స్వర్గానికి బదులుగా నిన్నే కోరుకుంటా
భూమి ఎంత అందమైన దైనా కావచ్చు. కానీ, దాన్ని ఆవరించి ఉన్న ఆకాశాన్ని చూడనిదే వెలితిగా, ఏదో అసంపూర్ణంగా అనిపిస్తుంది. రాగాల ఆలాపనలోనూ అంతే. తార స్వరాన్ని తాకకుండా పాటంతా మంద్రలోనే సాగితే ఏదో వెలితిలా అనిపిస్తుంది. ఆ వెలితి ఎందుకు ఉండాలని, రాగాన్ని నేలమీదే కాకుండా ఆకాశాన కూడా నడిపించిన మహాగాయకుడు మహేంద్రకపూర్. పాడటానికి సంగీత పరిజ్ఞానమే సరిపోదు ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి అనే వారాయన. ‘యే రాత్ ఫిర్ న ఆయేగీ’ సినిమాలోని ‘మేరా ప్యార్ వో హైఁ కే’ అన్న ఈ పాటలో ఆ ఆత్మశ్వాసమే ధ్వనిస్తుంది. హెచ్. ఎస్. బిహారీ రాసిన ఈ గీతానికి ఓ. పి. నయ్యర్ సంగీతం సమకూర్చారు. గగన సీమలో తేలియాడే మహేంద్ర కపూర్ గళ మాధుర్యాన్ని మరోసారి విని తరించండి మరి!మేరా ప్యార్ వో హై కే మర్‌కర్ భీ తుమ్‌కో
జుదా అప్‌నీ బాహోఁసే హోనే న దేగా
మిలీ ముఝ్ కో జన్నత్ తో జన్నత్ కే బద్‌లే
ఖుదా సే మేరీ జాఁ తుమ్హే మాంగ్ లేగా
( నా ప్రేమ, నా మరణానంతరం కూడా నిన్ను నా బాహువుల్లోంచి దూరం కానివ్వదు. నాకు స్వర్గమే లభించినా, ఓ ప్రియురాలా! స్వర్గానికి బదులుగా నిన్నే ఇవ్వమని భగవంతుడ్ని కోరుకుంటాను)
ప్రేమకు ఆరంభమే ఉంటుంది తప్ప అంతం ఉండదని కదా వాదన! అందుకే కాల పరిమితి మా శరీరాలకే గానీ, ప్రేమలకు లేదంటారు ప్రేమికులు. ఆ కారణంగానే తమ మరణానంతరం కూడా తాము ప్రేమించిన వారి పట్ల ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుందని బలంగా నమ్ముతారు. అంతే కాదు. భగవంతుడే వచ్చి నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాను. ఇక నీ ప్రియురాలును మరిచిపో అంటే ‘నా ప్రియురాలే లేని స్వర్గం నాకెందుకు? ఆ స్వర్గానికి బదులుగా నా ప్రియురాలిని నాకు ఇవ్వు చాలు’ అంటారు. నిజానికి భావోద్వేగాలకు భౌతిక రూపాలే ఉండవు. భౌతికం కాని వాటికి జీవిత కాలం, ఓ కాల పరిమితి అంటూ ఏముంటాయి? ప్రేమే కావచ్చు. మరొకటి కావచ్చు. భౌతికం కానివి ఏవైనా అనంత కాలం ఉంటాయి. ఈప్రేమికుడు అనేదీ అదే. దేహం భౌతిక మైనది కాబట్టి అది ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోతుంది. కానీ, ఈ అభౌతికమైన, ఆత్మగతమైన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది అంటాడా ప్రేమికుడు.
జమానా తో కర్‌వట్ బదల్‌తా రహేగా
నయీ జిందగీ కే తరానే బనేంగే
మిటేగీ న లేకిన్ ముహబ్బత్ హమారీ
మిటానే కే సౌ సౌ బహానే బనేంగే
హకీకత్ హమేశా, హకీకత్ రహేంగీ
కభీ భీ న ఇస్‌కా ఫసానా బనేగా / మేరా ప్యార్/
(లోకం అటూ ఇటూ దొర్లుతునే ఉంటుంది. ఏ రోజుకారాజు కొత్త కొత్త రాగాలు సిద్ధమవుతూనే ఉంటాయి. మా ప్రేమ ఎప్పటికీ మాసిపోయేది కాదు . అయిన లోకం దాన్ని మసి చేసే వందలాది సాకులు వెతుకుతూనే ఉంటుంది . సత్యం ఎప్పుడూ సత్యమే. ఈ సత్యమెప్పుడూ గతించిన గాధగా మారిపోదు
)
కాలం నిరంతరం మారుతూ ఉంటుంది. కాలంతో పాటు లోకమూ మారుతూ వెళుతుంది. అవసరాలకు, పెరుతుతున్న ఆశలకు ఆనుగుణంగా ప్రపంచంలోని పలు విషయాలు నిత్యం మారుతూ వెళుతూ ఉంటాయి. ఆ క్రమంలో లోకం అప్పటిదాకా ఆలపించిన వాటికి భిన్నంగా ఒక్కోసారి పూర్తి విరుద్ధంగా కూడా కొంగొత్త రాగాలు ఆలపిస్తుంది.
లోకం విషయం ఏమైనా కావచ్చు. అది ఎన్ని రకాలుగానైనా మారవచ్చు. ప్రేమ విషయంలో అవేవీ జరగవు. ప్రేమ ఒక పరమ సత్యం. సత్యం మారడం ఉండదు కదా!. ఎవరెన్ని ఎత్తులు వేసినా దాని తుడిచేయడం ఎప్పటికీ సాధ్యం కాదు. భౌతిక రూపాలలకు నిరంతరం రూపాంతరం చెందడం ఒక సహజలక్షణం. కానీ, ఆత్మల పరిస్థితి అది కాదు. భౌతిక ప్రపంచానికి ఈ ఆత్మలోకం పూర్తిగా భిన్నమైనది, అతీతమైనది. ఆ అతీతత్వమే ఆ ప్రేమను ఆ ప్రేమించే ఆత్మలను అమరం చేస్తుంది.
తుమ్హే ఛీన్ లే మేరీ బాహోఁ సే కోయీ
మేరా ప్యార్ యూఁ బేసహారా నహీఁ హై
తుమ్హారీ బదన్ చాంద్‌నీ ఆకే ఛూలే
మేరే దిల్‌కో యే భీ గఁవారా నహీఁ హై
ఖుదా భీ ఆగర్ ఆకే తుఝకో మిలే తో
తుమ్హారీ కసమ్ హైఁ మేరా దిల్ జలేగా / మేరా ప్యార్/
( నా బాహువుల్లోంచి ఎవరో వచ్చి బలత్కారంగా నిన్ను తీసుకుపోవడమా ! నా ప్రేమ అంత నిస్సహాయమైనదేమీ కాదు
నీ తనువును వె న్నెలే వచ్చి తాకినా నా హృదయానికి అది భరించరాని విషయమే సుమా ! . మనిషి మాటెందుకు? దేవుడే దిగి వచ్చి నిన్ను కలుసుకున్నా నీ మీద ఒట్టు. నా మనసు మండిపోతుంది)
ప్రేమికులు దేనికైనా భయపడుతున్నారూ అంటే ఇంకా ఆ ప్రేమ అసమగ్రంగా ఉందనే అర్థం. సంపూర్ణమైన, సర్వసమగ్రమైన ప్రేమ దేనికీ భయపడదు. అందుకే, పరిపూర్ణంగా ప్రేమించిన ఒక ప్రియుడు ఎవరో వచ్చి తన ప్రియురాలిని తననుంచి దూరం చేయలని చూస్తే ఏ ప్రేమికుడూ నిస్సహాయంగా ఉండిపోలేడు. మనిషే అని కాదు చివరికి గాలి, నీరు, వెన్నెల ఇలా ప్రకృతిలోని ఏదీ తన ప్రియురాలిని తాకడాన్ని భరించలేడు. చివరికి తన ప్రియురాలితో ఆ దేవుడే వచ్చి కలిసినా ఆ ప్రియుడి గుండెలు మండిపోతాయి.
ఈ ప్రేమైక జీవన భావోద్వేగాలే ఈ పాట నిండా ధ్వనిస్తున్నాయి. అవి మహేంద్రకపూర్ గొంతులో పడి నిప్పు రవ్వల్లా, వజ్రకిరణాల్లా మెరిసిపోతున్నాయి.
--- బమ్మెర
No comments :
Post a Comment