ఏ గమ్యాన్నీ చేరలేవు
‘‘యుద్ధం చేసి సాధించే విజయం కన్నా, అసలు యుద్ధమే రాకుండా నిలువరించడంలోనే నిజమైన విజయం ఉంది’’ అంటూ ఉంటారు. నిజమే.... కానీ, అన్ని ప్రయత్నాలూ విఫలమై, అనివార్యంగా యుద్ధమే వస్తే....? అదేమైనా తక్కువ పాఠాలు చెబుతుందా..! పాఠాలు చెప్పడమే కాదు అప్పటిదాకా మనలో నిక్షిప్తమై, నిగూఢంగా ఉన్న అనేకానేక శక్తి యుక్తులన్నింటినీ మహా విస్పోటనంలా బయటపెడుతుంది. నిజానికి, ఎన్నోసార్లు సంఘర్షణల్నీ, సమరాల్నీ అడ్డుకోవడం సాధ్యమే కాదు. అలాంటప్పుడు ఆ సమరాల గాయాల్నించి, సంఘర్షణల హృదయ క్షోభల్నించి ఏం నేర్చుకుంటున్నామన్నదే కీలకమవుతుంది. ఈ మాటలే, 1987లో విడుదలైన ‘ఇన్సాఫ్’ సినిమా కోసం ఫారుఖ్ కైజర్ రాసిన పాటలో విన పడతాయి. లక్ష్మీకాంత - ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో అనురాధా పౌడ్వాల్ పాడిన ఈ పాట పైకి సరదాగానే అనిపించినా ఎంతో లోతైన నీతినీ, గుండెను ఉక్కుపిండాన్ని చేసే స్పూర్తినీ అందిస్తుంది.
హమ్‌సఫర్! మిల్‌తీ హై మంజిల్- ఠోకరేఁ ఖానేకే బాద్
రంగ్ లాతీ హై హినా- పత్థర్ పే ఘిస్ జానే కే బాద్
మౌజ్ బన్‌జాతీ హై తూఫాఁ- సాహిల్ సే టక్‌రానే కే బాద్
రంగ్ లాతీ హై హినా- పత్థర్ పే ఘిస్ జానే కే బాద్
(ఓ సహయాత్రీ! ఎదురు దెబ్బలె న్నో తిన్న తర్వాతే గమ్యం లభిస్తుంది.
రాతి మీద వేసి నలిచిన తర్వాతే గోరింటాకు రంగు బయటికొస్తుంది
దరిని ఢీకొన్న తర్వాతే ఉప్పెన, కెరటంగా మారుతుంది.
రాతిమీద వేసి నలిచిన తర్వాతే గోరింటాకు రంగు బయటికొస్తుంది)
ఏ నగరానికో, ఏ దేశానికో వెళ్లాల్సి వస్తే, అప్పటికే, ఎవరో, ఎప్పుడో సిద్ధం చేసి ఉంచిన దారులు మీకు స్వాగతం పలుకుతాయి. సమాజం కోసం సమాజం తన బాధ్యతగా ఇలాంటివెన్నో ఏర్పాటు చేస్తుంది. కానీ, నీ కోసం, నీకు నువ్వుగా ఏర్పరుచుకున్న గమ్యానికి అవసరమైన ఆ ఏర్పాట్లు ఎవరో సిద్ధం చేసి ఉంచరు కదా! ఇక్కడ ప్రతిదీ నువ్వే ఏర్పరుచుకోవాలి. ఆ గమ్యం చుట్టూ ఉన్న కీకారణ్యాన్ని నువ్వే నరుక్కుని, నువ్వే బాట వేసుకుని, నువ్వే నడిచి వెళ్లాలి. ఇదెంతో క్లిష్టమైనది, కష్టమైనది. చేరుకోవాలనుకునే గమ్యాలు నిజ.ంగా, ఎంత అందంగానో, అపురూపంగానో ఉంటాయి. కానీ, వాటిని చేరుకునే ప్రయత్నంలోనే వేలాది ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. కాకపోతే, ఆ ఎదురుదెబ్బల్లోనే, ఎదురీతల్లోనే నువ్వేమిటో బయటపడుతుంది. గాలిగాలిగా ఎగిసిపడుతూ హోరెత్తిపోయే ఉప్పెనైనా, సముద్రపు దరిని ఢీకొన్న తర్వాతే కదా అది ప్రవాహంగా మారుతుంది! రాపిడికి గురైన తర్వాతే, గోరింటాకు రంగు బయటపడ్డట్టు, వేలాది ఘర్షణలూ, గాయాల తర్వాత గానీ, నువ్వు నువ్వుగా ఆవిష్కృతమయ్యే అవకాశం లేదు.
కిస్ లియే నారాజ్ హై- సారే జహాఁ సే జానేమన్
ఖూనే-దిల్ సే సీంచ్‌నే పడ్‌తే హై - ఖ్వాబోంకే చమన్
బీంజ్ తో బన్‌తే హై ఫూల్- మిట్టీ మే మిల్‌జానే కే బాద్ /రంగ్ లాతీ హై/
(ప్రియతమా! ఎందుకిలా నువ్వు మొత్తం లోకం మీదే అలకవ హించావు?
కలల తోటల్ని, గుండె రక్తంతో తడపాల్సి ఉంటుంది!
మట్టిలో కలిసిపోయాకే కదా! పూలు విత్తనాలవుతాయి./ రాతిమీద /
అవతలి వాళ్లు మనం వెళ్లే దారిలో అడ్డంగా వచ్చినప్పుడు మనలో అంతులేని ఆక్రోశం పుట్టుకొస్తుంది. వాళ్ల లక్ష్యం వాళ్లదని మనకు అప్పుడు అనిపించదు. పైగా, లోకం లోకమంతా మనకు శత్రురాజ్యంగానే కనిపిస్తుంది. ఏమైతేనేమిటి? ఎవరి శక్తి అసమానమో వారికే ఇక్కడ విజయం లభిస్తుంది. కాకపోతే ఆ విజయ సాధనకు నిర్జీవమైన అడుగులు సరిపోవు. శరీరం రక్తపు మడిలో దొర్లుతున్నా, లెక్కచేయని, ఒక మొక్కవోని సమరస్ఫూర్తి కావాలి. కలలు కనగానే సరిపోదు కదా!. గుండె రక్తంతో తడిపితే గానీ, ఆ కలల తోటలు బతకవు మరి! ఈ వడగాలిలో కొన్ని కుసుమాలు రాలిపోవచ్చు. అయ్యో పూలు నేలరాలిపోతున్నాయని క్షోభిస్తే ఎలా? అలా మట్టిలో కలిసిన పూలే కదా అంకురాలై, ఒక నందనానికి నాంది పడుతుంది. అందుకే లోకం మీద అలక వహించడం కాదు. అనుకున్నప్పుడు, ఆశయ సాధనకోసం, యుద్ధభూమిలో దిగిపోవడమే సరియైున సమాధానమవుతుంది.
బాద్ మే బన్‌నా ఖుదా - పహెలే జరా ఇన్సాన్ బన్
జిందగీ మే హై జరూరీ - థోడా సా దీవానా పన్
బాత ఆతీ హై సమఝ్ మే- హోశ్ ఉడ్‌నే కే బాద్ /రంగ్ లాతీ హై/
(దైవం కావడం తర్వాత, ముందు కాస్త మనిషిగా మారు
జీవితంలో కాస్తంత పిచ్చితనం కూడా అవసరమే సుమా!
స్పృహలన్నీ ఎగిరిపోయాకే అసలు విషయాలు బోధపడతాయి /రాతి మీద/
ఎంత ఆవేశం ఉన్నా, ఎంతటి మహా లక్ష్యమైనా ఏకంగా ఆకాశాన్నే హస్తగతం చేసుకోవాలనకుంటే ఎలా? దానివల్ల ఒక్కోసారి, అటు ఆకాశానికీ, ఇటు నేలకూ కాకుండా పోతాం. ముందు ఏదో ఒక నక్షత్రాన్ని పిడికిట్లోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరైనా అమాంతంగా దైవమైపోవాలనుకుంటే మాత్రం ఎలా? అంతేసి ఆధ్యాత్మికం ఆదిలోనే ఎందుకు? అయినా, జీవిత సార్థకతకు ఈ మానవ జన్మేమీ తక్కువ కాదు. అనంతత్వం, ఆఽధ్యాతికం ఇవే సర్వోత్తమం అనుకోవడం బాగానే ఉంది. కానీ, వాటిని చేరుకోవాలంటే ఒక మహా ప్రయాణం చేయాలి. జీవితం ఒక మహా యజ్ఞం కావాలి. అంతదాకా ఎందుకు? నీదీ, నాదనే ఆ కాస్త స్పృహ వదిలేయాలే కానీ, ఈ భౌతిక ప్రపంచం కూడా ముక్తిని ప్రసాదిస్తుంది. భౌతిక లోకాన్ని పిచ్చిగా ప్రేమించినప్పుడే దానికున్న అపారమైన ఆ శక్తేమిటో తెలుస్తుంది. వాస్తవానికి స్వీయ అస్తిత్వపు, వ్యక్తిత్వపు బంధనాలు దాటిన తర్వాతే ఎవరికైనా అసలు సిసలైన జీవిత సత్యాలు బోధపడతాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, తట్టుకుని, అనుకున్నది సాధించే అనంత శక్తియుక్తులు సొంతమవుతాయి.
No comments :
Post a Comment