Thursday, July 14, 2022

Aa Laut Ke Aaja Mere Meet Song | Rani Rupmati (1959) Film | Mukesh Songs |

ఆ లౌట్‌ కే ఆజా మేరే మీత్‌

ప్రణయ భావోద్వేగంలోనూ జీవితసత్యాలను మరవని ప్రేమికులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారే ప్రణయ జీవితాన్ని ఆసాంతం అనుభవించగలుగుతారు. అన్నిసార్లూ జీవితం మనం అనుకున్నట్లే ఉండదు. పైగా, చాలా సార్లు అనుకున్నదానికి పూర్తిగా విరుద్ధంగానే జరగవచ్చు. ప్రేమ, ప్రణయాలు ఎంత మధురమైనవైనా కావచ్చు. వాటి పట్ల మనకు ఎంత మక్కువైనా ఉండవచ్చు. జీవితపు ఊయలలో తేలియాడుతున్న సమయంలోనే ఒక్కోసారి అనుకోని విషాదాలు కమ్ముకుంటాయి. రెండు శరీరాలు ఒకే ఆత్మగా సాగిన జీవితాలు హఠాత్తుగా రెండు వేరు వేరు ప్రపంచాలవుతాయి. అనంత జీవన యానంలో ఇవన్నీ  సహజమే.కానీ, చాలాసార్లు హృదయం జీర్ణించుకోదు.  అయితే, ఆవేదనకు గురికావడం వేరు ఆవేదనలో కొట్టుకుపోవడం వేరు. అలా కొట్టుకుపోయే వాళ్లే  కొన్నిసార్లు జీవిత సత్యాల్ని విస్మరించే ప్రమాద ం ఉంది. నిజానికి ఏదీ శాశ్వతం కాని జీవితంలో ప్రణయమూ శాశ్వతం కాదు. అందుకే అద్భుతమైన సంయోగాలు సైతం కొన్నిసార్లు  వియోగాలుగా మిగిలిపోతాయి. ప్రతికూలమైన పరిణామాలు అప్పుడో ఇప్పుడో ఎదురవుతూనే ఉంటాయి. అలాఅని సానుకూలంగా ఉన్న ఆ నాలుగు ఘడియల్లోనైనా ప్రణయాన్ని ఆస్వాదించడంలో వెనుకడుగు వేయకూడదు. జీవితపు ఆవలి తీరాన్ని అవగాహన చేసుకోవలసిందే గానీ, ఆ కారణంగా కుంగిపోకూడదు కదా! సరిగ్గా ఈ జ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న ఓ యువహృదయం పాడుకునే పాటే ఇది. ‘రాణీ రూప్‌మతి’ సినిమాలోని ఈ పాటను భరత్‌ వ్యాస్‌ రాస్తే, ఎస్‌ ఎన్‌ త్రిపాఠీ స్వరపరిచారు. మంచుకంఠం ముకేశ్‌ ఈ పాటను పాడారు.
ఇప్పుడు ఆ ఆపాట మీకోసం....





లౌట్‌ కే ఆ...
లౌట్‌ కే ఆ...
లౌట్‌ కే ఆ...

ఆ లౌట్‌ కే ఆజా మేరే మీత్‌,
తుఝే మేరే గీత్‌ బులాతే హైఁ
మేరా సూనా పడారే సంగీత్‌
తుఝే మేరె గీత్‌ బులాతే హైఁ

(రా...వచ్చేయ్‌ ప్రియతమా..! నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి.
నువు లేక నా స్వరలోకమే మూగబోయింది.  రా.... నా గీతాలు పిలుస్త్తున్నాయి)

తాను ప్రేమించే వ్యక్తి దూరం కావడం అంటే అతని ప్రపంచమే దూరం కావడమే! ఏదో రాగం, ఒక గీతం కాదు తన సంగీత ప్రపంచమే మూగబోవడం. ప్రాణాధికంగా ప్రేమించిన హృదయానికి  తన ప్రేమమూర్తి  కనుమరుగైపోతే తన గొంతే కాదు, తన ప్రపంచం మూగబోవడమేగా...!

బర్సే గగన్‌ మేరే బర్‌సే నయన్‌
దే ఖో తర్సే హై మన్‌ అబ్‌ తో ఆజా
శీతల్‌ పవన్‌ యే లగాయే అగన్‌
ఓ సజన్‌ అబ్‌ తో ముఖ్‌డా దిఖాజా
తూనే భలిరే నిభాయీ ప్రీత్‌ తుఝే మేరే గీత్‌ బులాతీ హై

( ఆకాశం వర్షిస్తోంది, నా కళ్లూ వర్షిస్తున్నాయి- నీ కోసం నా మనసు తపించిపోతోంది
చల్లగాలులూ నాలో అగ్గి రాజేస్తున్నాయి ఓ మానవీ ఇపుడైనా ఒకసారి నీ మోము చూపించవా
ప్రేమను నువ్వు  భలేగా నిలబెట్టావు.... రా...నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి)

ప్రేమమూర్తి కోసమైన ఎదురుచూపులో కళ్లు ఆకాశమైపోతాయి. ఆ సమయంలో కళ్లు వర్షించడం అంటే ఆకాశం వర్షించడమే. ప్రేమ కోసం మనసు తపించేవేళ చల్లగాలులు సైతం అగ్గిసెగల్లాగే అనిపిస్తాయి. ప్రేమ మూర్తి మోము ఒక్కటే ఆ అగ్నిని  చల్లార్చగలదు. మనసున వర్షించే ఆ ప్రీతమ్‌ను ఆ హృదయగీతం పిలవక ఇంకేం చేస్తుంది?

ఏక్‌ పల్‌ హై హస్‌నా, ఏక్‌ పల్‌ హై రోనా
 కైసా హై జీవన్‌ కా ఖేలా
ఏక్‌ పల్‌ హై మిల్‌నా, ఏక్‌ పల్‌ బిఛడ్‌నా
 దునియా హై దో దిన్‌కా మేలా
యే ఘడీ నా జాయే బీత్‌
తుఝే మేరే గీత్‌ బులాతే హైఁ

( ఒక నిమిషం నవ్వడం, ఒక నిమిషం ఏడ్వడం ఏమిటో ఈ జీవన క్రీడ
 ఒక నిమిషం కలవడం, ఒక నిమిషం విడిపోవడం, లోకం రెన్నాళ్ల జాతర
ఉన్న నాలుగు ప్రేమఘడియలూ చేజారిపోకుండా, రా... నిన్ను నా గీతాలు పిలుస్తున్నాయి.)

ప్రణయోద్వేగంలోనూ జీవన తత్త్వాన్ని విస్మరించనితనం హృదయ ఔన్నత్యాన్ని తెలియచేస్తుంది. ప్రేమ డోలికల్లో తేలియాడే వేళలో సైతం ఈ నవ్వులూ, ఈ కలయికా శాశ్వతం కాదని గుర్తుంచుకోవడం ఎంత సత్యస్పృహ ఉంటే సాధ్యమవుతుంది? అప్పుడే నవ్వడం, అప్పుడే ఏడ్వడం ఇదంతా ఒక ఆట అనీ, అప్పుడే కలవడం, అప్పుడే విడిపోయే ఈ జీవితం ఒక విచిత్ర జాతర అనీ గమనించడానికి ఎంత పరిణతి ఉండాలి?
మధురమైన ప్రేమ ఘడియల్లో దుఃఖాన్ని గురించి, మరణాన్ని గురించి జ్ఞప్తికి తెచ్చుకోవడం అవసరమా?అని ఎవరైనా అడగొచ్చు. అవరమే మరి! అలా గుర్తుకు తెచ్చుకోవడం నిరాశావహ తత్వమేమీ కాదు.   జీవితంలోకి దుఃఖమూ ప్రవేశిస్తుందని తెలిసిన వారే కదా! ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. మరణం అనేది ఒకటుందనే విషయాన్ని అన్ని వేళల్లోనూ గుర్తుంచుకున్న వారే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలుగుతారు.
జీవితంలోని కఠోర సత్యాల ప్రస్థావనకే వణికిపోయే వారూ ఉండవచ్చు. కానీ, వణికిపోతున్నారని చేదు సంఘటనలు అసలు జరక్కుండానే ఉండిపోతాయా? విషాదాల్ని నియంత్రించే ప్రయత్నంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. కానీ, సమస్త విషాదాల్నీ నియంత్రించలేవు కదా! జీవితాన్నీ, ప్రాణాల్నీ కాపాడుకునే ప్రయత్నాలు నువ్వెప్పుడూ కొనసాగిస్తూనే ఉంటావు. అంతమాత్రాన అసలు ఎడబాటే లేకుండా చే యలేవు కదా! జీవితాన్ని ఎంత ప్రేమించినా, మరణాన్ని శాశ్వతంగా వెలివేయలేవు కదా! మనిషి శక్తి సామర్థ్యాలకు పరిమితులు ఉన్నాయి. అందుకే ‘పరిమితులు తెలిసిన వాడే పరిపూర్ణ మానవుడు’ అంటారు. ఆ పరిపూర్ణత సాధించిన వాడు దుఃఖాల్ని గమనిస్తూనే నవ్వుల్ని ఆస్వాదిస్తాడు. వియోగాన్నీ, మరణాన్నీ గమనిస్తూనే ప్రేమను ఆస్వాదిస్తాడు. జీవితాన్ని గొప్పగా  అనుభవిస్తాడు.
చేదు నిజాల పరిష్యంగంలోనూ ప్రణయాన్నీ, జీవితాన్నియు ఆసాంతం ఆస్వాదించే ఒక యువ హృదయ రసధ్వని ఈ గీతం.
             -బమ్మెర

2 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. నిజమైన జీవనగీతం bammera ji
    థాంక్యూ soo మచ్

    ReplyDelete