కలల నిండా ఎవరీ రారాజు!
* * * * *
మునుపెన్నడూ చూడని వాళ్లెవరో మనల్ని నీడలా వెంటాడుతుంటే, హృదయం కలవరపడిపోక ఏం చేస్తుంది? కాకపోతే ఆ రూపం సుందరమై, ఆ మాటలు ఆపాత మధురమై గుండెల మీద తారట్లాడుతుంటే హృదయం తెలియకుండానే పారవశ్యానికి లోనవుతుంది. పగలైతే సరే కానీ, రేయి రేయంతా కలల్లోకి జొరబడి హృదయాన్ని ఊయలలూపేస్తుంటే ఏమైపోవాలి? పైగా రేయి రేయంతా సాగే కలలు నిజాలే అనిపిస్తాయి. అయినా ఏదో అయోమయం మొదలై, అసలు పగేలేదో రేయేదో తెలియకుండా పోతుంది. ఈ స్థితిలో ఏమిటిదంతా? అని మన హృదయాన్ని మనమే ప్రశ్నిస్తే అది మాత్రం ఏం చెబుతుంది? మనమూ మన మనసూ వేరు వేరేమీ కాదు కదా! మనకు తెలియని నిజాలు దానికి మాత్రం ఎలా తెలుస్తాయి? ‘భాయ్-భాయ్’ సినిమా కోసం రాజేంద్రకృష్ణ్ రాసిన ఈ పాటలో ఈ కలవరపాటే కనిపిస్తుంది. మదన్ మోహన్ స్వర కల్పనలో గీతాదత పాడిన ఈ పాట నాలుగు దశాబ్దాల అనంతరం కూడా భారతీయ హృదయాల మీద భరతనాట్యం చేస్తూనే ఉంది.
* * * * *
వో కౌన్ హై జో ఆకర్ - ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్ ముఝే/
(ఎవరి మీద నువ్వు వాలిపోయావో - ఓ మనసా నాకు చెప్పేయవే
వచ్చి నా కలల నిండా వ్యాపించిన . ఈయనెవరో కాస్త చెప్పేయవే)
మనసెప్పుడూ మనతోనే, మనలోనే ఉంటే, మానవాళికి ఇన్నిన్ని తిప్పలు ఎందుకుండేవి? అది గాలిగాలిగా ఎటెటో తిరుగుతూ ఉంటుంది. ఎడతెగని సంచారమది. ఆ సంచారంలో ఎక్కడెక్కడ వాలుతుందో, అక్కడ ఎంతసేపుండి, అటునుంచి మళ్లీ ఎటు వెళ్లిపోతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు. అయితే ఒక్కోసారి ఏమీ కదలకుండా, వాలిన చోటే తిష్టవేసి ఉండిపోయినా ఉండొచ్చు. అయితే అంతరంగంలో జరిగే ఈ పరంపరల గురించి ఎవరో వచ్చి మనకేమీ చెప్పరు. అందుకే మన మనస్సునే అడిగే పనిలో పడతాం. అయినా మన మనసు ఎవరి మీదో వాలిపోయినప్పుడు వాళ్లు మాత్రం ఊరుకుంటారా? మనసుకు నచ్చితే మనవెంట పడతారు కూడా. వస్తే వచ్చారు గానీ, పగలంతా మనతో ఉండి సంధ్యవేళయినా వెళ్లిపోతే ఫరవాలేదు. అలా కాకుండా నిదురోయిందే తడవుగా కలల్లోకి కూడా జొరబడితే ఏమనుకోవాలి? విషయం చాలా దూరమే వెళ్లిందని కదా అర్థం!
మస్తీ భరా తరానా - క్యోఁ రాత్ గారహీ హై
ఆంఖో మే నీంద్ ఆకర్ - క్యూ దూర్ జారహీ హై
దిల్ మే కోయీ సితమ్‌గర్ - అర్‌మాఁ జగా రహా హై
వో కౌన్ జో ఆకర్- ఖ్వాబోఁ పే ఛా గయా హై / యే దిల్ ముఝే/
(రేయి ఉన్మత్త రాగాల్ని గానం చేస్తోంది ఎందుకని?
కళ్లల్లోకి వచ్చినట్టే వచ్చి నిద్ర, దూరమైపోతోంది ఎందుకని?
మనసులో వంచకుడెవరో ఆశల్ని మేల్కొలుపుతున్నాడు
ఎవరీయన? వ చ్చి నా కలలనిండా వ్యాపించాడు!)
పరాగాలూ, సరాగాలూ పగటి పూట మామూలే గానీ, ఒక్కోసారి రాత్రుళ్లు కూడా పగటినే తలపిస్తూ ఉన్మత్త రాగాలు వినిపిస్తాయి. అందుకు అనుగుణంగా కళ్ల దాకా వచ్చినట్టే వచ్చి నిద్ర మళ్లీవెనక్కి వెళ్లిపోతుంది.రేయి పగలైపోతుంది. ఇలా రాత్రుళ్లు పగళ్లయిపోతుంటే, పగటి కలలు రాకుండా ఏం చేస్తాయి? అయినా కలలు కలలే కదా! నిజాలు కలలుగా మారడం ఎందుకు? అందుకేనేమో నిజాల్నే తప్ప కలల్ని నమ్మని లోకం కోసం, ఊహలు, కలలు వాస్తవరూపంలో ఉండేలా రేయి పగలుగా మారిపోతుంది. కానీ, ఎన్నో రాత్రులు అలా గడిచిపోతుంటే ఒక్కోసారి కునికిపాట్లేవో వచ్చి క్షణకాలం కన్ను మలగవచ్చు కళ్లతో పాటే ఆశలూ నిద్రలోకి జారిపోవచ్చు. కానీ ఇంతలో ఏ ఆగంతకుడో వచ్చి ఆశల్ని తడముతుంటే ఇంక నిద్ర ఎక్కడ పడుతుంది? ఎన్నెన్నో రాత్రులు ఇలా నిద్రలేకుండా గడిచిపోతుంటే, తనువూ మనసూ మగతనిద్రా మత్తులో ఊగిపోతుంటే, రేయి ఉన్మత్త రాగాల్ని ఆలపించకుండా ఉంటుందా?
బేతాబ్ హో రహా హై - యే దిల్ మచల్ మచల్ కే
షాయద్ యే రాత్ బీతే - క ర్‌వట్ బదల్ బదల్ కే
యే దిల్ జరా సంభల్ జా - షాయద్ వో ఆగయా హై
వో కౌన్ హై జో ఆకర్ - ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్ ముఝే/
(అతలాకుతలం అవుతూ ఈ మది అశాంతి పాలవుతోంది
అటూఇటూ దొర్లుతూనే బహుషా ఈ రేయి గడిచిపోతుందేమో
కాస్త నిబ్బరించుకోవే మనసా! ఆయన వచ్చేసినట్లే ఉన్నాడు
ఇంతకీ ఎవరాయన? వచ్చి నా కలలనిండా వ్యాపించాడు!)
అక్షరం అక్షరం తెలిస్తే తప్ప అర్థం బోధపడనట్లు, ఏ మనిషైనా నఖశిఖం తెలిస్తేనే కదా గుర్తిస్తాం! లీలగా ఏదో కలలా వచ్చి అలా వె ళ్ళిపోతుంటే అతన్ని ఎలా గుర్తించగలం? తెలిసీ, తెలియని రూపం, మనసు ఎదుటి మనిషిని అల్లకల్లోలం చేయక ఏం చేస్తుంది? అతనేమిటో అతని మనసేమిటో తెలుసుకోలేని హృదయానికి నిద్ర ఆహారాలు ఏముంటాయి? కావాలని కళ్లు మూసుకున్నా, అటూ ఇటూ దొర్లడమే తప్ప నిదురైతే రాదు కదా! ఎప్పుడో క్షణకాలం నిదురపట్టినా అదే అదనుగా అతను కలల్లోకి జొరబడుతుంటే ఆ మనసేమైపోవాలి? అనునిత్యం కలల్లో రాజ్యమేలుతున్న వాడి పూర్తి ఆచూకీ తెలియకపోతే ఏమనుకోవాలి? ఏ నిర్ణయానికి రావాలి?
భీగీ హుయీ హవాయేఁ - మౌసమ్ భీ హై గులాబీ
క్యా చాంద్ క్యా సితారే ఁ హర్ చీజ్ హై శరాబీ
ధీరే సే ఎక్ నగ్‌మా - కోయీ సునాగయా హై
వో కౌన్ జో ఆక ర్, ఖ్వాబోఁ పే ఛాగయా హై / యే దిల్ ముఝే/
(పవనాలు తడిసిపోయాయి, రుతువు గులాబీలా ఉంది
చంద్రుడేమిటి? సూర్యుడేమిటి? ఇక్కడ ప్రతిదీ తాగుబోతయ్యింది
నిదానంగా అతనెవరో ఒక గీతాన్ని వినిపించి వెళ్లిపోయాడు
ఇంతకీ ఎవరాయన? వచ్చి నా కలలనిండా వ్యాపించాడు)
హృదయగతంగా మనం తడిస్తే, గాలిగాలంతా తడిసిపోయినట్లే, నదులూ, పర్వతాలూ, అరణ్యాలూ తడిసినట్లే. భావాలు ఏ వర్ణాన్ని పులుముకుంటే, సమస్త ప్రకృతీ ఆ వర్ణాన్ని పులుముకున్నట్లే. దృష్టిని బట్టే సృష్ఠి అని ఊరకే అన్నారా? అయినా ప్రపంచంలో పారవశ్యాన్ని మించిన మఽధువేముంది ఆ మధువుతో సూర్యుడేమిటి? చంద్రుడేమిటి? పంచభూతాలూ మత్తెక్కిపోతాయి. సరిగ్గా అదే సమయంలో ఎవరో వచ్చి తన మీద చూపుల వర్షం కురిపిస్తూ, ఆకాశమంతా హోరెత్తేలా గొంతెత్తి పాడుతుంటే హృదయం మీదుగా ఎన్నెన్నో సముద్రాలు ప్రవహిస్తునట్లు ఉండదా? ముల్లోకాలు తన ముందు వాలినట్లు అనిపించదా?అయినా నిలువెల్లా ముంచేస్తూ ఇవన్నీ జరిగిపోతుంటే.... నువ్వు ఎవరి మీద వాలిపోయావో చెప్పు. క లల్నిండా వ్యాపించిన ఆయనెవరో చెప్పు అంటూ ఆదేశిస్తుంటే, ఆ హృదయం మాత్రం ఏం చెబుతుంది? అవన్నీ తెలియాలంటే ఆ మనసుతో పాటే పయనిస్తూ, ఆ మనసుతోనే జీవించడం తప్ప అక్కడింక మరో మార్గమే లేదు మరి!
====================
No comments :
Post a Comment