Tuesday, March 14, 2017

ఆసూ భరీ హైఁ యే జీవన్‌ కీ రాహేఁ - Aasi Bari he ye jeevan ki raahe Mukesh to Raj kapoor parvarish hasratha jay puri


నన్నింక మరిచిపొమ్మని చెప్పరా!!


రెండు కన్నీటి చుక్కల్ని చూసే మనం ఒక్కోసారి కకావికలైపోతాం. అలాంటిది, ఒక్కోసారి జీవితమే కన్నీటి సముద్రమైపోతుంది. ఆ సముద్రాన్ని దాటి బయటికి రావడం ఇక ఎప్పటికీ సాధ్యం కాదని, నువ్వు నువ్వుగా ఇంక మిగలవనీ తేలిపోతే, ఎవరికైనా ఏమనిపిస్తుంది? నేను ఈ సముద్ర గర్భంలో కలసిపోయినా, తనను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఆ గతి పట్టకూడదనిపిస్తుంది. వారిని ఆ వైపే రాకుండా వారించి కాపాడాలనిపిస్తుంది. 1958లో విడుదలైన ’పర్‌వరిశ్‌’ సినిమాకోసం హస్రత జయ్‌పురి రాసిన ఈ పాటలో అలాంటి జీవన స్పందనలే వినిపిస్తాయి. దత్తారామ్‌ స్వరపరిచిన ఈ పాటను విషాదగీతాలకు మారుపేరైన ముకేశ్‌ పాడిన తీరు నిజంగా గుండెల్ని జలదరింపచేస్తుంది. మరొకసారి వినిచూడండి మీకే తెలుస్తుంది. 
*   *   *   *   *   *
ఆసూ భరీ హైఁ యే జీవన్‌ కీ రాహేఁ 
కోయీ ఉన్‌సే కహెదే హమే భూల్‌ జాయేఁ 

(జీవన దారులన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి 
నన్నింక మరిచిపొమ్మని ఎవరైనా ఆమెతో చె ప్పేస్తే బావుండును) 
ప్రాణప్రదంగా ప్రేమించినవారిని ఎవరైనా పూలబాటల్లోంచి తీసుకువెళ్లాలనుకుంటారు గానీ, ముళ్లడొంకల్లోంచి నడిపించాలనుకుంటారా? క న్నీటి తుపానుల్లో వదిలేయాలనుకుంటారా? వెంట తీసుకుపోలేని స్థితిలో వారిని దూరంగా ఉండిపొమ్మంటారు. అలా అని వచ్చిపడిన సంక్షోభమేమిటో, ఆ విషాదమేమిటో నేరుగా తన ప్రేమమూర్తికి చెప్పేయడం కూడా ఒక్కోసారి సాధ్యం కాదు. ఆ విషాదం వెనుక అసలేం జరిగిందో చెప్పేయడానికి ఒక్కోసారి మన హృదయమే సరిపోదు. భాషా సరిపోదు. ఏదోలా చెప్పేద్దాం అనుకునే సరికి ఒక్కోసారి గొంతు తడారిపోతుంది, ఉన్న ఆ కాస్త భాష కూడా అవిటిదైపోతుంది. ఈ స్థితిలో తన ఆవేదనను తన ప్రేమ మూర్తికి చేరవేయడానికి మరో వ్యక్తిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేదో ఆ విషాదాన్ని వివరించడానికని కాదు తననింక శాశ్వతంగా మరిచిపొమ్మనడానికి.

వాదే భులాదే, కసమ్‌ తోడ్‌ దే వో 
హాలత పే అప్‌నీ, హమే ఛోడ్‌ దే వో 
ఐసే జహాఁ సే క్యో హమ్‌ దిల్‌ లగాయే / కోయీ ఉన్‌సే/ 

(వాగ్దానాలన్నీ మరిచిపొమ్మని, చేసిన ప్రమాణాలన్నీ విరిచేయమని 
నా స్థితిగతుల్లో నన్ను ఇలా వదిలేసి పొమ్మని ఆమెకు చెబితే బావుండును 
ఇలాంటి ఈ లోకం మీద నేనింకా మనసు లగ్నం చేయడం దేనికి? 
న న్నింక మరిచిపొమ్మని ఎవరైనా ఆమెతో చెప్పేస్తే బావుండును) 
ప్రేమికులుగా ఎన్నో వాగ్దానాలు, ప్రమాణాలు చేసుకున్న మాట వాస్తవమే కానీ, అవన్నీ జీవితం అంతో ఇంతో హాయిగా నడుస్తున్న రోజులు. జీవితం అక్షరాలా మన చేతుల్లోనే ఉన్న రోజులవి. కానీ, ఉన్నట్లుండి అంతా తలకిందులై పోయి, అనివార్యంగా అనుకున్న వాటికి అంతా పూర్తి విరుద్ధంగానే జరిగిపోతున్నప్పుడు అప్పుడెప్పుడో చేసిన వాగ్దానాలకు , ప్రమాణాలకు ఉనికేమిటి? వాటి విలువేమిటి? పున్నమి రోజుల్లో కలిసి నడిచిన ఆ దారుల్లోనే ఆ తర్వాత కటిక చీకట్లో నడవలేం కదా! ఒకవేళ తప్పనిసరిగా ఆ దారుల్లోంచే వెళ్లాలనే అనుకున్నా ఏ చిన్న దీపమైనా వెలిగించే అవకాశమే లేనప్పుడు మళ్లీ వెన్నెల రోజులు వచ్చేదాకా వేచి ఉండాల్సిందే కదా! అయినా ప్రకృతిలో అమావాస్య తర్వాత క చ్ఛితంగా పున్నమి వస్తుందన్న గ్యారెంటీ ఉంది. కానీ, జీవితాన్ని కమ్మేసిన చీకట్లు క చ్చితంగా తొలగిపోతాయన్న గ్యారెంటీ ఏదీ లేదు. ఆ గ్యారెంటీ ఏదీ లేనప్పుడు నీ ప్రేమమూర్తిని అప్పటిదాకా వేచి ఉండవని హృదయమున్న ఏ ప్రేమికుడూ చెప్పలేడు. అందుకే తననింక మరిచిపొమ్మని చెప్పడానికే సిద్ధమవుతాడు.

బర్‌బాదియోఁ కీ అజబ్‌ దాస్తా హూఁ 
శబ్‌నమ్‌ భీ రోయే మై వో ఆస్‌మాఁ హూఁ 
తుమ్హే హర్‌ ముబారక్‌, హమే అప్‌నీ ఆహేఁ /కోయీ ఉన్‌సే / 

(ద్వంసమైపోయిన వింత జీవనగాథను నేను 
మంచు సైతం విలపించే ఆకాశాన్ని నేను 
నీకు నీ సంసారపు శుభాకాంక్షలు, నా నిట్టూర్పులు నాతోనే ఉంటే ఉండనీ 
నన్నింక మరిచిపొమ్మని ఆమెతో ఎవరైనా చెప్పేస్తే బావుండును) 
మన చుట్టూ జరిగే ఎన్ని జీవన విధ్వంసాల్ని మనం చూడలేదు. వాటన్నింటికీ ఒక తుది మొదలైనా ఉంటాయి. కూలిపోతున్నట్లే అనిపించిన జీవితాలే తిరిగి నిలబడిన ఎన్నో సందర్భాలు మనం అనేకం చూశాం. కానీ, కొన్నిజీవితాలు ఇందుకు పూర్తిగా భిన్నమైనవి, మోడు చిగురించడం మాట అటుంచి ఏ మంటలో ఎగిసిపడి కూకటి వేళ్లతో సహా బూడిదైపోతుంది. ఆకాశమే నాకు అండదండగా ఉన్నప్పుడు నాకేమిటని ఎంతో ధీమాగా ఉండే నక్షత్రాలు, మేఘాలు, మంచు, అనాథలై వెక్కివెక్కి ఏడ్చినట్లు, ఆశావ హమైన ఏ ఒక్క పరిణామమూ కనిపించక వీర కిశోరులు సైతం విషాదంలో పడిపోతారు. సంతోషమైనా దుఃఖమైనా నీతోనే అనడం అవతలి వ్యక్తి హృదయపు నిబద్ధతను చెబుతుంది కానీ, దుఃఖం తర్వాత సంతోషం వచ్చే అవకాశం అసలే కనిపించనప్పుడు ఎదుటివారిని నిరీక్షణలో ఉంచడం ఏ రకమైన నీతి. అందుకే అంతే లేని ఈ దుఃఖ సాగరపు అంచున నిలబడి జీవితాన్ని బలిచేసుకోవడం కన్నా, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించమని ఏ హృదయమున్న ప్రేమికుడైనా చెబుతాడు. ఆ కొత్త సంసార జీవితానికి అందరి కన్నా ముందే శుభాకాంక్షలు చెబుతాడు. నీ కొత్త జీవితపు ఆనందాన్ని చూసి ఆనందపడే అవకాశాన్నయినా ఈ నిట్టూర్పుల మధ్య నాకు దక్కనీ అంటాడు. నిజానికి సముద్రాన్ని చేతుల్లోకి తీసుకోలేనప్పుడు తరంగాన్ని తాకి తన్మయం చెందడంలోనే హృదయ ఔన్నత్యం, ఒక గొప్ప జీవన పరిణతీ ఉన్నాయి.
- బమ్మెర

No comments :

Post a Comment