ఎవరెవరో వచ్చారు... ఒక్క నువ్వు తప్ప!
లోకంలో ఎన్ని వందల కోట్ల మంది ఉంటేనేమిటి? నీ ప్రాణ సమానమైన వాళ్లు నీకు దూరమైపోతే, లోకంలో ఎందరున్నా ఎవరూ లేనట్లే అనిపిస్తుంది. తనదంటూ, తనకంటూ ఇంకేమీ మిగల్లేదనిపిస్తుంది. కాకపోతే ఆ దూరమైపోయిన వాళ్లు ఎప్పుడైనా మళ్లీ రాకపోతారా అన్న ఒక ఆశ మాత్రం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. నిరంతరం వాళ్లకోసం ఎదురు చూడటం ఒక పెద్ద తపస్సవుతుంది. ఆ తపస్సులో ప్రతిధ్వనించే కొన్ని జీవనరాగాలు 1991 లో విడుదలైన బంజారన్’ సినిమా కోసం ఆనంద్ బక్షీ రాసిన ఈ పాటను లక్ష్మీకాంథ్ ప్యారేలాల్ స్వర కల్పన చేసారు. సంచార జీవనంలోని ప్రణయాలు, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో తెలిపే ఈ పాటలోని చరణాలు అల్కా యాజ్ఞిక్ గొంతులో ఎంత సహజంగా పలికాయో మీరే చూడండి.
* * * * *
ఓ తూ నహీ ఆయా- ఆగయే సారే
కబ్ ఆయేగా మేరే బంజారే
(యీ సంచారిణి ఎదురు చూస్తోంది ఓ సంచారీ! నువ్వు ఎప్పుడొస్తావు?
నువ్వొక్కడివే రాలేదు. ఎవరెవరో అందరూ వచ్చారు.
సంచారీ! నువెవ్వప్పుడొసావు మరి!)
సాధువుల లోకం సాధువులకన్నట్లు... సంచారుల లోకం సంచారులది. అసలే దేశ సంచారులు. ఎప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళతారో, ఏ దేశం నుంచి ఏ దేశానికి బస మార్చేస్తారో ఎవరికీ తెలీదు. కాకపోతే, తమలో తాము ఉండిపోయినంత కాలం, ఎవరు ఎటు వెళ్లినా తంటాయేమీ ఉండదు. కానీ, ఒకరి హృదయంలోకి ఒకరు ప్రవేశించి , పరస్పరం హృదయాల్ని పంచేసుకుంటేనే అలజడి మొదలవుతుంది? ఎడబాట్లు, ఎదురుచూపులు గుండెల్ని కలవరపెడుతుంటాయి. కల్లోలపరుస్తుంటాయి.
దూర్ బహుత జో దేశ్ హై తేరా - పహుంచా నహీ సందేశ్ జో మేరా
సప్నోంకే రాజా జల్దీ సే ఆజా- దేర్ న కర్ సాజన్ ప్యారే
కబ్ ఆయేగా మేరే బంజారే
(నీ దేశం బహుదూరం, నేను పంపిన కబురు నీకు చేరలేదేమో మరి
కలల రాజా కదలిరా త్వరగా, జాగు సేయకింక ఓ ప్రేమమూర్తీ
ఎప్పుడొస్తావో మరి ఓ సంచారీ!)
దూరాలు, తీరాల మధ్య అయితేనేమిటి? హృదయాల మధ్య అయితేనేమిటి? ఎప్పుడో ఒకప్పుడు ఆ దూరాల్ని అధిగమించాల్సిందే లేదంటే దూరాలు మహాదూరాలై, మనం, మనకు తెలియకుండానే, తిరిగి ఎప్పటికీ చేరువకాలేని సుదూర దీవుల్లోకి విసిరివేయబడతాం. ఇద్దరూ ఉన్నది భూగోళం మీదే కావచ్చు కానీ, ఇద్దరూ నడుస్తున్నది భూమధ్య రేఖ మీదే కావచ్చు. కానీ, భూమికి ఎడమ కుడి వైపుల మధ్య ఎంతెంత దూరం? ఆగమేఘాల మీద ఏదైనా కబురంపాలన్నా అన్నిసార్లూ అంత సులువుగా అది అందదు కదా! పోనీ సమాచారం అందిన తర్వాతైనా, వడివడిగా అడుగులు వేయకుండా, తడబడుతూ ఉండిపోతే తీరాలు చేరువయ్యేదెలా? కన్న కలలు నెరవేరేదెలా?
ఐసా న హో కే తూన ఆయే - డోలీ కోయీ ఔర్ లే ఆయే
తడ ప్ తడప్ కే తరస్ తరస్ కే - మై మర్‌జావూఁ గమ్ కే మారే
తేరీ బంజారన్ రస్తా దేఖే- కబ్ ఆయేగా మేరే బంజారే
( నువ్వే రాకుండా పోయి- మరెవరో వచ్చి వాలేరు సుమా!
తల్లడిల్లుతూ, తపించిపోతూ నేను నా ప్రాణాలు ఇక్కడ వదిలే ను సుమా!
ఓ సంచారీ ఎప్పుడొస్తావు మరి!)
పల్లకీ అంటే వెదురు కర్రల వేదిక కాదు కదా! రెండు హృదయాలు ఒక లోకంగా ఒదిగిపోయే ఒక దివ్య సౌధమది. ఎన్నో ఏళ్లుగా ఒకరి కోసం ఒకరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న తరుణమది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఏదో అవరోధం వచ్చి, అడ్డంకి వచ్చి ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోవడమే కుదరకపోతే ఏమవుతుంది? ఆ రెండు హృదయాలు ముక్కచెక్కలై ఆకాశానికి అన్ని వైపులా విసిరివేయబడతాయి. ఆ స్థితిలో అహోరాత్రులూ, క్షణం- క్షణం తపించి తల్లడిల్లే హృదయాలు తమ ప్రాణాల్ని ఏం నిలబెట్టుకుంటాయి? అందుకే ప్రేమికులు, అలాంటి విపరిణామమేదీ చోటుచేసుకోకముందే, ఎవరో వచ్చి విడగొట్టలేనంతగా తమను తాము మలుచుకోవాలనుకుంటారు.
సప్‌నోం మే సప్‌నా తోడ్‌గ యా తూ- ఆగ్ సులగ్‌తీ ఛోడ్‌గయా తూ
ఫూలోం పే చల్ కే లగ్‌తా హై ఐసే - పావ్ కే నీచే హై ఆంగారే
మై మర్ జావూఁ గమ్ కే మారే- కబ్ ఆయేగా మేరే బంజారే
(కలలో వచ్చి నా కలను విరిచేశావు నువ్వు, అగ్ని జ్వాలల్ని నాలో వదిలేశావు నువ్వు
ఇప్పుడు పూల మీద నడుస్తున్నా- పాదాల కింద నిప్పులున్నాయనిపిస్తోంది
బాధాతప్తమై నేనింక బతకనేమో అనిపిస్తోంది- ఓ నా సంచారీ ఎప్పుడొస్తావు మరి!)
నిజజీవితంలోనే అని కాదు హృదయాన్ని ఎవరో వచ్చి, కలలో విరిచేయాలని చూసినా, అది నిజమంత వేధిస్తుంది. హృదయం అనంతంగా వ్యాపించే ప్రేమైక జీవనం మొదలయ్యాక కలకూ నిజానికీ మధ్య అట్టే తేడా కనిపించదు. అందుకే ఎవరైనా, కలలో వచ్చి తమ కలల్ని చిదిమేయాలని చూసినా హృదయం రక్తసిక్తమవుతుంది. ఆ సమయంలో పూలతేరు మీద వెళుతున్నా, అగ్ని జ్వాలలకు ఆహుతి అవుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే ఎదురు చూపులతో ఎక్కువ కాలం గడిపేయకుండా, దూరాల్ని చెరిపేసి, తీరాల్ని ఏకం చేసి అక్కడ తమదైన ఒక తారాలోకాన్ని సృష్టించుకోవడం ఎవరికైనా తప్పనిసరి
- బమ్మెర
No comments :
Post a Comment