Saturday, April 30, 2016

యే వాదియాఁ యే ఫిజాయేఁ బులారహీ హై తుమ్హే - Ye wadiya ye fizaye bularahi hai tumhe


నిశ్శబ్ద నాదాలు నిన్ను పిలుస్తున్నాయి 

ఎవరైనా ఒకరిని ఎందుకు ఆహ్వానిస్తారు? ఎదుటి వారు తనకు ప్రాణప్రదమైన వాటికి, తన ఆశలకూ ఆకాంక్షలకూ ప్రతిరూపంగా దర్శనమిచ్చినప్పుడే కదా! అయితే తాను ఆహ్వానిస్తున్న సమయంలోనే ప్రకృతిలోని మరెన్నో తనతో పాటే ఆహ్వానించవచ్చు. అలా ఆహ్వానించే వాటిలో పర్వత లోయలూ, పిల్లగాలులూ, మేఘాలు, నదీనదాలు కూడా ఉన్నాయీ అంటే, జీవ ప్రకృతి, జఢప్రకృతి అనే అడ్డుగోడలన్నీ కూలిపోయాయని అర్థం. ‘ఆజ్‌ ఔర్‌ కల్‌’ సినిమా కోసం సాహిర్‌ లుధియాన్వి రాసిన ఈ పాటలో ఆ జగదేక హృదయమే కనిపిస్తుంది. రవి సంగీత సారధ్యంలో రఫీ పాడిన తీరులో ఎంత రసాత్మకతో ఒలుకుతుంది. 

యే వాదియాఁ యే ఫిజాయేఁ బులారహీ హై తుమ్హే
ఖమోశియోంకి సదాయేఁ బులా రహీ హై తుమ్హే / యే వాదియాఁ/ 

(ఈ పర్వత లోయలు, ఈ పిల్లగాలులు నిన్ను పిలుస్తున్నాయి
ఈ నిశ్వబ్దాల నాదాలు నిన్ను పిలుస్తున్నాయి.) 

మనోహరమైన వాటిని చూసి మనుషులు మాత్రమే స్పందిస్తారని కొందరనుకుంటారు. కానీ, సృస్టిలోని అణువణువులోనూ ఆ స్పందించే గుణం ఉంటుంది. అందుకే ప్రేమసి కోసం నిరీక్షిస్తూ, ప్రేమోద్వేగంలో నాట్య విన్యాసం చేస్తున్న ఆ ప్రేమమూర్తికి మద్దతుగా సృష్టిలోని ప్రతిదీ ఆమెను రమ్మని పిలుస్తాయి. ఎక్కడెక్కడో ఎంత దూరంగానో ఉన్న ఆత్మ బంధాన్ని గొంతెత్తి పిలుస్తాయి, ఎర్ర తివాచీలు పరిచి ఎదురొచ్చి ఆహ్వానిస్తాయి అయినా, పర్వత లోయల్లో ఇలాంటి ఎన్నెన్ని ఆత్మలు ఘూర్ణిల్లుతున్నాయో ఎవరు గమనిస్తున్నారు? సముద్ర తీరాల వెంట సాగే పిల్ల గాలుల్లో ఏ జీవ నినాదాలున్నాయో ఎవరు వింటున్నారు? అయితే అవన్నీ కలగలిసిన పారవశ్యంలో ఒక్కోసారి నిశ్వబ్దాలు సైతం గుండెలు జలధరించేలా నాదాలు చేస్తాయి.
తరస్‌ రహే హైఁ ఫూల్‌ హోంఠ్‌ ఛూనే కో
మచల్‌ -మచల్‌ కే హవాయేఁ బులా రహీ హై తుమ్హే / యే వాదియాఁ/ 

(నీ పెదాల్ని తాకడానికి పూలు తపించిపోతున్నాయి.
ఎగిసెగిసి పడుతూ పవనాలు నిన్ను పిలుస్తున్నాయి) 

జీవ రసాల్ని, జీవన సత్యాల్నీ అభివ్యక్తం చేసేది పెదాలే కదా: ఆ మాటల్ని తేనెలో కూడా ముంచి ఆరవేస్తే ఇంకేమైనా ఉందా? ప్రాణం ఉన్నంత వరకే కదలాడే జీవరాశికే ఇంతటి ఉద్వేగాలుంటే, విశ్వంలోని సమస్త ప్రాణులకూ జీవనాధారమయ్యే ఆ ప్రాణవాయువుకెంతటి భావోద్వేగాలు ఉండాలి? అవి ఆ పెదాల్ని తాకాలని అనుకోవా? ఆ కారణంగానే అనంతమైన భావోద్వేగంతో ఆ అపురూప సౌందర్యరాశిని తమకు చేరువగా రా ర మ్మని మనసారా ఆహ్వానిస్తాయి.

 జుల్ఫోఁ సే ఖుశ్‌బూ కి భీఖ్‌ లేనే కో
ఝుకీ - ఝుకీ సీ ఘటాయే బులా రహీ హై తుమ్హే / యే వాదియాఁ/ 

(నీ కురుల పరిమళాల బిక్ష అడగడానికి
మేఘాలు వంగి వంగి నిన్ను పిలుస్తున్నాయి.) 

ఏవో మబ్బులు ఏర్పడటం, వర్షించడం ఇవన్నీ ఏదో రసాయనిక ప్రక్రియలే గానీ, నీలో ఉన్న ఆ రసాత్మకత వాటిలో ఎక్కడిది? ఆ జీవరసాన్ని నింపుకోవడానికే ఒక్కోసారి మేఘాలు సైతం వంగి వంగి సలాములు చేస్తూ స్వాగతిస్తాయి. ఆమె లోని ఆ సోయగాలు, సుగంధాలు తమలో లేనందునే మేఘాలు ఆ కురుల్లోని పరిమళాల బిక్ష వేయమంటూ ఆ మె ముందు నిలుచుంటాయి. ఆకాశంలో తిరుగాడే మేఘాలది నిజంగా ఎంత పెద్ద స్థాయి.? అయినా అవి త మ అహాన్నంతా వదిలేసి, నేల మీద నడయాడే ఈ కాంతి పుంజాన్ని చూసి వివశమై, అలా నిలుచుండిపోతాయి. ,
హసీన్‌ చంపయీ పైరోంకో జబ్‌ సే దేఖా హై
నదీ కీ మస్త్‌ అదాయేఁ బులా రహీ హై తుమ్హే 

(అందాల సంపెంగ పూల లాంటి నీ పాదాల్ని చూసినపప్పటి నుంచి
నదీనదాల సోయగాలన్నీ నిన్ను పిలుస్తున్నాయి) 

సమస్త సౌందర్యాన్నీ మోసేవి పాదాలే కదా! తనదనుకున్న అపురూప సజీవ శిల్పాన్ని మోసే ఆ పాదాల కేసి కృతజ్ఞతగా చూస్తుంటే, ఆ పాదాల మీదున్న ఆ సంపెంగ పూల వర్ణం, తన్మయానికి గురిచేస్తుంది. ఆ పారవశ్యంలో నదీనదాలన్నీ ఆమె పాదాక్రాంతమవుతాయి. ఆ పదముద్రలు తమ తీరాల్లో ఒక చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయేందుకు ఒకసారి రమ్మని ఆహ్వానిస్తాయి. మానవ హృదయం మాత్రం అపూరూపమనైన వాటిని అనంత కాలం పదిల పరుచుకోవాలనే కదా కోరుకుంటుంది?
మేరా కహా న సునో ఉన్‌కీ బాత్‌ తో సున్‌ లో
హర్‌ ఏక్‌ దిల్‌ కీ దువాయేఁ బులా రహీ హై తుమ్హే 

(నేనన్నవేవీ వినకున్నా, వాటన్నింటి మాటయినా వినుకో
ప్రతి హృదయపు ప్రార్థనలు నిన్ను పిలుస్తున్నాయి) 

తమ పరిమితులకు, తమ శక్తిసామర్థ్యాలకు మించి ఏదో దక్కాలనుకున్నప్పుడే కదా సమస్య. అలాంటి సమయాల్లోనే ఎవరైనా కొన్ని అతీత శక్తుల కోసం ప్రార్థిస్తారు. ఒక్కోసారి తనతో పాటు తనకు మంచి జరగాలని తన ఆశలు ఫలించాలని తన కోసమై మరెందరో ప్రార్థిస్తారు. నా ప్రార్థనలు ఆలకించకపోయినా నా కోసం చేసే ఇతరుల ప్రార్థనలైనా ఆలకించరాదా? అంటూ ప్రర్వత లోయలన్నీ ప్రతిధ్వనించేలా ప్రేమ హృదయులు గొంతెత్తి గానం చేస్తారు. ుఇ3ు3్థ ఈ

తంగ్‌ ఆ చుకే హైఁ కశ్‌మకశే జిందగీ సే హమ్‌ - Tang aa chuke hai kashmakashe jindgee se hum

మౌనంగా....   ఇలా ఎంత కాలమని?


మానవ జీవితంలో అనుకున్నది జరక్కపోవడమే కాదు. చాలా సార్లు అనుకున్నదానికి  పరమ విరుద్ధంగా కూడా ఎన్నో జరిగిపోతుంటాయి. ఎప్పుడో అరుదుగా అయితే సరే గానీ, తరుచూ అవే చేదు అనుభవాలు ఎదురవుతుంటే, ఒక్కోసారి శరీరమూ, మనసూ అలసిపోతాయి.  ఈ పరిణామాల్లో ఇక  ఏ మార్పూ రాదని ఎప్పటికప్పుడు  తేలిపోతుంటే,  బతికినంత కాలం ఈ గాయాలూ, ఘర్షణలూ తప్పవన్న నిరాశ కమ్ముకుని ఈ జీవితం అంత గొప్పదేమీ కాదనిపిస్తుంది. జీవితానికి దూరంగా ఎటైనా వె ళ్లిపోవాలనిపిస్తుంది. ‘లైట్‌హౌస్‌’ సినిమా కోసం సాహిర్‌ లుధియాన్వీ రాసిన ఈ పాటలో ఆ హృదయజ్వాలలే కనిపిస్తాయి. ఎన్‌. దత్తా స్వరకల్పనలో వచ్చిన ఈ పాట వింటూ ఉంటే  నిజంగా  ఆశాభోంస్లే గొంతులో ఇంత ఆవేదన పలుకుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది.
* * * * * * * *
తంగ్‌ ఆ చుకే  హైఁ కశ్‌మకశే జిందగీ సే హమ్‌
ఠుక్‌రా న దే జహాఁ కో కహీఁ బే దిలీ సే హమ్‌ / తంగ్‌ ఆ చుకే /
(జీవితపు పెనుగులాటలో అలిసిపోయాన్నేను
ఈ నిరాసక్త హృదయంతో నేనీ లోకాన్నే తృణీకరిస్తానో ఏమో)
ఒక ఆటంకం తొలగి పోయిందిలే అనుకునే సరికే మరో కొత్త ఆటంకం వచ్చి పడటం, ఒక సమస్య పరిష్కార దశకు చేరుకుందిలే అనిపించే  నాటికే మరో కొత్త సమస్య ఎదురు కావడం ఇలా ఎంత కాలమని?  ఒక రోజు, ఒక ఏడు అంటే సరే కానీ, ఏళ్లకు ఏళ్లే ఎడతెరిపి లేకుండా ఎదురు దాడులే అయితే ఏమిటి చేయడం? ఈ పరిస్థితిలో ఎప్పటికీ ఇక ఏ మార్పూ రాదన్న భావనే కలిగితే ఏమవుతుంది? కొందరికైతే, ఈ బతుకూ వద్దు, ఈ పోరాటమూ వద్దని బాల్చీ తన్నేసి అసలీ లోకానికే దూరంగా వెళ్లిపోవాలనిపిస్తుంది.
లో ఆజ్‌ హమ్‌నే తోఢ్‌ దియా రిశ్తా-యే- ఉమ్మీద్‌
లో అబ్‌ కభీ గిలా న కరేంగే  కిసీ సే హమ్‌ / తంగ్‌ ఆ చుకే/
(బంధాల మీదున్న నమ్మకాల్ని నేడు విరిచేశాన్నేను
అలా అని ఎవరి మీదా ఎప్పుడూ నిందలు మోపన్నేను)
ఎన్ని అపార్థాలు చోటుచేసుకున్నా, ఎన్ని అపనిందలు విరుచుకుపడినా,  ఏదోలే అనుకుని కొన్నాళ్లు ఎలాగోలా భరిస్తూ వెళతాం. కానీ. వరుస పరంపరగా బడభాగ్నులే ఎగజిమ్ముతుంటే, ఇక చాల్లే అనిపిస్తుంది. బంఽధాల ముసుగులో పరమ పాశవిక చర్యలకు పాల్పడే వాళ్లను చూస్తుంటే, అన్ని బంధాలతో తెగదెంపులు చేసుకుని  శాశ్వతంగా ఎటైనా వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ, ఇంత జరిగినా కొన్ని ఎదిగిన హృదయాలు తాముగా మాత్రం ఎవరిమీదా నిందలు వేయవు. పాములకు దూరంగా ఉండాలే గానీ, వాటిని దూషించి ఫలితమేముందిలే అనుకుంటారు.
గర్‌ జిందగీ మే మిల్‌ గయే ఇత్తేఫాక్‌ సే
పూఛేంగె అప్‌నా హాల్‌ తేరీ బేబసీ సే హమ్‌ / తంగ్‌ ఆ చుకే/
(ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా అనుకోకుండా ఎదురుపడితే,
అంత నిస్సహాయతలోనూ నీ యోగక్షేమాలు అడుగుతాన్నేను)
ఎదుటి వ్యక్తి వల్ల ఎన్ని గాయాలైనా కావచ్చు. జరగరాని  ఎంత నష్టమైనా జరగవచ్చు. కానీ, అవన్నీ అయిపోయాక ఇప్పుడు ఎవరిని నిందించి మాత్రం ఏమిటి ప్రయోజనం? కాకపోతే, ఇంకెందుకులే అనుకుని దూరమైతే జరుగుతాం గానీ,  ఆ వ్యక్తే అనుకోకుండా ఎక్కడో హఠాత్తుగా ఎదురుపడితే ఏం చేస్తారు? ఆక్రోశాన్నీ, ఆగ్రహాన్నీ,  వెళ్లకక్కితే మాత్రం మాత్రం ఒరిగేదేముంది? అంతకన్నా, ‘‘ఏమిటి... ఎలా ఉన్నారు?’’  అన్న ఆ ఒక్కమాటా అనేసి, వెళ్లిపోవడం ఎంతో మేలు కదా! పెద్ద మనసుతో ఆలోచించే వారెవరైనా అలాగే చేస్తారు మరి!.
ఓ ఆస్‌మా వాలే కభీ తో నిగాహ్‌ కర్‌
కబ్‌ తక్‌ యే జుల్మ్‌  సహెతే రహే ఖామోశీ సే హమ్‌ /తంగ్‌ ఆ చుకే/
(ఓ గగన వాసీ  ఎప్పుడైనా ఈ వైపు దృష్టి సారించు
ఎంతకాలమని ఈ దుర్మార్గాల్ని మౌనంగా భరించాల్నేను)
మానవాళి మీదున్న ఆగ్రహాన్నంతా దిగమింగిన వాళ్లు అంతిమంగా ఏంచేస్తారు? ఆ ఆవేశాన్నీ, దుఃఖాన్నీ, ఎక్కడో ఆకాశంలో ఉంటాడనుకునే ఆ దేవుని ముందు  వ్యక్తం చేస్తారు. సమస్త సృష్టికీ తానే మూలమైనప్పుడు సమస్త అరిష్టాలకూ అతడే మూలం కదా! అందుకే ఆ మూల విరాట్టు మీదే విరుచుకుపడతారు.కాకపోతే  ఇప్పటిదాకా అన్ని హింసల్నీ, మౌనంగా సహిస్తూ, భరిస్తూ వచ్చాం సరే! కానీ, ఇలా ఇంకా ఎన్నాళ్లని? ఈ పరిణామాలకు అంతం లేదా? అంటూ నిలదీస్తారు. ఒక దశలో, అలసి, సొలసి,  సొమ్మసిల్లినట్టు పడిపోవచ్చు. కానీ, కాస్త తేరుకున్నాక,  తనకు తెలియకుండానే అంతకన్నా పెద్ద ఆత్మ సంఘర్షణలకు, అంతకన్నా పెద్ద పోరాటాలకు అతని అంతరంగం  మళ్లీ  సిద్ధమైపోతుంది. ఎందుకంటే జీవితమంటే ఎడతెగని యుద్ధమేనని ఎదిగిన ఏ ఆత్మకైనా స్పష్టంగా తెలుసు.