Friday, May 27, 2016

మేరీ యాద్‌ మే తుమ్‌ నా ఆసూ బహానా - Meri yaadh Me Tum naa Aasu Bahana


తలత్ మహమూద్ వర్ధంతి సందర్బంగా...

నన్నింక మరిచిపో...... 


ఏ గొంతులోనైనా, లేలేత నదీ తరంగాల కన్నా సుకోమలమైన అలల ధ్వని రావడం మీరెప్పుడైనా విన్నారా? ఒకవేళ నిజంగానే మీరు వినిఉంటే అది కచ్ఛితంగా తలత్‌ మెహమూద్‌ గొంతే అయి ఉంటుంది. అలలు సైతం పులకరించిపోయే ఒక విలక్షణమైన స్వరమున్న విశిష్ట గాయకుడాయన. 1945లో సినీరంగంలోకి ప్రవేశించిన ఆయన తొలుత కథానాయకుడిగనూ,, గాయకుడిగానూ ఉభయ భూమికలూ పోషించాడు. అయినా ఆయన జీవితం కష్టాల్లోనే గడిచింది. ఆ తర్వాత కొంత కాలానికి స్వరకర్త అనీల్‌ బిశ్వాస్‌, ‘ఆర్‌జూ’ సినిమా కోసం ‘‘‘ఏ దిల్‌ ముఝే ఐసీ జగాహ్‌ లే చల్‌, జహాఁ కోయీ నహో’’ అన్న ఒక వేదాంత గీతాన్ని పాడే అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క పాట ఆయన్ని నేపథ్య గాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది. ఆ ప్రస్థానంలో 8 వేల పాటల దాకా పాడాడు. భాతర ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది. కోటానుకోట్ల మంది రసజ్ఞులను తన గాత్ర మాదుర్యంతో దశాబ్ధాల పర్యంతం ఓలలాడించిన తలత్‌ మహమూద్‌. దాదాపు రెండు దశాబ్దాల క్రితం అంటే 1988 మే, 5న ఆయన ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయారు. అయినా సంగీత ప్రేమికుల హృదయాల మీద ఈ నాటికీ ఆయన స్వరం తారట్లాడుతూనే ఉంది. తలత్‌ మహ్‌మూద్‌ పాడిన పాటల్లో విషాద గీతాలు, ఓదార్పు గీతాలే ఎక్కువ. ఆ రెండూ కలగలిసిన ఒక అరుదైన గీతం మనకు ‘‘మద్‌హోష్‌ ’’ సినమాలో వినిపిస్తుంది. రాజా మెహదీ అలీఖాన్‌ రాసిన ఈ పాటను మదన్‌మోహన్‌ స్వరపరిస్తే తలత్‌ మహ్‌మూద్‌ ఎంతో తాదాత్మ్యంతో గానం చేశారు. 
* * * * * *
మేరీ యాద్‌ మే తుమ్‌ నా ఆసూ బహానా
న జీ కో జలానా ముఝే భూల్‌ జానా
సమఝ్‌నా కే థా ఏక్‌ సప్‌నా సుహానా
వో గుజ్‌రా జమానా, ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే/ 

(నా జ్ఞాపకాల్లో నువ్వు కన్నీళ్లు రాల్చకు
హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో
ఆ సుందర స్వప్నమంతా ఏ నాటిదోలే అనుకో
ఆ కాలం అయిపోయింది, నన్నింక మరిచిపో /నా జ్ఞాపకాల్లో/) 

ఒక దశలో చేరువ కావడానికి ఎంతో ఆరాట పడిన వారే కావచ్చు. కానీ, అనుకోని ఏ విపత్కర పరిస్థితులో ఎదురైనప్పుడు విడిపోవడానికీ కూడా వారు అంతే చొరవ చూపుతారు. కలిసి ఉండడం కన్నా విడిపోవడంలోనే జీవితాలకు ఎక్కువ మేలు జరుగుతుందనిపించినప్పుడు శ్రేయోభిలాషులు ఇంకేం చేస్తారు? ఒక్కోసారి కొంత నాటకీయంగానైనా సరే ఎడబాటుకు దారులు వేస్తారు. కాకపోతే అలా అన్నీ చేస్తూనే, ఎదుటి వారు కంటతడి పెట్టకూడదని కోరుకుంటారు. ఎంతైనా అప్పటిదాకా ఒకరినొకరు ప్రాణప్రదంగా ప్రేమించుకున్నవారు కదా! ఎదురుపడి కాకపోయినా ఎదలో ప్రతిధ్వనించేలా అప్పటిదాకా జరిగినదంతా ఎప్పటిదో పాత కథలే అనుకొమ్మని చెబుతారు. అయినా, గడిచిపోయిన దానికోసం పడిఏడవడం ఎందుకు? మనం ఒకరినొకరం మరిచిపోవడమే మేలని చెబుతారు. ఎంత లేదన్నా ప్రేమలో పండిపోయాక సీదా సాదా మనసులు కూడా పెద్ద మనసులు అవుతాయి కదా!
జుదా మేరి మంఝిల్‌, జుదా తే రి రాహేఁ
మిలేంగీ న అబ్‌ తే రి మేరీ నిగాహేఁ
ముఝే తేరి దునియా సే హై దూర్‌ జానా
న జీ కో జలానా ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే /
 
( నా గమ్యం దూరమైపోయింది. నీ దారులూ వేరైపోయాయి
మన ఇరువురి చూపులు ఇంక ఏ నాడూ కలవనివై పోయాయి
నేనింక నీ లోకానికే దూరంగా వెళ్లాల్సి ఉంది
నీ హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో / నా జ్ఞాపకాల్లో/) 

తీరాలు దూరమైపోవచ్చు. అవతలి వాళ్ల దారులూ వేరైపోవచ్చు. మళ్లీ కలుసుకునే అవకాశమే ఉంటే, ఎన్నిసార్లు దూరమైపోతే మాత్రం అయ్యేదేముంది? ఏదో ఒక సమయాన తీరాలూ, దారులూ తిరిగి చేరువవుతాయి. ఏకమవుతాయి. కానీ, ఏకంగా లోకాలే వేరైపోయే స్థితి ఏర్పడితే, కనీసం ఒకరినొకరు కళ్లారా చూసుకునే అవకాశంకూ కూడా లేకపోతే, ఇంక చేయడానికేముంది? ఆ పైన ఆ విషయమై ఆలోచనలెందుకు? ఆశలు పెంచుకోవడం ఎందుకు? తీరని ఆశల్లో రేబవళ్లూ కాలిపోతూ హృదయాన్ని అగ్నిగుండం చేసుకోవడం ఎందుకు? అలాంటి స్థితిలో ఒకరినొకరు మరిచిపోవడమొక్కటే ఉత్తమ మార్గమనిపిస్తుంది. ఆ మాటలే గుండెలు ఘూర్ణిల్లేలా లోలోపల ప్రతిధ్వనిస్తాయి.
యే రోరోకే కహెతా హై, టూటా హువా దిల్‌
నహీ హూఁ మై తేరి, ముహబ్బత్‌ కి కాబిల్‌
మేరా నామ్‌ తక్‌ అప్‌నే లబ్‌ పే న లానా
న జీకో జలానా, ముఝే భూల్‌ జానా / మేరీ యాద్‌ మే / 

( ముక్కలైన నా హృదయం వెక్కి వెక్కి ఏడుస్తోంది
నాకు నీ ప్రేమను పొందే యోగ్యతే లేదని వాపోతోంది
నీ పెదాల మీదికి ఇక నా పేరే రానీయకు
హృదయాన్ని కాల్చుకోకు, నన్నింక మరిచిపో / నా జ్ఞాపకాల్లో /) 

ఎలాప్రాయంలో ఏది అద్భుతంగా కనిపించినా సరే, దాన్ని వెంటనే సొంతం చేసుకోవాలని తపించిపోతుందది. ప్రేమమూర్తిని పొందే విషయంలో అయితే ఈ ఆరాటం ఏకంగా వేయింతలవుతుంది. కానీ, కొన్నాళ్ల తర్వాత ఆ అపురూపత్వం ఇంకా ఇంకా ఎదిగి, ఏ ఆకాశ శిఖరాలనో తాకుతుంటే, ఆ దివ్యరూపాన్ని అందుకునే అర్హతే నాకు లేదేమో అనిపించవచ్చు. అందుకే ఆ అపురూప శిల్పానికే దూరంగా జరగాలనిపించవచ్చు. కాకపోతే అప్పటికే దాన్ని మనం జీవితంలో భాగం చేసుకుని ఉంటే, దాన్నించి ఇక దూరం కావడమే అసాధ్యం అనిపిస్తే ఏమిటి చేయడం? వెక్కి వెక్కి ఏడ్వడం తప్ప ఏంచేయాలో దిక్కు తోచదు. ఏ విషయాన్నయినా పదే పదే స్మరిస్తూనే అదే విషయాన్ని మరిచిపోవడం ఎలా సాధ్యమవుతుంది? .అయినా ఇక నుంచి కనీసం వాటి ఛాయల్లోకి వెళ్లకుండా, వాటి ఊరూ పేరూ ఉచ్ఛరించకుండా ఉండిపోతే మేలేమో అనిపిస్తుంది. అలానైనా గుండె కోత కాస్తంత తగ్గుతుందేమో అనిపిస్తుంది. కానీ, మనసులో నిండుగా ప్రతిష్టించుకున్న దాన్ని ఆ తర్వాత బహిష్కరించాలనుకుంటే అది సాధ్యమయ్యే పనికాదని అనుభవంతోనే తెలుస్తుంది.

* * * * * * * *

1 comment :


  1. ఎవరి జీవితం కూడా సాఫీగా సాగదు. ఎవరి బాధలు వారివి. గుండెల్లో దాచుకున్న బడబాగ్ని ఎవరికీ కనపడదు, వివరణ ఇవ్వడం కుదరదు ,ఇచ్చినా ఎవరికీ అర్థం కాదు. బాధలు భరించలేక వాళ్ళు పేలవంగా నవ్వినా ఆ నవ్వులో కన్నీటి ఆనవాళ్ళు కనపడతాయి. ప్రేమను బాధ్యతగా తీసుకునే ఆ రోజుల్లోని ప్రేమికుల గురించి రాజా మేహది అలీ ఖాన్ రాసిన ఈ విషాద గీతం ఒక అద్భుతం అయితే బమ్మెర గారి వివరణ మరో అద్భుతం. తలత్ మెహమూద్ గానం ఒక క్లిక్ తో మనకు దొరకడం టెక్నాలజీ ఇచ్చిన గొప్ప వరం.

    ReplyDelete