Saturday, October 15, 2022

Kahin Deep Jale Kahin Song Analysis | Bees Saal Baad (1962 film) |

 నీ ఊపిరి లో ఈ గీతం అమరం కావాలి

గానకోకిల లతా మంగేష్కర్‌ స్వర వైదుష్యం ఎవరినైనా ఒక  భావాతీత స్థితికి చే రుస్తుంది. ఆమె గొంతులో సప్త స్వరాలు సప్త సముద్రాలయ్యాయి కదా మరి!. అందుకే  ఆ స్వరంలో తడిసిన ఏ ఒక్క గీతాన్ని విన్నా  అది జీవితాంతపు జ్ఞాపకమైపోతుంది.  భారతీయుల్నే కాదు  ప్రపంచ దేశాల  రసహృదయాలందరినీ  దశాబ్దాల పర్యతం ఆమె తన గానమాధ్యురంతో  ఓలలాడించింది.  ఆ గానానికి పరశించిపోయిన  భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డుతో ఆమెను సత్కరించింది. నేల మీద నడిచే పాటలు వేలాదిగా ఉండొచ్చు. కానీ, ఆకాశంలో నాట్యం చేసే పాటలు కొన్నే ఉంటాయి. అలాంటి అత్యంత అరుదైన వాటిల్లో  ‘ కహీఁ దీప్‌ జలే’ అన్న పాట ఒకటి.  శకీల్‌ బదాయుఁనీ రచించగా, హేమంత్‌ కుమార్‌ స్వరపరిచిన  ఈ పాటను  ‘ బీస్‌ సాల్‌  బాద్‌ ’ సినిమా కోసం లతామంగేష్కర్‌ పాడారు. ఆకాశం హోరెత్తిపోయేలా పాడే ఆ స్వరాన్ని వినడం కన్నా  మహానందం మరేముంటుంది?





కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌-జరా దేఖ్‌లే ఆకర్‌ పర్‌వానే
తేరీ కౌన్‌ సీ హై మంజిల్‌ - కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌

( ఒకచోట   దీపాలు వెలుగుతున్నాయి.  ఒకచోట  హృదయాలు కాలుతున్నాయి.
ఒకసారి వచ్చి చూసుకో  మిడతా! నీ తీరమెక్కడో తెలుసుకో )/ ఒకచోట  దీపాలు/

మిడత పురుగులు ఎక్కడ వెలుగు కనిపిస్తే అక్కడ వాలిపోతాయి. కానీ,  అన్ని  వెలుగులూ ఒక్కటే  కావు కదా! ఒక్కోసారి అవి అడవి కాలిన మంటలూ కావచ్చు. అదేమీ  తెలియకుండా బిరబిరా వె ళ్లిపోతే నలువైపులా కమ్ముకున్న ఆ మంటల్లో ఆహుతి అయిపోవడమేగా! అయినా ప్రేమించే హృదయాల దావాగ్నిని పట్టించుకోకుండా, దీపాల వెలుగు చుట్టూ తిరిగితే ఎలా? అసలు మనిషి మనిషికీ మధ్య తేడా ఎక్కడ వస్తోంది? కొన్ని గుండెలు శిలల్లా, మరికొన్ని పువ్వుల్లా ఎందుకు ఉంటున్నాయి? చూపుల్లో లాలితత్వం, ఆలోచనల్లో స్పందన కరువైతే మనిషి కఠిన శిలే అవుతాడు మరి! వెలుగు వెలుగే కానీ, ఏ వెలుగు పునాదులు  ఎక్కడున్నాయో తెలియకపోతే  ఎలా? అసలు ఆ కనిపించేవేమిటో, వాటి మూలాలు, పాతాళంలో ఉన్నాయో, ఆకాశంలో ఉన్నాయో తెలిస్తేగా దేన్ని లక్ష్యంగా తీసుకోవాలో  బోధపడుతుంది.

మేరా గీత్‌ తేరే దిల్‌ కీ పుకార్‌ హై- జహాఁ మై హూఁ వ హీ తేరా ప్యార్‌  హై
మేరా దిల్‌ హై తేరీ  మహెఫిల్‌- కహీఁ దీప్‌ జలే కహీ దిల్‌

(నా గీతం నీ హృదయపు పిలుపు సుమా - నేనెక్కడుంటానో  అక్కడే ఉంటుంది నీ ప్రేమ
నా హృదయం నీ  కచేరీ వేదిక) / ఒకచోట  దీపాలు/

నీ పిలుపు ఎప్పుడూ  నీ గొంతులోంచే వస్తుందనుకుంటే ఎలా? నిన్ను ప్రేమించే, లేదా నువ్వు ప్రేమించే గుండెలో  కూడా నీ పిలుపు ప్రతిధ్వనిస్తుంది. ఆ వ్యక్తి ఎక్కడుంటే నీ ప్రేమా అక్కడే మకాం వేస్తుంది. ప్రేమ పుట్టడం అన్నది ముందు ఒకరిలోనే అయినా  ఆ తరువాత అది ఇద్దరిలోకీ  సమంగా వ్యాపిస్తుంది.  నీలోంచి వచ్చేవి మాత్రమే నీవని, నీ ఆవలి వైపు వచ్చేవన్నీ  నీకు సంబంధం లేనివనీ అనుకుంటే అది తప్పిదమవుతుంది.  పువ్వులో పుట్టిన పరిమళం పువ్వులోనే ఉండిపోతుందా? నేలనేలంతా వ్యాపిస్తుంది. గాలిలో కలిసి, నక్షత్రాల మీదుగా, సమస్త గోళాల మీదుగా ఆకాశమంతా వ్యాపిస్తుంది.  అవేమీ పట్టన ట్టు ఉంటే  నీ గురించి నీకు తెలిసేదెన్నడు? నీ ప్రేమ ఎక్కడెక్కడికి విస్తరించిందో  నువ్వు గుర్తించేదెప్పుడు? ఆ స్పృహే నిజంగా  నీకు కలిగిన్నాడు నువ్వే ప్రాణంగా జీవిస్తున్న ఆ ప్రేమమూర్తి గురించి తెలుస్తుంది. ఆ  ఒక్క హృదయమే  వేయి రూపాలు ధరిస్తుంది. అప్పుడింక ఆ హృదయం నీలోంచి వచ్చే వేయి రాగాలు , వేయి గీతాలతో సాగే ఒక కచేరీ వేదిక అవుతుంది.

న మై సప్నా హూఁ  న కోయీ రాజ్‌ హూఁ- ఏక్‌ దర్ద్‌ భరీ ఆవాజ్‌ హూఁ
పియా దేర్‌ న కర్‌ ఆ మిల్‌- కహీఁ దీప్‌ జలే కహీఁ దిల్‌


(నేనేమీ  స్వప్నాన్ని కాను, నేను రహస్యాన్నీ కాను- ఒక వేదనా భరిత స్వరాన్ని నేను
ప్రియా! ఆలస్యం చేయక వచ్చి కలుసుకో నన్ను ) / ఒకచోట దీపాలు /

భావాలు నేలమీద పారుతున్నంత సేపే అవి సత్యమని,  వాటి గొంతు  సముద్రాలూ, మేఘాలు దాటి ఆకాశాన్ని చేరగానే భ్రమ అనుకుంటే ఎలా? అనంతంగా విస్తరించిన  నీ ప్రియురాలి ఆత్మగానాన్ని  ఒక కలగానో, ఎవరికీ అంతుచిక్కని ఒక రహస్యంగానో అనుకుంటే జీవితంలోని అత్యున్నతమైన వాటికి నువ్వు దూరమైపోతావు.  ఎవరూ తనను అర్థంచేసుకోక, ఎవరూ తనను తానుగా గుర్తించక ఎంత వేదనో భరిస్తూ భూమ్యాకాల మధ్య తిరుగాడుతున్న ఆ ప్రేమమూర్తిని చూడు. ఆ సంచారం నిజమేనని గ్రహిస్తే  గానీ, ఆ రూపం కనపడదు. ఆ గొంతులోని ప్రాణధ్వని వినబడదు. ఏదోలే అనుకుని వదిలేస్తే  ఒక్కోసారి ఆ ప్రేమ మూర్తి ఏ ప్రమాదంలోనో ఇరుక్కుపోవచ్చు. ఎదురుచూసి, చూసి చివరికి నిన్ను చేరుకోకుండానే అలసిపోయి ఆగిపోవచ్చు.  చివరికి తనకు తానే ద క్కకుండా శూన్యంలో కలిసిపోవచ్చు. నిరీక్షణలో ఆశలు నిర్జీవమైపోతే ఎలా? వెంటనే వెళ్లి ఆ ప్రేమమూర్తిని అక్కున చేర్చుకోవాలి కదా!

దుశ్మన్‌ హైఁ  హజారో యహాఁ జాన్‌ కే- జరా మిల్‌నా నజర్‌ పహ్‌చాన్‌కే
కయీ రూప్‌ మే హై ఁ  కాతిల్‌- కహీఁ  దీప్‌  జలే కహీఁ దిల్‌

(ఇక్కడ వేలాది ప్రాణాంతక శత్రువులున్నారు-కాస్త చూపుల్ని గుర్తించి  కలుసుకో
హంతకులు ఇక్కడ అనేక రూపాల్లో  సంచరిస్తున్నారు)/ ఒక చోట దీపాలు/

పైపైన చూస్తే లోకం ఎంత సౌమ్యంగానో కనిపిస్తుంది. కానీ, లోనికి తొంగి చూస్తే అందులో చాలా భాగం ఒక మహా కీకారణ్యమని తెలిసిపోతుంది. క్రూర మృగాల్లాంటి మనుషులు ఇక్కడ  శాంత మూర్తుల ముసుగులో సంచరిస్తున్నారు. . అందుకే నువ్వు వాళ్లను గుర్తించలేవు.  వాస్తవానికి ఏ కాస్త అవకాశం దొరికినా ప్రాణాలు తీయాలనుకునే  శత్రువులు. ఇక్కడ  వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ల శత్రువైఖరికి  అంతకు ముందే వారితో జరిగిన ఏదో ఘర్షణే కారణమని కూడా కాదు.. వారికి ఆశించింది  అందకుండా పోతే చాలు, వాళ్లు అలా మారిపోతారు. కాకపోతే వాళ్ల  క్రూరత్వం బయటికి కనపించకుండా  పదేపదే రూపాలు మారుస్తుంటారు. అయినా వాళ్ల  కళ్లల్లోంచి  ఆ నకిలీతనం బయటపడుతూనే ఉంటుంది. అందుకే వారి చూపుల్ని నిశితంగా గమనించి అది నేనేనని  తెలిసిపోగానే నన్ను కలుసుకో.  హంతకులు ఇక్కడ అనేక రూపాల్లో విహరిస్తున్నారు. పొరబడి వాళ్ల పాలైపోకుండా వచ్చి నా చేయందుకో అంటుంది ఆ ప్రియురాలు

లోకం రీతులు, ప్రేమ లోతులు తెలిసిన ఓ యువతి జీవితాన్ని ప్రతిబింబించే ఈ గీతం మీ కోసం. 

                                                                                                --- బమ్మెర


1 comment :