Tuesday, July 12, 2016

దిల్‌ మే కిసీ కే ప్యార్‌ కా జల్‌తా హువా దియా - Dil Me kisi ke pyaar ka jaltha hua diya


పెనుగాలి వీస్తే, ప్రేమకేమవుతుంది? 


 * * * * *   

రెండు హృదయాలు కలిసి వెలిగించిన ప్రేమజ్యోతిని చూసి నిండుగా ఆశీర్వదించాలి కదా ఎవరైనా! కానీ, చాలా సార్లు జరుగుతున్నదేమిటి? లోకం కుళ్లుకుంటుంది. దాని కళ్లు నిప్పులు కక్కుతాయి. ఆ నిప్పురవ్వలు మహామంటలై ఎగిసిపడటానికి లోకం పెనుగాలుల్ని ఎగదోస్తుంది. ఉప్పెనల్ని ఉసిగొలుపుతుంది. ఒక్కోసారి తనవాళ్లనుకున్న వాళ్లు, కడదాకా తనతో కలిసి నడుస్తారనుకున్న వాళ్లు సైతం ఆ లోకం గొంతులో గొంతు కలుపుతారు. తమ గతమంతా మరిచిపోతారు. అయినా నిజమైన ప్రేమలు వెనుకంజవేయవు. ఆ ప్రేమనుంచి వైదొలగిపోవు పైగా, గుండెలోని ఆ ప్రేమను ఒక మహాజ్వాలను చేస్తాయి. మహీతలాన్నంతా కాంతిమయం చేస్తాయి.. ‘ఏక్‌ మహల్‌ హో సప్‌నోంకా’ సినిమోకోసం సాహిర్‌ లుధ్యాన్వీ రాసిన ఈ పాటలో ఈ సత్యాలే ప్రతిధ్వనిస్తాయి. రాగజలపాతాల రవి సంగీత దర్శకత్వంలో లతా మంగేశ్కర్‌ ఐదు దశాబ్దాల క్రితం గానం చేసినీ ఈ పాట తరగని తాజాదనంతో భారతీయ హృదయాల మీద ఇప్పటికీ తారట్లాడుతూనే ఉంది. 
* * * * * *  
దిల్‌ మే కిసీ కే ప్యార్‌ కా జల్‌తా హువా దియా 
దునియా కీ ఆంధియోఁ సే భలా యే బుజేగా క్యా /దిల్‌ మే/ 
(గుండెలో మండుతున్న ప్రేమ జ్యోతి ఎవరిదైనా 
లోకపు పెనుగాలులతో చల్లారిపోతుందా ఎపుడైనా?) 
‘‘లోకంలో ఆనందం ఒక్కటే సత్యం. దుఃఖాలన్నీ కల్పితాలే ’’అంటూ ఉంటారు. ఆ మాటకొస్తే, ‘‘లోకంలో ప్రేమ ఒక్కటే సత్యం. ద్వేషాలన్నీ కల్పితాలే.’’ ద్వేషాలు వాటికవిగా ఉన్నవి కావు. దేనికో ప్రతిగా, వ్యతిరేకంగా పుట్టుకొచ్చినవి. మనిషే కావాలని పనికట్టుకుని పెంచిపోషించుకున్నవి. ద్వేషాలు అసత్యమైనవి, కృత్రిమమైనవి. కృత్రిమమైనవెప్పుడూ బలహీనమైనవే. అందుకే ప్రేమకున్న శక్తిలో వెయ్యోవంతు కూడా ద్వేషానికి ఉండదు. ప్రేమ అమృతమైతే, ద్వేషం విషం. ఈ ద్వేషపు విషం ఎదలోపల ఎంతో కాలం ఇమడలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఎగదన్నుకొస్తుంది. ఎదుటివారిని ధ్వసం చేయాలని చూస్తుంది. కొంత ప్రయత్నం కూడా చేస్తుంది కానీ, అతిమంగా ఓడిపోతుంది. మౌలికంగా, కలిసిపోయేదీ, కలిపేదీ, కలపాలనుకునేదీ ప్రేమ. విడిపోయేదీ, విడగొట్టేదీ, విడగొట్టాలనుకునేదీ, ద్వేషం. అయితే కలపాలనుకునే వాటికున్న శక్తిలో వెయ్యోవంతు కూడా విడగొట్టాలనుకునే వాటికి ఉండదు. నిలబెట్టాలనుకునే వాటికి ఉన్న శక్తిలో వెయ్యోవంతు కూడా పడగొట్టాలనుకునే వాటికి ఉండదు. సత్యానికి ఉన్న శక్తిలో వెయ్యోవంతు కూడా అసత్యానికి ఉండదు. అందుకే లోకంలో ఎప్పుడూ సత్యానిదే పై చేయి అవుతుంది. సత్యసంహితమైన ప్రేమదే పై చేయి అవుతుంది. ప్రేమ అంటే ఒక పరమసత్యం. ఒక అఖండ జ్యోతి. సత్యం అంటే అది వేయి సూర్యుళ్లకు సమానం. ప్రేమించే హృదయం వేయి ఆకాశాలకు సమానం. అందుకే ద్వేషాలు ఎంత ఎత్తున ఎగిసిపడినా, పెనుగాలులై విరుచుకుపడినా అవి అవి అఖండమైన ప్రేమ జ్యోతిని ఆర్పలేవు. ప్రేమ హృదయూన్ని కాల్చలేవు
సాసోం కి ఆంచ్‌ పాకే భడక్‌తా రహేగా యే 
 సీనేవేు దిల్‌ కే సాథ్‌ భడక్ తా రహేగా యే

వో నక్శ్‌ క్యా హువా జో విుఠాయేు సే విుఠ్‌గయా 
వో దర్ద్‌ క్యా హువా జో దబాయే సే దబ్‌గయా / దిల్‌ మే/
 (ఊపిరుల సెగలందుకుని ప్రజ్వలిస్తూనే ఉంటుంది 
ఎదలోపల గుండెతో పాటు కొట్టుకుంటూనే ఉంటుంది 
చెరిపేస్తే చెరిగిపోతే ఇంక ఆ ముద్ర ఏపాటిది? 
అణిచేస్తే అణిగిపోతే ఇంక ఆ బాద ఏపాటిది?) 
జీవితమంతా ఎప్పుడూ ఏదో రకమైన ఉప్పెనలూ,, సుడిగుండాలేకదా!, వీటి మధ్య ఈ ప్రేమ దీపం ఎంతకాలం నిలుస్తుందిలే అనుకోవడంలో అర్ధం లేదు. ఉఛ్వాస- నిశ్వాసల అగ్ని ధారలే అసరాగా అది జాజ్వల్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. నువ్వున్నంత కాలం నేనూ ఉంటానంటూ గుండెను అంటి పెట్టుకుని నిండు సమద్రంలా సాగిపోతూనే ఉంటుంది. అయితే, ఎదురీదటవేు తెలియనప్పుడు ప్రవాహంలో ఏ చిన్న అల ఎగిసిపడినా గుండె గుభేలుమంటుంది. ఎక్కడ ఏ చిన్న మొసలి పిల్ల కనిపించినా ప్రాణాలు ఆగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఎదురీత తెలియని వాడిని ఎవరైనా ఈతగాడని ఎలా అంటారు? ఎదురుపడిన మొసలి మీదికి ఖడ్గం ఝలిపించని వాడు జీవితంలో ఏం తెలుసుకున్నట్లు? నువ్వు వెళ్లే మార్గం ఎంత సుదూరమైనదైతే నీ పాదముద్రలు అంత బలంగా పడతాయి. ఆ ముద్రలు ఎవరో తుడిచేస్తే పోయేవి కావు. నీ లక్ష్యం పట్ల నీ ప్రేమ ఎంత లోతైనదైతే, దాన్ని అందుకోవడానికి నీలో అంత లోతైన బాధ ఉంటుంది.. ఆ బాధ ఎవరో అణచివేస్తే అడుగంటిపోయేది కాదు.
యే జిందగీ భీ క్యా హై, అమానత్‌ ఉన్హీ కి హై  
యే శాయ్‌రీ భీ క్యా హై, ఇనాయత్‌ ఉన్హీ కి హై 
అబ్‌ వో కరమ్‌ కరే కె సితమ్‌ ఉన్‌కా ఫైస్‌లా 
హమ్‌నే తో దిల్‌ మే ప్యార్‌ కా శోలా హీ జగా లియా / దిల్‌ మే/ 
(ఏముంది ఈ జీవితం? అతని ఐశ్వర్యమే ఇది. 
ఈ కవిత్వమైనా ఏముంది? అతని ఆశీర్వాదమే ఇది ! 
ఇప్పుడు ఏ వంచనకు పాల్పడినా అదింక అతని నిర్ణయమే సుమా 
నేనైతే మనసులో ప్రేమజ్వాలనే జాగృతం చేశా ) 
ఎక్కడో పాతాళంలో పడి ఉన్న జీవితాల్ని కొందరు ఏ నక్షత్ర మండలానికో చేరుస్తారు. ఎడారిలో పడి ఉన్న ఇసుక రేణువుల్ని వజ్రతుల్యంగా మారుస్తారు. నిండు జీవితం నీదేనంటూ మనస్పూర్తిగా ఆశీర్వాదిస్తారు. జీవితాంతపు ఆసరాగా నిలుస్తానని బాసలు కూడా చేస్తారు. అప్పటికది నిజమే. ఆ నోటి ప్రతిమాటా అక్షర సత్యమే. కానీ అంతలోనే ఏమో అయిపోయినట్లు, ఏ విపరిణామాలో వచ్చిపడి అంతా తారుమారైపోవచ్చు. లోకపు ఒత్తిళ్లకు తలొగ్గి తాను నిర్మించిన సౌధాన్ని తానే కూల్చేయడానికి అన్నట్లు, ఏ విద్రోహానికో పాల్పడుతున్నట్లు ప్రతి అడుగూ విరుద్ధంగానే పడుతుంది. ప్రతి మాటా గుండెలో ఈటెలాగే దిగబడుతుంది. అయినా, అంతకుముందే అతని ప్రేమను స్వీకరించిన వాళ్లు వెనుకంజ వేయరు.‘‘అది అతడు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయాన్ని నేనెందుకు కాదనాలి. ’’ అనుకుంటారు. నిజమే కదా! ఇప్పుడేదో అయిపోయిందని మనసు మార్చుకోవడం ఏమిటి? గతాన్నంతా మరిచిపోవడమేమిటి? అయినా, భూమధ్య రేఖలా భువనాన్నంతా చుట్టేసిన ప్రేమ వెనక్కి ఎలా వెళుతుంది.? వలయాలు వలయాలుగా భూతలాన్ని అన్ని వైపుల నుంచి ఇంకా ఇంకా అల్లుకుపోతుంది. గుండెలో ప్రేమ జ్వాలల్ని వేయి చేతులతో ఎగదోసుకుంటుంది. గగనతలమంతా ప్రతిధ్వనించేలా గంధర్వగానం చేస్తుంది.
=============                                                                                                              బమ్మెర


1 comment :

  1. చాలా కాలం తర్వాత జీవనగీతం చదివాను , అనేక కారణాల వల్ల ఇది జరిగింది . ఇప్పుడు చదవగానే పాట రాసిన కవి సాహిర్ కు స్వరపరిచిన రవికి ఆ పాటకు తెలుగులో మీ వివరణకు హ్యాట్సాఫ్ !

    ReplyDelete