Sunday, March 5, 2017

ఓ మేరే దిల్‌ కే చైన్‌ - o Meri Dil ke Chain - Dileep kumar Mere jeevan saathee RD barman


నీ తోడు కోరింది లోకహితం కోసమే 



సాధారణంగా ప్రేమికుల మక్కువంతా తమవైన వ్యక్తిగత ప్రయోజనాల మీదే ఉంటుంది. అయితే, అరుదుగా మాత్రమే కొందరిలో తన ప్రేమమూర్తి చేయందుకుని సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉంటుంది. తమ అసలు సిసలైన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరతాయన్న ఒక అవగాహన వారికి ఉండడమే అందుకు కారణం. సరిగ్గా అలాంటి భావజాలంతో వచ్చే సినిమా పాటలు చాలా అరుదుగానే ఉంటాయి. 1959 లో విడుదలైన ’దీదీ’ సినిమా కోసం సాహిర్‌ లుధ్యాన్వీ రాసిన ’తుమ్‌ అగర్‌ భూల్‌ భీ జావో’ అనే పాటలోని ఒక పాదంలో కథానాయకుడు తన ప్రేయసిని ఉద్దేశించి ’మైనే తుఝ్‌సే హీ నహీ సబ్‌ సే ముహబ్బత కీ హై’ ( నేను నిన్నే కాదు సమస్త మానవాళినీ ప్రేమిస్తున్నా) అంటూ తన సామాజిక ప్రేమను వ్యక్తం చేస్తాడు. అయితే, ఈ పాట విడుదలైన ఓ పదేళ్ల తర్వాత అంటే 1972లో వచ్చిన ’ మేరే జీవన్‌ సాథీ’ సినిమా కోసం మజ్రూహ్‌ సుల్తాన్‌పురి అలాంటి సామాజిక ప్రేమగీతాన్నే రాశాడు. ఈ పాటకు ఆర్‌. డి బర్మన్‌ సమకూర్చిన బాణీ కిశోర్‌ కుమార్‌ గాత్ర మాధుర్యంతో పండిపోయింది. సినిమా విడుదలై నాలుగు దశాబ్దాలు దాటినా రస హృదయుల గుండెల మీద ఇప్పటికీ నడయాడుతూనే ఉంది. 

ఓ మేరే దిల్‌ కే చైన్‌ 
చైన్‌ ఆయే మేరే దిల్‌ కో దువా కీజియే /ఓ మేరే/ 
( ఓ నా హృదయ సాంత్వనమా! 
నాకు శాంతి కలగాలని కోరుకోవా! ) 
పోరాటం వ్యక్తిగతమే కావచ్చు. సామాజికమే కావచ్చు. ఆ పోరాటం ఎడతెరిపి లేకుండా ఏళ్ల పర్యంతం కొనసాగుతున్నప్పుడు ఒక్కోసారి మనసు కాస్తంత శాంతిని కోరుకుంటుంది. ఒక నిండైన సాంత్వనను కోరుకుంటుంది. ఒకవేళ అప్పటికే ఎవరైనా మన హృదయానికి బాగా చేరువై ఉంటే, వాటిని ప్రసాదించమని కోరేందుకు హృదయం సిద్ధమవుతుంది. ఏ యుద్దమైనా అంతిమంగా కోరుకునేది శాంతినేగా...! లోక హితం కోసం పోరాటం చేసే ఏ యువకుడైనా యుద్ద విరామంలో సైనికుడిలా ఎప్పుడైనా కాసేపు సేద తీరాలనుకుంటే తప్పేముంది? కాస్తంత శాంతిని, కాస్తంత సాంత్వనను కోరుకుంటే నేరమేముంది?
అప్‌నా హీ సాయా దేఖ్‌ కే తుమ్‌ - జానె జహాఁ శర్‌మాగయే 
అభీ తో పహ్‌లీ మంజిల్‌ హై - తుమ్‌ తో అభీ సే ఘబ్‌రాగయే 
మేరా క్యా హోగా, సోంచో తో జరా 
హాయ్‌ ఐసే న ఆహేఁ భరా కీజియే / ఓ మేరే/ 
(ఓ హృదయేశ్వరీ! నీ నీడనే నువ్వు చూసుకుని సిగ్గుపడుతున్నావు 
ఇంకా ఇది తొలి అంతస్థే! అప్పుడే నువ్వు గాబరా పడిపోతున్నావు 
ఇలా అయితే, నేనేమై పోవాలో ఆలోచించు 
హోయ్‌... మరీ అంతలా నిట్టూర్పులు విడవకు) 
ఎవరినో నీ మనసు నిండా నింపేసుకుంటావు. ఆమే నీ లోకంగా ప్రేమ పెంచేసుకుంటావు. కానీ, నువ్వేదో అలా అనుకున్నంత మాత్రాన ఎదుటి వ్యక్తి వెంటనే ఆమోదముద్ర వేస్తారని కాదు కదా! నీ ప్రతిపాదనకు వెంటనే తలూపి అప్పటికప్పుడు నీతో కలసి నడవాలంటే అది అయ్యేపనేనా? నువ్వు కాస్త తెలిసిన వ్యక్తివే కావచ్చు. నీ దారీ ఆమె దారీ ఒకటే అయినా కావచ్చు. అంతమాత్రానికే నువ్వూ నేనూ ఒకటేనని నీలో భాగంగా జీవించేస్తారా? ఎవరి జీవితం వారికున్నట్లే. ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి. ఎవరి భయాలు వారికి ఉంటాయి. అయినా ఎదుటి వ్యక్తికి నువ్వు ముందే అన్నీ చెప్పేసి నువ్వు ఈ మార్గాన్ని ఎంచుకోలేదు కదా? అలాంటప్పుడు, నువ్వు కాదంటే నేనేమైపోవాలో చె ప్పు అంటే ఎదుటి వ్యక్తి ఏం చెబుతారు? నీ భావోద్వేగాల్ని ఎదుటి వ్యక్తి మీద అలా గుమ్మరించేస్తే ఎలా? సామాజిక కార్యకలాపాల్లో ఆమెకూ బాధ్యత ఉంటుంది ఎవరూ కాదనలేరు. కానీ, ఆమె నీతోనే కలసి నడవాలనేమీ లేదుగా !
ఆప్‌కా అర్‌మాఁ ఆప్‌కా నామ్‌ - మేరా తరానా ఔర్‌ నహీఁ 
ఉన్‌ ఝుక్‌తీ పల్‌కోఁ కే సివా - దిల్‌ కా టికానా ఔర్‌ నహీఁ 
జంచ్‌తా హీ నహీఁ - ఆంఖో మే కోయీ 
దిల్‌ తుమ్‌కో హీ చాహే తో క్యా కీజియే / ఓ మేరే/ 
( నీ గురించిన ఆశలు, నీ పేరు ఇవే తప్ప నాకు మరో రాగం లేదు 
వాలిపోయే నీ కనురెప్పలే తప్ప నాకు మరో ఆవాసం లేదు 
నువ్వు కాక నా కళ్లల్లో మరేదీ పొసగదు 
నా మనసు నిన్నే కోరుకుంటే నేనేం చేయను!) 
ఎదుటి వ్యక్తి కేవలం వ్యక్తిగానే ఉన్నంత కాలం, అదొక పరిచయంగానే ఉండిపోతుంది. అప్పుడు నీకు నువ్వుగా, హాయిగా నీలో నువ్వు ఉండిపోతావు. కానీ, ఎప్పుడైతే ఆ వ్యక్తి నీ ప్రపంచమైపోతారో అప్పుడు నువ్వింక నువ్వుగా ఉండ లేవు. నీకొక గూడూ గుడారం ఏమీ ఉండవు. నీ ప్రపంచం అంతర్థానమైపోతుంది. అవతలి వ్యక్తే ప్రపంచంగా ఆ కళ్లల్లో, ఆ కంటి వెలుగుల్లో నువ్వు జీవించడం మొదలెడతావు. ఎందుకంటే ఆమె ఒక లోకమైపోయాక ఆమె కాక లోకంలో మరెవరూ ఉన్నట్లు నీకు అనిపించదు. కాకపోతే ఎదుటి వ్యక్తి ఇష్టాయిష్టాలను గమనించకుండా నీ మనోభావాల్ని ఎదుటి వారి మీద రుద్దేస్తానంటే ఎవరూ ఒప్పుకోరు.
యూఁ తో అకేలా అక్సర్‌ - గిర్‌ కే సంభల్‌ సక్‌తా హుఁ మై 
తుమ్‌ పకడ్‌లో హాథ్‌ మేరా - దునియా బదల్‌ సక్‌తా హుఁ మై 
మైనే మాంగా హై తుమ్హే - దునియా కే లియే 
అభ్‌ ఖుద్‌ హీ సనమ్‌ ఫైస్‌లా కీజియే / ఓ మేరే / 
(ఒంటరిగా నేనిలా ఎన్ని సార్లు పడిపోయినా మళ్లీ నిలదొక్కుకోగలను 
నువ్వు నా చెయ్యందుకో చాలు..... నేనీ లోకాన్నే మార్చేయగలను 
నిన్ను నే కోరుకుంది లోకహితం కోసమే సుమా 
ఏ నిర్ణయానికి వస్తావో అదంతా నీ చేతుల్లోనే ఉందింక )
ఎవరైనా తన సొంత పని మీద చాలా దూరమే పయనించి మధ్యలో అలసిపోయారే అనుకోండి. అయినా అవతలి వాళ్లల్లో కొందరికి అదేమంత పెద్ద గాబరా పడాల్సిన విషయంగా అనిపించకపోవచ్చేమో! అలా కాకుండా నువ్వు చేపట్టిన పని పదిమంది కోసం అయినప్పుడు జనం స్పందనలు వేరుగా ఉంటాయి. పదిమంది పని భుజానేసుకుని ఎక్కడైనా పడిపోతే అది సామూహిక నష్టం, సామాజిక నష్టం. అలా తెలిసి తెలిసి సామాజిక నష్టం చేసే హక్కు ఏ వ్యక్తికీ ఉండదు. అందుకే ప్రమాదాన్ని ముందే గమనించి అవసరమనిపిస్తే ఒకరి సాయం తీసుకోవడం అనివార్యమవుతుంది. పైగా నీ వ్యక్తిగత అవసరాల కోసం సాయం కోరినప్పుడు ఎవరైనా విముఖత చూపవచ్చేమో గానీ, సామాజిక ప్రయోజనం కోసం సాయం కోరినప్పుడు అత్యధికులు తమ సుముఖతనే వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సామాజిక ప్రయోజనాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలు ఒదిగి ఉంటాయని ఎక్కువమందికే తెలుసు. సామాజిక హృదయాన్ని ఆవిష్కరించే ఇలాంటి పాటలు అరుదుగా కాకుండా ఎక్కువ సంఖ్యలో రావాలని మనమంతా మనసారా కోరుకోవాలి.
- బమ్మెర . 

No comments :

Post a Comment