ఏడుస్తూ వచ్చినా.. నవ్వుతూ వెళ్లిపోతా...
‘జీవితానికి అర్థం లేదు. దానికి మనమే ఒక అర్థం కల్పించాలి’ అంటారు తత్వవేత్త జియో పాల్ సార్థ్. నిజమే కదా ! ఏ ప్రాణీ పుట్టుకతోనే ఒక అర్థాన్ని పునికి పుచ్చుకుని, ఒక గమ్యాన్ని ఎంచుకుని లోకంలోకి రాదు. వచ్చాక చేసిన కొన్ని పరిశీలనలు, పరిశోధనల తరువాత, ఎదురైన కొన్ని అనుభవాల తరువాత జీవితం పట్ల కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. వాటి ఆధారంగా మరికొన్ని ఆలోచనలు చేస్తాం. మనవైన అర్థాలు చెప్పుకుంటాం. మనకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పరుచుకుంటాం. అవన్నీ మనం ఏర్పరుచుకున్నవే తప్ప అందులో ఏవీ సహజంగా ఉన్నవేమీ కాదు.అందుకే ఎంత అధ్యయనం చేసినా జీవితానికి పూర్తి అర్థం బోధపడినట్లు అనిపించదు. ఆ బోధపడక పోవడానికి జీవితమూ, ప్రపంచమూ నిరంతరం మారుతూ ఉండడమూ ఒక కారణమే. వాస్తవానికి జీవితం ఏ మేరకు అర్థమయ్యిందని కూడా కాదు, అన్ని పరిణామాల్ని ఎదుర్కొంటూనే ఆనందం జారిపోకుండా నిలబడగలిగావా లేదా అన్నదే అన్నిటికన్నా ముఖ్యమవుతుంది. ‘సఫర్’ సినిమా కోసం ఇందీవర్ రాసిన పాటలో ఈ ప్రస్థావనే ఉంది. కళ్యాణ్‌జీ- ఆన ంద్‌జీ స్వరపరిచిన ఈ పాటను గండుకోయిల కిశోర్ కుమార్ గానం చేశారు.
జిందగీ కా సఫర్, హై యే కైసా సఫర్
కోయి సమ్‌ఝా న హీఁ కోయి జానా నహీఁ
హై యే కైసీ డగర్, చల్‌తేహై సబ్ మగర్
కోయి సమ్‌ఝా నహీఁ కోయి జానా నహీఁ/జిందగీ కా/
(ఈ జీవనయానం, అదేమిటో గానీ,
ఎవరూ దీన్ని అర్థం చేసుకోలేదు. ఎవరికీ ఇది బోధపడలేదు.
అదేమి మార్గమో గానీ, అందరూ అందులోంచే నడుస్తున్నా ఆ మార్గం గురించి
ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ బోధపడలేదు.)
అనంతమైన ఈ సృష్టి, దాని నిరంతరమైన పరిణామాలు అనుక్షణం నీ మీద ప్రభావం చూపుతూనే ఉంటాయి. అలాగే మానవాళి ఆలోచనా ప్రభావం కూడా సమాజం మీద పడుతూనే ఉంటుంది. పరస్పరం ప్రభావితం అవుతూనే ఉంటాయి. అందుకే ఎక్కడా ఏదీ నిలకడగా ఉండదు. ప్రపంచంలో ఏదీ నాశనం కాదు కూడా కాకపోతే , నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటాయి. అయితే నిలకడగా లేని దాన్ని ఎవరైనా నిశితంగా ఎలా పరిశీలించగలరు? అందుకే ఎన్నేళ్లు గడిచినా జీవిత యాత్ర ఎవరికీ స్పష్టంగా అర్థం కాదు. ఎవరికీ సంపూర్ణంగా బోధపడదు. ఎందుకంటే అప్పటికి అవే నిజమనిపించిన ఎన్నో సత్యాలు కొంత వ్యవధిలోనే సమూలంగా మారిపోతుంటాయి. కాకపోతే ప్రపంచంలో ఏదీ శాశ్వత సత్యం కాదనే నిజమొకటి ఎప్పటికప్పుడు బోధపడుతునే ఉంటుంది. అదే మనసును కొంత నిలకడగా ఉంచుతుంది. అదే అన్నింటి పైనా ఒక సమదృష్టిని కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకింత అయోమయం, ఒకింత జ్ఞానస్పృహ ఇవే జీవితాన్ని నడిపిస్తాయి.
జిందగీ కో బహత్ ప్యార్ హమ్‌నే దియా
మౌత్ సేభీ మొహబ్బత్ నిభాయేంగె హమ్‌ః
రోతె రోతే జమానే మే ఆయే మగర్
హస్తే, హస్తే జమానే సే జాయేంగ్ హమ్
జాయేంగె పర్ కిధర్, హై కిసే యే ఖబర్
కోయి సమ్‌ఝా నహీఁ కోయి జానా నహీఁ / జిందగీ కా/
( జీవితానికి నేనెంతో ప్రేమ పంచాను-మృత్యువు పట్ల కూడా నేను అంతే ప్రేమతో ఉంటాను. ఏడుస్తూ, ఏడుస్తూ లోకం లోకి వచ్చాను గానీ, నవ్వుతూ నవ్వుతూ లోకంలోంచి వెళ్లిపోతా. కాకపోతే ఆ వెళ్లేది ఎక్కడి కి అన్న సమాచారమే ఎవరి వ ద్దా లేదు. అందుకే ఆ ప్రదేశం గురించి, ఆ ప్రయాణం గురించి ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ బోధపడలేదు.)
సమస్త విషయాల మీద, సమస్త జీవన పరిణామాల మీద సమదృష్టి కలిగి ఉండడమే జ్ఞానానికి పరమావధి. ఆ దృష్టే ఏర్పడిన్నాడు. అతనికి జీవితమూ మరణమూ సమానంగానే కనపడతాయి. ఆ పరిణతి ఏర్పడిన మనిషి జీవితం పట్ల మనిషి ఎంత ప్రేమగా ఉంటాడో మృత్యువు పట్ల కూడా అంతే ప్రేమగా ఉంటాడు. పుట్టేటప్పుడు ఏడుపు లంఘించినా పోయే టప్పుడు మాత్రం మందహాసంతో ఉండిపోతాడు. కాకపోతే ఆ పోయేది ఎక్కడికో ఏమీ అర్థం కాకపోవడమే ఇక్కడ సమస్య. జీవితంలో అంతుచిక్కని విషయాలు ఎప్పుడూ ఉంటాయి. వాటికోసం ఇంకా నిరీక్షించకుండా, అర్థమైన వాటితోనే జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో తెలియడమే వివేకం మరి!
ఐసే జీవన్ భీ హై జో జియే హీ నహీఁ
జిన్ కో జీనే సే పహెలే హీ మౌత్ ఆగయీ
ఫూల్ ఐసే భి హై జో ఖిలే హీ నహీఁ
జిన్‌కో ఖిల్‌నే సే పహెలేహీ ఖిజా ఛాగయీ
హైఁ పరేశాఁ నజర్ థక్ గయే చారగర్
కోయి సమ్‌ఝా నహీఁ కోయీ జానా నహీఁ / జిందగీ కా/
( జీవితాలన్న పేరే కానీ, వాటిలో కొన్ని అసలు జీవించనే లేదు.
జీవించడం కన్నా ముందే వాటిని మృత్యువు ఆవహించింది.
పూలన్న పేరే కానీ, వాటిలో కొన్ని అసలు వికసించనే లేదు.
వికసించడం కన్నా ముందే అవి హేమంతానికి ఆహుతైపోయాయి.
మనసులు ఆవేదనతో నిండిపోవడం, అలసిపోయి చూడటమే గానీ,
ఈ పరిణామాలు ఎవరికీ అర్థం కాలేదు. ఎవరికీ బోధపడ లేదు.)
వికసించడం కన్నా ముందే కొన్ని పూలు రాలిపోయినట్లు, కొన్ని ప్రాణాలు ఇంకా జీవించడం మొదటెట్టక ముందే మృత్యువు పాలవుతాయి. ఒక దశలో జీవితం ఎంతో సుదీర్ఘమని అనిపించినా మరోదశలో జీవితం ఎంత క్షణికమో బోధపడుతుంది. '' నిండు నూరేళ్ల జీవితాన్ని ఊహిస్తూనే మరోపక్క దానికి సమాంతరంగా నడిచి వచ్చే మృత్యువును కూడా అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. అప్పుడే ప్రాణం సౌరభాలు వెదజల్లుతుంది. జీవితం సార్థకమవుతుంది '' అన్న లోతైన జీవన తాత్వికతను తెలిపే అద్భుత గీతమిది.
No comments :
Post a Comment