Sunday, January 23, 2022

Diye Jalte Hain | Amitabh Bachchan, Rajesh Khanna | Namak Haraam

 స్నేహాన్ని మించిన ఐశ్వర్యం ఏముంది!


ఏ స్నేహమైనా అది అంకురించిన తొలి క్షణాన, బీజం లాగే  ఉంటుంది. అది మొలకెత్తుతుందా లేదా, ఒక మహావృక్షంగా ఎదుగుతుందా లేదా అన్నది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఆకాశాన కనిపించిన ప్రతి మేఘమూ వర్షించనట్లే, లోకాన తారసపడిన ప్రతి స్నేహమూ ఆత్మీయతను కురిపించదు. అయితే, చాలా అరుదుగానే అయినా అక్కడో ఇక్కడో ఎదురయ్యే ఆ అపురూప మైత్రీబంధాన్ని మన జీవితమంతా నిలబెట్టుకోగలగాలి.  సంపద అంటే- వాహనాలూ, భవంతులూ, వజ్ర, వైడూర్యాలని కాదు.  ప్రాణానికి ప్రాణమైన  కనీసం ఓ నలుగురు స్నేహితుల్ని క లిగి ఉండడమే అసలు సిసలైన ఐశ్వర్యం. అలాంటి స్నేహంతోనే జీవన సాఫల్యం, జీవితానందం సిద్ధిస్తాయి. 1973 లో విడుదలైన ‘నమక్‌ హరామ్‌’ సినిమా కోసం  స్నేహమే ప్రధానాంశంగా ఆనంద్‌ బక్షీ రాసిన ఈ గీతాన్ని ఆర్‌. డి. బర్మన స్వరపరిస్తే కిశోర్‌ కుమార్‌ ఎంతో మృదుమధురంగా గానం చేశారు





దియే జల్‌తే హైఁ - ఫూల్‌ ఖిల్‌తే హైఁ   
 బడీ ముష్కిల్‌ సే మగర్‌ - దునియా మే దోస్త్‌ మిల్‌తే హైఁ 
                 

(దీపాలు వెలుగుతాయి - పూలు వికసిస్తాయి కానీ, 

ఎంతో క ష్టంగా మాత్రమే లోకాన మిత్రులు దొరుకుతారు)   



మంచి స్నేహితుడి కోసం, పనికట్టుకుని మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ వెళ్లం కదా! అనుకోకుండా ఎప్పుడో ఎక్కడో అలాంటి ఒక స్నేహితుడు ఎదురుపడతాడు. కాకపోతే అలా ఎదురుపడిన వారిలో  కొందరు తొలుత మిత్రులుగానే  కనిపించి ఆ తర్వాత శత్రువులుగా బయటపడ వచ్చు. తొలుత శత్రువుల్లానే అనిపించిన వాళ్లల్లో కొందరు ఆ తర్వాత ప్రాణమిత్రులుగా నిలిచిపోవచ్చు. నిజానికి, మన వ్యాపకాలు, మన వ్యవహారాలు- వీటితోనే మనకు సరిపోతుంది. ఈ ఉద్యోగ, వ్యాపారాల వ్యవహారాల్లో పడి అలా వెళుతుంటాం. మనం వెళ్లే ఆ దారి పొడవునా వేల దీపాలు వెలుగుతున్నా, వేలాది పూల తోరణాలు పరిమళాలు వెదజల్లుతున్నా చాలాసార్లు  మనకు అవేమీ పట్టవు. కానీ, ఒక నిండుస్నేహానికి ప్రతిరూపంగా, హృదయంలో హృదయంగా ఒక్కరంటే ఒక్కరు ఎదురైనా  మనసు పులకించిపోతుంది. ఆ స్నేహాన్ని జీవితపు భరిణెలో భద్రంగా దాచుకుంటుంది. కానీ, అలాంటి మిత్రుడు ఎదురుపడటం నిజంగా ఎంత అరుదైన విషయం!


పర్‌ జిస్‌ వఖ్త్‌ కిసీకా యార్‌ జుదా హోతా హై

కుఛ నా పూఛో యారో దిల్‌ కా హాల్‌ బురా హోతా హై 

దిల్‌ పే యాదోఁ కే  జైసే తీర్‌ చల్‌తే హైఁ / దియే జల్‌తే హైఁ/

(ఎప్పుడైనా ఒకరి మిత్రుడు ఎడబాసిపోతే

ఇంకేమీ అడగొద్దు మిత్రులారా - ఆ హృదయ స్థితి దారుణంగా ఉంటుంది

హృదయం మీద జ్ఞాపకాల బాణాలు దిగినట్లే ఉంటుంది)

‘‘బాల్య కౌమారమంతా క్షణం విడనాడకుండా జీవించాం. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ యౌవనం, బాఽధ్యతా పర్వతాల్ని నెత్తినేసుకుని, ఒకళ్ల కన్నీళ్లు ఒకళ్లు తుడుచుకోకుండా చెల్లాచెదరైపోయాం’’ అంటాడో కవి. నిజమే కదా! 

అత్యంత ఆప్తమిత్రులే కావచ్చు. జీవన పోరాటంలో పడి ఒక్కోసారి కొందరు జిల్లాలు, రాషా్ట్రలనే కాదు ఒక్కోసారి దేశాన్నే వదిలేసి వెళ్లిపోతారు. ఇదో రకం ఎడబాటైతే,  అప్పుడప్పుడే విరబూస్తున్న స్నేహ వల్లరి మీద అపార్థాల కత్తులు పడి, అది తునాతునకలైపోతుంది. అయితే, ఒక్కోసారి అది  అపార్థమే తప్ప అందులో వాస్తవం లేదని చెప్పే అవకాశం కూడా రాదు. ఫలితంగా, ఒకరి నుంచి ఒకరు విడిపోయి, జీవితంలో ఇంకెప్పుడూ కలుసుకోరేమో అన్నంత దూరంగా వెళ్లిపోతారు. అప్పుడింక ఆ పాత జ్ఞాపకాలన్నీ  ఇరువురి హృదయాల మీద ఈటెల్లా దిగిపోతాయి. ఆ బాధను భరించడం నిజంగా ఎంత కష్టం!

ఇస్‌ రంగ్‌ రూప్‌ పే దేఖో -  హర్‌గిజ్‌ నాజ్‌ నా కర్‌నా 

జాన భీ మాంగే యార్‌ తో దేనా - నారాజ్‌ న కర్‌నా 

రంగ్‌ ఉడ్‌జాతే హైఁ - రూప్‌ ఢల్‌తే హైఁ /దియే జల్‌తే హై!/

(చూడండి... ఈ రంగు రూపుల మీద - ఏమాత్రం మోహాన్ని పెంచు

కోకండి. మిత్రుడు ప్రాణమే అడిగినా ఇచ్చేయండి అతని మనసును చిన్న

బుచ్చకండి.

ఈ రంగులన్నీ ఎగిరిపోయేవే... ఈ రూపాలన్నీ వాడిపోయేవే)

నువ్వు నిర్మించుకున్న నీ స్వప్న సౌధం... ఎంత  అపురూపం,  ఎంత మనోహరమైనదైతే ఏమిటి? ఎంత గొప్ప రంగుల రాజ్యమైతేనేమిటి? వాటిని చూసుకుని ఎవరైనా పొంగిపోతే అర్థం లేదు. ఎందుకంటే, ఇవన్నీ భౌతికమైనవి... వీటి ఆయుష్షు ఎంత? ఈ సౌధాలు ఎప్పటికైనా కూలిపోయేవే. వీటి వర్ణాలు  వెలిసిపోయేవే. అందువల్ల హృదయబంధమైన స్నేహం కోసం ఏదైనా చేయగలిగితే దాంతో చెదరని ఆనందం సిద్ధిస్తుంది. అవసరమైతే స్నేహం కోసం ప్రాణాలే ఇచ్చినా అందులో జీవితం ధన్యమవుతుంది.


దౌలత ఔర్‌ జవానీ - ఎక్‌ దిన ఖోజాతే హైఁ

సచ కహతా హూఁ సారీ దునియా - దుష్మన హో జాతీ హై

ఉరమ్‌ భర్‌  దోస్త్‌ లేకిన సాథ్‌ చల్‌తే హైఁ / దియే జల్‌తే హై/

(ఈ ఐశ్వర్యం.. యౌవనం.. ఒకరోజున మాయమైపోతాయి

నిజమే చెబుతున్నా... లోకమంతా శత్రువైపోతుంది

మిత్రులు మాత్రమే... జీవితాంతం తోడై నడుస్తారు)

ఆత్రేయ అన్నట్లు చాలా మంది ‘‘అందమైన లోకమనీ... రంగురంగులుంటాయనీ’’ అనుకుంటారు గానీ, లోకం అంత అందమైనదేమీ కాదనీ, ఈ రంగులూ, హంగులూ పైపైవేనని అనిపిస్తుంది.  ఒక్కోసారి విషం చిమ్ముతూ, నిప్పులు కక్కుతూ లోకం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో చూసి మనసు దిగ్ర్భాంతికి గురవుతుంది.   అప్పటి దాకా ఎంతో ఆప్యాయంగా కనిపించిన లోకమే హఠాత్తుగా నీ శత్రువైపోవడం చూసి హతాశుడివైపోతావు. ఇతరులే కాదు ఒక్కోసారి అయినవాళ్లూ, సమీప బంధువులు, చివరికి రక్తసంబంధీకులు కూడా నీపై కత్తికడతారు. ఆ సమయంలో నువ్వు ఏ వైపు వెళ్లాలో, నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటావు.్ల నీ వ్యూహాలేవీ అప్పుడు పనిచేయవు. నీశక్తి ఎందుకూ  కొరగాదు.  సరిగ్గా ఆ స్థితిలో నీ అండగా నిలబడి, నిన్ను అక్కున చేర్చుకుని నిన్నూ, నీ జీవితాన్నీ నిలబెట్టేది. మైత్రీబంధమే.  జీవితాంతపు ఆసరాగా, నీకో భరోసానిచ్చేది  స్నేహహస్తమే!

బమ్మెర

Tuesday, January 18, 2022

ఆప్‌ కహే ఔర్‌ హమ్‌ న ఆయే AAP Kahe Our Hum Na aaye - Desh paradesh latha mangeshkar rajesh roashan amith kanna

తీరాన్ని చేరడానికి మీ తోడు కావాలి!!


ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే ఒక్కోసారి వంద అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎంతో కష్టపడి ఒక అవరోధాన్ని తొలగించేసరికి మరో పది ఆటంకాలు మనదారికి అడ్డుపడతాయి. వీటన్నింటినీ ఒక్కరే ఎదుర్కోవడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు. ఆ స్థితిలో ఎవ రైనా తోడుగా వస్తే ఎంత  బావుండునో కదా అనిపించవచ్చు. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి తామే స్వయంగా ఆహ్వానించారనుకోండి. ఇక కాదనడం ఎక్కడుంటుంది? 1978లో విడుదలైన ‘దేశ్‌- పర్‌దే్‌శ ’ సినిమా కోసం అమీత ఖన్నా రాసిన ఈ పాటలోని సారాంశమే ఇది.  రాజేశ్‌ రోషన్‌  స్వరపరిచిన ఈ పాటను లతామంగేష్కర్‌ ఎంతో రసరమ్యంగా పాడారు.  



ఆప్‌ కహే ఔర్‌ హమ్‌ న ఆయే - ఐసే తో హాలాత నహీ !  ఓ.....   

మంజిల్‌  తక్‌ పౌంచేంగే కైసే - ఆప్‌ కా జబ్‌ తక్‌ సాథ్‌ నహీఁ 

(మీరు అడగడమూ... నేను రాకపోవడం కూడానా? ఆ పరిస్థితే లేదు

అసలు మీ తోడే లేకపోతే గమ్యాన్ని ఎలా చేరగలను నేను)

చేరుకోవాలనుకున్న గమ్యం ఇద్దరిదీ ఒక్కటే అయినప్పుడు ఏం చేస్తారు?  ఆ రెండో వ్యక్తి నుంచి పిలుపొస్తే చాలు, ఏమాత్రం బెట్టు చేయకుండా వెంటనే అంగీకారం తెలిపేస్తారు. మొదట తమ ప్రయాణాన్ని ఎవరికి వారు వేరు వేరుగానే ప్రారంభించి ఉండవచ్చు. కానీ, తామిద్దరి మార్గం, గమ్యం ఒకటేనని తెలిసిపోయాక విడిగా ఎందుకు! కలిసినడిస్తే పోలా అనిపించవచ్చు. పైగా, అన్ని గమ్యాల్నీ అందరూ ఒంటరిగానే చేరుకోలేరు కదా!. ఆ నిజం కొందరికి మొదట్లో తెలియకపోయినా కాలగతిలో తెలుస్తుంది. పోనుపోను ఒక్కోసారి తాము ఎంచుకున్న దారిలో ఒంటరిగా సాగిపోవడం అసాధ్యమని కూడా తేలిపోతుంది. 

చాహ్‌నే వాలోఁ కీ ఆజ్‌ దునియా మేఁ చాహ్‌నే వాలే ఆగయే 

ఉల్ఫత కీ మయ్‌ ఆంఖోఁ సే లో ఆజ్‌ పిలానే ఆగయే

ఆప్‌ పియే ఔర్‌ ఆప్‌ న ఝూమే - ఆప్‌ కీ బస్‌కీ బాత నహీఁ ఓ....

(కోరుకునే వారి లోకంలోకి నేడు కోరుకున్న వారు వచ్చేశారు

ప్రేమ మధువును ఈ రోజు కళ్లతో తాగించడానికి వచ్చేశారు

ఈ మధువు తాగి కూడా మీరు మత్తిల్లకుండా ఉండి పోవడమా?

అది మీ వల్ల అయ్యే పనే కాదు సుమా!)

కోరుకున్న వారే కడదాకా  తమ తోడుగా రావడమన్నది ఎంత మంది జీవితాల్లో జరుగుతుంది? ఆశించినట్లు నిజంగానే అలా తోడైవస్తే, ఒకరి ఆత్మలో ఒకరు కలిసిపోయి... ఏకాత్మగా ఒక్కరే మిగిలిపోతారు. ఒక్కరుగానే కలిసి నడుస్తారు. నిజానికి ఏ లక్ష్యాన్ని సాధించాలన్నా, ఆ లక్ష్యం మీద అవ్యాజమైన ప్రేమ ఉండాలి. అయితే లక్ష్యం మీద ఉన్న ఆ ప్రేమ ఒక్కోసారి ఆ లక్ష్య సాధనలో తనతో కలిసి నడుస్తున్న వాళ్ల మీదికి కూడా పాకుతుంది. అదే జరిగితే, వాళ్లు నడుస్తున్న దారంతా ప్రేమతో తడి సిపోతుంది. కళ్లల్లో ప్రేమ మధువు నిండిపోతుంది. ఆ మధువు మనసులోకి  పారుతుంటే... ఎవరైనా మత్తిళ్లకుండా ఉంటారా? ఆ మత్తులో ఊగకుండా తమను తాము సంభాలించుకోగలరా?

కసా హువా హై తీర్‌ హుస్న్‌ కా జరా సంభల్‌ కే రహియేగా

నజర్‌ నజర్‌ కో మారేగీ తో- కాతిల్‌ హమే న కహియేగా

చాల్‌ చలీ హై సోంచ్‌ కే హమ్‌నే - ఇస్‌  ఖేల్‌ మే అప్‌నీ మాత నహీఁ      ఓ..... /ఆప్‌ కహే ఔర్‌/

(సంధించిన అందాల బాణమిది కాస్త సంభాలించుకోండి

చూపు చూపు మీదే దాడి చేస్తే, నన్ను హంతకి అనమాకండి

అన్నీ ఆలోచించే ఈ అడుగులు వేశా... ఈ ఆటలో  మనకు ఓటమెక్కడిది !)

ప్రేమ ఎలా పుట్టినా అది తన సహజత్వాన్ని కోల్పోదు. ఏ పూలగుత్తికో గురిపెట్టిన బాణమే కావచ్చు. కానీ, ఒడిసిపట్టుకోవడం తెలియకపోయినా, గురిపెట్టడం రాకపోయినా, అది మరెక్కడో దిగిపోవచ్చు. ఆ దెబ్బకు ఒక్కోసారి ఎదుటి వారి దేహమో, మనసో నిలువెల్లా రక్తసిక్తమైపోవచ్చు. అందుకే తళతళా మెరిసే ఈ అందాల బాణాన్ని అతి జాగ్రత్తగా ప్రయోగించే నైపుణ్యం తెలియడం చాలా అవసరం. లేదంటే, అది ఎంత రక్తపాతానికి దారి తీస్తుందో! జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో... ఎవ రూ ఊహించలేరు. అయితే, ఎవరైనా బాణం బారిన పడటానికి విలుకాడు గురి తప్పడమే కారణం కానక్కర్లేదు. ఒక్కోసారి వాళ్ల దృష్టి చెదిరిపోయేలా చేసి... వాళ్లు గురితప్పడానికి మనమే కారణం కావచ్చు. అలాంటప్పుడుకూడా ఎదుటివారిని హంతకులనేస్తే ఎలా?

పాస్‌ ఆకే యే ఆప్‌కే హమే హోనే లగా అహసాస్‌ హై 

దమ్‌ హై తో బస్‌ ఆప్‌కే దమ్‌ సే ఆప్‌ హీ కే సాస్‌ హై 

బయాన్‌ కరే జో హాలే దిల్‌ కో ఐసే కోయీ జజ్‌బాత నహీఁ ఓ.... /

ఆప్‌ కహే ఔర్‌ /

(మీ చెంత చేరాక నా మనసుకు తెలుస్తోంది

అసలు నా ప్రాణాలు నిలిచిందే మీ వల్ల 

ఈ నా హృదయ స్థితి అభివ్యక్తం చేయగలిగేది కూడా కాదు)

ఏ తీరాన్ని చేరడానికో, ఏ లక్ష్యాన్ని సాధించడానికో ఎవరైనా ఒకరి సన్నిధిలోకి వెళ్లి ఉండవచ్చు. అయితే ఒక్కోసారి అద్భుతమైన పారవశ్యానికి లోనై ఆ సన్నిధానమే సమస్తమనిపించవచ్చు.  ప్రాణమున్నంత కాలం అక్కడే ఉండిపోవాలనిపించవచ్చు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే వ్యక్తిగత బంఽధాలు కేవలం, సుఖ, సంతోషాలనే కాదు. అప్పుడో ఇప్పుడో వ్యక్తిగతమైన సమస్యల్ని కూడా మోసుకువస్తాయి. ఒక్కోసారి ఆ వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించడమే పెద్ద పనైపోతుంది. ఈ క్రమంలో ఒక్కోసారి అనుకున్న లక్ష్యం నుంచి వైదొలగే ప్రమాదం కూడా ఏర్పడవచ్చు. అలాంటి సమయాల్లో మనతో కలిసి నడిచే వారు, మన లక్ష్యం, వారి లక్ష్యం ఒకటే అయిన వారు... మనల్ని తట్టిలేపుతారు. వ్యక్తిగత వలయాల్లోంచి లేవదీసి సామాజిక రహదారుల గుండా నడిపిస్తారు. అలాంటి వారు ఎప్పుడైనా అనుకోకుండా ఎదురై సమష్టిగా సాగిపోదాం రమ్మంటే మనసున్న ఏ మనిషైనా రానని ఎలా అనగలడు?

Bammera

Monday, January 3, 2022

హమ్‌సఫర్‌! మిల్‌తీ హై మంజిల్‌---Humsafar Milti Hai Manzil Thokare Khane Ke Baad - Insaaf | Anuradha Paudwal | Vinod Khanna

 ఏ గమ్యాన్నీ చేరలేవు


‘‘యుద్ధం చేసి సాధించే విజయం కన్నా, అసలు యుద్ధమే రాకుండా నిలువరించడంలోనే నిజమైన విజయం ఉంది’’ అంటూ ఉంటారు. నిజమే.... కానీ, అన్ని ప్రయత్నాలూ విఫలమై, అనివార్యంగా యుద్ధమే వస్తే....? అదేమైనా తక్కువ పాఠాలు చెబుతుందా..! పాఠాలు చెప్పడమే కాదు అప్పటిదాకా మనలో నిక్షిప్తమై, నిగూఢంగా ఉన్న అనేకానేక శక్తి యుక్తులన్నింటినీ  మహా విస్పోటనంలా బయటపెడుతుంది. నిజానికి, ఎన్నోసార్లు సంఘర్షణల్నీ, సమరాల్నీ అడ్డుకోవడం సాధ్యమే కాదు. అలాంటప్పుడు ఆ సమరాల గాయాల్నించి, సంఘర్షణల హృదయ క్షోభల్నించి ఏం నేర్చుకుంటున్నామన్నదే కీలకమవుతుంది. ఈ  మాటలే, 1987లో విడుదలైన ‘ఇన్సాఫ్‌’ సినిమా కోసం ఫారుఖ్‌ కైజర్‌ రాసిన పాటలో విన పడతాయి. లక్ష్మీకాంత - ప్యారేలాల్‌ సంగీత దర్శకత్వంలో అనురాధా పౌడ్వాల్‌ పాడిన ఈ పాట పైకి సరదాగానే అనిపించినా ఎంతో లోతైన నీతినీ, గుండెను ఉక్కుపిండాన్ని చేసే స్పూర్తినీ అందిస్తుంది.


హమ్‌సఫర్‌! మిల్‌తీ హై మంజిల్‌- ఠోకరేఁ ఖానేకే బాద్‌

రంగ్‌ లాతీ హై హినా- పత్థర్‌ పే ఘిస్‌ జానే కే బాద్‌

మౌజ్‌ బన్‌జాతీ హై తూఫాఁ- సాహిల్‌ సే టక్‌రానే కే బాద్‌

రంగ్‌ లాతీ హై హినా- పత్థర్‌ పే ఘిస్‌ జానే కే బాద్‌ 


(ఓ సహయాత్రీ! ఎదురు దెబ్బలె న్నో తిన్న తర్వాతే గమ్యం లభిస్తుంది.

రాతి మీద వేసి నలిచిన తర్వాతే  గోరింటాకు రంగు బయటికొస్తుంది

దరిని ఢీకొన్న తర్వాతే ఉప్పెన, కెరటంగా మారుతుంది. 

రాతిమీద వేసి నలిచిన తర్వాతే గోరింటాకు రంగు బయటికొస్తుంది)

ఏ నగరానికో, ఏ దేశానికో వెళ్లాల్సి వస్తే, అప్పటికే, ఎవరో, ఎప్పుడో సిద్ధం చేసి ఉంచిన దారులు మీకు స్వాగతం పలుకుతాయి. సమాజం కోసం సమాజం తన బాధ్యతగా ఇలాంటివెన్నో ఏర్పాటు చేస్తుంది.  కానీ, నీ కోసం, నీకు నువ్వుగా ఏర్పరుచుకున్న గమ్యానికి అవసరమైన ఆ ఏర్పాట్లు ఎవరో సిద్ధం చేసి ఉంచరు కదా! ఇక్కడ ప్రతిదీ నువ్వే ఏర్పరుచుకోవాలి. ఆ గమ్యం చుట్టూ ఉన్న కీకారణ్యాన్ని నువ్వే నరుక్కుని, నువ్వే బాట వేసుకుని, నువ్వే నడిచి వెళ్లాలి. ఇదెంతో క్లిష్టమైనది, కష్టమైనది. చేరుకోవాలనుకునే గమ్యాలు నిజ.ంగా, ఎంత అందంగానో, అపురూపంగానో ఉంటాయి. కానీ, వాటిని చేరుకునే ప్రయత్నంలోనే వేలాది ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. కాకపోతే, ఆ ఎదురుదెబ్బల్లోనే, ఎదురీతల్లోనే నువ్వేమిటో బయటపడుతుంది. గాలిగాలిగా ఎగిసిపడుతూ హోరెత్తిపోయే ఉప్పెనైనా, సముద్రపు దరిని ఢీకొన్న తర్వాతే కదా అది ప్రవాహంగా మారుతుంది! రాపిడికి గురైన తర్వాతే, గోరింటాకు రంగు బయటపడ్డట్టు, వేలాది ఘర్షణలూ, గాయాల తర్వాత గానీ, నువ్వు నువ్వుగా ఆవిష్కృతమయ్యే అవకాశం లేదు


కిస్‌ లియే నారాజ్‌ హై- సారే జహాఁ సే జానేమన్‌

ఖూనే-దిల్‌ సే సీంచ్‌నే పడ్‌తే హై - ఖ్వాబోంకే చమన్‌

బీంజ్‌ తో బన్‌తే హై ఫూల్‌- మిట్టీ మే మిల్‌జానే కే బాద్‌ /రంగ్‌ లాతీ హై/

(ప్రియతమా! ఎందుకిలా  నువ్వు మొత్తం లోకం మీదే అలకవ హించావు?

కలల తోటల్ని, గుండె రక్తంతో తడపాల్సి ఉంటుంది!

మట్టిలో కలిసిపోయాకే కదా! పూలు విత్తనాలవుతాయి./ రాతిమీద /

అవతలి వాళ్లు మనం వెళ్లే దారిలో అడ్డంగా వచ్చినప్పుడు మనలో అంతులేని ఆక్రోశం పుట్టుకొస్తుంది. వాళ్ల లక్ష్యం వాళ్లదని మనకు అప్పుడు అనిపించదు. పైగా,  లోకం లోకమంతా మనకు శత్రురాజ్యంగానే కనిపిస్తుంది. ఏమైతేనేమిటి? ఎవరి శక్తి అసమానమో వారికే ఇక్కడ విజయం లభిస్తుంది. కాకపోతే ఆ విజయ సాధనకు నిర్జీవమైన అడుగులు సరిపోవు. శరీరం రక్తపు మడిలో దొర్లుతున్నా, లెక్కచేయని, ఒక మొక్కవోని సమరస్ఫూర్తి కావాలి. కలలు కనగానే సరిపోదు కదా!. గుండె రక్తంతో తడిపితే గానీ, ఆ కలల తోటలు బతకవు మరి! ఈ వడగాలిలో కొన్ని కుసుమాలు రాలిపోవచ్చు. అయ్యో పూలు నేలరాలిపోతున్నాయని క్షోభిస్తే ఎలా? అలా మట్టిలో కలిసిన పూలే కదా అంకురాలై, ఒక నందనానికి నాంది పడుతుంది. అందుకే లోకం మీద అలక వహించడం కాదు. అనుకున్నప్పుడు, ఆశయ సాధనకోసం, యుద్ధభూమిలో దిగిపోవడమే సరియైున సమాధానమవుతుంది.


బాద్‌ మే బన్‌నా ఖుదా - పహెలే జరా ఇన్సాన్‌ బన్‌

జిందగీ మే హై జరూరీ - థోడా సా దీవానా పన్‌

బాత ఆతీ హై సమఝ్‌ మే- హోశ్‌  ఉడ్‌నే కే బాద్‌ /రంగ్‌ లాతీ హై/

(దైవం కావడం తర్వాత, ముందు కాస్త మనిషిగా మారు

జీవితంలో కాస్తంత పిచ్చితనం కూడా అవసరమే సుమా!

స్పృహలన్నీ ఎగిరిపోయాకే అసలు విషయాలు బోధపడతాయి /రాతి మీద/

ఎంత ఆవేశం ఉన్నా, ఎంతటి మహా లక్ష్యమైనా ఏకంగా ఆకాశాన్నే హస్తగతం చేసుకోవాలనకుంటే ఎలా? దానివల్ల ఒక్కోసారి, అటు ఆకాశానికీ, ఇటు నేలకూ కాకుండా పోతాం. ముందు ఏదో ఒక నక్షత్రాన్ని పిడికిట్లోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా అమాంతంగా దైవమైపోవాలనుకుంటే మాత్రం ఎలా? అంతేసి ఆధ్యాత్మికం ఆదిలోనే ఎందుకు? అయినా, జీవిత సార్థకతకు ఈ మానవ జన్మేమీ తక్కువ కాదు. అనంతత్వం, ఆఽధ్యాతికం ఇవే సర్వోత్తమం అనుకోవడం బాగానే ఉంది. కానీ, వాటిని చేరుకోవాలంటే ఒక మహా ప్రయాణం చేయాలి. జీవితం ఒక మహా యజ్ఞం కావాలి.  అంతదాకా ఎందుకు? నీదీ, నాదనే ఆ కాస్త స్పృహ వదిలేయాలే కానీ, ఈ భౌతిక ప్రపంచం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. భౌతిక లోకాన్ని పిచ్చిగా ప్రేమించినప్పుడే దానికున్న అపారమైన ఆ శక్తేమిటో తెలుస్తుంది. వాస్తవానికి స్వీయ అస్తిత్వపు, వ్యక్తిత్వపు బంధనాలు దాటిన తర్వాతే ఎవరికైనా అసలు సిసలైన జీవిత సత్యాలు బోధపడతాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, తట్టుకుని,  అనుకున్నది సాధించే అనంత శక్తియుక్తులు సొంతమవుతాయి. 

- బమ్మెర