ఆకాశంలోకి ఎగిరానని అంత అహం ఎందుకు ?
హీరోలకే తప్ప విలన్ పాత్రధారులకు అత్యున్నత పురస్కారాలు రావడం చాలా... చాలా అరుదు. దాదాపు 400 సినిమాల్లో విలన్ పాత్రలే ధరించిన ప్రాణ్‌కు దాదా సాహెబ్ పాల్కే అవార్డు రావడం అంతటి అరుదైన సంఘటనే మరి! కాకపోతే, సినీ జీవితమంతా విలన్ పాత్రలే పోషించిన ప్రాణ్, 'ఉప్‌కార్' సినిమాలో మాత్రం, ఎంతో హృద్యమైన క్యారెక్టర్ పాత్ర పోషించారు. ఆ సినిమాలోని ‘కస్‌మే వాదే ప్యార్ వఫా సబ్’ అన్న పాటలోని ఆయన అభినయం నిజంగా, కోట్లాది భారతీయ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించింది.
జీవన ప్రవాహంలో, భావోద్వేగాల వెల్లువలో మనిషి ప్రతిరోజూ ఏవేవో మాటలు చెబుతుంటాడు. తన మాట, తన బాట ఒకటేనని కూడా చెబుతాడు. కాకపోతే, ప్రతి మాటా మరీ అంత ఆలోచనాత్మకం కాకపోవడం వల్ల, ఆలోచన మారినప్పుడు అతని మాట కూడా మారిపోవచ్చు. ఆ పరిస్థితిని ఎవరైనా కాస్త అర్థం చేసుకోవచ్చు. అయితే వాగ్దానం అనే మాట పూర్తిగా వేరు. ప్రత్యేకించి ప్రమాణం చేసి మరీ చెప్పడం వేరు. ఎవరైనా ఏ విషయంలోనైనా వాగ్ధానం చేశారూ అంటే, ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే, చేసిన వాగ్దానం నుంచి వైదొలగడని మానవలోకం బలంగా నమ్ముతుంది. అయితే, ఎవరైనా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఏ కారణాన్నో మిషగా చూపించి ఆ వాగ్ధానానికి విరుద్ధంగా వెళితే ఏమనుకోవాలి? అప్పటిదాకా అతని వాగ్దానాన్ని నమ్మి, సర్వశక్తులూ ధారవోసి, జీవితాన్నే ఫణంగా పెట్టి, అతని వెంట నడిచిన వాళ్లంతా ఏమైపోవాలి? వాగ్ధానం అన్నది సాదాసీదా మాటలా చంచలంగా మారిపోతే ఆ రెండింటికీ మధ్య తేడా ఏముంది? ఇలాంటి చేదు అనుభవాల తర్వాత మళ్లీ ఎవరైనా, ప్రమాణాలు చేస్తేనో, వాగ్ధానాలు చే స్తేనో ఎలా ఉంటుంది? వినేవాళ్ల గుండెలు ఆక్రోశంతో మండిపోతాయి. మహా అగ్నిగోళాలై చండ్రనిప్పులు ఎగజిమ్ముతాయి? ఆ ఆక్రందనకూ, ఆవేదనకూ ప్రతిరూపమే ఈ గీతం. ‘ఉప్‌కార్’ సినిమా కోసం ఇందీవర్ ఈ గీతాన్ని రచించగా, కళ్యాణ్‌జీ ఆనంద్‌జీ స్వరపరిచారు. ఆకాశం పిక్కటిల్లేలా అంతరంగ లోకాన్ని ప్రతిధ్వనింప చేస్తూ, ‘మన్నాడే’ ఈ గీతాన్ని ఆలపించిన తీరు అనితర సాధ్యం!
కస్‌మే వాదే ప్యార్ వఫా సబ్ - బాతే హైఁ బాతో కా క్యా
కోయీ కిసీకా నహీ యే ఝూటే - నాతే హైఁ నాతోంకా క్యా
(ప్రమాణాలూ, వాగ్ధానాలూ ఇవన్నీ ఉత్త మాటలే- ఈ మాటలదేముంది?
ఎవరూ ఎవరికీ కారు. అన్నీ అసత్యపు బంధాలే- ఈ బంధాలదేముంది?)
మాట అంటే ఉత్తుత్తి శబ్ధం కాదు కదా! అది మనిషిలోని నిలువె త్తు నిబద్ధతకు ప్రతిరూపం. మాటంటే ఒక ప్రాణచలనం. మాటే కదా బంధాల్నీ మానవ సంబంధాల్నీ నిలబెట్టేది వాస్తవానికి బంధం అన్నది మానవ హృదయం సృష్టించిన ఒక అద్భుత ప్రపంచం. క్రమక్రమంగా ఆ ప్రపంచం తన ఉనికినీ, తన జవజీవాల్నీ కోల్పోతోంది ఎందుకని? పోనుపోను... మానవ సంబంధాలు మరీ ఇంత కంటకప్రాయంగా ఎందుకు మారుతున్నాయి? మాట ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గే మానవ నైజం మూలాలు ఎక్కడున్నాయి? మాట ఇచ్చి వెనక్కి తగ్గడం అంటే తన శవయాత్రలో తాను నడవడమే కదా! ఇచ్చిన ఒక మాట కోసం, చేసిన వాగ్దానం కోసం జీవితాల్నే ఫణంగా పెట్టిన వారు లోకంలో ఎందరు లేరు? మాట పోతే ప్రాణం పోయినట్లేననే కదా ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందరెందరో నానా కష్టాలు పడ్డారు? అలాంటి వాళ్లను చూసిన వారు, ఎవరైనా ఏదైనా వాగ్దానం చేశారంటే దాని మీద కొండంత నమ్మకం పెట్టుకుంటారు. అయితే, వాగ్దానం చేసిన వారే ఒక్కరొక్కరుగా ఆ వాగ్దానం నుంచి పక్కకు తొలగిపోతుంటే ఆ నమ్ముకున్న వారికి ప్రమాణాలూ, వాగ్ధానాలూ అన్నీ ఉత్త అబద్ధాలే అనిపించవా మరి?
హోగా మసీహా సామ్‌నే తేరే - ఫిర్ భీ నా తూ బచ్ పాయేగా
తేరా అప్‌నా ఖూన్ హీ ఆఖిర్ - తుజ్‌కో ఆగ్ లగాయేగా
ఆస్‌మాన్ మే ఉడ్‌నే వాలే మిట్టీ మే మిల్ జాయేగా /కస్‌మే/
(ఏ మహర్షో నీ ముందు నిలుచున్నా - నీకు మాత్రం ఇక్కడ రక్షణే లేదు
నీ రక్తం అనుకున్న వాళ్లే - ఇక్కడ నీకు నిప్పు ముట్టిస్తారు.
ఆకాశంలో ఎగిరే వాళ్లంతా కడకు - మట్టిలో కలిసిపోయే వాళ్లేగా )
మనిషి ఎంత క్రూరుడయ్యాడూ అంటే నీ ముందే ఒక మహా యోగి ఉన్నా నిన్ను వదిలేయడు. అతని కళ్లముందే నిన్ను బలితీసుకుంటారు
నావాళ్లూ ... నావాళ్లూ అని నువ్వేదో నమ్మేస్తావు గానీ, నీ రక్తం పంచుకున్న వాళ్లే ఒక రోజున నిన్ను అగ్ని గుండంలోకి తోసేస్తారు. మాకేమిటి? ఏకంగా ఆకాశంలోకే ఎగిరిపోయామని కొందరు తెగ విర్రవీగుతారు కానీ, ఎంతెత్తుకు ఎగిరినా ఎప్పటికీ ఆకాశంలోనే ఉండిపోలేరుగా! ఆకాశంలో తిరిగీ తిరిగీ చివరికి మళ్లీ భూమ్మీదికి దిగిరావలసిందేగా! అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందేగా! ఎందుకో ఈ సత్యం చాలా మందికి కడదాకా బోధపడదు. మృత్యువు వచ్చి భుజం పైన చేయి వేసే దాకా మనసు ఆ సత్యం వైపు తిరిగైనా చూడదు.
సుఖ్ మే తేరే సాథ్ చలేంగే - దుఖ్ మే సబ్ ముఖ్ మోడేంగే
దునియా వాలే తేరే బన్‌కర్ - తేరా హీ దిల్ తోడేంగే
దేతే హైఁ భగ్‌వాన్ కో దోఖా - ఇన్‌సా కో క్యా ఛోడేంగే / కస్‌మే/
(నువ్వు సుఖంగా ఉన్నప్పుడు నీ వెంటే నడుస్తారు.
నువ్వు దుఃఖంలో ఉన్నావా - అందరూ మొహం చాటేసుకుని వెళ్లిపోతారు.
లోకంలో మనుషులు నీవాళ్లలా ఉంటూనే నీ హృదయాన్ని విరిచేస్తారు.
వీళ్లు దేవుణ్ణే మోసగించే రకం - ఇక మనిషినేం వదులుతారు?)
నీ జీవితం సకల సౌఖ్యాలతో ఉన్నప్పుడు నీ చుట్టూ తిరిగే వాళ్లంతా నీకేమిటి? నేనున్నానంటూ, ఎవరికి వారు ఎంతో ధీమానిచ్చే మాటలు చెబుతారు. కానీ, ఒక్కసారి నీ జీవితం కష్టాలవైపు మొగ్గిందా? వాళ్లల్లో ఏ ఒక్కరూ కనపించరు ఉన్నట్లుండి అంతా మటుమాయమవుతారు. అప్పటిదాకా నీ వాళ్లుగా ఉన్నవాళ్లంతా, నీ గుండెల్లో గునపాలు గుచ్చి మరీ వెళ్లిపోతారు. అవసరమైతే దేవుణ్నే మోసం చేయగల సిద్ధహస్తులు వీరు. ఇలాంటి వారు, ఇక మనిషిని వదిలేస్తారా? అందుకే, ఎవరో ఏదో వాగ్ధానం చేశారనీ, ప్రమాణం చేసి మరీ చెప్పారని అందరికి అందరినీ నమ్మితే, ఒక్కోసారి పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోవవడం ఖాయం. అందుకే నిజమైన మనిషికీ, నకిలీ మనిషికీ మధ్క గల తేడా తెలుసుకుని మసలడం ఎంతో అవసరం అన్న ఒక నిగూఢ సత్యాన్ని ఈ గీతం మరీ మరీ స్పష్టంగా చెబుతుంది.
--- బమ్మెర
songs from upkaar,कसमें वादे प्यार वफ़ा हिंदी लिरिक्स,
No comments :
Post a Comment