Sunday, May 29, 2016

కిసీనే అప్‌నా బనా కే ముఝ్‌ కో ముస్కురానా సిఖా దియా - Kisine apnaa banake mujko muskurana sikadiya


ఈ దీపం .. తాను వెలిగించిందే.. !! 

తనకు తానే అన్నీ అయి, తనరారే జీవితాలు కొన్ని ఉంటాయి, కానీ, అధఃపాతాళానికి జారిపోయి, ఏ ఆధారమూ దొరక్క అక్కడే అడుగంటే బతుకులు కూడా కొన్ని ఉంటాయి. ఎవరో వచ్చి చేయూత అందించేదాకా ఎన్ని దశాబ్దాలయినా అక్కడే మగ్గుతూ ఉండిపోయే విషాదరకర పరిస్థితులవి. నిజంగానే ఎప్పుడైనా వారి జీవితాల్లోకి అలాంటి వాళ్లు ప్రవేశిస్తే, వాళ్ల ఆనందానికి ఇంక అవధులు ఉండవు. వాళ్ల జీవితోత్సవానికి భూమ్యాకాశాల ఎల్లలు ఉండవు. ఈ ఆనందోద్వేగమే, ‘పతిత’ సినిమా కోసం శైలేంద్ర రాసిన ఈ గీతంలో కనిపిస్తుంది. శంకర్‌ జైకిషన్‌ సంగీత సారధ్యంలో లతా మంగేష్కర్‌ పాడిన ఈ పాట, పారవశ్యానికి ప్రతిరూపంలా ఉంటుంది. 

* * * * * * * *
కిసీనే అప్‌నా బనా కే ముఝ్‌ కో ముస్కురానా సిఖా దియా
అంధేరే ఘర్‌ మే కిసీ నే హస్‌ కే, చిరాగ్‌ జైసే జలా దియా 
(నన్నొకరు తనదానిగా చేసుకుని, నాకు మందహాసం నేర్పారు
చీకటింట్లో నవ్వుతూ ఆయన దీపమేదో వెలిగించారు) 

ఊహతెలిసిన నాటినుంచే నిప్పుల మీద నడిచే జీవితాలు కొన్ని ఉంటాయి. ఆ జీవితాల్లో మనోల్లాసం, మందహాసం లాంటివి మచ్చుకైనా ఉండవు. తానున్న ప్రపంచంలో తనకు తానుగా అంత కన్నా భిన్నమైన జీవితాన్ని ఏర్పరుచుకునే అవకాశమే వారికి ఉండదు. అనుకోకుండా ఎవరో, తన చీకటి జీవితంలోకి వెలుగై వచ్చి, కాసింత అమృతాన్ని హృదయంలోకి ఒంపితే తప్ప ఆ పెదవుల మీద మందహాసం పుట్టదు.
శరమ్‌ కే మారే మై కుఛ్‌ న బోలీ, నజర్‌ నే పర్‌దా గిరా దియా
మగర్‌ వో సబ్‌కుఛ్‌ సమజ్‌ గయే హై, కే దిల్‌ భీ మైనే గవా దియా 

(సిగ్గుతో నే నేమీ మాట్లాడలేదు, నా కనుదోయి ఏదో తెరలు జార్చింది
అయినా, నా మనసునెక్కడో నేను పోగొట్టుకున్నానని ఆయన అర్థం చేసుకున్నారు, ) 

మనసులోకి ఏనాడూ లీలగానైనా రాని ఒక యువరాజు హఠాత్తుగా వచ్చి ఎదురుగా నిలబడితే ఏమైపోవాలి? సిగ్గుతో మెలికలు తిరిగే కనుపాపల్ని దాచేందుకు ఆ వేళ కనురెప్పలే పరదాలవుతాయి. ఎదురుగా ఉన్నదెవరో తల ఎత్తయినా చూడలేనితనాన్ని చూస్తే ఆమె మనసు ఆమెలో లేదని దాన్నెప్పుడో ఆమె ఎక్కడో పోగొట్టుకుంద ని అతనికి అర్థమైపోతుంది. అయినా, ఆకాశమంత ఆనందాన్ని పొదివి పట్టుకోవడానికి అనంతమైన ఆత్మ కావాలి గానీ, పిసరంత మనసెందుకు పనికొస్తుంది? కారణమేదైతే ఏమిటి? కొన్నిసార్లు తన మనసు తన నుంచి దూరమై అలా ఎటో వెళ్లిపోతుంది.
న ప్యార్‌ దేఖా, న ప్యార్‌ జానా, సునీ థీ లేకిన్‌ కహానియాఁ 

జో ఖ్వాబ్‌ రాతోఁ మే భీ న ఆయా, వో ముఝ్‌ కో దిన్‌ మే దిఖాదియా 

(ప్రేమను చూడలేదు, తెలుసుకోనూ లేదు కానీ, ఆ కథలైతే విన్నాన్నేను
ఏ కల రాత్రుళ్లు కూడా రాలేదో, ఆ కలను ఆయన పగలే చూయించారు) 

సాధారణంగా నిజజీవితంలో అందుకోలేనివెన్నో కలలో నిజమైనట్లు వచ్చి మనసును కమనీయంగా మారుస్తాయి. కానీ, ఏనాడూ కలలోకే రాని అద్భుతాల్ని పట్టపగలే ఎవరైనా కళ్ల ముందు నిలబెడితే ఆ మనసేమైపోవాలి? అరుదుగానే కావచ్చు. కానీ, కొన్ని జీవితాల్లో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సాదాసీదా జీవితం గడిపే వారి జీవితాల్లోనే అదొక అద్భుతమైన అనుభవం. అలాంటిది ఆది నుంచే తీరని అగచాట్ల మధ్య గడిపిన జీవితంలోకి ఇలాంటి ఆనందాలు ప్రవేశిస్తే ఆ హృదయాలింక స్వర్గధామాలే కదా!
వో రంగ్‌ భర్‌తే హై జిందగీ మే, బదల్‌ రహా హై మేరా జహాఁ
కోయీ సితారే లుటారహా థా, కిసే నే దామన్‌ బిఛాదియా 

(జీవితాన్ని ఆయన వర్ణమయం చేస్తుంటే, నా లోకమే మారిపోతోంది
ఎవరో నక్షత్రాల్ని వెదజల్లుతున్నారు.. వాటికోసం మరెవరో కొంగు పరుస్తున్నారు) 

లోకంలో చాలా మంది జీవితాలు అంధకార బంధురమే కదా:! ఏ వైపు కాసిన్ని వెలుగురేఖలు వచ్చిపడతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. జీవితం చేదెక్కిపోయిన వాళ్లు అమృత వర్షం కోసం అదేపనిగా నిరీక్షిస్తుంటారు. అలాంటి సమయాల్లోనే కొన్నిసార్లు ఏ క్రాంతి హృదయులో వచ్చి ఆ జీవితాల్లో ఇంద్రధనుస్సును నిలబెడతారు. అదే సమయంలో ఇంకెవరో వచ్చి నక్షత్రాలు వెదజల్లుతుంటారు. వాటన్నింటినీ మూటకట్టుకోవడానికి మరెవరో నేల మీద కొంగు పరుస్తారు. అయితే ఆ ఎదజల్లుతున్నది ఎవరో కాదు తన ప్రేమమూర్తి. ఆ కొంగు పరుస్తున్నది కూడా ఎవరో కాదు తన అంతరాత్మే. నిజంగా ఎంతటి ఆనందకర పరిణామాలివి. కాకపోతే ఈ రోజు ఒకరి ఆలంబనతో నిలబడిన వాళ్లు, ఏదో ఒకరోజున మరొకరి జీవితానికి ఆలంబన కావడానికి ప్రయత్నించాలి. ఒకరు వెలిగించిన దీపకాంతిలో ఈ రోజు జీవితాన్ని చక్కదిద్దుకున్న వాళ్లు, ఎప్పుడైనా మరొకరి జీవితంలో వెలుగు నింపడానికి కంకణ బద్దులు కావాలి. ఎవరి జీవితానికైనా అప్పుడే కదా సార్థకత!!

Friday, May 27, 2016

మేరీ యాద్‌ మే తుమ్‌ నా ఆసూ బహానా - Meri yaadh Me Tum naa Aasu Bahana


తలత్ మహమూద్ వర్ధంతి సందర్బంగా...

నన్నింక మరిచిపో...... 


ఏ గొంతులోనైనా, లేలేత నదీ తరంగాల కన్నా సుకోమలమైన అలల ధ్వని రావడం మీరెప్పుడైనా విన్నారా? ఒకవేళ నిజంగానే మీరు వినిఉంటే అది కచ్ఛితంగా తలత్‌ మెహమూద్‌ గొంతే అయి ఉంటుంది. అలలు సైతం పులకరించిపోయే ఒక విలక్షణమైన స్వరమున్న విశిష్ట గాయకుడాయన. 1945లో సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన తొలుత కథానాయకుడిగనూ,, గాయకుడిగానూ ఉభయ భూమికలూ పోషించాడు. అయినా ఆయన జీవితం కష్టాల్లోనే గడిచింది. ఆ తర్వాత కొంత కాలానికి స్వరకర్త అనీల్‌ బిశ్వాస్‌, ‘ఆర్‌జూ’ సినిమా కోసం ‘‘‘ఏ దిల్‌ ముఝే ఐసీ జగాహ్‌ లే చల్‌, జహాఁ కోయీ నహో’’ అన్న ఒక వేదాంత గీతాన్ని పాడే అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క పాట ఆయన్ని నేపథ్య గాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది. ఆ ప్రస్థానంలో 8 వేల పాటల దాకా పాడాడు. భాతర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. కోటానుకోట్ల మంది రసజ్ఞులను తన గాత్ర మాదుర్యంతో దశాబ్ధాల పర్యంతం ఓలలాడించిన తలత్‌ మహమూద్‌. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 1988 మే, 5న ఆయన ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అయినా సంగీత ప్రేమికుల హృదయాల మీద ఈ నాటికీ ఆయన స్వరం తారట్లాడుతూనే ఉంది. తలత్‌ మహ్‌మూద్‌ పాడిన పాటల్లో విషాద గీతాలు, ఓదార్పు గీతాలే ఎక్కువ. ఆ రెండూ కలగలిసిన ఒక అరుదైన గీతం మనకు ‘‘మద్‌హోష్‌ ’’ సినమాలో వినిపిస్తుంది. రాజా మెహదీ అలీఖాన్‌ రాసిన ఈ పాటను మదన్‌మోహన్‌ స్వరపరిస్తే తలత్‌ మహ్‌మూద్‌ ఎంతో తాదాత్మ్యంతో గానం చేశారు. 
* * * * * *
మేరీ యాద్‌ మే తుమ్‌ నా ఆసూ బహానా
న జీ కో జలానా ముఝే భూల్‌ జానా
సమఝ్‌నా కే థా ఏక్‌ సప్‌నా సుహానా
వో గుజ్‌రా జమానా, ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే/ 

(నా జ్ఞాపకాల్లో నువ్వు కన్నీళ్లు రాల్చకు
హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో
ఆ సుందర స్వప్నమంతా ఏ నాటిదోలే అనుకో
ఆ కాలం అయిపోయింది, నన్నింక మరిచిపో /నా జ్ఞాపకాల్లో/) 

ఒక దశలో చేరువ కావడానికి ఎంతో ఆరాట పడిన వారే కావచ్చు. కానీ, అనుకోని ఏ విపత్కర పరిస్థితులో ఎదురైనప్పుడు విడిపోవడానికీ కూడా వారు అంతే చొరవ చూపుతారు. కలిసి ఉండడం కన్నా విడిపోవడంలోనే జీవితాలకు ఎక్కువ మేలు జరుగుతుందనిపించినప్పుడు శ్రేయోభిలాషులు ఇంకేం చేస్తారు? ఒక్కోసారి కొంత నాటకీయంగానైనా సరే ఎడబాటుకు దారులు వేస్తారు. కాకపోతే అలా అన్నీ చేస్తూనే, ఎదుటి వారు కంటతడి పెట్టకూడదని కోరుకుంటారు. ఎంతైనా అప్పటిదాకా ఒకరినొకరు ప్రాణప్రదంగా ప్రేమించుకున్నవారు కదా! ఎదురుపడి కాకపోయినా ఎదలో ప్రతిధ్వనించేలా అప్పటిదాకా జరిగినదంతా ఎప్పటిదో పాత కథలే అనుకొమ్మని చెబుతారు. అయినా, గడిచిపోయిన దానికోసం పడిఏడవడం ఎందుకు? మనం ఒకరినొకరం మరిచిపోవడమే మేలని చెబుతారు. ఎంత లేదన్నా ప్రేమలో పండిపోయాక సీదా సాదా మనసులు కూడా పెద్ద మనసులు అవుతాయి కదా!
జుదా మేరి మంఝిల్‌, జుదా తే రి రాహేఁ
మిలేంగీ న అబ్‌ తే రి మేరీ నిగాహేఁ
ముఝే తేరి దునియా సే హై దూర్‌ జానా
న జీ కో జలానా ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే /
 
( నా గమ్యం దూరమైపోయింది. నీ దారులూ వేరైపోయాయి
మన ఇరువురి చూపులు ఇంక ఏ నాడూ కలవనివై పోయాయి
నేనింక నీ లోకానికే దూరంగా వెళ్లాల్సి ఉంది
నీ హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో / నా జ్ఞాపకాల్లో/) 

తీరాలు దూరమైపోవచ్చు. అవతలి వాళ్ల దారులూ వేరైపోవచ్చు. మళ్లీ కలుసుకునే అవకాశమే ఉంటే, ఎన్నిసార్లు దూరమైపోతే మాత్రం అయ్యేదేముంది? ఏదో ఒక సమయాన తీరాలూ, దారులూ తిరిగి చేరువవుతాయి. ఏకమవుతాయి. కానీ, ఏకంగా లోకాలే వేరైపోయే స్థితి ఏర్పడితే, కనీసం ఒకరినొకరు కళ్లారా చూసుకునే అవకాశంకూ కూడా లేకపోతే, ఇంక చేయడానికేముంది? ఆ పైన ఆ విషయమై ఆలోచనలెందుకు? ఆశలు పెంచుకోవడం ఎందుకు? తీరని ఆశల్లో రేబవళ్లూ కాలిపోతూ హృదయాన్ని అగ్నిగుండం చేసుకోవడం ఎందుకు? అలాంటి స్థితిలో ఒకరినొకరు మరిచిపోవడమొక్కటే ఉత్తమ మార్గమనిపిస్తుంది. ఆ మాటలే గుండెలు ఘూర్ణిల్లేలా లోలోపల ప్రతిధ్వనిస్తాయి.
యే రోరోకే కహెతా హై, టూటా హువా దిల్‌
నహీ హూఁ మై తేరి, ముహబ్బత్‌ కి కాబిల్‌
మేరా నామ్‌ తక్‌ అప్‌నే లబ్‌ పే న లానా
న జీకో జలానా, ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే / 

( ముక్కలైన నా హృదయం వెక్కి వెక్కి ఏడుస్తోంది
నాకు నీ ప్రేమను పొందే యోగ్యతే లేదని వాపోతోంది
నీ పెదాల మీదికి ఇక నా పేరే రానీయకు
హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో / నా జ్ఞాపకాల్లో /) 

ఎలాప్రాయంలో ఏది అద్భుతంగా కనిపించినా సరే, దాన్ని వెంటనే సొంతం చేసుకోవాలని తపించిపోతుందది. ప్రేమమూర్తిని పొందే విషయంలో అయితే ఈ ఆరాటం ఏకంగా వేయింతలవుతుంది. కానీ, కొన్నాళ్ల తర్వాత ఆ అపురూపత్వం ఇంకా ఇంకా ఎదిగి, ఏ ఆకాశ శిఖరాలనో తాకుతుంటే, ఆ దివ్యరూపాన్ని అందుకునే అర్హతే నాకు లేదేమో అనిపించవచ్చు. అందుకే ఆ అపురూప శిల్పానికే దూరంగా జరగాలనిపించవచ్చు. కాకపోతే అప్పటికే దాన్ని మనం జీవితంలో భాగం చేసుకుని ఉంటే, దాన్నించి ఇక దూరం కావడమే అసాధ్యం అనిపిస్తే ఏమిటి చేయడం? వెక్కి వెక్కి ఏడ్వడం తప్ప ఏంచేయాలో దిక్కు తోచదు. ఏ విషయాన్నయినా పదే పదే స్మరిస్తూనే అదే విషయాన్ని మరిచిపోవడం ఎలా సాధ్యమవుతుంది? .అయినా ఇక నుంచి కనీసం వాటి ఛాయల్లోకి వెళ్లకుండా, వాటి ఊరూ పేరూ ఉచ్ఛరించకుండా ఉండిపోతే మేలేమో అనిపిస్తుంది. అలానైనా గుండె కోత కాస్తంత తగ్గుతుందేమో అనిపిస్తుంది. కానీ, మనసులో నిండుగా ప్రతిష్టించుకున్న దాన్ని ఆ తర్వాత బహిష్కరించాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదని అనుభవంతోనే తెలుస్తుంది.

* * * * * * * *

Sunday, May 8, 2016

దునియా బనానేవాలే క్యా తేరే మన్ మే సమాయీ - Duniya banane wale kya tere man me samayi



ఈ మట్టిబొమ్మల్ని...  ఎందుకు చేసినట్లు? 


దేవుడనేవాడు అనుకోకుండా మనకెక్కడైనా ఎదురైతే ఏం చేస్తాం? మన మనసు మూలల్లో ఎన్నేళ్లుగానో మగ్గుతున్న సవాలక్ష ప్రశ్నల్ని ఆయన మీదికి సంధిస్తాం. సమాధానం చెబుతాడా? నవ్వేసి మౌనంగా ఉండిపోతాడా అన్నది వేరే విషయం. కానీ, ప్రశ్నించడం మాత్రం ఖాయం. దైవం మీద మనిషి కురిపించే ఇలాంటి ప్రశ్నల వర్షమే ‘ తీస్‌రీ కసమ్‌’ సినిమా కోసం హస్‌రత్‌ జైపూరి రాసిన ఈ పాటలో కనిపిస్తుంది. శంకర్‌ జైకిషన్‌ స్వర రచనకు ముకేశ్‌ కంఠస్వరం ఎలా ప్రాణం పోసిందో ఎవరికి వారు ఆ పాట విని అంచనాకు రావల్సిందే...! 
* * * * * * * 
దునియా బనానే వాలే క్యా తేరే మన్‌ మే సమాయీ
కాహే కో దునియా బనాయీ, తూనే కాహేకో దునియా బనాయీ 

( ఓ లోకకారకా! నీ మనసును ఏమావహించింది?
ఎందుకు సృష్టించావు ఈ లోకాన్ని? నువ్వెందుకు సృష్టించావీ లోకాన్ని?) 

శూన్యంలో మహానందంగా ఉన్న ఆ దివ్యమూర్తికి నిజంగా, ఈ లోకాన్ని సృష్టించాలన్న తలంపు ఎందుకు కలిగినట్లు? ఏ వైపునా ఏమీ లేని మహా శూన్యమే కదా ! ఏమొచ్చి గుండెను కమ్మేసినట్లు? మిన్నకుంటే ఏ విపత్తు వచ్చిపడుతుందని, ఈ కోటానుకోట్ల గ్రహాల్ని, ఈ అనంత విశ్వాన్ని సృష్టించినట్లు? 
కాహే బనాయే తూనే మాటీ కీ పుత్‌లే, ధర్‌తీ యే ప్యారీ ప్యారీ ముఖ్‌డే యే ఉజ్‌లే
కాహే బనాయా తూనే దునియా కా ఖేలా, ఉస్‌మే లగాయా జవానీ కా మేలా
గుప్‌చుప్‌ తమాశా దేఖే, వాహ్‌ రే తేరీ ఖుదాయీ / కాహే కో దునియా/ 

(నువ్వు ఈ మట్టి బొమ్మల్ని ఎందుకు తయారు చేశావు?
ప్రియాతిప్రియమైన ఈ భూతలాన్నీ, దేదీప్యంగా వెలిగే ఈ ముఖబించాల్ని ఎందుకు చేశావు? 

ఎందుకు చేశావీ క్రీడా కాండ, అందులో ఎందుకు చేర్చావీ పరువాల తిరునాల
మళ్లీ....గుట్టుచప్పుడు కాకుండా ఆ చోద్యం చూడటమేమిటి? ఓహో ఏమి దైవత్వం నీది?)
ఇంతటి మనోహర మహీతలాన్ని సృష్టించాలన్న కల ఆ మహదేవునికి ఎందుకొచ్చింది? ఇదంతా అతనికో క్రీడే అనుకున్నా, యువ హృదయాల్ని మేల్కొలిపి ఈ పరువాల జాతర ఎందుకు చేసినట్లు? నిజానికి, అసలు యుద్ధమంతా ఇక్కడే కదా మొదలయ్యేది? ఒక పక్కన ఇవన్నీ జరిగిపోతుంటే, దేవుడు తనకేమీ తెలియనట్లు, ఏదో తమాషా చూస్తాడు ఎందుకని? అసలింతకీ ఈయన నైజం ఏమై ఉంటుంది?
తూ భీ తో తడ్‌పా హోగా మన్‌ కో బనాకర్‌, తూఫాఁ యే ప్యార్‌ కా మన్‌ మే ఛుపాకర్‌
కోయీ ఛబీ తో హోగీ ఆంఖో మే తేరీ, ఆసూ భీ ఛల్‌కే హోంగే పల్‌కోఁ సే తేరీ
బోల్‌ క్యా సూఝీ తుఝ్‌ కో, కాహే కో ప్రీత్‌ జగాయీ / కాహే కో దునియా/ 

(మనసును తయారు చేసి నువ్వూ ఎంతో మదనపడి ఉంటావు
ప్రేమ తుఫానును గుండెలో దాచుకుని ఎంతో విలవిల్లాడి ఉంటావు
ఏదో నీ కంట్లో గుచ్చుకునే ఉంటుంది...నీ కనురెప్పల్లోంచి కన్నీరు ఎగిసిపడే ఉంటుంది
అసలు ఏమనిపించింది నీకు, ఎందుకు నువ్వు ఈ ప్రేమను మేల్కొలిపావు?) 

 మట్టి బొమ్మల కోసమని దేవుడు మనసును సృష్టించాడు  కానీ, ఆ సృష్టించే క్రమంలో తనలోనూ ఒక మనసు  మకాం వేస్తుందని గుర్తించలేకపోయాడా? కానీ, జరిగింది  అదేగా! పరమాత్మ స్థాయి నుంచి మనసుదాకా వస్తే, ఆ  సంఘర్షణ మామూలుగా ఉంటుందా? మనసంటూ    ఒకసారి అంకురించాక ప్రేమ తుఫానుకు గురికాకుండా  ఉంటారా ఎవరైనా? మిగతా విషయాలు ఎలా ఉన్నా, ప్రేమ  విషయంలో దేవుడు కూడా అతీతంగా ఉండలేడు.  ప్రేమలో పడ్డాక ఎప్పుడో ఒకప్పుడు కళ్లల్లో ఈటెలు దిగడం ఖాయం. హృదయం కన్నీటి పర్యంతం అవడం ఖాయం. అయినా తె లిసి తెలిిసీ దేవుడు ఇవన్నీ ఎందుకు కొనితెచ్చుకున్నట్లు?
ప్రీత్‌ బనాకే తూనే జీనా సిఖాయా, హస్‌నా సిఖాయా, రోనా సిఖాయా
జీవన్‌ కే పథ్‌ పర్‌ మీత్‌ మిలాయే, మీత్‌ మిలా కే తూనే సప్‌నే జగాయే
సప్‌నే జగాకే తూనే కాహే కో దేదీ జుదాయీ / కాహే కో దునియా/ 

(ప్రేమను సృష్టించి... జీవించడం నే ర్పావు, నవ్వడం నేర్పావు... ఏడ్వడం నేర్పావు
జీవన మార్గంలో ఒక నేస్తాన్ని కలిపావు, నేస్తాన్ని కలపి, కొన్ని స్వప్నాల్ని పొదిగావు
కలలు ఇచ్చిన నువ్వే మరి, ఎడబాటు ఎందుకు ఇచ్చావు?) 

ఒక జీవామృతం లేకుండా ఎలా బతుకుతాడీ మనిషనేమో దేవుడు ప్రేమను సృష్టించాడు, అతనికోసం, ఒక జీవన సహచరిని కూడా సృష్టించాడు. ఆ సహచర్య సాంగత్యంలో వేవేల స్వప్నాలకు బీజం వేశాడు. దాని పరిణామంగా వచ్చే వాటిని తట్టుకోవడానికి ప్రతి మనిషికీ నవ్వూ ఏడుపుల్ని సమంగా నేర్పాడు. మనిషి బాగు కోరి ఇంతా ఆలోచించిన వాడు ఆ స్వప్నాలు చెల్లాచెదరయ్యేలా ఆ ప్రేమహృదయాల్ని ఎందుకు ఎడబాపుతున్నట్లు? వీటి వెనుకున్న ఆంతర్యమేమిటో మానవాళికైతే అర్థం కాదు. కానీ, ఆ సృష్టికరక్తకైనా అర్థమవుతుందా అన్నదే అనుమానం? ఇక్కడున్న వాళ్లు ఎన్ని మాట్లాడుకుంటే ఏం లాభం కానీ, ఆ వైపు వెళ్లే వారెవరైనా ఉంటే, నేరుగా ఆయన్నే అడిగితే ఏదో సమాఽధానం చెప్పకుండా ఉంటాడా?