Sunday, October 9, 2022

Aage Bhi Jaane Na Tu Song Lyrics Analysis | Waqt (1965 film) | Asha Bhosle songs |

ఈ క్షణమే మన జీవితం 

తుమ్మెద , పూల చుట్టూ తిరుగుతున్నట్లు, తుమ్మెద  నాదమొకటి కొన్ని దశాబ్దాలుగా భారత రస హృదయాల మీద తిరుగాడుతూ ఉంది. ఆ  నాదం పేరే ఆశా భోంస్లే. ప్రతి పాటతోనూ హృదయ వేదిక మీదికి ఒక గమ్మత్తైన మత్తును వదిలేసే ఆ స్వరం ఇప్పటికి కొన్ని  వేల పాటలు పాడింది. ప్రణయ భావోద్వేగాల్ని గానం చేసినంత హాయిగానే జీవిత సత్యాల్ని ఒలికించే గీతాల్ని సైతం ఆమె ఆహ్లాద భరితం చేస్తారు. ఆమె గొంతు ఒలికించిన రసడోలికల్లో ఊగిపోయిన భరతఖండం ఆమెను దాదా సాహె బ్‌ పాల్కే అవార్డుతో సత్కరించింది.  ‘వక్త్‌’ సినిమా కోసం   ‘సాహిర్‌’ రచిస్తే ‘రవి’ స్వరపరిచిన ఈ గీతం . ఆశా భోంస్లే స్వర ఝరిలో ఎలా ప్రాణం పోసుకుందో  చూద్దామా మరి!


ఆగే భీ జానే న తూ- పీఛే భీ జానే న తూ
జో భీ హై బస్‌ యహీ ఎక్‌ పల్‌ హై

(ముందుకూ పోమాకు- వెనక్కీ పోమాకు 
ఏమున్నా  ఈ ఒక్క  క్షణమే మన కు)

రాబోయే కాలం గురించో, గడిచిపోయిన కాలం గురించో  ఆలోచించడంలోనే కదా మన జీవితంలోని అత్యధిక కాలం కరిగిపోతుంది. భవిత ఎలా ఉంటుందో మనకేమీ  తెలియదు. గతం ఎప్పటికీ తిరిగి మన చేతికి రాదు. ఇంక వాటి గురించి ఆలోచించి మాత్రం మనం ఏం చేస్తాం? మనతో ఉన్నది, మనతో నడుస్తున్నది, మనలో భాగమై ఉంది, ఇప్పటి ఈ క్షణం ఒక్కటే. ఇప్పుడున్న ఈ క్షణమే  సజీవమైనది. దివ్యమైనది.  నీ ముందున్న ఈ అపురూప క్షణాల్ని ఆస్వాదించకుండా  శవమైపోయిన గతంలోకి వెళ్లడం ఎందుకు? శూన్యంలో తిరుగుతున్న ఆ భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎందుకు? అందుకే మృతప్రాయమైన ఆ గతమూ వద్దు. ఏ ఉనికీ లేని ఆ భవిష్యత్తూ వద్దు. కోటి కిరణాలతో  తొణకిస లాడే ఈ వర్తమానంలో  జీవిద్దాం మరి!

అంజానే సాయోంకా రాహోఁ మే ఢేరా హై
అన్‌దేఖీ బాహోఁనే హమ్‌ సబ్‌కో ఘేరా హై 
యే పల్‌ ఉజాలా హై - బాకీ ఆంధేరా హై
యే పల్‌ గవాఁనా న యే పల్‌ హీ తేరా హై
జీనేవాలే సోంచ్‌లే యహీ వ క్త్‌ హై కర్‌లే  పూరి ఆర్జూ / ఆగే భీ/

 ( తెలియని  నీడలేవో దారుల నిండా అలుముకుని ఉన్నాయి
 ఎన్నడూ చూడని బాహువులేవో మనలందిరినీ చుట్టు ముట్టేశాయి
 ఈ ఘడియే వెలుతురు. మిగతా అంతా చీకటి
ఈ ఘడియను జారవిడుచుకోకు, యీ ఘడియే నీది మరి
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను... నీ ఆశలన్నీ నెరవేర్చుకో)

జరగబోయే  వాటి గురించి  ఏదో కొంత అంచనా అయితే ఉంటుంది. అయితే  ఆ జరగబోయేవన్నీ  మన అంచనాలకు లోబడే ఉంటాయని కాదు కదా! వాస్తవం ఏమిటంటే మన ఆలోచనలకు, అంచనాలకూ అతీతంగా ఏవేవో జరిగిపోతూనే ఉంటాయి, ఆ జరిగే  క్రమంలో మనం ఊహించని  పరిణామాలేవో  మనల్ని చుట్టుముడుతూనే ఉంటాయి.  మన శక్తియుక్తులతో,  మన కళ్ల ముందున్న క్షణాల మీద ఎలాగోలా వెలుతురు నింపుకుంటాం. కానీ, మన కంటికి  దూరంగా ఉన్నవన్నీ చీకటిమయమే అవుతాయి? ఆ చీకట్లో ఏం అన్వేషించి  ఏం పట్టుకుంటాం?  ఆ వృధా ప్రయత్నాల్లో పడి  మన ముందున్న ఈ అపురూప క్షణాల్ని పోగొట్టుకోవడం ఎందుకు? ఈ క్షణమే మనది.  దీన్ని సంపూర్ణంగా ఆస్వాదిద్దాం. మన ఆశల్ని నెరవే ర్చుకునే అరుదైన క్షణాలివి వాటిని సార్థకం చేసుకుందాం.

ఇస్‌ పల్‌కే జల్‌వోఁ మే మహఫిల్‌ సఁవారీ హై
ఇస్‌ పల్‌ కీ గర్‌మీ నే ధఢ్‌కన్‌ ఉభారీ హై 
ఇస్‌ పల్‌ కే హోనే సే దునియా హమారీ హై
యే పల్‌ జో దేఖో తో సదియోం పే భారీ హై
జీనేవాలే సోంచ్‌లే  యహీ వక్త్‌ హై కరలే పూరి ఆర్జూ  / ఆగే భీ/
( ఈ అద్భుత క్షణాల్లో జీవన సదస్సు జరుగుతోంది
ఈ ఉద్విగ్న క్షణాల్లో  గుండె వేగం పెరుగుతోంది.
ఈ క్షణంలో ఉన్నాం క నకే ఈ లోకం మనదైంది
ఈ క్షణాలు ఎన్నో యుగాల కన్నా అపురూపమైనవి
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను మరి... ఆశలన్నీ నెరవేర్చుకో )

విశ్వం ఎన్ని లక్షల ఏళ్లు ఉంటేనేమిటి? మనం వాటిని చూడబోయామా? వాస్తవానికి విశ్వకాలం అంటే మరేదో కాదు. మన జీవిత కాలమే విశ్వకాలం. మనం లోకంలో లేకుండా పోయాక ఈ విశ్వం ఏమిటి? మనమేమిటి? అందుకే సమస్త మానవాళీ ఇప్పుడున్న ఈ  క్షణాన ఒక మహా సదస్సు జరుపుకునే అపురూప క్షణాలివి. అత్యంత అరుదైన ఈ క్షణాల్లోని ఆ ఉద్విగ్న భావాలతో హృదయ లయ పెరిగే ఘడియలివి. ఈ క్షణంలో జీవించే వారిదే ఈ ప్రపంచం. మన ముందున్న ఒక్క క్షణం రాబోయే కొన్ని యుగాలకు సమానం. అందుకే ఓ మానవా! ఇదే సరియైన సమయం నీ ఆశలన్నీ  నెరవేర్చుకో 

ఇస్‌ పల్‌ కే సాయే మే ఆప్‌నా ఠికానా హై
ఇస్‌ పల్‌ కే ఆగే కీ హర్‌ శౌ ఫసానా హై
కల్‌ కిస్‌నే దేఖా హై-కల్‌ కిస్‌నే జానా హై
ఇస్‌ పల్‌ సే పాయేగా-జో తుఝ్‌కో పానా హై
జీనేవాలే సోంచ్‌లే యహీ వక్త్‌ హై కర్‌లే పూరి ఆర్జూ / ఆగే భీ/

( ఈ ఘడియ నీడలోనే మన నివాసం ఉంది
ఈ ఘడియ ఆవలకు వెళితే అక్కడంతా ఓ పెద్ద గాదే  ఉంటుంది 
రేపును చూసిందెవడు? రేపు గురించి తెలిసిందెవడు?
ఏం పొందాలనుకున్నా ఈ ఘడియలోనే పొందగలవు మరి !) 
జీవుడా ఆలోచించుకో, ఇదే అదను మరి... ఆశలన్నీ నెరవేర్చుకో )

ఈ క్షణాలే నీకు నీడనిస్తాయి. జీవితాన్నిస్తాయి. జీవితానందాన్ని ఇస్తాయి. ఈ  క్షణం తరువాత జరిగే ప్రతిదీ  ఓ మహా గాధగా ఉంటుంది. రేపు, రేపు అంటాం కానీ, రేపు తాలూకు  రూపురేఖలు ఎలా ఉంటాయో ఎవరైనా చూశారా? రేపు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని మార్పులకు లోనవుతుందో ఎవరైనా అంచనా వేయగలిగారా? అందీ అందని సత్యాల గురించి అంచనాలెందుకు? ఆలోచనలెందుకు? ఏం పొందాలన్నా, ఏం సాధించాలన్నా  ఈ రోజు ఒక్కటే నీకు ఉపకరిస్తుంది. ఓ మానవా! అన్నీ ఆలోచించుకో  ఈ ఆశలన్నీ ఇప్పుడే నెరవేర్చుకో. 

ఇదీ ఈ గీతం  సంభోదన, వర్తమానం విలువ తెలిపే ఒక కవిగారి  హృదయ సంవేదన.

                                           ---బమ్మెర

No comments :

Post a Comment