నేనూ మీలాంటి మనిషినే........!
మన పక్కనుంచి వెళుతున్నవాడు కూడా మనిషే, మన వాడే, మనలో భాగమే అనుకునే పరిస్థితిలో అన్నిసార్లూ మనం ఉండం. ఎందుకంటే పక్కవాడు మనలా లేడు. మనలా ఆలోచించడం లేదు. మనలా మాట్లాడటం లేదు. మనలా జీవించడం లేదు. అందుకే మనమూ, వాడూ వేరువేరనుకుంటాం. అందుకే ఎవరి బతుకులు వారి బతుకుతూ ఎవరి దారిన వారు వెళ్లిపోవడమే మేలనుకుంటాం. అందుకే అందరి మధ్య ఉంటూనే చాలాసార్లు ఒంటరి భావనతో ఉండిపోతాం. అన్నీ సానుకూలంగానే ఉన్నప్పుడు ఎవరినుంచి విడిపోయినా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ, ఏ సమస్యో వచ్చినప్పుడు, ఏ సంక్షోభంలోనో పడిపోయినప్పుడు కనీసం ఒక్క మనిషైనా తోడుగా లేడే అని దిక్కులు పిక్కటిల్లేలా పిలుస్తాం. కానీ, అందరినుంచీ ఎప్పుడో విడిపోయిన మన గొంతును ఇప్పుడు ఎవరు వింటారు? ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుటివారి పిలుపునకు బదులిస్తేనే కదా!, మన పిలుపునకు ఎదుటి వారు బదులిస్తారు!. ‘ దోస్తీ’ సినిమా కోసం ఆనంద్ బక్షీ రాసిన ఈ పాట ఈ సందేశమే వినిపిస్తుంది. లక్ష్మీకాంత్- ప్యారేలాల్ బాణీలో ఒదిగిపోయిన రఫీ గొంతు సైతం ఎంతో ఉద్వేగంతో ఆ సందేశాన్ని లోకమంతా వెదజల్లుతుంది.
* * * * *
జానెవాలో జరా, ముడ్ కే దేఖో ముఝే
ఏక్ ఇన్‌సాన్ హూఁ, మై తుమ్హారీ తర్హా
జిస్‌నే సబ్ కో రచా, అప్‌నే హీ రూప్ సే
ఉస్ కీ పహెచాన్ హూఁ మై తుమ్హారీ తర్హా / జానే వాలో/
(ఓ బాటసారులారా! కాస్త వెనుతిరిగి నన్ను చూడండి
మీకు మల్లే నేనూ ఓ మనిషినే
ఎవరు తన రూపంతో మనందరినీ సృష్టించాడో
మీకు మల్లే నేనూ ఆయన గుర్తునే)
నీ మనసే నీ ప్రపంచమైనప్పుడు, నీ జీవిత మే నీ సమస్తమైనప్పుడు నీ ఆవల ఏం జరుగుతున్నా నీకేమీ పట్టదు. అవతల ఎందరో అరుస్తుంటారు, ఆక్రోశిస్తుంటారు అయినా అవేవీ నీ మనసుకు ఎక్కవు. ఎందుకంటే నీ జీవితమే నీకు గానీ అవతలి వారి జీవితంతో నీకేం పని? వాళ్లేమైపోతే నీకేమిటి బాధ? ఎవరైనా బాహ్య ప్రపంచం నుంచి విడిపోతే, మానవాళి అంతా మటుమాయమైపోతే, తానొక్కడే మనిషి ఈ లోకపు సృష్టి తానొక్కడే. తన చుట్టూ ఉన్నవేవీ ఏమీ కావు. తన చుట్టూ ఉన్నవారెవరూ మనుషులూ కాదు మానులూ కాదు. పైగా ఈ సృష్టి గానీ,
సృష్ట్టికర్తగానీ నీకు మాత్రమే ప్రాణం పోసినట్టు, ఈ సృష్టినంతా నీకే దారాధత్తం చేసినట్లు భ్రమిస్తావు. వాస్తవానికి, ఏ పంచభూతాత్మక శక్తి నిన్ను సృష్టించిందో, సమస్త చరాచర జగ త్తునంతా ఆ శక్తే కదా సృష్టించింది. అలాంటప్పుడు నువ్వొక్కడివే మనిషైనట్లు మిగతా ఎవరూ ఏమీ కానట్లు ఉండిపోతావెందుకని? పక్కవాడు గుండెలు బాదుకుంటున్నా, పట్టనట్లే వెళ్లిపోతావెందుకని?
ఇస్ అనోఖే జగత్ కీ మై తక్‌ధీర్ హూఁ
మై విధాతా కే హాథో కీ తస్‌వీర్ హూఁ
ఇస్ జహాఁ కే లియే, ధర్‌తీ మా కే లియే
శివ్ కా వర్‌దాన్ హూఁ మై తుమ్హారీ తర్హా / జానేవాలో/
(ఈ సుందర లోకపు జాతకాన్ని నేను
సృష్టికర్త చేతుల్లోని చిత్రపటాన్ని నేను
ఈ లోకం కోసం, ఈ భూమాత కోసం ఏతెంచిన
మీలాగే శివుని వరప్రసాదాన్ని నేను)
తన అస్తిత్వం, గురించి తానే చెప్పుకోవాల్సి రావడానికి మించిన దురదృష్టం మానవ జీవితంలో మరేముంటుంది. కానీ, ఎదుటి వాళ్లు తన ఉనికిని అసలే పరిగణనలోకి తీసుకోనప్పుడు తనను తానే పరిచయం చేసుకోక తప్పదుగా! లేదంటే తనకింక మనుగడే ఉండదు మరి! నిజానికి సృష్టికి ప్రతిసృష్టి చేచగలిగే మానవుడు ఈ సుందర జగత్తు పాలిటి సౌభాగ్యమూర్తే నువ్వే కాదు సమస్తమానవులూ సౌభాగ్యమూర్తులే. సృష్టికర్త చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్ర కళాకండాలే. భూతలం కోసమే కావచ్చు. సమస్త జగత్తు కోసమైనా కావచ్చు. నీలాగే నాలాగే ప్రతి మనిషీ ఈ లోకానికి శివప్రసాదంగా సిద్ధించినవారే. అందువల్ల నీవొక్కడివే ఈ లోకానికి ఏదైనా చేయగలుగుతావన్నట్లు, మిగతా ఎవరివల్లా ఏమీ కాదన్నట్లు వ్యవహరిస్తే ఏలా? మనుషుల్లో అంతస్తుల వ్యత్యాసాలు ఉండవ చ్చు. హోదాల్లో తేడాలు ఉండవచ్చు. అయితే ఇవన్నీ భౌతిక లోకంలోనే తప్ప, జ్ఞాన లోకంలో ఇవి ఎందుకూ కొరగావు. అందుకే జ్ఞానవంతులు, ఈ తేడాల్ని ఏమాత్రం పట్టించుకోరు. పైగా మనుషులందరినీ సృష్టిలోని దివ్యత్వంలో భాగంగానే చూస్తారు. తన ఆత్మలోనూ భాగంగానే చూస్తారు. అంటే సాటి మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే కన్నీరుమున్నీరవుతారు. అండగా నిలుస్తారు. చేయందిస్తారు. చేయిపట్టుకుని నడిపిస్తారు.
మన్ కే అందర్ ఛుపాయే మిలన్ కీ లగన్
అప్‌నే సూరజ్ సే హూఁ ఏక్ బిఛ్‌డీ కిరణ్
ఫిర్ రహా హూఁ భటక్‌తా మై యహాఁ సే వహాఁ
ఔర్ పరేశాన్ హూఁ మై తుమ్హారీ త ర్హా / జానేవాలో/
(కలుసుండే కాంక్షను మనసులోనే దాచేసుకుని
సూర్యున్నించి విడిపోయిన కిరణాన్ని నేను
బాటతప్పి ఇటూ అటూ తిరుగుతున్నాన్నేను
మీకు మల్లే మహా చింతాక్రాంతుణ్నయ్యాన్నేను)
చెప్పడానికి వెనకాడతాం గానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరమూ మన ఆశాసౌధాల్లోంచి దూరంగా విసిరేయబడి కటిక చీకట్లో కాలిపోరున వాళ్లమే. జీవనయానంలో కాటు కలిసి అటూఇటూ తిరుగుతున్న వాళ్లమే. ఎవరికెవరమూ తీసిపోని రీతిలో అంతు చిక్కని ఆందోళనలో అందరమూ అల్లకల్లోలమవుతున్న వాళ్లమే. అందువల్ల ఇక్కడ ఎవరినో చూసి ఎవరూ తలవంచుకుని వెళ్లాల్పిన అవసరం లేదు. ఎవరినుంచి ఎవరూ తప్పించుకు తిరగాల్సిన అవసరం లేదు. అందరి జీవితాలూ ఇక్కడ తెరిచిన పుస్తకాలే. పైపైన కనపడే రంగులు వేరు వేరు కావచ్చు గానీ, లోపలున్న అందరి మూలాలూ ఒకటే. కష్టాలకూ కన్నీళ్లకూ ఎవరూ అతీతులు కారు. ఇక్కడ అఖండమైన ఆనందమూర్తులెవరూ లేరు. అయినా బాఽధా తప్త హృదయులు నేరస్తులేమీ కాదు. వాటిని అధిగమించే ఏ ప్రయత్నమూ చేయకపోవడాన్ని నిలదీయవచ్చులే గానీ, బాధల్ని అభివ్యక్తం చేయడాన్నే అడ్డుకోవడం కచ్ఛితంగా నేరమే అవుతుంది.
మేరే పాస్ ఆవో ఛోడో యే భరమ్
జో మేరా దుఃఖ్ వహీ హై తుమ్హారా భీ గమ్
దేఖ్‌తా హూఁ తుమ్హే, జాన్‌తా హూఁ తుమ్హే
లాఖ్ అంజాన్ హూఁ మై తుమ్హారీ తర్హా
(భ్రమలన్నీ వదిలేసి నా చెంతకు వచ్చేయండి
ఏ దుఃఖం నాలో ఉందో, ఆ దుఃఖం మీలోనూ ఉంది
మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరేమిటో తెలుసున్నా
లక్షలాది మందితో మీలాగే నిర్లక్ష్యమైపోయాన్నేను)
ఎవరికి వారు తామేదో అతీతులమన్న భ్రమలో ఉంటారు. పక్కనున్న ఏ ఒక్కరితోనూ తమకు పోలికే లేదనుకుంటారు. కానీ, కొమ్మలు వేరు వేరుగా కనపడినా, వృక్షపు కాండం ఒక్కటే కదా! మనుషులైనా తమ అంత స్తుల రీత్యా, హోదాల రీత్యా భిన్నంగా కనపడవచ్చేమో గానీ, వారి ఆవేదనలూ, ఆత్మక్షోభలూ, దుఃఖాలక్షౌ ఏమైనా తేడా ఉంటుందా? శరీరాల రంగూ, రూపూ వేరు కావచ్చేమో గానీ, వాటన్నింటి నిద్ర ఒక్కటే. మరణం ఒక్కటే. నిదురోయాక నాకు నేనుండను. నీకు నీవుండవు. ఎవరికీ తన దంటూ ఏదీ ఉండదు. మరణమూ అంతే అది ఎవరికీ సడలింపులూ, మినహాయింపులూ ఇవ్వదు. మళ్లీ వచ్చి ఆగిపోయిన పనుల్ని పూర్తిచేసే అవకాశం ఎవరికీ ఇవ్వదు. ఎవరైనా అంతిమంగా వెళ్లేది శూన్యారణ్యంలోకే. ఇన్నిన్ని సారూప్యాలు ఉన్నప్పుడు. మనుషులింకా దాచిపెట్టుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికీ ఏముంది? అయినా, ఒకరినుంచి ఒకరు దూరదూరంగా వెళ్లిపోవాలనుకుంటారు? ఒకరినొకరు ఉపేక్షిస్తూ, లోకంలో అందరికందరూ అనామకులుగా మిగిలిపోతారు. ఎవరికీ ఎవరూ పట్టక నిర్లక్ష్యమైపోతారు. ఈ దౌర్భల్యం నుంచి మనిషి బయటపడేదెన్నడో!! అందరితో కలిసిపోయి అందరిలో వ్యాపించి అనంతంగా జీవించేదెన్నడో!!
ReplyDeleteగొప్ప సందేశం ! మానవ నైజాన్ని ఎంత బాగా చెప్పారు రఫీ గొంతులో ఎంత మార్దవం వుంది ! పాట ఎన్నిక అద్భుతం ... బమ్మెర గారికి వందనాలు
ReplyDeleteగొప్ప సందేశం ! మానవ నైజాన్ని ఎంత బాగా చెప్పారు ఆ రోజుల్లో ...పాటల్లో అది సోలో కానీ ద్యూయెట్ కానీ విషాదగీతం కానీ నేపథ్య గీతం కానీ వేదాంతం , జీవన సత్యాలు ఉండేవి . రఫీ గొంతులో ఎంత మార్దవం వుంది! పాట ఎన్నిక అద్భుతం ... బమ్మెర గారికి వందనాలు --
ReplyDeleteగొప్ప సందేశం ! మానవ నైజాన్ని ఎంత బాగా చెప్పారు ఆ రోజుల్లో ...పాటల్లో అది సోలో కానీ ద్యూయెట్ కానీ విషాదగీతం కానీ నేపథ్య గీతం కానీ వేదాంతం , జీవన సత్యాలు ఉండేవి . రఫీ గొంతులో ఎంత మార్దవం వుంది! పాట ఎన్నిక అద్భుతం ... బమ్మెర గారికి వందనాలు --