Thursday, October 27, 2022

Kabhi Kabhie Mere Dil Mein Song Analysis | Kabhi Kabhie Film | Mukesh Songs | Jeevanageetham |

నిన్ను భూమ్మీదికి రప్పించిందే  నా కోసం 

‘‘కభీ కభీ  మేరె దిల్‌ మే’ అన్న పాట ప్రాణం పోసుకుని ఇప్పటికి మూడు దశాబ్దాలు గడిచిపోయింది. అయినా ఒక తాజా పాటలా సంగీత ప్రేమికుల్ని ఇప్పటికీ ఉర్రూతలూపుతూనే ఉంది. ఆ పాటను ఎంతో రసార్థ్రంగా పాడిన ముకేశ్‌కు ఆ యేటి (1976) జాతీయ స్థాయి ఉత్తమ గాయకుడి అవార్డు లభించింది. కాకపోతే ఆ అవార్డు అందుకోవలసిన రోజు నాటికి ముకేశ్‌   ఈ లోకంలో లేరు.  అందుకే ఆయన కొడుకు నితిన్‌ ముకేశ్‌  ఆ అవార్డును అందుకున్నారు. ‘కభీ కభీ’ సినిమాలోని  ఈ పాటను సాహిర్‌ లుధ్యాన్వి రచిస్తే, ఖయ్యామ్‌ స్వరబద్ధం చేశారు. ముకేశ్‌ను అమరం చేసిన అరుదైన పాటల్లో ఒకటైన ఈ పాటను మరోసారి విని ఆనందించండి మరి!


కభీ కభీ మేరే దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసె తుఝ్‌కో  బనాయా గయా హై మేరే లియే
తూ అబ్‌ సే పహెలే సితారో మే బస్‌ రహీథీ కహీ
తుఝే జమీఁ పర్‌ బులాయా గయా హై మేరే లియే 

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో ఇలా వచ్చేస్తుంది
నిన్నెవరో నా కోసమే సృష్టించినట్లు, 
ఇంతకుముందెక్కడో నక్షత్రాల్లో నివసించేనిన్ను
నా కోసమే భూమ్మీదికి రప్పించినట్లు /ఒక్కోసారి/)

సామాన్య దృష్టికి కనిపించే ప్రపంచం  వేరు, ప్రేమోద్వేగంలో కనిపించే ప్రపంచం వేరు. ఆ స్థితిలో కలిగే భావాలన్నీ భౌతిక ప్రపంచానికి అతీతంగానే ఉంటాయి. సరిగ్గా అలాంటి భావాలే ఈ గీతం నిండా ఉన్నాయి. నిజానికి లోకంలోని కోటానుకోట్ల యువతీయువకుల్లో తామిద్దరమే ఇలా కలుసుకోవడం ఎలా జరిగింది? అన్న భావన అప్పుడో ఇప్పుడో ప్రతి ప్రేమ హృదయంలోనూ అంకురిస్తుంది. ప్రేమోద్వేగం ఆకాశాన్ని తాకే స్థితిలో ఆమెను ఎవరో తనకోసమే సృష్టించారన్న  బావున కలిగినా కలగవచ్చు. పైగా ఆమెపట్ల తనకున్న అద్వితీయ భావన వల్ల  ఆమె ఇక్కడెక్కడో భూమ్మీది మనిషిగా కాకుండా ఎక్కడో ఆకాశంలో, నక్షత్రాల మధ్య నివాసించేలా అనిపిస్తుంది. అలాంటి ఆమెను తనకోసమే ఎవరో భూమ్మీదికి రప్పించారన్న భావన కలుగుతుంది. ఈ విషయాల్లో తర్కానికి తావులేదు. అదొక భావోద్వేగం. ఒక రసానుభూతి అంతే.

కభీ కభీ మేరే దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె యే బదన్‌ ఔర్‌ నిగాహే  మేరీ అమానత్‌ హై
యే గేసువోంకీ ఘనీ ఛావ్‌ హై మేరీ ఖాతిర్‌
యే హోట్‌ ఔర్‌ యే బాహే మేరీ అమానత్‌ హై

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో  ఇలా వచ్చేస్తుంది
నీ తనువు, నీ చూపులు నా సంపత్తి అయినట్లు
ఈ ముంగురుల గాడమైన నీడలు నా కోసమే అయినట్లు
ఈ పెదాలు, ఈ బాహువులు నా ఐశ్వర్యమైనట్లు /ఒక్కోసారి/)

ఒక  జీవన ప్రపంచానికే  వేదికైన తన ప్రియురాలి  తనువు, నిరంతరం లోకంలోకి ఒదిగిపోతూ, లోకాన్ని తనలో పొదుగుకుంటూ ఉండే  ఆమె  చూపులు,  తన సొంత సంపదైపోయినట్లు ఏవేవో  భావోద్వేగాలు కదలాడుతూ ఉంటాయి. తనదైన ఒక స్వాప్నిక ప్రపంచాన్ని చూడటమే కాదు, ఆ ప్రపంచాన్నే తనలోకి ఇముడ్చుకోగలిగే ఆ పదునైన చూపుల్ని తన సొంతం చేసుకోవాలని ఎంత ఆరాటమో తనకు. అంతే కాదు చల్ల చల్లగా నలుమూలలా విస్తరించే ఆమె ముంగురుల నీడలు తాను సేదదీరడం కోసమే అయినట్లు  భావిస్తాడు. పైగా భావనా ప్రవాహానికి ముఖద్వారమైన పెదాలు, జీవితాన్ని అమృతమయం చేసి, అద్భుతమైన అంతర్లోకాన్ని ఆవిష్కరించే ఆమె బాహువులు తన ఐశ్వర్యమైనట్లు  ఎంతో తాదాత్మ్యతలో పడిపోతాడు ప్రేమికుడు.

కభీ కభీ మేరే   దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసె బజ్‌తీ హై  శహనాయియాఁ  సి రాహోఁమే
సుహాగ్‌ రాత్‌ హై గూంగట్‌ ఉఠారహా హూఁ మై
సిమట్‌ రహీ హై తూ శర్మాకె  అప్‌ని బాహోఁ మే

( ఒక్కోసారి నా మదిలోకి ఒక భావనేదో ఇలా వచ్చేస్తుంది
పలు దారుల్లో  సన్నాయిల్లా ఏవో మారు మోగుతున్నట్లు 
తొలిరేయి వేళ  నేను నీ తలకొంగును తొలగించి వేస్తున్నట్లు 
నువ్వేమో నా బాహువుల్లో  సిగ్గుతో ముడుచుకుపోతున్నట్లు / ఒక్కోసారి / )

ప్రియురాలిని ఎప్పుడు తనలో కలిపేసుకుందామా అని నిరంతరం నిరీక్షించే ప్రియుడికి చుట్టూ  సన్నాయి స్వరాలు కాక ఇంకేం వినపడతాయి? కేవలం సన్నాయి నాదాలేనా? సహజీవనం తాలూకు ఒక ఊహాలోకమే మనసులో కదలాడుతుంది. నాలుగడుగులు ముందుకేసి ఏకంగా తొలిరాత్రి ఊహలన్నీ మనసులో తొంగి చూడవచ్చు. నిజానికి సన్నాయిలు ఏం చేస్తాయి? ప్రేమికుల హృదయాల్ని నాదమయం చేస్తాయి. చంద్రబింబాన్ని కమ్మేసిన నల్లమబ్బును ఎవరో తొలగించినట్లు ఆ సమయంలో  అతని చేతులు ప్రియురాలి ముఖారవిందాన్ని కమ్మేసిన మేలి ముసుగును తొలగించడానికి సిద్ధమవుతాడు. ప్రేమికుడు అలా తొలగించడం బాగానే ఉంది కానీ, ఆ స్థితిలో ప్రియురాలి పరిస్థితి ఏమిటి? ముసుగులోనే బిడియపడుతున్న ఆమె  ముఖంమీది ఆ కాస్త ముసుగుకూడా తొలగిపోతే ఇంక  సిగ్గుతో తడిసి ముద్దయిపోక ఏంచేస్తుంది? ఇక్కడ జరిగిందీ అదే.

కభీ కభీ మేరె దిల్‌ మే ఖయాల్‌ ఆతా హై
కె జైసే తూ ముఝె చాహేగీ ఉరమ్‌ భర్‌ యూఁహీ
ఉటేగి మేరి తరఫ్‌ ప్యార్‌ కి నజర్‌ యూఁహీ
మై జాన్‌తా హూఁ కె తూ గైర్‌ హై మగర్‌ యూఁహీ

(ఒక్కోసారి నా మదిలోకి ఓ భావనేదో ఇలా వచ్చేస్తుంది
జీవితమంతా నువ్వు ఇలాగే న న్ను ప్రేమిస్తావన్నట్లు
నీ ప్రేమ చూపులు ఎప్పటికీ ఇలాగే  నా మీద వాలిపోతాయన్నట్లు
నువ్వు నాకు పరాయివేనని తెలిసినా ఎందుకో 
ఒక్కోసారి నా మదిలోకి ఏదో భావన ఇలా వ చ్చేస్తుంది)

ఏ ప్రియుడైనా తన ప్రేయసి జీవితాంతం తనను ప్రేమిస్తూనే ఉండాలని కోరుకుంటాడు. ఆమె చూపుల్లో ఎప్పుడూ తానే ఉండాలనీ కోరుకుంటాడు. ఎందుకని? ఎన్నో ప్రేమలు  భగ్నమైపోయి అర్థాంతరంగా ముగిసిపోవడం ఎన్నోసార్లు కళ్లారా చూసే ఉంటాడు కాబట్టి. ప్రేమలు విచ్ఛిన్నమై కడకు  ఒకరినొకరు క ళ్లెత్తి చూసుకునే స్థితి కూడా లేని తనాన్ని తాను ఎన్నోసార్లు గమనించే ఉంటాడు  కాబట్టి. అందుకే తన ప్రేమ శాశ్వతంగా ఉండాలని కుంటాడు. కడదాకా ఆమె కనుసన్నలలో తడిసిపోవాలనుకుంటాడు. కాకపోతే ఎంతటి అన్యోన్యత ఉన్నా, ఎంతటి ప్రేమోద్వేగం  ఉన్నా కళ్యాణ బంధమేదీ లేకపోతే సంప్రదాయ సమాజంలో వారిద్దరూ పరాయిలేగా!. నిజానికి  తమ ప్రేమకు  హద్దులు ఉన్నాయని  ఒకవేళ తెలిసినా ఆ భావోద్వేగాలు ఆగుతాయా? అవి రసాత్మకమై, కవితాత్మకమై  వారి హృదయాల్లోంచి ఒక గీతంలా ఇలా జాలువారుతూనే ఉంటాయి. ఎవరైనా ఆ భావోద్వేగాల్ని ఎలా ఆపగలరు!

---బమ్మెర


3 comments :

  1. చాలా చాలా బాగుంది మీ సాహితీ విశ్లేషణ మరియు తర్జుమా

    ReplyDelete
  2. I am following your blog for past 2/3 years. Your translation is vey good.
    my olny request is for every song please mention original author name so that we can remember him for ever. please

    ReplyDelete