్చుకోవడం అవసరమా?అని ఎవరైనా అడగొచ్చు. అవరమే మరి! అలా గుర్తుకు తెచ్చుకోవడం నిరాశావహ తత్వమేమీ కాదు.   జీవితంలోకి దుఃఖమూ ప్రవేశిస్తుందని తెలిసిన వారే కదా! ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. మరణం అనేది ఒకటుందనే విషయాన్ని అన్ని వేళల్లోనూ గుర్తుంచుకున్న వారే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.
జీవితంలోని కఠోర సత్యాల ప్రస్థావనకే వణికిపోయే వారూ ఉండవచ్చు. కానీ, వణికిపోతున్నారని చేదు సంఘటనలు అసలు జరక్కుండానే ఉండిపోతాయా? విషాదాల్ని నియంత్రించే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. కానీ, సమస్త విషాదాల్నీ నియంత్రించలేవు కదా! జీవితాన్నీ, ప్రాణాల్నీ కాపాడుకునే ప్రయత్నాలు నువ్వెప్పుడూ కొనసాగిస్తూనే ఉంటావు. అంతమాత్రాన అసలు ఎడబాటే లేకుండా చే యలేవు కదా! జీవితాన్ని ఎంత ప్రేమించినా, మరణాన్ని శాశ్వతంగా వెలివేయలేవు కదా! మనిషి శక్తి సామర్థ్యాలకు పరిమితులు ఉన్నాయి. అందుకే ‘పరిమితులు తెలిసిన వాడే పరిపూర్ణ మానవుడు’ అంటారు. ఆ పరిపూర్ణత సాధించిన వాడు దుఃఖాల్ని గమనిస్తూనే నవ్వుల్ని ఆస్వాదిస్తాడు. వియోగాన్నీ, మరణాన్నీ గమనిస్తూనే ప్రేమను ఆస్వాదిస్తాడు. జీవితాన్ని గొప్పగా  అనుభవిస్తాడు.
చేదు నిజాల పరిష్యంగంలోనూ ప్రణయాన్నీ, జీవితాన్నియు ఆసాంతం ఆస్వాదించే ఒక యువ హృదయ రసధ్వని ఈ గీతం.
             -బమ్మెర