Tuesday, March 28, 2017

జుల్మ్‌ తుమ్హారే సహ నా సకే హమ్‌ - Julm Tumhare Saha Naa Sake hum Ramchandra Latha Mangeshkar Namoona old movie


హృదయాన్ని ఉప్పెన కప్పేసినప్పుడు..
ఎంతో అపురూపమైన ప్రేమ తన సొంతమవుతుందని ఆశపడ వచ్చు.. గుండె నిండా ప్రేమతో ఒకరి చేతిని అంతే అపురూపంగా చేతుల్లోకి తీసుకోవచ్చు. కానీ, ఒక్కోసారి ఎక్కువో తక్కువో అనికాదు ఆశించిన దానికి పూర్తి విరుద్ధంగా, ఒక విషాదంతంగా జీవితం మిగిలిపోతుంది. హృదయం గాయాల జల్లెడవుతుంది. ఈ విపరిణామానికి మనిషి కకావికలమవుతాడు. కల్లోల సాగరమవుతాడు. ఈ భావోద్వేగాలే 1949లో విడుదలైన ‘నమూనా’ సినిమా కోసం న క్శబ్‌ రాసిన పాటలో వినిపిస్తుంది. స్వరకర్త సి. రామచంద్ర బాణీకి లతా మంగేష్కర్‌ ప్రాణం పోశారు. 

జుల్మ్‌ తుమ్హారే సహ నా సకే హమ్‌- సబ్ర్‌ కా దామన్‌ ఛూట్‌ గయా 
ఎక్‌ ఠేస్‌ లగీ - ఆసూ టప్‌కే - ఎక్‌ ఛోట్‌ లగీ దిల్‌ టూట్‌ గయా / ఎక్‌ ఠేస్‌ లగీ/ 
(నీ కసాయి తనాన్ని భరించడం నా వల్ల కాలేదు. సహనాల బంధం ముక్కలయ్యింది. 
ఒక వే టుకు కన్నీరొలికింది.. ఒక గాయమై.. హృదయం విరిగిపోయింది) 
ప్రేమపాశంలో జీవితకాలమంతా పెంచుకున్న ఎంతటి బంధమైతేనేమిటి? ఎడతెగని కసాయి వేట్లతో అది తునాతునకలైపోతుంది. ఏ రోజుకారోజు ఈటెలు కొత్తగా గుండెలో దిగుతుంటే జీవితం కన్నీటి ప్రవాహమవుతుంది. అదే పనిగా ఎదలో గునపాలు దిగుతూ ఉంటే ఒక దశలో ఏడవడానికి కూడా శక్తి లేక గొంతు మూగపోవచ్చు. ఏడుస్తూ విలవిల్లాడితే గానీ, తృప్తి కలగని క్రూరత్వం ఇంకా ఇంకా గాయం చేస్తూ పోవచ్చు. అప్పటిదాకా మనిషిలోని ఒక కోణాన్నే చూసిన వాళ్లను ఇదంతా దిగ్ర్భాంతికి గురిచేయక మానదు. అప్పటిదాకా అంతగా నమ్మిన వ్యక్తిలో, అతనే తన లోకం అని నమ్మిన వ్యక్తిలోంచి ఒక్కొక్క వైరుద్ధ్యమే బయటపడుతుంటే త ట్టుకోవడం ఎవరి తరమవుతుంది? 

నజ్‌రోంకీ లగావట్‌ దిల్‌ కీ లగీ - సుఖ్‌ సే నహీఁ రహెనే దేగీ కభీ 
జిన్‌ పే తేరే గమ్‌ మే గుజ్‌రీ - ఎక్‌ ఛాలా బనా ఔర్‌ ఫూట్‌ గయా / ఏక్‌ ఠేస్‌ లగీ/ 
(హృదయాన్ని ఆవరించిన ప్రేమ, సుఖంగా ఎప్పుడూ ఉండనివ్వదు. 
వ్యధలు దొర్లిన చోట ఒక బొబ్బ పుట్టి అంతలోనే చితికిపోతుంది ) 
బంధం ఏర్పడిన కొత్తలో అంతా ఆనందంగానే ఉంటుంది. కాకపోతే ఆ బంధం ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా? లేక ఏ సుడిగాలికో వడలిపోయి రాలిపోతుందా? అని మనసు నిరంతరం దిగులూ ఆందోళనల్లో పడిపోయిందనుకోండి. వారి మనసుకింక సుఖంగా ఉండే అవకాశం ఎక్కడిది? నిజంగానే ఒకవేళ అలా ఏదైనా అపస్వరమైనా పలికితే హృదయం విలవిల్లాడిపోతుంది. విషాద గీతాల్ని ఆలపిస్తుంది. నిజానికి ఎవరూ ఉబుసుకోక ప్రతికూల ఆలోచనలు చేయరు. ఎక్కడో ఆ ఛాయలు కనపడతాయి. మరెక్కడి నుంచో సెగలు ఎగిసిపడుతుంటాయి. ఇవే మనిషిలో అనుమానాన్ని కలిగిస్తాయి. ఆవేదనకు గురిచేస్తాయి. క్షణం క్షణం వణికిపోయేలా చేస్తాయి. అంతటి అంతరక్షోభలో ఎంత కొత్త బంధమైనా ఏం ప్రశాంతంగా ఉంటారు? 

ముహ్‌ ఫేర్‌ కే జానే వాలే యే ఫరియాద్‌ తో మేరీ సున్‌తా జా 
జిస్‌మే తేరీ తస్వీర్‌ సజీ - ఆజ్‌ వో శీశా టూట్‌ గయా / ఏక్‌ ఠేస్‌ లగీ/ 
(ముఖం చిట్లించుకుంటూ వెళ్లే బాటసారుల్లారా! నా ఫిర్యాదు కాస్త విని వెళ్లండి! 
గాజు బీరువాలో అమర్చిన మీ చిత్రపటం ఈ రోజు పగిలిపోయింది చూసుకొండి.) 
గుండెలో ఎంత ద్వేషం పెంచుకుంటారో ఏమిటో... అస్తమానం ఎవరినో ఏమో చేస్తామంటూ కొందరు అదేపనిగా ప్రతిజ్ఞలు చేస్తారు. ఎదుటి వారికేసి ఎప్పుడూ గుడ్లురుముతూ ఉంటారు. దానికంతా తామేదో చాలా సురక్షితంగా ఉన్నామనే భావనే కారణం. కానీ, తాము ఎంతో భద్రంగా దాచుకున్నామనుకుంటున్న తమ చిత్రపటం కూడా ఒక్కోసారి పగిలి ముక్కలైపోవచ్చు. అయినా చాలా రోజుల దాకా వారికి ఆ విషయమే తెలియకపోవచ్చు. ఎంతసేపూ ఎదుటివారి బతుకుల్ని కూల్చివేస్తున్నామన్న సంతోషంలోనే ఉండిపోతే, తన జీవితం ఎలా కూలిపోతోందో తెలుసుకునే అవకాశమెక్కడ? నిజానికి ఎదుటి వారి జీవితంలోకి చూడటంలో ఉన్న దాంట్లో వెయ్యి రెట్ల అదనపు శ్రమ తన జీవితంలోకి చూసుకోవడంలో ఉంది. అందుకే చాలా మంది ఆ అంతర్వీక్షణకు సిద్ధం కాలేక తప్పించుకోవాలని చూస్తారు. కానీ, జీవిత సత్యాలు ఎవరినీ వదిలిపెట్టవు. అవి జీవితమంతా వెంటాడతాయి. ఎప్పుడో జీవనతత్వాన్ని బోధించి తీరతాయి. 

- బమ్మెర 

2 comments :