Sunday, May 29, 2016

కిసీనే అప్‌నా బనా కే ముఝ్‌ కో ముస్కురానా సిఖా దియా - Kisine apnaa banake mujko muskurana sikadiya


ఈ దీపం .. తాను వెలిగించిందే.. !! 

తనకు తానే అన్నీ అయి, తనరారే జీవితాలు కొన్ని ఉంటాయి, కానీ, అధఃపాతాళానికి జారిపోయి, ఏ ఆధారమూ దొరక్క అక్కడే అడుగంటే బతుకులు కూడా కొన్ని ఉంటాయి. ఎవరో వచ్చి చేయూత అందించేదాకా ఎన్ని దశాబ్దాలయినా అక్కడే మగ్గుతూ ఉండిపోయే విషాదరకర పరిస్థితులవి. నిజంగానే ఎప్పుడైనా వారి జీవితాల్లోకి అలాంటి వాళ్లు ప్రవేశిస్తే, వాళ్ల ఆనందానికి ఇంక అవధులు ఉండవు. వాళ్ల జీవితోత్సవానికి భూమ్యాకాశాల ఎల్లలు ఉండవు. ఈ ఆనందోద్వేగమే, ‘పతిత’ సినిమా కోసం శైలేంద్ర రాసిన ఈ గీతంలో కనిపిస్తుంది. శంకర్‌ జైకిషన్‌ సంగీత సారధ్యంలో లతా మంగేష్కర్‌ పాడిన ఈ పాట, పారవశ్యానికి ప్రతిరూపంలా ఉంటుంది. 

* * * * * * * *
కిసీనే అప్‌నా బనా కే ముఝ్‌ కో ముస్కురానా సిఖా దియా
అంధేరే ఘర్‌ మే కిసీ నే హస్‌ కే, చిరాగ్‌ జైసే జలా దియా 
(నన్నొకరు తనదానిగా చేసుకుని, నాకు మందహాసం నేర్పారు
చీకటింట్లో నవ్వుతూ ఆయన దీపమేదో వెలిగించారు) 

ఊహతెలిసిన నాటినుంచే నిప్పుల మీద నడిచే జీవితాలు కొన్ని ఉంటాయి. ఆ జీవితాల్లో మనోల్లాసం, మందహాసం లాంటివి మచ్చుకైనా ఉండవు. తానున్న ప్రపంచంలో తనకు తానుగా అంత కన్నా భిన్నమైన జీవితాన్ని ఏర్పరుచుకునే అవకాశమే వారికి ఉండదు. అనుకోకుండా ఎవరో, తన చీకటి జీవితంలోకి వెలుగై వచ్చి, కాసింత అమృతాన్ని హృదయంలోకి ఒంపితే తప్ప ఆ పెదవుల మీద మందహాసం పుట్టదు.
శరమ్‌ కే మారే మై కుఛ్‌ న బోలీ, నజర్‌ నే పర్‌దా గిరా దియా
మగర్‌ వో సబ్‌కుఛ్‌ సమజ్‌ గయే హై, కే దిల్‌ భీ మైనే గవా దియా 

(సిగ్గుతో నే నేమీ మాట్లాడలేదు, నా కనుదోయి ఏదో తెరలు జార్చింది
అయినా, నా మనసునెక్కడో నేను పోగొట్టుకున్నానని ఆయన అర్థం చేసుకున్నారు, ) 

మనసులోకి ఏనాడూ లీలగానైనా రాని ఒక యువరాజు హఠాత్తుగా వచ్చి ఎదురుగా నిలబడితే ఏమైపోవాలి? సిగ్గుతో మెలికలు తిరిగే కనుపాపల్ని దాచేందుకు ఆ వేళ కనురెప్పలే పరదాలవుతాయి. ఎదురుగా ఉన్నదెవరో తల ఎత్తయినా చూడలేనితనాన్ని చూస్తే ఆమె మనసు ఆమెలో లేదని దాన్నెప్పుడో ఆమె ఎక్కడో పోగొట్టుకుంద ని అతనికి అర్థమైపోతుంది. అయినా, ఆకాశమంత ఆనందాన్ని పొదివి పట్టుకోవడానికి అనంతమైన ఆత్మ కావాలి గానీ, పిసరంత మనసెందుకు పనికొస్తుంది? కారణమేదైతే ఏమిటి? కొన్నిసార్లు తన మనసు తన నుంచి దూరమై అలా ఎటో వెళ్లిపోతుంది.
న ప్యార్‌ దేఖా, న ప్యార్‌ జానా, సునీ థీ లేకిన్‌ కహానియాఁ 

జో ఖ్వాబ్‌ రాతోఁ మే భీ న ఆయా, వో ముఝ్‌ కో దిన్‌ మే దిఖాదియా 

(ప్రేమను చూడలేదు, తెలుసుకోనూ లేదు కానీ, ఆ కథలైతే విన్నాన్నేను
ఏ కల రాత్రుళ్లు కూడా రాలేదో, ఆ కలను ఆయన పగలే చూయించారు) 

సాధారణంగా నిజజీవితంలో అందుకోలేనివెన్నో కలలో నిజమైనట్లు వచ్చి మనసును కమనీయంగా మారుస్తాయి. కానీ, ఏనాడూ కలలోకే రాని అద్భుతాల్ని పట్టపగలే ఎవరైనా కళ్ల ముందు నిలబెడితే ఆ మనసేమైపోవాలి? అరుదుగానే కావచ్చు. కానీ, కొన్ని జీవితాల్లో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సాదాసీదా జీవితం గడిపే వారి జీవితాల్లోనే అదొక అద్భుతమైన అనుభవం. అలాంటిది ఆది నుంచే తీరని అగచాట్ల మధ్య గడిపిన జీవితంలోకి ఇలాంటి ఆనందాలు ప్రవేశిస్తే ఆ హృదయాలింక స్వర్గధామాలే కదా!
వో రంగ్‌ భర్‌తే హై జిందగీ మే, బదల్‌ రహా హై మేరా జహాఁ
కోయీ సితారే లుటారహా థా, కిసే నే దామన్‌ బిఛాదియా 

(జీవితాన్ని ఆయన వర్ణమయం చేస్తుంటే, నా లోకమే మారిపోతోంది
ఎవరో నక్షత్రాల్ని వెదజల్లుతున్నారు.. వాటికోసం మరెవరో కొంగు పరుస్తున్నారు) 

లోకంలో చాలా మంది జీవితాలు అంధకార బంధురమే కదా:! ఏ వైపు కాసిన్ని వెలుగురేఖలు వచ్చిపడతాయా అని వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. జీవితం చేదెక్కిపోయిన వాళ్లు అమృత వర్షం కోసం అదేపనిగా నిరీక్షిస్తుంటారు. అలాంటి సమయాల్లోనే కొన్నిసార్లు ఏ క్రాంతి హృదయులో వచ్చి ఆ జీవితాల్లో ఇంద్రధనుస్సును నిలబెడతారు. అదే సమయంలో ఇంకెవరో వచ్చి నక్షత్రాలు వెదజల్లుతుంటారు. వాటన్నింటినీ మూటకట్టుకోవడానికి మరెవరో నేల మీద కొంగు పరుస్తారు. అయితే ఆ ఎదజల్లుతున్నది ఎవరో కాదు తన ప్రేమమూర్తి. ఆ కొంగు పరుస్తున్నది కూడా ఎవరో కాదు తన అంతరాత్మే. నిజంగా ఎంతటి ఆనందకర పరిణామాలివి. కాకపోతే ఈ రోజు ఒకరి ఆలంబనతో నిలబడిన వాళ్లు, ఏదో ఒకరోజున మరొకరి జీవితానికి ఆలంబన కావడానికి ప్రయత్నించాలి. ఒకరు వెలిగించిన దీపకాంతిలో ఈ రోజు జీవితాన్ని చక్కదిద్దుకున్న వాళ్లు, ఎప్పుడైనా మరొకరి జీవితంలో వెలుగు నింపడానికి కంకణ బద్దులు కావాలి. ఎవరి జీవితానికైనా అప్పుడే కదా సార్థకత!!

No comments :

Post a Comment