ఈ మట్టిబొమ్మల్ని... ఎందుకు చేసినట్లు?
దేవుడనేవాడు అనుకోకుండా మనకెక్కడైనా ఎదురైతే ఏం చేస్తాం? మన మనసు మూలల్లో ఎన్నేళ్లుగానో మగ్గుతున్న సవాలక్ష ప్రశ్నల్ని ఆయన మీదికి సంధిస్తాం. సమాధానం చెబుతాడా? నవ్వేసి మౌనంగా ఉండిపోతాడా అన్నది వేరే విషయం. కానీ, ప్రశ్నించడం మాత్రం ఖాయం. దైవం మీద మనిషి కురిపించే ఇలాంటి ప్రశ్నల వర్షమే ‘ తీస్‌రీ కసమ్’ సినిమా కోసం హస్‌రత్ జైపూరి రాసిన ఈ పాటలో కనిపిస్తుంది. శంకర్ జైకిషన్ స్వర రచనకు ముకేశ్ కంఠస్వరం ఎలా ప్రాణం పోసిందో ఎవరికి వారు ఆ పాట విని అంచనాకు రావల్సిందే...!
దునియా బనానే వాలే క్యా తేరే మన్ మే సమాయీ
కాహే కో దునియా బనాయీ, తూనే కాహేకో దునియా బనాయీ
( ఓ లోకకారకా! నీ మనసును ఏమావహించింది?
ఎందుకు సృష్టించావు ఈ లోకాన్ని? నువ్వెందుకు సృష్టించావీ లోకాన్ని?)
శూన్యంలో మహానందంగా ఉన్న ఆ దివ్యమూర్తికి నిజంగా, ఈ లోకాన్ని సృష్టించాలన్న తలంపు ఎందుకు కలిగినట్లు? ఏ వైపునా ఏమీ లేని మహా శూన్యమే కదా ! ఏమొచ్చి గుండెను కమ్మేసినట్లు? మిన్నకుంటే ఏ విపత్తు వచ్చిపడుతుందని, ఈ కోటానుకోట్ల గ్రహాల్ని, ఈ అనంత విశ్వాన్ని సృష్టించినట్లు?
కాహే బనాయే తూనే మాటీ కీ పుత్‌లే, ధర్‌తీ యే ప్యారీ ప్యారీ ముఖ్‌డే యే ఉజ్‌లే
కాహే బనాయా తూనే దునియా కా ఖేలా, ఉస్‌మే లగాయా జవానీ కా మేలా
గుప్‌చుప్ తమాశా దేఖే, వాహ్ రే తేరీ ఖుదాయీ / కాహే కో దునియా/
(నువ్వు ఈ మట్టి బొమ్మల్ని ఎందుకు తయారు చేశావు?
ప్రియాతిప్రియమైన ఈ భూతలాన్నీ, దేదీప్యంగా వెలిగే ఈ ముఖబించాల్ని ఎందుకు చేశావు?
ఎందుకు చేశావీ క్రీడా కాండ, అందులో ఎందుకు చేర్చావీ పరువాల తిరునాల
మళ్లీ....గుట్టుచప్పుడు కాకుండా ఆ చోద్యం చూడటమేమిటి? ఓహో ఏమి దైవత్వం నీది?)
ఇంతటి మనోహర మహీతలాన్ని సృష్టించాలన్న కల ఆ మహదేవునికి ఎందుకొచ్చింది? ఇదంతా అతనికో క్రీడే అనుకున్నా, యువ హృదయాల్ని మేల్కొలిపి ఈ పరువాల జాతర ఎందుకు చేసినట్లు? నిజానికి, అసలు యుద్ధమంతా ఇక్కడే కదా మొదలయ్యేది? ఒక పక్కన ఇవన్నీ జరిగిపోతుంటే, దేవుడు తనకేమీ తెలియనట్లు, ఏదో తమాషా చూస్తాడు ఎందుకని? అసలింతకీ ఈయన నైజం ఏమై ఉంటుంది?
తూ భీ తో తడ్‌పా హోగా మన్ కో బనాకర్, తూఫాఁ యే ప్యార్ కా మన్ మే ఛుపాకర్
కోయీ ఛబీ తో హోగీ ఆంఖో మే తేరీ, ఆసూ భీ ఛల్‌కే హోంగే పల్‌కోఁ సే తేరీ
బోల్ క్యా సూఝీ తుఝ్ కో, కాహే కో ప్రీత్ జగాయీ / కాహే కో దునియా/
ప్రేమ తుఫానును గుండెలో దాచుకుని ఎంతో విలవిల్లాడి ఉంటావు
ఏదో నీ కంట్లో గుచ్చుకునే ఉంటుంది...నీ కనురెప్పల్లోంచి కన్నీరు ఎగిసిపడే ఉంటుంది
అసలు ఏమనిపించింది నీకు, ఎందుకు నువ్వు ఈ ప్రేమను మేల్కొలిపావు?)
మట్టి బొమ్మల కోసమని దేవుడు మనసును సృష్టించాడు కానీ, ఆ సృష్టించే క్రమంలో తనలోనూ ఒక మనసు మకాం వేస్తుందని గుర్తించలేకపోయాడా? కానీ, జరిగింది అదేగా! పరమాత్మ స్థాయి నుంచి మనసుదాకా వస్తే, ఆ సంఘర్షణ మామూలుగా ఉంటుందా? మనసంటూ ఒకసారి అంకురించాక ప్రేమ తుఫానుకు గురికాకుండా ఉంటారా ఎవరైనా? మిగతా విషయాలు ఎలా ఉన్నా, ప్రేమ విషయంలో దేవుడు కూడా అతీతంగా ఉండలేడు. ప్రేమలో పడ్డాక ఎప్పుడో ఒకప్పుడు కళ్లల్లో ఈటెలు దిగడం ఖాయం. హృదయం కన్నీటి పర్యంతం అవడం ఖాయం. అయినా తె లిసి తెలిిసీ దేవుడు ఇవన్నీ ఎందుకు కొనితెచ్చుకున్నట్లు?
ప్రీత్ బనాకే తూనే జీనా సిఖాయా, హస్‌నా సిఖాయా, రోనా సిఖాయా
జీవన్ కే పథ్ పర్ మీత్ మిలాయే, మీత్ మిలా కే తూనే సప్‌నే జగాయే
సప్‌నే జగాకే తూనే కాహే కో దేదీ జుదాయీ / కాహే కో దునియా/
(ప్రేమను సృష్టించి... జీవించడం నే ర్పావు, నవ్వడం నేర్పావు... ఏడ్వడం నేర్పావు
జీవన మార్గంలో ఒక నేస్తాన్ని కలిపావు, నేస్తాన్ని కలపి, కొన్ని స్వప్నాల్ని పొదిగావు
కలలు ఇచ్చిన నువ్వే మరి, ఎడబాటు ఎందుకు ఇచ్చావు?)
ఒక జీవామృతం లేకుండా ఎలా బతుకుతాడీ మనిషనేమో దేవుడు ప్రేమను సృష్టించాడు, అతనికోసం, ఒక జీవన సహచరిని కూడా సృష్టించాడు. ఆ సహచర్య సాంగత్యంలో వేవేల స్వప్నాలకు బీజం వేశాడు. దాని పరిణామంగా వచ్చే వాటిని తట్టుకోవడానికి ప్రతి మనిషికీ నవ్వూ ఏడుపుల్ని సమంగా నేర్పాడు. మనిషి బాగు కోరి ఇంతా ఆలోచించిన వాడు ఆ స్వప్నాలు చెల్లాచెదరయ్యేలా ఆ ప్రేమహృదయాల్ని ఎందుకు ఎడబాపుతున్నట్లు? వీటి వెనుకున్న ఆంతర్యమేమిటో మానవాళికైతే అర్థం కాదు. కానీ, ఆ సృష్టికరక్తకైనా అర్థమవుతుందా అన్నదే అనుమానం? ఇక్కడున్న వాళ్లు ఎన్ని మాట్లాడుకుంటే ఏం లాభం కానీ, ఆ వైపు వెళ్లే వారెవరైనా ఉంటే, నేరుగా ఆయన్నే అడిగితే ఏదో సమాఽధానం చెప్పకుండా ఉంటాడా?
No comments :
Post a Comment